More

  అంతరిక్షమే రణరంగం..! రోదసిలో రక్షణ వ్యూహం సిద్ధమేనా..?

  మొదటి ప్రపంచ యుద్ధం యూరప్ ఖండంలోని హేమాహేమీలను హతాశులను చేసింది. మహామహులను మట్టి కరిపించింది. ఉత్తరార్ధగోళమంతటా.. మృత్యువు కోరలు సాచింది. అసాధ్యులమనీ, అరివీర భయంకరులమనీ మీసం మెలేసినవారిని అర్భక ప్రాణులుగా తేల్చి పారేసింది.

  రెండో ప్రపంచ సంగ్రామం యుద్ధ లక్షణాన్ని మార్చి వేసింది. అందుకే ‘‘world was overturned’’-భూగోళం తిరగబడింది అన్నారు. రణరంగంలోకి సాంకేతికత ప్రవేశించేందుకు కారణమైంది. చరిత్ర చక్రాన్ని కనిపెట్టి కాలాన్ని పరుగులు తీయిస్తే, చైనా మందుగుండును అందించి ప్రమాద స్థాయిని పెంచింది. కాలగతిని మార్చినట్టే యుద్ధం – హననాన్నే కాదు, సంపదనూ పోగేసింది. వాణిజ్యాన్ని వృద్ధి చేసింది.

  దేశాల మధ్య బంధానికి ‘దౌత్య’మనే మఖ్ మల్ ముసుగు తొడిగింది.. ప్రచ్ఛన్న యుద్ధం.  రక్తపు చారికల చేతులతో స్పృషిస్తే పుట్టిందే వ్యాపారం. ప్రచ్ఛన్న యుద్ధం కుయుక్తిని యుద్ధకళలోకి ఆహ్వానించింది. బలమైన దేశాల మధ్య సాగే పరస్పర కుట్రల్లో బలయ్యేది బలహీన దేశాలనే వాస్తవాన్ని చరిత్రకు మరోసారి గుర్తు చేసింది.

  యుద్ధరంగమిప్పుడు అంతరిక్షానికి చేరింది. అగ్రరాజ్యాలన్నీ పోటాపోటీగా అంతరిక్ష రక్షణ వ్యూహాన్ని రచిస్తున్నాయి. అంతరిక్ష యానం మనకు బొత్తిగా కొత్త విషయం కాదు. మన ప్రాచీన గ్రంథాల్లో ఖేచరులుండేవారు. బహిర్లోకాల నుంచి భూలోకానికి విమానాల్లో వచ్చేవారట. భూలోక వాసుల కోసం ఇంద్రుడు ఎన్నోసార్లు ‘మాతలి’-పైలట్ లాంటివాణ్నిచ్చి తన విమానంలో పంపినట్టూ పురాణాల్లో ఉంది.

  త్రిశంకుడు రెండో కాస్మిక్ వేగాన్ని అందుకోలేక, ఒక స్పత్నిక్ లో చిక్కుకుపోయాడనీ, అలా భూమిపైకి రాలేకా, అంతరిక్షంలోకి పోలేకా ఉండిపోయాట్ట. మొత్తంగా రోదసి ఆసక్తిని రేకిత్తించడమే కాదు, వర్తమానంలో ఉద్వేగాన్నీ దట్టిస్తోంది.

  అమెరికా ఖగోళ శాస్త్రవేత్త Neil deGrasse Tyson రాసిన పుస్తకం ‘‘Accessory to War: The Unspoken Alliance Between Astrophysics and the Military’’ అమెరికా, చైనా, రష్యా అంతరిక్ష రక్షణ వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయి? భారత్ అనుసరిస్తున్న వైఖరి ఏంటి? ఆర్టెస్ దేశాల్లో భారత్ భాగం కానుందా?

  ఇలాంటి అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం….

  Astro physics గా పేర్కొనే ఖగోళ భౌతిక శాస్త్రంలో విప్తవాత్మక మార్పులు వచ్చాక యుద్ధం మరింత ప్రమాదకరంగా పరిణమించింది. జీవశాస్త్రవేత్తల ఆవిష్కరణలూ, వ్యోమగాముల కృషీ, రసాయనశాస్త్రవేత్తల శ్రమ అంతిమంగా యుద్ధ బీభత్సాన్ని పెంచి పోషించింది. రోదసి.. ఒక ఆయుధశాలగా రూపంతరం చెందింది. Cosmology-గా వ్యవహరించే విశ్వనిర్మాణశాస్త్రం సృష్టి రహస్యాన్ని కనుగొనిందో లేదో గానీ, యుద్ధాన్ని ఆధునీకరించింది.

  సౌరమండలం-పరస్పర మోహరింపులకు నెలవుగా మారిందని జోసెఫ్ పి. ఫారెల్ అనే అమెరికన్ వేదాంతి.. తన ‘‘The Cosmic War: Interplanetary Warfare, Modern Physics, and Ancient Texts’’ పుస్తకంలో వాపోయాడు. ఖగోళం సాంతం కత్తుల వంతెనగా మారిందన్నాడు. నక్షత్ర మండలం నిత్యాగ్నిగుండంగా మారిందని ఖేదపడ్డాడు.

  ప్రపంచ చరిత్రను నిర్దేశించినవి మూడే మూడు యుద్ధాలు: రెండు ప్రపంచ యుద్ధాలూ వాటి సాంగత్యం వల్ల పుట్టిన ప్రచ్ఛన్న యుద్ధం. నాగరికతను నిర్దేశించిందీ, అభివృద్ధిని శాసించిందీ, సాంకేతికతను పరుగులు పెట్టించిందీ అక్షరాలా యుద్ధమే!

  డేగచూపు యుద్ధానికి కొత్త భాష్యం చెప్పింది. రాబందు సమాంతర దృష్టి ‘డ్రోన్ వార్ ఫేర్’ అనే సరికొత్త దాడి ఎత్తుగడలకు పురికొల్పింది. ప్రకృతి.. యుద్ధకళను పరిపుష్ఠం చేసినట్టే, సాంకేతికత ఏరియల్ బాంబింగ్ పేరిట దాడుల తీవ్రతను పదింతలు పెంచింది.

  సర్వకాల, సర్వావస్థల్లో యుద్ధశాస్త్రం స్తబ్దుగా ఉండిపోదు. యుద్ధ కళ ఒక ఊసరవెల్లి. రాత్రింబవళ్లతోబాటు.. ఎత్తుగడలను మార్చేస్తుంది. రణరంగం మూలంగా పెరిగే ప్రసూతుల సంఖ్యను రాజ్యం నియంత్రించలేదు. నియంత్రణ అనే నిబంధన యుద్ధంలో చెల్లుబాటు కాదు.

  ప్రాచీన యుద్ధ తంత్రంలో కాకతాళీయంగా వాడిన కుళ్లి పొయిన జంతుకళేబరాలకు ఆధునిక శాస్త్రం ఆవిష్కరించిన సైన్స్ ల్యాబ్ ‘వైరస్’ పేరిట పెను ప్రమాదాన్ని కనిపెట్టింది. నింగీ, నేలా, ఆకాశం మాత్రమే కాదు, ఉచ్వాసనిశ్వాసల్లోంచి సామూహిక మృత్యువును ప్రసరిస్తోంది పాశ్చాత్య పరిఙ్ఞానం.

  అందుకే హెచ్.జీ.వెల్స్ ఒకచోట ‘‘the essence of modern war.. The killing off of the young’’  ‘యవ్వనాన్ని చిదిమేసేదే.. ఆధునిక యుద్ధం’ అంటాడు. యుద్ధం అనే పదానికి ఆంగ్లమేంటనీ, WAR అనే ఆంగ్ల పదానికి తెలుగేంటనీ తలబాదుకున్నారు భాషావేత్తలు. స్థలకాలాలాను బట్టీ యుద్ధనీతి మారుతుందనే ఙ్ఞానం ప్రాక్ దేశాలకు ఆలస్యంగా తెలిసివచ్చింది.

  2009, ఫిబ్రవరి 10న రష్యా, అమెరికాలకు చెందిన రెండు కమ్యూనికేషన్ ఉపగ్రహాలు సైబీరియాకు సమీపాన నింగిలో 5 వందల మైళ్ల దూరంలో, పాతికవేల మైళ్ల వేగంతో ఢీకొని పేలిపోయాయి. ఈ ఘటన పెనుసంచలనానికి కారణమైంది.

  ఖగోళ భౌతిక శాస్త్రం శతఘ్నులను తయారు చేయదు. అణుబాంబులనూ కనిపెట్టదు. ఏ భౌతిక ఆయుధాన్నీ ఆవిష్కరించదు. సైన్యానికి అవసరమైన అనేక అంశాలను పరిశోధించి-పరీక్షించి అందజేస్తుంది. వైరి బహుముఖ మోహరింపులకు సంబంధించిన వివరాలను, ఆయుధ ప్రయోగానికి సంబంధించిన పరిధులను, వైరి కదలికలనూ పసిగడుతుంది.

  ఎంత ఎత్తులో మోహరింపు జరుగుతోందో, భౌతిక బలమెంతో.. అంతరిక్షం నుంచి అంచనావేసి సైన్యానికి చేరవేస్తుంది. భూ ఉపరితలం, సముద్రంలోనే కాదు.. అంతరిక్షంలోనూ యుద్ధం చేయగల తిరుగులేని శక్తిగా భారత్‌ అవతరించింది.

  ‘మిషన్‌ శక్తి’ పేరుతో చేపట్టిన ఉపగ్రహ విధ్వంసక ప్రాజెక్టు విజయవంతమైంది. ఇందులో భాగంగా భూ ఉపరితలానికి 300 కిలోమీటర్ల ఎత్తులో దిగువ కక్ష్యలో ఉన్న క్రియాశీలక ఉపగ్రహాన్ని యాంటీ శాటిలైట్‌ – ఏ-శాట్‌ మిసైల్‌తో భారత్‌ కూల్చివేసింది. ఉపగ్రహ వ్యవస్థను ధ్వంసం చేయగల టెక్నాలజీ ఉన్న దేశాల సరసన నిలిచింది.

  యుద్ధంలో క్షిపణులను ప్రయోగించాలన్నా.. సైనిక మోహరింపు పథకాలు రూపొందించాలన్నా,  ఎప్పటికప్పుడు సమాచారం అందించాలన్నా.. యుద్ధ విమానాలు మోహరించాలన్నా కమ్యూనికేషన్‌ వ్యవస్థే కీలకం. దీనికి మూలం ఉపగ్రహాలు. వీటిని ధ్వంసం చేయడం ద్వారా శత్రు దేశాల వ్యూహాలను చిత్తు చేయొచ్చు.

  యుద్ధాల్లో వినియోగించే గైడెడ్‌ బాంబులు, క్షిపణులు అన్నీ ఉపగ్రహాల ఆధారంగా తమ లక్ష్యాలను ఛేదిస్తాయి. భారత్‌పై ఏ దేశమైనా క్షిపణి ప్రయోగిస్తే.. దాన్ని మార్గనిర్దేశం చేసే ఉపగ్రహాన్ని కూల్చి ముప్పును తప్పించుకోవచ్చు. అంతరిక్ష వ్యవస్థలపై సైబర్‌ దాడులు కూడా ఏ-శాట్‌ ద్వారా చేసే వీలుంటుంది. అయితే ఇప్పటివరకు ఏ యుద్ధంలోనూ వీటిని ఉపయోగించలేదు.

  డీఆర్‌డీవో రూపొందించిన బాలిస్టిక్‌ మిసైల్‌ డిఫెన్స్‌ ఇంటర్‌సెప్టార్‌ను, కైనటిక్‌ కిల్‌ టెక్నాలజీని 2019లోనే భారత్ ఉపయోగించింది. ఇప్పటివరకు ఉపగ్రహాలను కూల్చే టెక్నాలజీ కేవలం అమెరికా, రష్యా, చైనా వద్ద మాత్రమే ఉంది. ఇకపై అంతరిక్షంలో నిఘా వేసే శత్రు దేశాల ఉపగ్రహాలను భారత్‌ కూల్చగలదని శాస్త్రవేత్తలు ప్రకటించారు.

  దేశ భద్రత కోసం అనేక దేశాలతో పోటీ పడి ఎన్నో ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపించింది. మంగళ్‌యాన్‌ పేరుతో మార్స్ మీదకు రోవర్‌ను పంపింది. గగన్‌యాన్‌ పేరుతో మనిషిని అంతరిక్షంలోకి పంపే ఏర్పాట్లు చేస్తోంది.

  ప్రపంచ వాణిజ్యంలో అత్యధిక భాగం మహా సముద్రాల ద్వారానే జరుగుతుంది. హిందూ మహాసముద్రం పరిధిలో వేల నౌకలు చమురు, సరుకు రవాణా కోసం తిరుగుతుంటాయి. ఈ ప్రాంతాల్లో నిఘా వేయడంలో ఉపగ్రహాలదే కీలకపాత్ర. అందుకే వీటిని రక్షించుకునేందుకు ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుంది. పెరిగిపోతున్న సాంకేతికత నేపథ్యంలో దేశ భద్రతకు కొత్త ముప్పులు ఎదురయ్యే అవకాశం ఉండటంతో భారత్‌ ఈ టెక్నాలజీని అభివృద్ధి చేసింది. మిషన్‌ శక్తితో భారత్‌ అంతరిక్ష సైనికుడి అవతారం ఎత్తింది.

  అంతరిక్షంలోని ఉపగ్రహాన్ని కూల్చివేసి, ప్రపంచానికి సగర్వంగా చాటి చెప్పిన మన దేశం.. ఆ ఘనతను సాధించిన అతికొద్ది దేశాల జాబితాలో చేరింది. ఏ-శాట్‌ను కలిగిన దేశాల్లో ఇప్పటి వరకు అమెరికా, రష్యా, చైనా ఉండగా.. ఆ జాబితాలో భారత్‌ అడుగుపెట్టింది.  అంతరిక్ష యుద్ధ క్షేత్రంలో ప్రస్తుతం భూ ఉపరితలం నుంచి ఏ శాట్‌ ద్వారా ఉపగ్రహాలను కూల్చివేయొచ్చు. అమెరికా, రష్యా వద్ద నౌకలపై నుంచీ, భూ ఉపరితలం, నింగి మీది నుంచి ప్రయోగించే సాంకేతికత అందుబాటులో ఉంది.

  2016-2025 మధ్యకాలంలో ప్రపంచ దేశాలు మొత్తం 1,450 కొత్త ఉపగ్రహాలను అంతరిక్షంలోకి ప్రయోగించనున్నాయని, ఈ మార్కెట్‌ విలువ 25,000 కోట్ల డాలర్లని యూరోకన్సల్ట్‌ సంస్థ అంచనా. అంతరిక్ష సాంకేతికత విలువ రాగల 30 ఏళ్లలో 33,900 కోట్ల డాలర్ల నుంచి 2.7 లక్షల కోట్ల డాలర్లకు పెరుగుతుందని బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా లెక్కగట్టింది.

  ఈ సాంకేతికత సృష్టి, వినియోగంలో 80 దేశాలు నిమగ్నమయ్యాయి. అంతరిక్షంలో అగ్రశ్రేణి దేశాల్లో భారత్‌ కూడా ఉంది. ప్రస్తుతం భూకక్ష్యలో పరిభ్రమిస్తున్న 1,950 ఉపగ్రహాల్లో 830 అమెరికాకు చెందినవైతే, 280 ఉపగ్రహాలతో చైనా, 147 ఉపగ్రహాలతో రష్యాలు పరస్సరం పోటీ పడుతున్నాయి.  54 ఉపగ్రహాలతో భారత్‌ ఏడో స్థానంలో నిలిచింది.

  చైనా దూకుడుకు కళ్లెం వేయడానికి ఏర్పడ్డ ‘క్వాడ్ కూటమి’ రోదసిలో సైతం బలోపేతమవుతోంది. రోదసి రంగానికీ  మైత్రి విస్తరిస్తోంది. ఈ దిశగా కూటమిలోని ఇతర దేశాలైన అమెరికా, జపాన్, ఆస్ట్రేలియాతో అంతరిక్ష బంధాన్ని భారత్‌ పటిష్ఠం చేసుకుంటోంది. వాతావరణ మార్పులు; కీలక, సరికొత్త పరిజ్ఞానాలు, భవిష్యత్‌ సాంకేతికతను సంయుక్తంగా అభివృద్ధి చేయడం దృష్టి సారించాయి క్వాడ్ దేశాలు.  అంతరిక్ష రంగంలోనూ నాలుగు దేశాలు ఉమ్మడిగా సాగేందుకు అడుగులు వేస్తున్నాయి.

  అమెరికాతో కలిసి అభివృద్ధి చేస్తున్న ‘నిసార్‌’ ఉపగ్రహం కోసం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ -ఇస్రో ఒక ఎస్‌-బ్యాండ్‌ సింథటిక్‌ అపెర్చర్‌ రాడార్‌ను ఇటీవల రూపొందించింది. దీన్ని 2022లో  శ్రీహరికోట నుంచి ప్రయోగించనున్నారు. చంద్రుడిపైకి భారత్‌ పంపే చంద్రయాన్‌-3లో నాసాకు చెందిన లేజర్‌ రిఫ్లెక్టోమీటర్‌ ను అమర్చనున్నారు.

  జపాన్‌తో మైత్రిని ఇస్రో బలోపేతం చేసుకుంటోంది. భూ పరిశీలన, చంద్రమండలంపై అన్వేషణ, ఉపగ్రహ నేవిగేషన్‌ లో ఇరు దేశాలూ సహకరించుకంటున్నాయి. 2023 నాటికి చంద్రుడి దక్షిణ ధ్రువానికి లూనార్‌ పోలార్‌ ఎక్స్ ప్లొరేషన్‌ -లూపెక్స్‌ పేరుతో ఒక వ్యోమనౌకను  పంపనున్నాయి.  ఇందుకోసం జపాన్‌.. 2.6 కోట్ల డాలర్లను కేటాయించింది కూడా.  

  2050కల్లా భూమి-చంద్ర ఆర్థిక మండలాన్ని ఏర్పాటు చేయాలని చైనా భావిస్తోంది. ప్రభుత్వ సంస్థ అయిన చైనా ఏరోస్పేస్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ కార్పొరేషన్‌కు ఈ బాధ్యతను అప్పగించింది. మొత్తంగా అమెరికా, చైనాలు రోదసిలో పోటీపడుతూ, ఇతర దేశాలను తమ పరిధిలోకి ఆకర్షించాలని చూస్తున్నాయి. అమెరికా, రష్యా, చైనా, యూరప్, భారత్‌, జపాన్‌ లతో పాటు యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ కూడా రోదసి యాత్రలు చేపట్టింది. గ్రహశకలాలపై ఖనిజ తవ్వకాలకు జపాన్‌, అమెరికా వ్యోమ నౌకలను పంపాయి.

  1999 నుంచి అంతరిక్ష అన్వేషణ చేపట్టిన భారత్‌, దీర్ఘకాలంపాటు రోదసిలో వ్యోమగాముల నివాసానికి, చంద్ర వనరుల వెలికితీతకు ఏర్పాట్లు చేయనున్నది. చంద్రయాన్‌ యాత్రల తరవాత చంద్రుడి దక్షిణ ధ్రువం మీద అంతరిక్ష నౌకను దింపి విజయం సాధించింది. 2022లో గగన్‌యాన్‌ పేరిట వ్యోమగాములను భూకక్ష్యలోకి పంపబోతోంది.

  2030కల్లా స్పేస్‌ షటిల్‌ లా భూమి చుట్టూ పరిభ్రమించే అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించాలని తలపెట్టింది. 1979లో చంద్రమండల ఒప్పందంపై సంతకాలు చేసిన దేశాల్లో కేవలం భారత్‌, ఫ్రాన్స్‌ మాత్రమే గ్రహ యాత్రలు చేపట్టే సత్తాను, అంతరిక్షంలోకి మానవులను పంపే సామర్థ్యాన్ని సాధించగలిగాయి. ఫ్రాన్స్‌ చందమామ ఒప్పందం నుంచి వైదొలగి అమెరికా నాయకత్వంలోని ఆర్టెమిస్‌ ఒప్పందంలో భాగస్వామి కావడానికి సుముఖత కనబరచింది.

  జపాన్‌, ఆస్ట్రేలియా, కెనడాలూ అదే బాటలో ఉన్నాయి. భారతదేశం చాలాకాలం నుంచి రష్యా, అమెరికా, యూరప్, జపాన్‌లతో అంతరిక్ష సహకారం నెరపుతోంది. స్వశక్తితో అంతరిక్షంలోకి ఎదుగుతోంది. త్వరలో అమెరికా, చైనాల తరవాత మూడో ప్రధాన ఆర్థిక శక్తిగా నిలవబోతున్న భారత్‌- ఆర్టెమిస్‌ ఒప్పంద దేశాలతో చేతులు కలుపుతూనే, స్వతంత్రంగా అంతరిక్ష అన్వేషణ, ఖనిజ వనరుల వినియోగానికి పథక రచన చేస్తోంది.

  అదే సమయంలో అమెరికా, చైనాల మధ్య రగులుతున్న అంతరిక్ష పోటీని గుర్తించి అడుగులు వేయాలంటారు నిపుణులు. కరోనా కల్లోలానికి చైనాయే కారణమని దుయ్యబడుతున్న అమెరికా- బీజింగ్‌ నుంచి రోదసిలో ఎదురుకాగల సైనిక ముప్పును దృష్టిలో ఉంచుకుని అంతరిక్ష సేనను ఏర్పాటు చేసింది.

  చైనా, రష్యాలు అంతరిక్షాన్ని ఆయుధీకరించాయంటూ, గత 2019 జూన్‌లో అంతరిక్ష రక్షణ వ్యూహాన్ని అమెరికా ప్రకటించింది. భూకక్ష్యలోని ఉపగ్రహాలను పేల్చివేసే రాకెట్‌ను చైనా ప్రయోగించడం దాని ఉద్దేశాలను బయటపెడుతోంది. భారత్‌ కూడా అటువంటి రాకెట్‌ను ప్రయోగించి ప్రతిసవాల్ విసిరింది.

  ఆంతరిక్షానికి ఆర్థిక, సైనిక ప్రాధాన్యం ఉందని గ్రహించిన భారత్ తన సామర్థ్యాలను పెంచుకుంటోంది. చైనా తన సొంత అంతరిక్ష అజెండాతో ముందుకువెళుతోంది. చంద్రుడి పైకి వ్యోమగాములను తీసుకెళ్లే ఫ్లెక్సిబుల్‌ ఇన్‌ ఫ్లేటబుల్‌ కార్గో రీఎంట్రీ వెహికల్‌ -ఎఫ్‌.ఐ.సి.ఆర్‌.వి ని భారీ లాంగ్‌ మార్చ్‌ రాకెట్‌ పై గతేడాది ప్రయోగించింది.

  భూమి-చంద్రుల మధ్య ప్రత్యేక ఆర్థిక మండలాన్ని ప్రకటించాలని చూస్తున్న చైనా, తన లక్ష్య సాధన కోసం ఈ రాకెట్‌ను ప్రయోగించింది. అంతరిక్ష సేవలు, పారిశ్రామికోత్పత్తి, అంతరిక్ష ఖనిజ వనరుల వినియోగం ద్వారా 10 లక్షల కోట్ల డాలర్లు ఆర్జించడానికి చైనా ఈ ప్రత్యేక ఎకనమిక్ జోన్  ప్రకటించబోతోంది. దీనికి ప్రత్యామ్నాయంగా అమెరికా ఆర్టెమిస్‌ ఒప్పందాన్ని ముందుకుతెచ్చింది.

  అంతరిక్ష అన్వేషణకు, ఖగోళ వనరుల వినియోగానికి ఉమ్మడి సూత్రాలను రూపొందించాలని ఆర్టెమిస్‌ భావిస్తోంది. ఈ నేపథ్యంలో భారత్‌ 1979 చంద్రమండల ఒప్పందం నుంచి వైదొలగి ఆర్టెమిస్‌ ఒప్పందంలో భాగస్వామి కావాలంటారు నిపుణులు.

  ఈ సూచనను భారత ప్రభుత్వం లోతుగా పరిశీలిస్తోంది. చంద్రయాన్‌, మంగళ్‌ యాన్‌, గగన్‌ యాన్‌ ప్రణాళికలతో అంతరిక్షంలో తన ఉనికిని బలంగా చాటుకొంటోంది.  చైనాకు దీటుగా  రోదసిలో దూసుకెళ్లడానికి క్వాడ్ దేశాల సహకారం అవసరం. అందుకే భారత్ దౌత్యనీతికి మెరుగులు పడుతోంది. 

  మార్చి 9, 2021లో చైనా అంతరిక్ష పరిశోధన సంస్థ- CNSA, రష్యా రోదసి పరిశోధన సంస్థ- ROSCOSMOS లు చంద్రమండలంపై ప్రతిపత్తితో కూడిన పర్మనెంట్ రీసెర్చ్ బేస్ ఏర్పాటు చేయాలన్న ఒప్పందం నేపథ్యంలో భారత్ అంతరిక్ష రక్షణ వ్యూహం ఎలా ఉండబోతోందో వేచి చూడాల్సిందే!

  Related Stories