కరోనా కట్టడికి రాష్ట్రాలకు తోడ్పాటును అందిస్తామని భారతీయ జనతా పార్టీ ఎప్పటి నుండో చెబుతూ ఉంది. అందుకు తగ్గట్టుగా కష్టాల్లో ఉన్న ప్రభుత్వాలకు తమ వంతుగా సహాయాన్ని అందిస్తోంది. గత ఏడాది కాలంగా భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బి.ఈ.ఎల్.) 30000కు పైగా వెంటిలేటర్లను తయారు చేయగా.. వాటిని చాలా రాష్ట్రాలకు పంపించారు. అయితే కొన్ని రాష్ట్రాలు మాత్రం ఈ వెంటిలేటర్లు సరిగా పనిచేయడం లేదంటూ పక్కన పడేశాయి. సెకండ్ వేవ్ సమయంలో కూడా కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు వీటిని వినియోగించాలని భావించలేదు. చిన్న రిపేరీలు, మెయిన్టెనెన్స్ తోడైతే ఈ వెంటిలేటర్లు పని చేస్తూ ఉండేవి.. కానీ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వాటిపై కనీసం కనికరం చూపించలేదు.
వెంటిలేటర్లు పనిచేయడం లేదనే విషయాన్ని తెలుసుకున్న బి.ఈ.ఎల్. సి.ఎం.డి. ఎం.వి.గౌతమ్ పంజాబ్ రాష్ట్రం లోని ఫరీద్ కోట్ కు వెళ్లారు. అక్కడ ఉన్న వెంటిలేటర్లకు చిన్న చిన్న మార్పులు చేస్తే పని చేస్తాయట.. కానీ అక్కడి సిబ్బంది వాటి గురించి అసలు పట్టించుకోలేదు. పనిచేయని వస్తువుల కింద భావించి పక్కన పెట్టేశారట. వెంటిలేటర్లలో ఉండే ఫ్లో సెన్సార్లు, ఆక్సిజన్ సెన్సార్లు మారిస్తే అవి తప్పకుండా పనిచేస్తాయని గౌతమ్ తెలిపారు. కానీ ఆసుపత్రి సిబ్బంది వాటిని కనీసం చూడకుండా పక్కన పెట్టేయడం నిజంగా దురదృష్టకరమని అన్నారు.
కేంద్ర ప్రభుత్వం కొన్ని రాష్ట్రాలకు వెంటిలేటర్లను పంపినా కూడా వాటిని వాడుకోవడంలో ఘోరంగా విఫలమయ్యాయి. పంజాబ్, మహారాష్ట్ర ప్రభుత్వాలు తమకు కేంద్ర ప్రభుత్వం పని చేయని వెంటిలేటర్లు పంపాయని ఆరోపించాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం బృందాన్ని పంపగా.. చిన్న చిన్న రిపేరీలు చేయడంతోనే అవి పని చేయడం ఆరంభించాయి. రాష్ట్ర ప్రభుత్వాలు కనీసం వాటి గురించి పట్టించుకోకుండా.. మెయింటెనెన్స్ అన్నదే లేకుండా ఉండడం వలన పని చేయడం మానేశాయని గుర్తించారు. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం మీద నిందలు మోపడం మొదలు పెట్టారు. కొన్ని కొన్ని ఆసుపత్రుల్లో పైప్ లతో ఆక్సిజన్ సప్లై అన్నది జరగకపోవడం, ఆక్సిజన్ ప్రెజర్ సరిగా లేకపోవడం.. పైప్ సిస్టమ్ లో తప్పులు ఉండడం.. ఇక ఎలెక్ట్రికల్ ఫిట్టింగ్స్ లో కూడా సమస్యలు ఉండడంతో వెంటిలేటర్లు పనిచేయడం లేదు. ఇలాంటి సమస్యలను ఆసుపత్రి సిబ్బంది గుర్తించి ఉండి ఉంటే వెంటిలేటర్లు పని చేసేవని టెక్నికల్ టీమ్ రాష్ట్ర ప్రభుత్వాలకు క్లారిటీ ఇచ్చింది. కరోనా సెకండ్ వేవ్ సమయంలో కూడా పంజాబ్ ప్రభుత్వం 250 వెంటిలేటర్లను ఉపయోగించకుండా పక్కన పెట్టేసిందట. మరో వైపు కాంగ్రెస్ నేతలు కేంద్ర ప్రభుత్వాన్ని వెంటిలేటర్ల స్కామ్ జరిగిందంటూ విమర్శిస్తూ ఉన్నారు. తీరా అక్కడికెళ్లి చూస్తే.. వెంటిలేటర్లను ఇంస్టాల్ చేయనూ లేదు.. వాటికి ఉన్న చిన్న చిన్న రిపేరీలను కూడా చేయించలేదు.