విపక్షాల రాష్ట్రపతి అభ్యర్ధిని ఖరారు చేసిన జైరాం రమేష్..!

0
788

రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి, టీఎంసీ నేత యశ్వంత్ సిన్హా పేరు ఖరారైంది. ఎన్సీపీ అధినేత శరద్​ పవార్​ నేతృత్వంలో జరిగిన విపక్షాల సమావేశంలో దీనిపై ఏకాభిప్రాయానికి వచ్చారు. అనంతరం కాంగ్రెస్ నేత జైరాం రమేశ్.. యశ్వంత్ సిన్హానే తమ ఉమ్మడి అభ్యర్థి అని అధికారికంగా ప్రకటించారు.

యశ్వంత్‌ సిన్హా కూడా విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేసేందుకు సముఖంగానే ఉన్నారు. ఈ మేరకు ట్విట్టర్‌ ద్వారా తన అభిప్రాయాన్ని సూచన ప్రాయంగా వెల్లడించారు. టీఎంసీ పార్టీకి కూడా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. దేశ ప్రయోజనాల కోసం పార్టీకి దూరంగా పనిచేయాల్సిన సమయం వచ్చిందంటూ సిన్హా ట్వీట్‌ చేశారు. టీఎంసీలో మమతా బెనర్జీ తనకు ఇచ్చిన గౌరవం, హోదాకు ఆమెకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు చెప్పారు. ప్రతిపక్షాల ఐక్యత కోసం పని చేయాల్సిన సమయం వచ్చిందన్నారు.

రాష్ట్రపతి పదవికి బీజేపీయేతర పక్షాల ఉమ్మడి అభ్యర్థిగా ఉండేందుకు ఇప్పటికే ముగ్గురు నేతలు తిరస్కరించడంతో ప్రతిపక్షాలకు కొంత ఇబ్బందికర పరిస్థితి తలెత్తింది. రాష్ట్రపతి రేసుకు తొలుత ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ విముఖత చూపించగా.. ఆ తర్వాత జమ్మూకశ్మీర్‌ మాజీ సీఎం ఫరూక్‌ అబ్దుల్లా, మహాత్మా గాంధీ మనవడు, పశ్చిమ బెంగాల్‌ మాజీ గవర్నర్‌ గోపాలకృష్ణ గాంధీ కూడా విపక్షాల ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించారు. దీంతో యశ్వంత్ సిన్హా పేరు తెరపైకి వచ్చింది. అయితే సిన్హాను రాష్ట్రపతి ఎన్నికల్లో దింపాలంటే ఆయన టీఎంసీకి రాజీనామా చేయాలని కాంగ్రెస్‌, వామపక్షాలు ఒత్తిడి చేసినట్లు సమాచారం.

ఈ క్రమంలోనే ఆయన టీఎంసీకి రాజీనామా చేశారు. వంగత మాజీ ప్రధాని వాజ్‌పేయీకి సన్నిహితుడైన సిన్హాకు వివిధ పార్టీల నేతలతో సత్సంబంధాలున్నాయి. బీజేపీని వీడిన ఆయన గతేడాది తృణమూల్‌లో చేరారు. రాష్ట్రపతి అభ్యర్థికి విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా యశ్వంత్‌ సిన్హా పేరును మమతా బెనర్జీనే ప్రతిపాదించినట్లు సమాచారం. మరోవైపు, నేడు బీజేపీ పార్లమెంటరీ బోర్డు కూడా భేటీ కానుంది. ఈ సమావేశంలో రాష్ట్రపతి అభ్యర్థిపై చర్చించనున్నట్లు సమాచారం. జులై 18న రాష్ట్రపతి ఎన్నిక జరగనుంది.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

fifteen + 5 =