నేను మోనార్క్‎ని..! ఆర్మీ, దేశం, పార్టీ.. అన్నీ నావే..!!

0
1056

శతాబ్దం వయసున్న చైనా కమ్యూనిస్టు పార్టీ ఇరవయ్యో మహాసభలు జరుపుకుంటోంది. వారం రోజుల పాటు జరిగే సీపీసీ మహాసభలు సమష్టికి సమాధి చేసి షి జిన్ పింగ్ కు సర్వాధికారాలూ కట్టబెట్టనున్నాయి. పాతకొత్తల మేలుకలయిక పేరుతో తనను వ్యతిరేకించే వారిని సీసీపీ కేంద్ర కమిటీ నుంచి తప్పించేందుకు తగిన పథక రచన చేశాడు 69 ఏళ్ల షీ జిన్ పింగ్. వారం రోజుల పాటు జరిగే మహాసభల్లో  2,296 మంది పార్టీ ప్రతినిధులు జిన్‌ పింగ్‌ అధికారంలో కొనసాగడానికి వీలుగా ఓటు వేయనున్నారు. జిన్ పింగ్ మరోసారి పార్టీ ప్రధాన కార్యదర్శి బాధ్యతలు చేపట్టేందుకు దాదాపు రంగం సిద్ధమైంది.

జిన్ పింగ్ గృహ నిర్బంధంలో ఉన్నాడనీ, సీపీసీ మహాసభల్లో తీవ్ర వ్యతిరేకత ఎదురయ్యే అవకాశం ఉందంటూ జరిగిన ప్రచారాలు అంతా అబద్ధమని తేలిపోయింది. చైనా కమ్యూనిస్టు పార్టీపై తనకు ఉడుంపట్టు లాంటి ఆధిపత్యం ఉందని నిరూపించారు జిన్ పింగ్. మూడో సారి తానే అధిపతినని చెప్పకనే చెప్పాడు జిన్ పింగ్. పదవీ బాధ్యతలు చేపట్టక ముందే సీపీసీ మహాసభల ప్రారంభోపన్యాసంలోనే తైవాన్ పై దాడికి దిగుతామంటూ తైవాన్-అమెరికాలను హెచ్చరించాడు.

జిన్ పింగ్ పై సుమారు డజను పైగా పుస్తకాలు అచ్చయ్యాయి. వీటిలో అతి ముఖ్యమైన మూడు పుస్తకాలను పరిచయం చేస్తూ…జిన్ పింగ్ మరోసారి సీసీపీ ప్రధాన కార్యదర్శి బాధ్యతలు, చైనా అధ్యక్ష పదవి చేపడితే ఆసియా ఖండంలో భౌగోళిక రాజకీయాలు ఎలాంటి రూపు తీసుకుంటాయో చెప్పే ప్రయత్నం చేస్తాను. భారత్ ఎలాంటి సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుందో కూడా చర్చించే ప్రయత్నం చేస్తాను.

1. sulmaan Wasif KHan 2018లో రాసిన ‘‘Haunted by CHaos: China’s Grand   Strategy from Mao Zedong to Xi Jinping.

2. Elizabeth Economy 2018లో రాసిన ‘THE THIRD REVOLUTION: XI JINPING AND THE NEW CHINESE STATE

3. Klaus Mühlhahn 2019లో రాసిన ‘Making China Modern: From the Great Qing  to Xi Jinping.

ఈ మూడు పుస్తకాలు కీలకమైనవి కాబట్టి వీటి ఆధారంగా జిన్ పింగ్ ఆలోచన ధోరణినీ, చైనా వల్ల మనదేశానికి పొంచి ఉన్న ముప్పును మదింపు వేసే ప్రయత్నం చేస్తాను…..

వాలుకనుల చైనీయుల మనసులో ఏముందో తెలుసుకోవడం కష్టం. మంగోలాయిడ్ కవళికలు అనుమానాస్పదంగా ఉంటాయనేది అందరూ అంగీకరించే పరిశీలన. జిన్ పింగ్ విషయంలోనూ ఇది నిజమనే చెప్పాలి. ఎలాంటి హావభావాలు కనిపించకుండా ఉండటం జిన్ పింగ్ ప్రత్యేకత. కొన్నాళ్ల క్రితం ‘హౌజ్ అరెస్ట్’ వ్యవహారం కూడా ఉద్దేశ పూర్వకంగా వేసిన ఎత్తుగడగా భావించాలంటారు అంతర్జాతీయ పరిశీలకులు. చైనాలోనూ, బయటి దేశాల్లో ఎలాంటి ప్రతిస్పందనలు వస్తాయో తెలుసుకునే ఉద్దేశంతోనే సైనిక తిరుగుబాటు, గృహనిర్బంధం, అంతర్గత వ్యతిరేకత అంశాలను ప్రచారంలో పెట్టినట్టూ తెలుస్తోంది. మావో కాలం నుంచి ఇలాంటి కుయుక్తులు పన్నడంలో సీసీపీది అందె వేసిన చెయ్యి.

చైనా కమ్యూనిస్టు పార్టీపై తన పట్టు నిలుపుకునేందుకు ‘జిన్ పింగ్ థాట్’ పేరుతో సైద్ధాంతిక ప్రతిపాదన చేశాడంటే జిన్ పింగ్ దూరదృష్టి అర్థమవుతుంది. 19వ చైనా కమ్యూనిస్టు పార్టీ మహాసభల్లో జిన్‌పింగ్‌ ఆలోచన విధానాన్ని పార్టీ నిబంధనావళిలో అంతర్భాగం చేశాడు. చైనాలో కమ్యూనిస్టు పాలన పాదుకునేట్లు చేయడానికి, ప్రపంచ శక్తిగా చైనా ఆవిర్భావానికి తిరుగులేని మహా నాయకుడు అవసరమని, ఆ మహా నేత తానేనని జిన్‌పింగ్‌ ఆలోచన విధానం సారాంశం.

కమ్యూనిస్టు పార్టీపై కేంద్ర కమిటీ పెత్తనాన్ని, కేంద్ర కమిటీపై తన పెత్తనాన్ని సుస్థిరం చేసుకోవడం జిన్‌పింగ్‌ భావజాల లక్ష్యం.  క్రమంగా తన పట్టు పెంచుకుంటూ దేశాధ్యక్షుడికి రెండు పదవీకాలాల పరిమితిని 2018లో జిన్‌పింగ్‌ తొలగించారు. దీంతో ఆయన శాశ్వతంగా ఈ పదవిని చేపట్టడానికి మార్గం సుగమం చేసుకున్నాడు.

చైనా అధ్యక్ష బాధ్యతలు తర్వాత 2013లో జిన్‌పింగ్ కఠిన నిర్ణయాలు తీసుకున్నాడు. తాను ద్రోహులుగా, అవినీతిపరులుగా అసమర్థులుగా భావించిన అధికారులను తొలగించడానికి పెద్ద క్యాంపెయిన్ ప్రారంభించాడు. సదరు ఖాళీ స్థానాలను తనకు అనుకూలంగా ఉన్నవారితో భర్తీ చేయడం ద్వారా జిన్‌పింగ్ తన అధికారాన్ని సుస్థిరం చేసుకున్నాడు. అయితే జిన్ పింగ్ తొలగించిన వారిలో ఆయన వ్యతిరేకులు, నిజాయితీ పరులే ఉన్నారంటారు చైనా వ్యవహారాలు పరిశీలించే నిపుణులు. జిన్‌పింగ్ పదవీకాలంలో ఇప్పటివరకు 47 లక్షలకు పైగా అధికారులను చైనా ప్రభుత్వం విచారించింది.

2013లో చైనా అధ్యక్ష బాధ్యతలు చేపట్టినప్పటికీ..2015 తర్వాత మాత్రమే పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ పై తన పట్టును బలోపేతం చేసుకున్నాడు. జిన్‌పింగ్..తాను చనిపోయేవరకు చైనాకు అధ్యక్షుడుగా ఉండాలనే పదవీ కాంక్షతో…భవిష్యత్తులో రాబోయే ప్రతికూల పరిస్థితులను ముందే పసిగట్టి సైన్యంలో సంస్కరణలకు శ్రీకారం చుట్టాడు. సైనిక తిరుగుబాట్లను అరికట్టడానికి 2015 నుండి సైన్యంలో పెద్ద ఎత్తున సంస్కరణలు చేపట్టాడు. అడ్డు వస్తారనుకున్నవారిని నిర్దాక్షిణ్యంగా తొలగించాడు. తన అడుగులకు మడుగులొత్తేవారిని సైన్యంలో ఉన్నత స్థానాల్లో నియమించాడు.

సీపీసీ 8వ కాంగ్రెస్ లో కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా, సెంట్రల్ మిలటరీ కమిషన్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన జిన్ పింగ్ కాలక్రమేణా పార్టీపై పట్టు బిగించాడు. తన రాజకీయ వ్యూహాల ద్వారా తన పథకాన్ని చాపకింద నీరులా అమలుచేసుకుంటూ వెళ్లాడు.

