యాదాద్రి ఘాట్ రోడ్డు కుంగిపోవడానికి కారణాలేంటి..? ఇందుకు అధికారులు అలసత్వమా..? ప్రభుత్వ నిర్లక్ష్యమా..? భక్తులు ఏం చెబుతున్నారు..? ఎలాంటి ప్రమాణాలు పాటించాల్సి ఉంది..? పార్కింగ్ బాదుడుపై ఉన్న శ్రద్ధ..నాణ్యతపై లేదా…?
తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. ఉపరిత ద్రోణి ప్రభావంతో పలు చోట్ల భారీ వర్షాలు కురిశాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి. కుండపోత వర్షానికి హైదరాబాద్ అతలాకుతలమైంది. తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరి గుట్టు సైతం తడిసి ముద్దయింది. బుధవారం తెల్లవారుజామున 5 గంటల నుంచి సుమారు రెండు గంటలపాటు కుండపోత వర్షం కురిసింది.
కుండపోత వర్షానికి లక్ష్మీనరసింహస్వామి ఆలయ పరిసరాల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. వరద నీటి ధాటికి ఘాట్ రోడ్డు దెబ్బతింది. ఆలయ క్యూకాంప్లెక్స్‌లు వరద నీటితో నిండిపోయాయి. యాదగిరి గుట్ట బస్టాండ్ ప్రాంగణంలోకి నీరు చేరడంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. బస్సులు సైతం బురదలో కూరుకుపోయాయి. కొండపై నుంచి వర్షపు నీరు దిగువ ఉన్న కాలనీల్లోకి చేరాయి. దీంతో ఆ ప్రాంతమంతా చెరువులా మారింది.
యాదాద్రి కొండపై నుంచి కిందికి నూతనంగా నిర్మించిన రోడ్డు దెబ్బతినడంతో రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాలినడకతోనే కొండపైకి చేరుకుంటున్నారు. ఈదురుగాలులకు చలువ పందిళ్లు నేలకొరిగాయి. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ దెబ్బతింది. నూతనంగా నిర్మించిన ఘాట్ రోడ్డు దెబ్బతినడంపై విమర్శలు వస్తున్నాయి. అధికారులు, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వల్లే రోడ్డు కుంగిపోయిందని భక్తులు మండిపడుతున్నారు. పార్కింగ్‌పై పెట్టిన దృష్టి రోడ్లపై పెట్టలేదని ఫైర్ అవుతున్నారు. కొండపై పార్కింగ్‌కు ఐదు వందల రూపాయలు తీసుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.
కుండపోత వర్షంతో యాదాద్రి పనుల్లో డొల్లతనం బయటపడింది. పూర్తి నాసిరకం పనుల వల్లే కొండపై ఈపరిస్థితి అన్న విమర్శలు వస్తున్నాయి. సీఎం కేసీఆర్ మానసపుత్రిక అయిన యాదాద్రి ఒక్క వర్షానికి అతలాకుతలమైంది. అధికారులు, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందన్న ఆరోపణలున్నాయి. ఆలయ అభివృద్ధికి దాదాపు 2 వేల కోట్లు ఖర్చు చేసినా..ఎక్కడా నాణ్యత లేదన్న వాదన ఉంది. దీనిపై ప్రభుత్వం సైతం సీరియస్‌గా ఉందని తెలుస్తోంది. యాదాద్రి పరిస్థితిపై అధ్యయనానికి కమిటీ వేసినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి.