More

  యాదాద్రి భువనగిరిలో దారుణం.. నిందితుడిని పట్టించిన చెప్పులు

  యాదాద్రి భువనగిరి జిల్లాలో దారుణం జరిగింది. వలస వచ్చి జీవిస్తున్న వివాహిత మహిళపై ఓ కామాంధుడు అత్యాచారం చేసి చంపేశాడు. వివాహితపై దారుణంగా అత్యాచారానికి పాల్పడి చంపేయడమే కాకుండా.. ఆమె కాళ్ల పట్టీలు, బంగారు పుస్తెలను దోచుకుని పారిపోయాడు. దారుణం జరిగిన 12 గంటల్లోనే పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

  నాగర్‌కర్నూల్‌ జిల్లా కోడేరు మండలంలోని ఓ తండాకు చెందిన భార్యాభర్తలు బతుకుదెరువు కోసం కొద్ది రోజుల కింద యాదాద్రి భువనగిరి జిల్లాకు వచ్చారు. ఆరేళ్ల కింద వీరికి పెళ్లి అయింది. పిల్లలు లేరు. చౌటుప్పల్‌ మండలం తూప్రాన్‌పేట శివారులోని మూతబడిన ఓ నిర్మాణ పనుల గోదాంకు భార్య(28), భర్తలు వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నారు. అక్కడే ఒక గదిలో నివాసం ఉంటున్నారు. జీతం చాలకపోవడంతో భర్త.. సమీపంలోని ఓ ఇంజనీరింగ్‌ కళాశాలలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. భార్య గోదాం వద్దే ఉంటూ చూసుకునేది. ఎప్పటి లాగే భర్త సోమవారం డ్యూటీకి వెళ్లాడు. డ్యూటీ ముగించుకుని రాత్రి 8 గంటలకు వచ్చేసరికి ఇంటికి తాళం వేసి ఉంది. భార్య కోసం చుట్టుపక్కల వెతుకుతుండగా పక్కనే ఉనన్న బాత్రూం సమీపంలోని గడ్డివాము దగ్గర విగతజీవిగా రక్తపు మడుగులో అర్ధ నగ్నంగా పడి ఉంది. భర్త వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు క్లూస్‌టీం, డాగ్‌ స్క్వాడ్‌లను రప్పించి, వివరాలు సేకరించారు. మృతదేహాన్ని మంగళవారం ప్రభుత్వాస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. ఆమెపై రెండుసార్లు లైంగికదాడి జరిగినట్లు నిర్ధారించారు. గోదాంకు సమీపంలోని సిమెంట్‌ బ్రిక్స్‌ పరిశ్రమలో పనిచేసే కార్మికుడు ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానించారు.

  డెయిరీ లేబర్‌ రూముల్లో అద్దెకు ఉంటున్న హరీష్‌గౌడ్ అనే పాతికేళ్ల యువకుడే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు గుర్తించారు. భర్త లేని సమయం చూసి ఇంట్లోకి చొరబడి ఆమెపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. ఆమె ప్రతిఘటించడంతో కొట్టి చంపాడు. మృతి చెందిన మహిళ పై అత్యాచారం చేసి ఆమె ఒంటిపైనున్న నగలు, వెండి పట్టీలు తీసుకొని పారిపోయాడు. పక్కా ప్లాన్ ప్రకారమే చేసినప్పటికి గోదామ్‌లోకి వచ్చే ముందు పక్కనే ఉన్న తమ డెయిరీ లేబర్‌ గదులకు మధ్య ఉన్న గోడ దూకడానికి చెప్పులు వదిలి వచ్చాడు. మృతురాలి భర్త ఫిర్యాదుతో హత్య కేసు నమోదు చేసిన చౌటుప్పల్ పోలీసులు నిందితుడ్ని పట్టుకునేందుకు ఇద్దరు సీఐలు, ముగ్గురు ఎస్సైలతో ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. హత్య జరిగిన గోదామ్‌తో పాటు పక్కనే ఉన్న ప్రహరిగోడ దగ్గర సాక్ష్యాధారల కోసం వెదుకుతుండగా నిందితుడు హరీష్‌గౌడ్ వదిలివెళ్లిన చెప్పులను స్వాధీనం చేసుకున్నారు. వాటికి సిమెంట్‌ ఉండటంతో పక్కనే ఉన్న డెయిరీ లేబర్‌ రూంలో ఉన్న వ్యక్తులను విచారించారు. గిరిజన యువతిని హత్య చేసిన నిందితుడు కూడా అక్కడే ఉండటంతో అతడ్ని ప్రశ్నించారు పోలీసులు. ఆ సమయంలో హరీష్‌గౌడ్‌ కాళ్లకు చెప్పులు లేకపోవడంతో అనుమానం వచ్చి ప్రశ్నించారు. హరీష్‌గౌడ్‌ని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లగా.. తమదైన శైలిలో విచారించగా మహిళను చంపి, అత్యాచారం చేసినట్లుగా అంగీకరించినట్లుగా ఏసీపీ ఉదయ్‌రెడ్డి తెలిపారు. నిందితుడి దగ్గర మృతురాలి దగ్గర కాజేసిన నగలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. కోర్టులో హాజరుపరిచి నల్లగొండ జైలుకు తరలించారు.

  Trending Stories

  Related Stories