భారత్ 1983 వరల్డ్ కప్ స్టార్ కు అశ్రు నివాళి

భారత మాజీ క్రికెటర్ యశ్ పాల్ శర్మ కార్డియాక్ అరెస్ట్ కారణంగా ఢిల్లీలో మృతి చెందారు. 1983లో జరిగిన ప్రపంచకప్ ను కైవసం చేసుకున్న కపిల్ దేవ్ సేనలో శర్మ కూడా ఒకరు. ఆయన వయసు 66 సంవత్సరాలు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. 1972లో పంజాబ్, జమ్మూకాశ్మీర్ స్కూళ్ల మధ్య జరిగిన క్రికెట్లో 260 పరుగులు చేసి ఆయన అందరి దృష్టిలో పడ్డారు. 1978లో వన్డే జట్టులోకి, 1979లో టెస్టు జట్టులోకి వచ్చిన యశ్పాల్ 1985లో అంతర్జాతీయ క్రికెట్‌కు యశ్ పాల్ శర్మ వీడ్కోలు పలికారు. 1983లో వరల్డ్ కప్ గెలుచుకున్న టీమిండియా బృందంలో ఒకరైన యశ్ 34.28తో 240 పరుగులు సాధించారు. ఇంగ్లాండ్ తో జరిగిన సెమీ ఫైనల్స్ లోనూ 60 పరుగులు నమోదు చేయగలిగారు.
అంతర్జాతీయ క్రికెట్ లో శర్మ 37 టెస్టులు, 42 వన్డేలు ఆడారు. టెస్టుల్లో 1,606 పరుగులు, వన్డేల్లో 883 రన్స్ సాధించారు. 1983 ప్రపంచకప్ లో ఓల్డ్ ట్రాఫోర్డ్ లో ఇంగ్లండ్ తో జరిగిన మ్యాచుల్లో యశ్ పాల్ సాధించిన హాఫ్ సెంచరీ హైలైట్ అని భారత క్రికెట్ అభిమానులు చెబుతూ ఉంటారు. రంజీ ట్రోఫీలో యశ్ హర్యానా, రైల్వేలతో సహా మూడు జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. 160 మ్యాచ్‌లు ఆడగా 8,933 పరుగులు చేశాడు, ఇందులో డబుల్ సెంచరీ కూడా ఉంది. 2000 ప్రారంభంలో యశ్ పాల్ జాతీయ సెలక్టర్ గా కూడా బాధ్యతలను నిర్వహించారు. ఆయన మృతి పట్ల పలువురు ప్రముఖులు, క్రికెటర్లు సంతాపాన్ని తెలియజేశారు.
యశ్పాల్ మృతి ఎంతో షాక్‌కు గురి చేసిందని క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ తెలిపారు. 1983 వరల్డ్‌కప్‌లో అతని బ్యాటింగ్ శైలిని చూసి ఎంజాయ్ చేసేవాడిని అని పేర్కొన్నాడు. ఎన్నో జ్ఞాపకాలు మిగిలి ఉన్నాయన్నారు. భారతీయ క్రికెట్‌కు ఆయన అందించిన భాగస్వామ్యం మరవలేనిదంటూ శర్మ కుటుంబానికి నివాళి అర్పించారు. యశ్పాల్ మృతి బాధాకరం అని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ట్విట్టర్ ద్వారా నివాళులు అర్పించారు. 83 వరల్డ్ కప్‌లో అతడి ప్రదర్శన అసాధారణమన్నారు. యశ్పాల్ కుటుంబసభ్యులకు రాష్ట్రపతి ప్రగాఢ సానుభూతి తెలిపారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా యశ్ పాల్ మృతి పట్ల దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు.