ఖతార్ ‎లో ఫిఫా మతోన్మాదం..! జకీర్ నాయక్ చేత ప్రార్థనలు..!!

0
755

ఖతార్ లో ఫిఫా వరల్డ్ కప్ అట్టహాసంగా ప్రారంభమైంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రీడా అభిమానులు లక్షలాదిగా తరలివస్తున్నారు. అయితే క్రీడా ఆహ్లాదం కోసం వస్తున్న వీక్షకుల స్వేచ్చకు ఖతార్ ప్రభుత్వం అడుగడుగునా అడ్డుపడుతోంది. తమ దేశంలోకి వచ్చే టూరిస్టులపై నిషేధాలు, ఆంక్షలతో వేధిస్తోంది. అంతేకాదు, ఏకంగా ఉగ్రవాదంతో సంబంధాలున్న జకీర్ నాయక్ లాంటి వారితో మత బోధనలు చేయించి.. ఫిఫా వరల్డ్ కప్ ను వివాదాలకు కేంద్రబిందువుగా మార్చే ప్రయత్నం చేస్తోంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఫుట్ బాల్ అభిమానుల నుంచి తీవ్ర విమర్శలను ఎదుర్కొంటోంది ఖతార్ ప్రభుత్వం. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకునేముందు.. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానెల్స్ ను సబ్ స్క్రయిబ్ చేసుకోండి. జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి.

ఇక స్టోరీలోకి వెళితే.. ఆటలకు మతం లేదు. క్రీడలనేవి ఏ వర్గానికో, మతానికో సంబంధించినవి కాదు. పిల్లల నుంచి వృద్దుల వరకూ క్రీడలను ఆదరిస్తారు. భారత్ – పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ వచ్చిందంటే, గ్రామాలు, నగరాలు అనే తేడాలేకుండా అప్రకటిత కర్ఫ్యూ వాతావరణం నెలకొంటుంది. ఇక క్రికెట్ వరల్డ్ కప్, ఒలింపిక్స్, ఫిఫా వరల్డ్ కప్ లాంటి మెగా స్పోర్ట్ ఈవెంట్లయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ క్రీడా సంబరాలు ఖండాంతరాలు దాటిపోతాయి. వృత్తి జీవితానికి కాస్త విరామం ఇచ్చి.. మెగా ఈవెంట్లను చూడటానికి దేశ, విదేశాల నుంచి క్రీడాభిమానులు తరలివస్తారు. ఇలా వెళ్లిన అభిమానులకు కావాల్సినవన్నీ సమకూర్చడం, ఏవిధమైన ఇబ్బందీ రాకుండా చూసుకోవడం ఆయా ఆతిథ్య దేశాల బాధ్యత. ఇతర దేశాల నుంచి వచ్చే ప్రేక్షకుల ఇష్టాఇష్టాలను గ్రహించి వారికి సరైన విందు వసతులు ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. వారి మనోభావాలను సైతం గౌరవించాల్సివుంటుంది. అయితే ప్రస్తుతం ఖతార్ లో ప్రారంభంమైన ఫిఫా వరల్డ్ కప్ లో వాటన్నింటీని గాలికొదిలేశారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా పూర్తి విభిన్న పరిస్థితుల్లో ఫిఫా వరల్డ్ కప్ భిన్నంగా జరుగుతోంది. ఇస్లామిక్ రాజ్యమైన ఖతార్ ఫిఫా వరల్డ్ కప్ ను మత ప్రచారానికి వాడుకుంటోంది. అంతేకాదు, వరల్డ్ కప్ వీక్షించడానికి వచ్చిన ప్రేక్షకులను కూడా ఇబ్బందులకు గురిచేస్తోంది ఖతార్.

ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని దేశాల్లోనూ మద్యం సేవిస్తారు. మద్యపానం వల్ల అనారోగ్యమని.. అదొక చెడు అలవాటని.. ఇలా ఎన్ని చెప్పుకున్నా.. మద్యం ఒక విలాస వస్తువు అనేది వాస్తవం. అయితే మద్యపానం కొంతమందికి నచ్చకపోవచ్చు. అది వారి వ్యక్తిగత ఇష్టాన్నిబట్టి ఉంటుంది. ముఖ్యంగా మెగా స్పోర్ట్స్ ఈవెంట్లకు వచ్చిన క్రీడా పర్యాటకులు కూడా మద్యపానం పట్ల మొగ్గుచూపడం సహజం. కానీ ఖతార్ ప్రభుత్వం మాత్రం పర్యాటకులను ఇబ్బందులకు గురిచేసేలా.. పూర్తి మద్య నిషేధాన్ని విధించింది. దీంతో వరల్డ్ కప్ వీక్షకులు తీవ్ర ఆగ్రహానికి గురవుతున్నారు. ఫిఫా వరల్డ్ కప్ లాంటి ప్రదేశాల్లో ఆల్కహాల్ పై నిషేధం విధించడమేంటని ప్రశ్నిస్తున్నారు. మద్యపానాన్ని వారు హరామ్ గా భావించినంత మాత్రాన.. మిగతావారి ఇష్టాలకు వ్యతిరేకంగా ప్రవర్తించడమేంటని విమర్శిస్తున్నారు. అయితే ఈ నిషేధంపై ఫిఫా సమాఖ్య కూడా తమకేమీ తెలియదన్నట్లే వ్యవహరిస్తోంది. గతంలో బ్రెజిల్ లో కూడా ఇటువంటి సమస్యే ఎదురైంది. 2014 లో ఫిఫా వరల్డ్ కప్ కు బ్రెజిల్ ఆతిథ్యమిచ్చింది. అయితే అప్పట్లో కొన్ని కారణాల రీత్యా స్టేడియంలో మద్యం అమ్మకాలను నిషేధించినందుకు ఫిఫా సమాఖ్య తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలంటూ బ్రెజిల్ ప్రభుత్వాన్ని ఒత్తిడి చేసింది. అయితే ఇప్పుడు జరుగుతున్న ఫిఫా వరల్డ్ కప్ లో ఖతార్ ప్రభుత్వం మద్య నిషేధం విధించినా కూడా సమాఖ్య మాత్రం ఏమీ చేయకుండా చూస్తూ ఉండిపోయింది. దీంతో ఫిఫా సమాఖ్య ద్వంద వైఖరిని కూడా ప్రేక్షకులు తీవ్రంగా తప్పుబడుతున్నారు. మద్య నిషేధంతో పాటు టూరిస్టులు ధరించే దుస్తులపై కూడా ఆంక్షలు విధించింది ఖతార్ ప్రభుత్వం. క్రీడలను వీక్షించడానికి వచ్చే టూరిస్టులందరూ చిన్న డ్రెస్సులను ధరించకూడదనీ తమ శరీరాలను పూర్తిగా కప్పుకుని ఉన్న డ్రెస్సులను మాత్రమే ధరించాలని ఆంక్షల పెట్టి వేధిస్తోంది.

ఇక వీటితో పాటు ఫిఫా స్టేడియంలో ఏకంగా ఇస్లామిక్ మతబోధనలకు తెరతీసింది. అయితే, అది కూడా వివాదాస్పద మత ప్రబోధకుడు జకీర్ నాయక్ ను ఆహ్వానించడం తీవ్ర వ్యతిరేకతకు దారితీసింది. అతన్ని ముఖ్య అతిధిగా ఆహ్వానించి స్టేడియంలో ఇస్లాం బోధనలను చేయిస్తోంది. జకీర్ నాయక్ పై అనేక వివాదాలున్నాయి. గతంలో ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించిన ఆధారాలు బయటపడ్డాయి. ఇప్పటికే అతన్ని భారత్, శ్రీలంకతో పాటు.. పూర్తి ఇస్లామిక్ దేశమైన బంగ్లాదేశ్ కూడా నిషేధించింది. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో 2016 జూలై 1వ తేదీన ఉగ్రవాద దాడులు జరిగాయి. ఐదుగురు ఉగ్రవాదులు ఒక బేకరీలో చొరబడి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ దారుణ ఘటనలో 29మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ ఘటనను పూర్తి దర్యాప్తు జరపిన తర్వాత ఈ ఉగ్రవాదులంతా జకీర్ నాయక్ బోధనలకు ప్రభావితమవడం వల్లే ఈ దారుణ చర్యకు పాల్పడ్డారని తేలింది. దీంతో పాటు శ్రీలంకలో జరిగిన ఈస్టర్ బాంబు దాడి సూత్రధారి హషీమ్ కు కూడా జకీర్ నాయక్ తో సత్సంబంధాలున్నట్టు తేలింది. ఇక భారత్ లో జకీర్ నాయక్ చేయని నేరాలు లేవు. మనీలాండరింగ్ నుంచి ఉగ్రవాదాన్ని పెంచిపోషించడం వరకు అతడు ఎన్నో దారుణాలకు పాల్పడ్డాడు. భారత్ లో పట్టుబడ్డ చాలామంది ఐసిస్ ఉగ్రవాదులకు జకీర్ నాయక్ బోధనలతోనే ప్రభావితమయ్యారని భారత రక్షణ దళాలు ఆధారాలతో సహా నిరూపించాయి.

జకీర్ నాయక్ ఉగ్రవాద సంబంధాలు భారత ప్రభుత్వం గుర్తించిన వెంటనే దేశాన్ని వదిలి పారిపోయాడు. భారత్ అరెస్ట్ చేస్తుందన్న భయంతో.. చివరికి 2016లో తన తండ్రి చనిపోయినా చివరి చూపు చూసుకోవడానికి కూడా రాలేదు జకీర్. ఈ విధంగా పూర్తి ఇస్లామిక్ రాజ్యమైన బంగ్లాదేశ్ కూడా జకీర్ నాయక్ పై లుకౌట్ నోటీసులు జారీ చేసింది. అటువంటి వివాదాస్పద వ్యక్తిని మత బోధనల కోసం ఫిఫా వరల్డ్ కప్ ముఖ్య అతిథిగా ఆహ్వానించడమేంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. దీంతో పాటు గతంలో జకీర్ నాయక్ కు సంబంధించిన ఓ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ప్రముఖ రచయిత ‘భావన అరోరా’ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసిన వీడియోలో ఇస్లాం మతంలో ఫుడ్ బాల్ ఆడటం ‘హరామ్’ అంటే, నిషేధం అని,.. దీన్ని ఎవరూ ఆడకూడదని చెప్పాడు. గతంలో ఏ ఆటను అయితే నిషేధించాలని చెప్పాడో ఇప్పుడు అదే ఆటకు జకీర్ నాయక్ ముఖ్య అతిధిగా హాజరవుతుండటంతో వీరి ద్వంద వైఖరిని చూసి ఆశ్చర్యపోతున్నారు. తన బోధనలతో ఉగ్రవాదులను తయారు చేసిన జకీర్ నాయక్ ను ఫిఫా వరల్డ్ కప్ కు ఏవిధంగా ఆహ్వానిస్తారని ప్రశ్నిస్తున్నారు. ఇక కొంతమంది భారతీయ నెటిజన్లు గతంలో నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన నేపథ్యంలో గతంలో అదే తరహా వ్యాఖ్యలు జకీర్ నాయక్ సైతం చేసిన వీడియోను బయటకు తీసారు. అప్పట్లో నుపుర్ వ్యాఖ్యలపై ఖతార్ ప్రభుత్వం భారత్ ను తీవ్రంగా తప్పుబట్టిందనీ,.. అయితే అటువటి వ్యాఖ్యలనే చేసిన జకీర్ నాయక్ చేసినా కూడా అతడిని ముఖ్య అతిథిగా ఎలా పిలిచారంటూ ప్రశ్నిస్తున్నారు.

మరోవైపు ఇలా ఒక క్రీడా ప్రాంగణాన్ని మతపరమైన బోధనలకోసం ఉపయోగించుకోవచ్చా..? అన్నదానిపైనా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి ధోరణి ఇలాగే కొనసాగితే,.. ఇతర దేశాల్లో ఇటువంటి మ్యాచ్ లు జరిగినప్పుడు ఆయా దేశాలు కూడా తమ మతాన్ని ప్రమోట్ చేయడానికి ఉపయోగించుకునే అవకాశముంటుంది. దీంతో ఆహ్లాదాన్ని పంచాల్సిన క్రీడలు కాస్తా మతపరమైన వివాదాలకు దారితీసే ప్రమాదం ఏర్పడుతుంది. ఇటువంటి ధోరణిపై ఫిఫా సమాఖ్య ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

three × 5 =