More

    ‘లాసా’ రహస్యం..! జిన్‎పింగ్ పర్యటన ఆంతర్యం..!!

    చైనా శాశ్వత అధ్యక్షుడు షి జిన్ పింగ్  ప్రపంచపు పైకప్పు, టిబెట్ లోని చారిత్రక నగరం ‘లాసా’లో రహస్యంగా వాలిపోయారు. అనుకోని అతిథి అద్భుత నగరంలో కాలుమోపగానే ప్రపంచం నివ్వెరపోయింది. చైనా పగ్గాలు చేపట్టిన ఎనమిదేళ్ల తర్వాత జిన్ పింగ్ టిబెట్ లో ఎందుకు పర్యటించాడనే సందేహం అంతటా వ్యక్తమైంది. వర్షరుతువు ధాటికి చిగురుటాకులా వణికిన చైనాను వదిలి, ఏలినవారు టిబెట్ లో ఎందుకు ప్రత్యక్షమయ్యారు…? అనే అనుమానం రావడం సహజం కూడా.

    షి జిన్ పింగ్ కాకతాళీయంగా టిబెట్ పర్యటనకు రాలేదు. దానికి చాలా వ్యూహాత్మక కారణాలున్నాయి. చారిత్రక అవసరాలున్నాయి. లాసా నగరం సౌందర్యానికే కాదు, వ్యూహానికి కూడా కేంద్రం. భౌగోళిక రాజకీయాల వికృత క్రీడకూ, దౌత్యనీతి మాటున సాగిన కుట్రలకు కేంద్రం లాసా సిటీ.

    చైనాను ఒక పట్టాన విశ్వసించలేమని మనమే కాదు, వామపక్షాన్ని కాసింత విశ్వసించిన తిలక్ లాంటి కవికూడా తన కవిత్వంలో మోతాదు పెంచి మరీ కసిగా అనుమానించారు. ‘‘బరిమీద పాముని, చైనా వాడినీ/ ‘‘బోగం పాటని, చౌ ఎన్ లై మాటనీ/ సినీతార వయస్సుని, మావో సేటుంగ్ మనస్సునీ’’ నమ్మవద్దని హెచ్చరించారు. ‘బోగం’ అనే మాటను ఇవాళ ఉచ్చరించడం తగదు. చాలా మాటలకు కాలం గౌరవాన్ని తెచ్చినపుడు దాన్ని కాపాడాల్సిన బాధ్యత పాత్రికేయులకే కాసింత ఎక్కువగా ఉంటుంది కావచ్చు.

    ఇంతకూ షి జిన్ పింగ్ లాసా నగరానికి ఎందుకు వచ్చినట్టు?

    జిన్ పింగ్ పర్యటనకు కొన్ని వ్యూహాత్మక కారణాలూ, మరికొన్ని పర్యవసనాలూ ఉన్నాయి. అంతకు మించి టిబెట్ తో చైనాకు కొన్ని అత్యంత తీవ్రమైన అవసరాలున్నాయి. రాబోయే రోజుల్లో ఏర్పడే భౌగోళిక రాజకీయాల తలపోటుకు అమృతాంజనం ఎంతో కొంత టిబెట్ లో కూడా ఉందని చైనా భావిస్తోంది.

    చైనా దౌత్యనీతిని ప్రశ్నించగల అనేక అవరోధాలు కూడా టిబెట్ చరిత్రతో ముడివడి ఉన్నాయి. అంతకు మించి సౌందర్యం, ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడే ‘లాసా’ నగరాన్ని నిఘాకేంద్రంగా మార్చే కుట్ర దాగి ఉంది. అయితే ఇప్పుడే ఎందుకు పర్యటించాలి? అనే ప్రశ్నకూ సమాధానాలున్నాయి.

    అవేంటో చూద్దాం….

