ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సభ అంటే అధికార వైసీపీ మీద తీవ్రమైన విమర్శలు ఉంటాయి. అలాంటి సభకు వైసీపీ నేత వెళ్లడం ఏమిటా అనే డౌట్ మీకు వస్తుంది. అయితే కేవలం అవినీతి మీద ఒక వ్యక్తి చేస్తున్న పోరాటం కారణంగానే అతడికి మైక్ ఇచ్చామని, మాట్లాడాలని, అతడికి మద్దతు ఇవ్వాలని చంద్రబాబు చెప్పిన ఆసక్తికర ఘటన తాజాగా చోటు చేసుకుంది. ఏలూరు జిల్లాలోని ఆగిరిపల్లి మండలం నెక్కలం గొల్లగూడెం గ్రామంలో చంద్రబాబు నిర్వహించిన గ్రామ సభలో ఈ సంఘటన చోటు చేసుకుంది.
గ్రామ సభకు వచ్చిన వైసీపీ ఎంపీటీసీ కాజా రాంబాబు మాట్లాడుతానని అడిగారు. తాను వైసీపీలోనే ఉంటూ గ్రామంలో జరిగిన రూ.75 లక్షల అవినీతిపై పోరాడుతున్నట్లు రాంబాబు చెప్పడంతో చంద్రబాబు ఆయనకు మాట్లాడే అవకాశం కల్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేకా ప్రతాప్ తనయుడు అవినీతికి పాల్పడ్డాడంటూ సంబంధిత పత్రాలను చంద్రబాబుకు రాంబాబు ఇచ్చారు. తాను వైసీపీలోనే కొనసాగుతానని.. ఎమ్మెల్యే తనయుడు అవినీతిపై పోరాటానికి మద్దతివ్వాలని కోరారు. అవినీతిపై రాంబాబు చేసే పోరాటాన్ని పార్టీలకతీతంగా చూడాలని పార్టీ శ్రేణులకు చంద్రబాబు సూచించారు. రాంబాబును సభలో అభినందించి తనకు చేతనైన సాయం చేస్తానని అన్నారు. వైసీపీ ఓ అవినీతి వృక్షమని, తల మొత్తం అవినీతి మయమైనప్పుడు పార్టీలో మొండెం పోరాడినా ఫలితం లేదని చంద్రబాబు అన్నారు. ప్రజల చెవిలో పూలు పెట్టానని భావిస్తున్న జగన్‌కి ప్రజలంతా కలిసి చెవిలో పూలు పెట్టే రోజు దగ్గరలోనే ఉందన్నారు.
బుధవారం నాడు పుట్టిన రోజు సందర్భంగా చంద్రబాబు నాయుడు విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న దుర్గమ్మను దర్శించుకున్నారు. అయితే ఈ సందర్భంగా ఇంద్రకీలాద్రిపై ఓ ఆసక్తిక సన్నివేశం జరిగింది. అమ్మవారి దర్శనానికి వెళ్తున్న చంద్రబాబుకు కమలాపురం వైసీపీ ఎమ్మెల్యే రవీంద్రనాధ్ రెడ్డి ఎదురయ్యారు. వెంటనే చంద్రబాబు దగ్గరకు వెళ్లి ఆయన్ను పలకరించి షేక్ హ్యాండ్ ఇచ్చి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు.