Yasodha Movie Review : ఎమోషనల్ జర్నీ ‘యశోద’!

0
1245
Yasodha telugu Movie Review
Yasodha telugu Movie Review

చిత్రం : యశోద
విడుదల : 11, నవంబర్ 2022
రేటింగ్ : 4/5
నిర్మాణం : శ్రీదేవి మూవీస్
నిర్మాత : శివలెంక కృష్ణప్రసాద్
దర్శకత్వం : హరి -హరీష్

నటీనటులు:
సమంత, వరలక్ష్మీ శరత్ కుమార్,
ఉన్ని ముకుందన్, రావు రమేష్,
మురళీ శర్మ, సంపత్ రాజ్, శత్రు,
మధురిమ, కల్పికా గణేష్, దివ్య శ్రీపాద,
ప్రియాంకా శర్మ తదితరులు.

సంగీతం: మణిశర్మ
మాటలు: పులగం చిన్నారాయణ, డా. చల్లా భాగ్యలక్ష్మి
పాటలు: రామజోగయ్య శాస్త్రి
కెమెరా: ఎం. సుకుమార్
ఆర్ట్: అశోక్, ఫైట్స్: వెంకట్, యానిక్ బెన్
ఎడిటర్: మార్తాండ్ కె. వెంకటేష్
ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు : రవికుమార్ జీపీ, రాజా సెంథిల్
క్రియేటివ్ డైరెక్టర్: హేమంబ‌ర్ జాస్తి
లైన్ ప్రొడ్యూసర్: విద్య శివలెంక
సహ నిర్మాత: చింతా గోపాలకృష్ణారెడ్డి.

పురాణాల్లో శ్రీ కృష్ణుడిని పెంచిన ‘యశోద’ గురించి విన్నాం. పురాణాలపై అందరికీ అవగాహన ఉంది. మరి ఈ మోడ్రన్ ‘యశోద’ ఎలా ఉంటుంది? ఇద్దరూ మహిళలే. ఇద్దరూ అమ్మలే. చాలా మందిని రక్షించారు. ఇదే విషయాన్ని వివరిస్తూ ఆసక్తిని కలిగించేలా సమంత టైటిల్ పాత్రలో ప్రేక్షకుల ముందుకొచ్చిన చిత్రం ‘యశోద’. శ్రీదేవి మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. హరి-హరీష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నేడు ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదలయింది. సినిమా విడుదలకు ముందు వచ్చిన టీజర్, ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. తెలుగులో హీరో విజయ్ దేవరకొండ, తమిళంలో సూర్య, కన్నడలో రక్షిత్ శెట్టి, మలయాళంలో దుల్కర్ సల్మాన్, హిందీలో వరుణ్ ధావన్ ‘యశోద’ ట్రైలర్ విడుదల చేయడంతో ఈ చిత్రానికి పాన్ ఇండియా హీరోల సపోర్ట్ లభించినట్లయింది. ఫలితంగా అన్ని భాషల్లో ప్రేక్షకులకు ట్రైలర్ మరింత చేరువయింది. దాంతో సినిమాపై మరింత అంచనాలు పెరిగాయి. మరి ఈ చిత్రం ఎలావుంది? అంచనాలను అందుకుందా..లేదా అనేది తెలుసుకుందాం…

కథ: ఆర్ధిక ఇబ్బందులతో సతమతమవుతున్న సమంత (యశోద) తన చెల్లి ఆపరేషన్ కోసం సరోగసికి ఒప్పుకుంటుంది. పేద అమ్మాయిలకు డబ్బు ఆశ చూపించి సరోగసి తల్లిగా మారడానికి మధు (వరలక్ష్మి శరత్ కుమార్ ) అండ్ గౌతమ్ (ఉన్ని ముకుందన్) ఒప్పిస్తారు. ఈ క్రమంలోనే యశోద కూడా బిడ్డను కని ఇవ్వడానికి ఒప్పుకుంటుంది. అయితే, దీని వెనుక ఏదో కుట్ర ఉంది అని యశోదకు అర్థమవుతుంది. సరోగసీ పేరుతో జరుగుతున్న అకృత్యాలు ఏమిటి ? వాటిని తెలుసుకొని యశోద ఏం చేసింది ? అసలు ఈ యశోద ఎవరు?, ఎందుకు ఇదంతా చేస్తోంది?, చివరకు సరోగసీ పేరు మీద జరుగుతున్న అక్రమ వ్యాపారాన్ని ఎలా అరికట్టింది ? అనేది కథ.

విశ్లేషణ : ఇదొక మెడికల్ మాఫియా తరహా సినిమా. వాస్తవ ఘటనల ఆధారంగా ఈ సినిమా కథ రూపుదిద్దుకుంది. సరోగసీ మీద చాలా సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ టాపిక్ గురించి అందరూ మాట్లాడుతున్నారు.  లాక్‌డౌన్‌లో చాలా మంది పేద మహిళలు డబ్బుల కోసం తమ గర్భాన్ని సరొగసీకి ఇచ్చారు. ట్విన్స్ పుడితే వాళ్ళకు ఎక్కువ డబ్బులు వస్తాయి. దానికి కూడా వాళ్ళు ఓకే అనేవారు. తల్లిదండ్రులు కావాలని అనుకునే వాళ్ళకు సరోగసీ ఒక పరిష్కారం మాత్రమే. వాళ్ళ ఆశలకు ఆయువు పోస్తుంది.  చట్టప్రకారం సరోగసీని ఆశ్రయించినప్పుడు ఎవరికి ఎటువంటి సమస్య ఉండదు. సరోగసీ అనేది చెప్పడం సులభమే. కానీ, అదొక ఎమోషనల్ జర్నీ. సైంటిఫిక్‌గా చూస్తే… మిరాకిల్. పురాణాల్లో మనం అటువంటి వాటి గురించి విన్నాం. అయితే.. అలాగని.. ఇందులో సరోగసీ ప్రధాన కథ కాదు. కథలో అదొక భాగమంతే! అందుకే, ఓపెన్‌గా చెప్పేశారు. సరోగసీ కంటే కథలో ఇంకా ఉంది. వార్తల్లో చూసిన, చదివిన విషయాల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా చూస్తున్న ప్రేక్షకులు షాక్ అవుతారు. తమిళంలో ‘ఒరు ఇరవు’, ‘అంబులి’, ‘ఆ’, ‘జంబులింగం’ సినిమాలు తీసి మంచి పేరును తెచ్చుకున్న దర్శక ద్వయం హరి-హరీష్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ ‘యశోద’ ఐడియాస్, మేకింగ్ పరంగా కొత్తగా అనిపించింది.  ఎక్స్‌పరిమెంట్స్ కూడా అలాగే ఉన్నాయి. కథ పరంగా ఎప్పుడూ కొత్త పాయింట్ చెప్పాలనేది వీరి ఉద్దేశం. ‘యశోద’లో అదే జరిగింది. కంటెంట్ విషయానికి వస్తే ఈ సినిమా చాలా కొత్తగా ఉంది. గ్లోబల్ రీచ్ కనిపించింది. ఐదు భాషల్లో చేసిన పాన్ ఇండియా కాదు, పాన్ వరల్డ్‌లో ప్రేక్షకులకు కూడా కొత్తగా అనిపిస్తుంది.  కథను చెప్పడంలో దర్శకులు చూపిన ప్రతిభ తెరపై స్పష్టంగా కనిపించింది. సస్పెన్స్ ఎలిమెంట్స్ వేటికవే ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. స్క్రీన్ ప్లే మరింత ఇంట్రెస్టింగ్ గా సాగింది. తర్వాత ఏం జరుగుతుంది? అనే టెన్షన్ ప్రేక్షకుల్లో ఉంటుంది. ఈ ‘యశోద’లో డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి. ఎంత పెద్ద ఎమోషనల్ సీన్ అయినా సరే సమంత ఇట్టే చేసేసింది. తన నటనతో ప్రతీ ఒక్కరిని ఆలోచించేలా చేసింది. ప్రతి ఇరవై నిమిషాలకు సినిమాలో ఒక మూవ్ ఉంటుంది. సినిమా నెక్స్ట్ లెవల్ కు వెళుతుంది. సర్‌ప్రైజ్‌లు షాక్ లు ఉంటాయి. మహిళలు, మాతృత్వం గురించి హృదయానికి హతుక్కునేలా చెప్పి ఫ్యామిలీ ప్రేక్షకుల