    1. చైనా కమ్యూనిస్టు పార్టీ 2021, జూలై 21 నాటికి శతవసంతాలు పూర్తి చేసుకుంది. కమ్యూనిజం, ప్రజాస్వామ్యం, Democratic capitalism మీదుగా… అంతిమంగా నియంతృత్వమే నిఖార్సైన శాశ్వత సిద్ధాంతమని నిర్ధారణకు వచ్చిన సందర్భమిది.
    2. ఆసియాఖండంలోని అనేక చిన్నాచితక దేశాలపై పై చేయి సాధించిన చైనా; అక్రమంగా తన అధీనంలో ఉండిపోయిన ‘టిబెట్’ విషయంలో తన భవిష్యత్ చర్యలను తెలియజేసేందుకు ఒక ‘ప్రతీకాత్మక హెచ్చరిక-Symbolic warning’ చేయాలని భావించింది. అందుకే ఈ పర్యటనతో భారత్ కు ఒక కొత్త సంకేతాన్ని ఇచ్చే ప్రయత్నం చేసింది.
    3. మధ్య ఆసియాలో ముఖ్యంగా చారిత్రక సిల్క్ రోడ్ పై ఆధిపత్యం సంపాదించేందుకు అటు పాకిస్థాన్ లోని కరాచీ పోర్ట్ ను వాడుకోవాలని ప్రణాళికలు సిద్ధం చేసింది. అందుకు అడ్డంకిగా ఉన్న ఆఫ్ఘనిస్తాన్ ను అదుపు చేసేందుకు అక్కడ పెట్టుబడులు పెట్టి సిల్క్ రోడ్ కు మార్గం సుగమం చేసుకుంది.
    4. ఇక మిగిలింది సిల్క్ రోడ్  తో చారిత్రక, ఆధ్యాత్మిక, వాణిజ్య బంధం ఉన్న టిబెట్ లోని TEA HORSE ROAD ను కూడా తన అదుపులోకి తెచ్చుకోబోతున్నాననే హెచ్చరిక పంపడం.
    5. లాసా నగరంలో ఇకపై అమెరికా నిఘా సంస్థ CIA, భారత నిఘా దిగ్గజం RAW ల ఆటలు సాగవనే సంజ్ఞ చేయడం. మారిన టిబెట్ Demography ని సూచించడం.
    6. 2008 బీజింగ్ ఒలంపిక్స్ సందర్భంగా లాసాలో నిరసన తెలిపిన బౌద్ధులను ఊచకోత కోసిన పుష్కర కాలం తర్వాత అదే నగరం నుంచి చైనా తన రక్తపు చారికల ముఖంగా చిరునవ్వులు చిందిస్తోంది.

    మన దేశంలోని ప్రతిపక్షాలన్నీ ప్రజాస్వామ్య విలువల గురించి మాట్లాడుతున్న చిత్రమైన సందర్భంలో సమీప గతంలో వారు టిబెటన్ల అనుసరించిన వైఖరి జ్ఞప్తికి తెచ్చుకోవాలి. ప్రస్తుతం టోక్యో లో ఒలంపిక్స్ జరుగుతున్న సందర్భంలో – 2008 బీజింగ్ ఒలంపిక్స్ వేళ భారత్ లో నిరసన తెలిపిన టిబెటన్ల విషయంలో చైనాను సంతృప్తి పరిచేందుకు కాంగ్రెస్ అనుసరించిన తీరు తప్పక గుర్తుకు తెచ్చుకోవాలి.

    2008లో బీజింగ్ లో ఒలంపిక్స్ జరుగుతున్న సందర్భంలో భారత్ లోని టిబెట్ కాందిశీకులు దేశ రాజధాని ఢిల్లీలో నిరసన తెలిపారు. చైనాకు కోపం తెప్పించకూడదన్న భయంతో నాటి ప్రభుత్వం 365 మంది టిబెటన్ కాందిశీకులను తీహార్ కారాగారంలో బందీ చేసింది. ఒలంపిక్ జ్యోతి భారత సరిహద్దులు దాటిన పక్షం రోజులకు కూడా వారిని విడుదల చేయలేదు నాటి ఘనత వహించిన ‘ప్రజాస్వామిక’ యూపీఏ ప్రభుత్వం.

    చైనాను తన చెప్పు చేతల్లో వలసగా మార్చుకుని పాలించిన జపాన్ లో నేడు ఒలంపిక్స్ జరుగుతున్నాయి. 2008, మార్చి 10న లాసా నగరంలో మారణకాండ జరిగి పుష్కరకాలం గడిచిపోయిన తర్వాత చైనా పాలకుడు అదే నగరంలో పర్యటించాడు. విషాదాన్ని గుర్తు చేసి, టిబెటన్ల అశక్తతను మరోసారి జ్ఞప్తికి తెచ్చి తాజాగా అవమానించాడు జిన్ పింగ్.

    ఇదీ టిబెట్ వర్తమానాన్ని వెంటాడుతున్న చరిత్ర – వేటాడుతున్న చైనా స్వభావ చరిత్ర…

    చలనం గురించీ, నిరంతర మార్పు గురించి వ్యాఖ్యానాలు చేసే మార్క్సియన్ తాత్వికత కాలానుగుణమైంది కాదని చైనా కూడా గుర్తించింది. అందుకే శాశ్వతత్వం, నియంతృత్వం, దురాక్రమణతత్వం అనే ‘త్రిసూత్రం’ పై దృష్టి సారించింది. 2018లోనే శాశ్వత అధ్యక్షుడి హోదాను ఖరారు చేసింది. ప్రజాభిప్రాయానికి తావున్న రాజ్యాంగం అక్కరలేదని తేల్చిపారేసింది.

    అంతర్జాతీయ సమాజం నమ్మిన, నమ్ముతున్న విలువలు పరమచెత్తగా భావిస్తోంది. అందంగా కనిపించేదీ, లాభంగా తోచిందీ, అవసరమనిపించిందీ, భవిష్యత్తుకు మేలు చేసేది, ప్రమాదాన్ని నివారించేదీ ఏదైనా సరే….దాన్ని బలవంతంగా లాగేసుకోవచ్చని చైనా భావిస్తోంది. ఇది జనచైనా సాధించిన గుణాత్మక పరిణామం. కమ్యూనిజం చిట్టచివరి మజిలీ. ఈ మజిలినీ ప్రపంచానికి ఖరారుగా చెప్పాలన్న కాంక్షకొద్దీ జిన్ పింగ్ లాసాలో ప్రవేశించారు.

    చైనా సాధించిన ఆర్థిక ప్రగతి వల్ల వచ్చే ప్రమాదం కన్నా, దాని స్వభావంలో వచ్చిన మార్పు వల్ల పొంచి ఉన్న అపాయమే అధికం. ద్వంద్వ ప్రమాణాన్ని ప్రామాణికంగా భావిస్తోంది చైనా. Diplomacy అంటే conspiracy అనీ, Disengagement కు అర్థం engagement అని సరికొత్తగా నిర్వచిస్తోంది.

    ఎవరికైనా అన్యాయం జరిగితే గగ్గోలు పెడతారు కమ్యూనిస్టులు. చైనా టిబెట్ ను ఆక్రమిస్తే మాత్రం మౌనం పాటిస్తారు. కారణం, టిబెట్ ను దురాక్రమించుకున్నది కమ్యూనిస్టు చైనా కాబట్టి. చైనా పరిభాషలో ‘టిబెటన్ల స్వాతంత్ర్య కాంక్ష ఫ్యూడల్ సంస్కృతిని కాపాడే బౌద్ధమతాధిపతుల తిరోగామి కాంక్ష’. టిబెటన్లు వియత్నాం వీరుల్లాగా, దక్షిణాఫ్రికా ప్రజల్లాగా హీరోలు కాలేకపోయారు. ప్రతిఘటన మాటున వామపక్షవాదులు గుర్తింపును కోరుకుంటారు. అధికారాన్ని ఆశిస్తారు టిబెటన్లు వాటిని ఆశించలేదు.

