టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చివరి ఎన్నిక అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈసారి వచ్చే అసెంబ్లీ ఎన్నికలు.. నా చివరి ఎన్నిక అని అన్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ గౌరవ సభ కాదని, అది కౌరవ సభ అని.. ఈ అసెంబ్లీలో నన్ను, నా భార్యను కూడా అవమానించారని.. తనను గెలిపించి అసెంబ్లీకి పంపితే సరే అని, లేదంటే ఇదే తన చివరి ఎన్నిక అని చెప్పారు.
ఈ వ్యాఖ్యలపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. కోరిక తప్పకుండా నెరవేరుతుందని.. దేవుడు “తథాస్తు” అంటాడని వ్యాఖ్యానించారు. చంద్రబాబు ఎప్పటికీ ముఖ్యమంత్రి కాలేరని.. ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రజలు మూడుసార్లు అవకాశం ఇచ్చారని… అన్నిసార్లు ఆయన మోసం చేశారని విమర్శించారు. అసెంబ్లీలో తన భార్యను కించపరిచారంటూ సానుభూతి కోసం చంద్రబాబు డ్రామాలు చేస్తున్నారని విమర్శించారు. మాజీ మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ, చంద్రబాబుకు 2024 ఎన్నికలే చివరివని అన్నారు. ఈ విషయం ప్రజలకు ఎప్పుడో తెలుసని… చంద్రబాబుకే ఈ విషయం తెలియడానికి చాలా కాలం పట్టిందని అన్నారు.
చంద్రబాబు నాయుడు శారీరకంగా ఫిట్‌గా ఉన్నప్పటికీ మెంటల్‌గా ఆయన ఫిట్‌గా లేడని మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. ప్రధాని మోదీ డ్వాక్రా సంఘాలు భేష్ అన్నాడని తనకు తాను చంద్రబాబు నాయుడు సర్టిఫికెట్ ఇచ్చుకుంటున్నాడని ఎద్దేవా చేశారు. కానీ ప్రధాని నరేంద్ర మోదీ ఎక్కడా ఆ మాట అనలేదని తెలిపారు. దీన్ని బట్టే చంద్రబాబు మానసిక స్థితిని అర్ధం చేసుకోవాలన్నారు. చంద్రబాబును చూసి వైసీపీ భయపడేదే లేదని అన్నారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు వెళ్లి రెచ్చగొట్టి తిరిగి రాళ్ల దాడి చేశారని సానుభూతి మాటలు మాట్లాడటం చంద్రబాబుకు మంచిది కాదని మంత్రి సీదిరి అప్పలరాజు హితవు పలికారు.