మనసుల్నిదోచుకున్నారు. సరోగసీ కోసం తమ గర్భాన్ని అద్దెకు ఇచ్చిన మహిళలను ఒక్కచోట చేర్చడం… ఆ తర్వాత అక్కడ ఏదో జరుగుతుందనే క్యూరియాసిటీ ని కలిగించారు. సరోగసీ కోసం తీసుకొచ్చిన మహిళలకు ఏం జరుగుతోంది? ప్రపంచం నలుమూలల నుంచి వస్తున్న 122 మంది సంపన్న మహిళలు పేర్లు బయటకు రావడానికి, సరోగసీ ప్రెగ్నెన్సీ ధరించిన మహిళలకు సంబంధం ఏమిటి? ప్లాన్ ప్రకారం ఎవరి హత్య జరిగింది? అని ఆద్యంతం ప్రేక్షకులు ఆలోచించేలా సాగింది.
‘యశోద’ ఒక మంచి థ్రిల్లర్. ఇందులో సమంత చేసిన భావోద్వేగభరిత పాత్ర సినిమా చూస్తున్న ప్రేక్షకులకు థ్రిల్ కలిగిస్తుంది. గూస్ బంప్స్ వస్తాయి. తనకు ఎదురైన పరిస్థితుల నుంచి బయట పడటం కోసం పోరాటం చేసే మహిళగా సమంత నటన గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అంతలా ఆమె పాత్రలో పరకాయ ప్రవేశం చేశారు. వివిధ షేడ్స్ లో ఆమె ప్రదర్శించిన నటన విశేషంగా ఆకట్టుకుంది. ఆమె యాక్షన్, ఎమోషనల్ సీన్స్ లో చూపిన ప్రతిభ అనన్యసామాన్యం. కథలో, సినిమాలో గొప్ప ఎమోషన్ ఉంది. ప్రేక్షకులను ఎంగేజ్ చేసే విధంగా సినిమా ఉంది. బిగినింగ్ నుంచి కథలో పొటెన్షియల్ ఉంది. యాక్షన్ పరంగా కూడా కొత్తగా ఉంటుంది. దర్శకులు కథ, స్క్రీన్ ప్లే రాసుకున్న విధానం… స్క్రీన్ మీదకు తీసుకు వచ్చిన తీరు… ఫైట్స్, సెట్స్, ఆర్ట్ వర్క్, మ్యూజిక్… ప్రతిదీ సూపర్. ‘ఫ్యామిలీ మ్యాన్ 2’తో సమంతకు దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. యానిక్ బెన్ తో ‘ఫ్యామిలీ మ్యాన్ 2’కి పని చేసిన సమంత ఆ క్యారెక్టర్ కోసం కిక్ బాక్సింగ్, బాక్సింగ్ లో ట్రైనింగ్ తీసుకుంది. కానీ, ఈ ‘యశోద’లో ఆమె సింపుల్ ప్రెగ్నెంట్ లేడీగా చేసి ఆ పాత్రకు తగ్గట్టు యాక్షన్ మేళవించి చేసిన ఫైట్స్ బాగా ఆకట్టుకున్నాయి. సమంత ఇందులో పూర్తిగా కొత్తగా కనిపించింది.
ఉన్ని ముకుందన్ ఓ ప్రధాన పాత్రలో నటించారు. ‘జనతా గ్యారేజ్’, ‘భాగమతి’, ‘ఖిలాడీ’ తర్వాత ఆయన నటించిన తెలుగు చిత్రమిది. ఇలా.. తెలుగులో చేసిన ప్రతి సినిమాలో మంచి క్యారెక్టర్ ప్లే చేశారు. ఈ సినిమాలో డాక్టర్ గా కనిపించి తన పాత్రకు న్యాయం చేశారు. ఇక వరలక్ష్మీ శరత్ కుమార్, రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్…ఇలా ఈ సినిమాలో భారీ తారాగణం ఉంది. వీళ్లంతా ఎంతో అనుభవం ఉన్న ఆర్టిస్టులు. వారికిచ్చిన పాత్రలకు పూర్తి న్యాయం చేసి చక్కటి ప్రతిభను కనబరిచారు. ముఖ్యంగా వరలక్ష్మీ శరత్ కుమార్ క్యారెక్టర్ కొత్తగా అనిపించింది.