    టిబెటన్ సమాజాన్ని అదుపులో పెట్టుకోవాలంటే బౌద్ధమత శాఖలపై పెత్తనం నెలకొల్పాలని చైనా కమ్యూనిస్టు పార్టీ తొలిరోజుల్లోనే భావించింది. దలైలామా స్వాతంత్ర్య కాంక్షకు ‘ఫ్యూడల్ సంస్కృతి’ అని నిందించిందో అదే బౌద్ధమత వ్యవస్థను ఆధారం చేసుకుని చైనా టిబెట్ పై ఆధిపత్యం సంపాదించింది. మతాధిపతుల ఎంపికలో తన పాత్రను నిర్ణాయకం చేయడం వల్ల టిబెట్ తనలో భాగమని నిరూపించే ప్రయత్నం చేసింది. అందుకే ఏడేళ్ల పసివాణ్ని 17వ కర్మపాగా గుర్తించింది. వివిధ బౌద్ధమత శాఖలకు టిబెటన్ సమాజంపై ఉన్న ప్రభావాన్నిచైనా తన దురాక్రమణకు వాడుకుంది. అనేక చారిత్రక వాస్తవాలను అబద్ధాలుగా ప్రచారం చేసింది చైనా. గడచిన వందేళ్లలో ఏ దేశంలోనూ జరగని ప్రజా ఉద్యమాలూ చైనాలో జరిగాయి. వాటి ఊసే ప్రపంచానికి తెలియకుండా పోయింది.

    సరిగ్గా ఈ నేపథ్యంలోనే లాసాలోకి అడుగుపెట్టింది.

    అప్పుల వల విసిరి పాకిస్థాన్ ను అమెరికా చేతుల్లో నుంచి లాక్కుంది. యూరేసియాకు, పశ్చిమాసియాకు మధ్య ఉన్న ఆఫ్ఘనిస్తాన్ లో పెట్టుబడులు పెట్టి అనుకూల వాతావరణాన్ని ఏర్పాటు చేసుకునే ప్రయత్నం చేస్తోంది. షాంఘై కో-ఆపరేషన్ ఆర్గనైజేషన్ పేరుతో సిల్క్ రోడ్ దేశాలు-కజకిస్థాన్, కిర్గిస్థాన్, ఉజ్బెకిస్థాన్, తజకిస్థాన్ లలో అపారమైన వనరుల తరలింపునకు మార్గం సుగమం చేసుకుంటోంది. టిబెట్ లోని Tea horse route సిల్క్ రోడ్ కు అనుసంధానంగా ఉన్న ప్రాచీన మార్గం.

    తేయాకు రవాణా జరిగిన కాలంలో ఆ మార్గానికి అదే పేరు  స్థిరపడింది. చైనాకు నైరుతిలో ఉన్న మార్గంపై పూర్తి స్థాయి పట్టుసాధించేందుకు గా ప్రాచీన చరిత్రలో తారసపడే నైరుతి చైనాకు ఆనుకుని ఉన్న టిబెట్ లోని సిల్క్ రోడ్ ను తన అధీనంలోకి తెచ్చుకునే ప్రయత్నం చైనా సుదీర్ఘ  కాలంగా చేస్తూనే ఉంది. ఈ టీ హార్స్ రోడ్ నేపాల్, భూటన్, భారత్ లోకి ప్రవేశిస్తుంది.

