ఉత్తరప్రదేశ్‌లోని యమునా ఎక్స్‌ప్రెస్‌వే పేరును మాజీ ప్రధాని ‘అటల్ బిహారీ వాజ్‌పేయి ఎక్స్‌ప్రెస్‌వే’ గా మార్చే అవకాశం ఉంది. యమునా ఎక్స్‌ప్రెస్ వేకు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి పేరు పెట్టాలని కేంద్రం నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈ నెల 25న గౌతమ్ బుద్ధనగర్ జిల్లాలోని జెవార్‌లో నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయానికి శంకుస్థాపన చేయనున్నారు. ఈ సందర్భంగానే యుమునా ఎక్స్‌ప్రెస్ వే పేరును మారుస్తూ ప్రకటన చేయనున్నట్టు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావడం ఒక్కటే ఆలస్యం అని అధికారులు చెబుతున్నారు. ఎక్స్‌ప్రెస్‌వే పేరు మార్చడంపై అధికారిక ప్రకటన వెలువడే ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మరియు బీజేపీ అగ్రనేతలు హాజరుకానున్నారు.
ఒక సీనియర్ బిజెపి నాయకుడు మాట్లాడుతూ “భారతదేశంలో అత్యంత ప్రియమైన రాజకీయ నాయకులకు గౌరవం ఇవ్వడానికి ఎక్స్‌ప్రెస్‌వే పేరు మార్చడానికి నిర్ణయం తీసుకోబడింది. AB వాజ్‌పేయిని పార్టీ శ్రేణులకు అతీతంగా అందరూ గౌరవిస్తారు, మరియు ఎక్స్‌ప్రెస్‌వే పేరు మార్చడం వలన ఆయన గొప్పతనాన్ని భవిష్యత్ తరాలకు తెలియజేసే అవకాశం ఉంటుంది.” అని చెప్పుకొచ్చారు. యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం యొక్క కీలకమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్ట్ అయిన నోయిడా విమానాశ్రయానికి శంకుస్థాపన కార్యక్రమం అట్టహాసంగా జరగనుంది. వచ్చే ఏడాది జరగనున్న ఉత్తరప్రదేశ్ ఎన్నికల విషయంలో బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు చూపిస్తూ ఉంది. మరికొన్ని ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల విషయంలో కూడా అడుగులు వేస్తూ ఉంది.