ఈ ‘యశోద’ టెక్నికల్ పరంగా కమర్షియల్ సినిమాను తలపించింది. ఎక్కడా రాజీ పడకుండా నిర్మాత కృష్ణప్రసాద్ పెట్టిన ఖర్చు తెరపై కనిపించింది. కథకు ఏం కావాలో అది ఇవ్వడమే కాదు… తెలుగు, తమిళ్ తెలిసిన వాళ్ళను ఎంపిక చేసుకొని మంచి మార్గాన్నే ఎన్నుకున్నారు. ‘సమ్మోహనం’ తర్వాత శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించిన డైరెక్ట్ సినిమా ఇది. మణిశర్మ సంగీతం.. మార్తాండ్ కె. వెంకటేష్ ఎడిటింగ్ వేటికవే సాటిగా ఉన్నాయి. సినిమాలో చిన్న చిన్న బిట్ సాంగ్స్ ఉన్నాయి. వీటికి మణిశర్మ అద్భుతమైన సంగీతం అందించారు. అవి విన్న ప్రతిసారి ఆ ఎమోషన్ గుర్తు వస్తుంది. అంత బాగా చేశారు. నేపథ్య సంగీతం సన్నివేశాలకు ప్రాణం పోసింది. సినిమాటోగ్రఫీ రిచ్‌గా ఉంది. మొత్తం మీద నిర్మాణ విలువలు ఉన్నత స్థాయిలో ఉన్నాయి. ప్రేక్షకుల్లో సినిమాపై ఉన్న అంచనాలను అందుకునే విధంగా సినిమా ఉంది. సినిమాలో డైలాగుల విషయానికొస్తే.. సీనియర్ జర్నలిస్టులు పులగం చిన్నారాయణ, డా. చల్లా భాగ్యలక్ష్మి రాసిన మాటలు మనసుల్ని తాకాయి. పులగం చిన్నారాయణకు సినిమాలపై మంచి పుస్తకాలు రాసిన అనుభవం ఉంది. జర్నలిస్ట్ గా చల్లా భాగ్యలక్ష్మికి ఎంతో పేరుంది. కథానుగుణం గా ఇద్దరూ చక్కటి మాటలు రాశారు. ‘యశోద’ ఎవరో తెలుసు కదా…కాబోయే మదర్, ఫైటర్ & పవర్‌ఫుల్! ‘యశోద’ ఎవరో తెలుసు కదా? ఆ కృష్ణ పరమాత్ముడిని పెంచిన తల్లిలాంటి డైలాగులకు ప్రేక్షకుల్లో మంచి స్పందన కనిపించింది. ‘యశోద’లో ప్రేమ ఉంది. ‘నీకు ఎప్పుడైనా రెండు గుండె చప్పుళ్లు వినిపించాయా? బిడ్డను కడుపులో మోస్తున్న తల్లికి మాత్రమే అది వినిపిస్తుంది’ అని సమంత చెప్పే మాటలో బిడ్డపై తల్లి ప్రేమ వినిపిస్తుంది. అంతే కాదు… ‘యశోద’లో క్రైమ్ ఉంది, రాజకీయం ఉంది, అన్నిటి కంటే ముఖ్యంగా మహిళ చేసే పోరాటం ఉంది.
టాలీవుడ్ లో ఎప్పటికప్పుడు వాతావరణం మారుతుంటుంది… దాన్ని లేటెస్ట్ అంటాం. ఐదారు నెలలుగా మళ్ళీ భయం మొదలైంది. ఇప్పుడు నిర్మాతలు భయపడుతున్నారు. ఎందుకంటే… కరోనా తర్వాత ప్రేక్షకులు అన్ని భాషల సినిమాలు చూస్తున్నారు. ఓటీటీల్లో సబ్ టైటిల్స్ ఉంటున్నాయి. వరల్డ్ సినిమా చూస్తున్నారు. అందుకని, ఏమాత్రం రొటీన్‌కి దగ్గరగా ఉన్నా నిర్ధాక్షిణ్యంగా మాట్లాడుతున్నారు. అది నెక్స్ట్ షో కలెక్షన్స్ మీద ఎఫెక్ట్ చూపిస్తోంది. మంచి చెడులు ఉండటం లేదు. ప్రేక్షకులు తొక్కేస్తున్నారు. కాంబినేషన్స్ మీద కాకుండా మంచి సినిమాలు తీయాలని నిర్మాతలు కాన్సంట్రేషన్ చేస్తున్నారు. ఇది మంచి పరిణామమే! అలా కొత్తగా.. ప్రేక్షకులు మెచ్చే విధంగా న్యూ ఏజ్ కాన్సెప్ట్‌తో రూపొందిన సినిమా ఈ ‘యశోద’. సినిమా చూసిన ప్రతీ ఒక్కరూ థియేటర్ నుంచి బయటికి వస్తున్నప్పుడు ‘వాహ్..సమంత!’ అని మెచ్చుకోకుండా ఉండలేరు. అంతటి ఎమోషనల్ జర్నీ ఈ ‘యశోద’!

– ఎం.డి అబ్దుల్

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

13 − eleven =