ప్రపంచంలోనే అతిపెద్ద కార్గో విమానమైన ‘ఏఎన్-225 మ్రియా’ ను రష్యా దళాలు ధ్వంసం చేశాయి. ప్రపంచంలోనే అతిపెద్ద కార్గో విమానంగా గుర్తింపు పొందిన ఈ విమానం రాజధాని కీవ్ సమీపంలోని హోస్టోమెల్ ఎయిర్‌పోర్టుపై రష్యా జరిపిన దాడిలో ధ్వంసమైనట్టు ఉక్రెయిన్ విదేశాంగశాఖ మంత్రి దిమిత్రో కులేబా తెలిపారు. ఉక్రెయిన్ భాషలో ‘మ్రియా’ అంటే కల. ఉక్రెయిన్ ఏరోనాటిక్స్ కంపెనీ ఆంటోనోవ్ దీనిని తయారుచేసింది.
“ప్రపంచంలోని అతిపెద్ద విమానం “మ్రియా” (ది డ్రీం)ని కీవ్ సమీపంలోని ఎయిర్‌ఫీల్డ్‌లో రష్యన్ సైన్యం ధ్వంసం చేశారు. మేము విమానాన్ని పునర్నిర్మిస్తాము. బలమైన, స్వేచ్ఛా, ప్రజాస్వామ్య ఉక్రెయిన్ కోసం ప్రయత్నిస్తాం” అని ఉక్రెయిన్ ప్రభుత్వ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ట్వీట్ చేసింది. విమానం ధ్వంసమైనందుకు బాధను వ్యక్తం చేసింది. రష్యా ధ్వంసం చేసింది విమానాన్నే కానీ తమ మ్రియా ఎప్పటికీ నశించదని పేర్కొంటూ విమానం ఫొటోను షేర్ చేసింది.
ఆయుధాల తయారీదారు ఉక్రోబోరోన్‌ప్రోమ్ “మ్రియా”ని పునరుద్ధరించడానికి $3 బిలియన్లు (2.7 బిలియన్ యూరోలు) కంటే ఎక్కువ ఖర్చవుతుందని అంచనా వేసింది. అందుకు ఐదు సంవత్సరాలు పట్టవచ్చని వార్తా సంస్థ AFP నివేదించింది. “ఇది ప్రపంచంలోనే అతిపెద్ద విమానం, AN-225 ‘మ్రియా'” అని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి డిమిట్రో కులేబా ఆదివారం ట్వీట్ చేశారు.
ప్రపంచంలోనే అతిపెద్ద విమానం, AN-225 ‘మ్రియా’
ఈ విమానం ప్రపంచంలో ఎంతో ప్రత్యేకమైనది. 84 మీటర్ల పొడవు (276 అడుగులు) ఉన్న ఈ విమానం గంటకు 850 కిలోమీటర్ల (528 mph) వేగంతో 250 టన్నుల (551,000 పౌండ్లు) వరకు సరుకును రవాణా చేయగలదు. దీనికి “మ్రియా” అని పేరు పెట్టారు, అంటే ఉక్రేనియన్‌లో “కల” అని అర్ధం. ప్రారంభంలో సోవియట్ ఏరోనాటికల్ ప్రోగ్రామ్‌లో భాగంగా నిర్మించబడింది. 1988లో మొదటి విమానాన్ని ప్రారంభించింది. సోవియట్ యూనియన్ పతనం తర్వాత చాలా సంవత్సరాలు నిరుపయోగంగా ఉండగా.. 2001లో కీవ్ నుండి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న గోస్టోమెల్‌లో టెస్ట్ ఫ్లైట్ చేసింది. ఇది కార్గో విమానాల కోసం ఉక్రెయిన్ కు చెందిన ఆంటోనోవ్ ఎయిర్‌లైన్స్ ద్వారా నిర్వహించబడుతుంది. కోవిడ్ -19 మహమ్మారి ప్రారంభంలో అధిక డిమాండ్ ఉంది.