సైన్యంతో పాటు దేశీయ భద్రతా వ్యవస్థను నియంత్రించడానికి జిన్‌పింగ్.. ప్రక్షాళనను మొదలుపెట్టాడు.  ముప్పు ఉందని భావించిన పోలీసు అధికారులు, న్యాయమూర్తులను జిన్‌పింగ్ పదవుల నుంచి తప్పించాడు. మీడియాను తన చెప్పుచేతుల్లో ఉంచుకోవడానికి పకడ్బందీ ప్రణాళిక రచించాడు. తాను చెప్పిందే వేదం అనే రీతిలో వార్తలు రాసేలా ప్రభుత్వ మీడియాని తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు.

షీ జిన్‌ పింగ్‌కు సర్వాధికారాలు కట్టబెట్టడం ద్వారా చైనా కమ్యూనిస్టు పార్టీ తిరిగి మావో  నాయకత్వ శైలిని తలదన్నే రీతిలో పాలన కొనసాగించాలని ఉవ్వీళ్లూరుతోంది.  మావో సే టుంగ్ పాలనలో చైనా పెట్టుబడిదారీ అవశేషాలను, సంప్రదాయ ఆలోచనా విధానాన్ని ప్రక్షాళన చేశాడు. సాంస్కృతిక విప్లవం పేరుతో వేల మంది బుద్ధి జీవుల ప్రాణాలు హరించాడు. మావో తరవాత పగ్గాలు చేపట్టిన డెంగ్‌ జియావో పింగ్‌ అతివాద విధానాలను తోసిరాజని సరికొత్త ఆర్థిక విధానాలను అమలు చేసి చైనా అభివృద్ధికి బాటలు వేశాడంటారు చైనా వ్యవహారాల నిపుణులు.

జిన్ పింగ్ నేతృత్వంలో చైనా ఎలాంటి పద్ధతులను అవలంబించాడో తెలుసుకోవాలంటే క్లాస్ ముల్హన్ పుస్తకం తప్పక చదవాలి. ‘‘China’s rise on the global stage has been accompanied by an explosion  of facts and information about the country’’ అంటాడు Klaus Mühlhahn తన ‘Making China Modern: From the Great Qing  to Xi Jinping’ పుస్తకంలో. విశ్వవిఫణిలో తాము ఎదుగుతున్నామనే రీతిలో సమాచారాన్ని, వాస్తవాలను భారీ ఎత్తున ప్రచారం చేయడం వ్యూహాత్మంగానే చేసింది. వెంటనే ‘The information we receive is often contradictory’ అంటాడు క్లాస్ ముల్ హన్. మనకు లభించే సమాచారం పరస్పర వైరుధ్యపూరితమైందంటారు క్లాస్ ముల్హన్.

‘‘In recent years by the emergence of Xi Jinping as C.C.P general secretary and president. Under his leadership, significant new laws and regulations have been drafted, revised, and promulgated at an astonishing rate, in many instances challenging long-held understandings…’’ అంటాడు క్లాస్ ముల్హన్. జిన్ పార్టీ, ప్రభుత్వం పట్టు పెంచుకోగానే అనేక చట్టాలకు సవరణ చేయడం, కొత్త చట్టాలను తేవడం సహా సుదీర్ఘ కాలంగా దేశం అనుసరిస్తున్న అనేక విధాన నిర్ణయాలను సమూలంగా మార్చాడంటారు.

‘‘Xi adds a cult of personality—something not seen since the days of Mao. It is no longer enough to have the party move in the direction one wishes; he must formalize his authority, by writing “Xi Jinping Thought” into the con stitution. Abroad, China must maintain a balance of power’’ అంటాడు sulmaan Wasif Khan  తన పుస్తకం ‘‘Haunted by CHaos: China’s Grand   Strategy from Mao Zedong to Xi Jinpingలో.

మావో కాలం నాటి వ్యక్తిపూజను మరోసారి తెరపైకి తేవడంతో పాటు తనదే అయిన కొత్త తరహా సైద్ధాంతిక ప్రతిపాదనను సీసీపీ ముందు ఉంచడం ద్వారా తన అధికారాన్ని పూర్తి స్థాయిలో పటిష్ఠం చేసుకున్నాడు జిన్ పింగ్. మొత్తంగా జిన్ పింగ్ మరోసారి చైనా కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టడం, అధ్యక్షుడు కావడం ఆసియా భౌగోళిక రాజకీయాల్లో మరింత కల్లోలం చెలరేగే అవకాశాలు బలంగా ఉన్నాయి. మరీ ముఖ్యంగా భారత్-చైనా, చైనా-అమెరికా సంబంధాల్లో ఘర్షణ మరింత తీవ్రమవుతాయంటారు అంతర్జాతీయ వ్యవహరాల నిపుణులు. ప్రధానంగా తైవాన్, దక్షిణ చైనా సముద్రం, భారత్-చైనా సరిహద్దు వివాదం మరింత ముదిరి యుద్ధ ఉద్రిక్తతలకు దారితీస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

two × four =