More

    లైంగిక ఆరోపణలు చేసిన క్రీడాకారిణి అదృశ్యం.. ఇక చైనాలో టెన్నిస్ టోర్నమెంట్స్ లేనట్లేనా..!

    చైనాలో అక్కడి అధికారులకు, ప్రభుత్వ పెద్దలకు వ్యతిరేకంగా గళం విప్పితే వాళ్ల భవిష్యత్తు ప్రశ్నార్థకమే అన్న సంగతి తెలిసిందే..! పెద్ద పెద్ద వ్యాపార దిగ్గజాలకే చైనా ప్రభుత్వం చుక్కలు చూపించింది. అయితే ఇప్పుడు చైనీస్ స్టార్ విమెన్ టెన్నిస్ ప్లేయర్ పెంగ్ షుయ్ అదృశ్యం గురించి తీవ్రమైన చర్చ కొనసాగుతోంది. ఆమె అదృశ్యం కావడానికి ముందు ఆమె చైనాలో అధికార కమ్యూనిస్టు పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడిపై సంచలన ఆరోపణలు చేశారు. అతడు తనను బెదిరించి.. లైంగికంగా దాడి చేశాడని.. అత్యాచారం కూడా చేశాడని ఆమె ఆరోపించారు. తనపై లైంగిక దాడికి పాల్పడినట్లు పెంగ్‌ షువాయి నవంబర్‌ 2న సంచలన ఆరోపణలు చేసింది. ఈ విషయాన్ని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. అయితే వెంటనే ఆ పోస్టును డిలీట్‌ చేసింది. అయితే ఆమె ఏరోజైతే పోస్ట్‌ డిలీట్‌ చేసిందో ఆరోజు నుంచి కనిపించకుండా పోయింది.

    ఈ ఆరోపణలు చేసిన తర్వాత ఆమె కనపడకుండా పోయింది. పెంగ్ షుయ్‌ని చైనా ప్రభుత్వమే ఏదో చేసిందనే ఊహాగానాలు వినిపించాయి. ఎంతటి ప్రముఖులైన చైనా కమ్యూనిస్టు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే దారుణమైన శిక్షలు ఎదుర్కోక తప్పదు. పెంగ్ షుయ్ పరిస్థితి కూడా ఇదేనని అనుకున్నారు. ఇక ఆమె అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ చైర్మన్ థామస్ బాచ్‌తో పెంగ్ షుయ్ అరగంట పాటు వీడియో కాల్‌ ద్వారా మాట్లాడారు. తన ఆరోగ్యం బాగానే ఉందని.. తనకు ఏమీ కాలేదని పెంగ్ షుయ్ చెప్పుకొచ్చింది. కానీ పెంగ్ షుయ్ వీడియో కాల్ లో మాట్లాడినా.. ప్రపంచం మాత్రం చైనాను నమ్మడం లేదు. ఆమె ఎందుకు బయట ప్రపంచానికి దూరంగా ఉందో చెప్పాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. పెంగ్ షుయ్ అదృశ్యం అనంతరం పలువురు టెన్నిస్ స్టార్స్ ఆమెను ఎక్కడ ఉన్నా వెంటనే ప్రజల ముందుకు తీసుకొని రావాలని కోరారు. డబ్ల్యూటీఏ చైర్మన్ స్టీవ్ సైమన్ కూడా వెంటనే ఆమె అదృశ్యంపై విచారణ జరపాలని చైనా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పెంగ్ షుయ్ 30 నిమిషాల పాటు మాట్లాడినా.. ఇంకా ప్రపంచం ముందు అనేక ప్రశ్నలకు సమాధానాలు రావల్సి ఉంది.