    టిబెట్ లో జరిగిన 1959 తిరుగుబాటు తర్వాత చైనా కమ్యూనిస్టు పార్టీ ఆ ప్రాంత జనాభా నిష్ఫత్తిపై ప్రత్యేక దృష్టి సారించింది. 2007 లో వెలువడిన ‘‘Population Structure and Changes in the Tibet Autonomous Region’’ నివేదిక మారిన జనాభా నిష్ఫత్తిని స్పష్టంగానే సూచించింది. చైనా ప్రభుత్వం తీసుకున్న “Developing West” క్యాంపెయిన్ ఉద్దేశం పశ్చిమ, నైరుతి ప్రాంతాల జనాభాతో పాటు, ఎథినిక్ సమస్య రాకుండా సాంస్కృతిక వాతావరణాన్ని మార్చాలన్నది కూడా. ఈ లక్ష్యంతోనే తీర ప్రాంతాన్ని పశ్చిమానికి అనుసంధానం చేసింది. ఇది సహజంగానే టిబెట్ లో చైనీయుల ప్రాబల్యాన్ని క్రమంగా పెంచింది. ఈ మార్పు లాసాలో జరిగిన జిన్ పింగ్ స్వాగత సత్కారాల్లో కొట్టొచ్చినట్టు కనిపించింది.

    19 శతాబ్దంలో బ్రిటీష్, రష్యా సామ్రాజ్యాల మధ్య నెలకొన్న యుద్ధాలు, దౌత్యం నేపథ్యంలో లాసా ఒక గూఢచార కేంద్రంగా ఉంటుంది. 1950ల తర్వాత రష్యా, అమెరికా ప్రచ్ఛన్న యుద్ధ కాలానికి సీఐఏ-కేజీబీ రహస్య కార్యకలాపాలకు లాసా కేంద్రంగా మారింది. 1950,1960 సమయంలో చైనా ఇంటెలిజెన్స్‌ సంస్థలు భారత్‌లో కొన్ని కీలక ఆపరేషన్లు నిర్వహించాయి.

    టిబెట్‌ ఆక్రమణ సమయంలో భారీ సంఖ్యలో ఇంటెలిజెన్స్‌ ఆపరేటివ్స్‌ను అక్కడకు తరలించింది. చైనా టిబెట్ ను ఆక్రమించిన తర్వాత తర్వాత ఇండో-టిబెట్‌ సరిహద్దుల్లో స్థిరపడ్డారు. ఆ తర్వాత భారత్‌లోగూఢచర్యం మొదలు పెట్టారు. టిబెట్‌లోని లాసాలో బోర్డర్‌ అఫైర్స్‌ ఆఫీస్‌ పేరుతో ఒక నిఘా కార్యలయాన్ని చైనా తెరిచింది. దాదాపు నాలుగు వందల మందిని ఇందులో నియమించింది. 1960 నుంచి ఈశాన్య భారత్‌లో వేర్పాటు వాదానికి చైనా ఇంటెలిజెన్స్‌ సంస్థలే కారణం అయ్యాయి. అమెరికా రచయిత Joe Bageant ‘‘Militery History’’ అనే పత్రికకు రాసిన వ్యాసంలో 1959 టిబెట్ తిరుగుబాటు గురించి ఆసక్తికరమైన అంశాలను రాశారు. ఈ తిరుగుబాటును చైనా అత్యంత దారుణంగా అణచివేసిన తర్వాత ఈ పోరాటంలో పాల్గొన్న కొంతమందిని  Joe Bageant ఇంటర్వ్యూ చేసిన సందర్భంలో మీలో మిగిలిన ఆశ ఏంటి అని ప్రశ్నించారట. అందుకు వారంతా ‘‘We only lived to kill Chinese’’ అన్నారట. ఈ ఒక్కమాట చాలు చైనా స్వభావాన్ని చెప్పటానికి. కమ్యూనిజాన్ని ఆదర్శంగా చెప్పుకుని క్రూరమైన యుద్ధాలు చేసి అధికారాన్ని సంపాదించిన దేశాలు అంతిమంగా ఆశ్రయించింది నియంతృత్వాన్నే! ఏడు దశాబ్దాలుగా మంచుకొండల్లో బౌద్ధ భిక్షువులు వినిపిస్తున్నఆర్తనాదం వెనుక విషాద చరిత్ర ఉంది. ఆ మహా విషాదం తుడిచిపెట్టుకుపోయి…టిబెట్ వాసులకు స్వేచ్ఛ రావాలని కోరుకుందాం..

    Trending Stories

    Related Stories