    పెంగ్‌ షుయ్ ఆచూకీ చెప్పాల్సిందేనంటూ వుమెన్స్‌ టెన్నిస్‌ అసోసియేషన్‌(WTA) చైనాకు అల్టిమేటం జారీ చేసింది. ఆమె ఆచూకీ చెప్పేవరకు చైనాలో జరగాల్సిన అంతర్జాతీయ పోటీలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించి డబ్ల్యూటీఏ చైనాకు షాక్‌ ఇచ్చింది. చైనాలో టోర్నీలను నిలిపివేయడం వల్ల కోట్లాది రూపాయల నష్టం వాటిల్లుతుందని ఈ నిర్ణయాన్ని అందరూ సమర్థిస్తున్నారని WTA చైర్మన్, CEO స్టీవ్ సైమన్ అన్నారు. “చైనా, హాంకాంగ్‌లలో జరగాల్సిన అన్ని డబ్ల్యుటీఏ టోర్నమెంట్‌లను తక్షణమే రద్దు చేస్తున్నట్లు ప్రకటించాం” అని స్టీవ్ సైమన్ తెలిపారు. పెంగ్ షుయ్ ను ఆడేందుకు అనుమతించారు.. కానీ, లైంగిక వేధింపుల ఆరోపణల నుంచి వెనక్కి తగ్గాలని ఒత్తిడి చేస్తున్నట్లు తెలిపారు. అథ్లెట్లు స్పష్టమైన మనస్సుతో చైనాలో ఆడలేరని తాము భావించడం లేదని అన్నారు. 2022లో చైనాలో టోర్నీని నిర్వహించడం వల్ల మన ఆటగాళ్లు, సిబ్బంది ప్రమాదంలో పడవచ్చని తీవ్ర ఆందోళన చెందుతున్నామని అన్నారు. పెంగ్ షుయ్ స్వేచ్ఛగా, సురక్షితంగా ఎలాంటి ఒత్తిడిలో లేదనే సందేహాలు తమకు ఉన్నాయని అన్నారు. ఈ విషయం నుంచి మనం తప్పుకుంటే.. లైంగిక వేధింపుల కేసులను పట్టించుకోవద్దని, విషయం తీవ్రతను అర్థం చేసుకోవద్దని ప్రపంచానికి సందేశం ఇస్తున్నట్లు అనిపిస్తుందని.. అందుకే తాము చైనా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకుని వస్తున్నామని అన్నారు.

    భారత్ కు సువర్ణ అవకాశం:

    చైనాకు ఇది ఊహించని షాక్..! WTA నిర్ణయం ప్రశంసనీయమైనది. చైనా ఎటువంటి WTA ఈవెంట్‌ను నిర్వహించకుండా సస్పెండ్ చేయడంతో భారతదేశంలో ఆ టోర్నమెంట్లు షిఫ్ట్ చేయమని కోరవచ్చు. భారతదేశంలో చాలా కాలంగా పెద్ద టెన్నిస్ టోర్నమెంట్లు జరగడం లేదు. డేవిస్ కప్ గేమ్‌లు లాంటివి దేశంలో టెన్నిస్ మరింత అభివృద్ధి చెందడానికి దోహదం చేయడం లేదనే విమర్శలు చాలా కాలంగా ఉన్నాయి. దీంతో పెద్ద టోర్నమెంట్లను భారత్ కు తీసుకుని వస్తే చాలా ప్లస్ అవుతుందని భావిస్తున్నారు. మహిళలలో అంకితా రైనా డబుల్స్ టాప్-100లోకి ప్రవేశించడం, WTA టూర్-లెవల్ ట్రోఫీని గెలుచుకోవడం, గ్రాండ్‌స్లామ్ మెయిన్ డ్రాలలో పాల్గొనడం వంటివి ఓ వైపు కొనసాగుతూ ఉన్నాయి. కానీ ఈ రోజు వరకు సానియా మీర్జా భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తూ టాప్ 27 ర్యాంకింగ్ ను సొంతం చేసుకుంది. అదే భారతీయ మహిళా సాధించిన అత్యుత్తమ సింగిల్స్ ర్యాంకింగ్‌గా నిలిచిపోయింది. అది కూడా 14 సంవత్సరాల క్రితం వచ్చింది. టాప్-100లో మరెవ్వరూ చేరలేకపోయారు. ఏది ఏమైనప్పటికీ చైనాను సైడ్ చేసి భవిష్యత్ WTA ఈవెంట్‌లలో భారతదేశానికి అవకాశం లభిస్తే మాత్రం దేశంలో అటు టెన్నిస్ కు పాపులారిటీ.. ఇటు యంగ్ ట్యాలెంట్ ను ఎంకరేజ్ చేయవచ్చు.

    Trending Stories

    Related Stories