నిజమైన మహిళా దినోత్సవం ఎప్పుడు..?

0
841

అమ్మ అంటాం.. అమ్ముకుంటాం..! పూజించాలంటాం.. వేధిస్తుంటాం..! కాలేజీలు, కార్యాలయాలు,.. పార్కులు, సినిమాహాళ్లు.. ఇంటా బయటా ఇంతికి ఎంతో కష్టం. అడుగుకో అత్యాచారం.. ఎక్కడ చూసినా దుశ్శాసన పర్వం. తల్లిగా, చెల్లిగా, అక్కగా, భార్యగా.. స్త్రీని గౌరవించే భారత దేశంలోనూ.. నీచత్వం శృతి మించుతోంది. చెయ్యెత్తి మొక్కాల్సిన మగువపై.. చెయ్యేస్తున్న విష సంస్కృతి పెరిగిపోతోంది. మరి, మార్పు ఎక్కడ రావాలి..? చట్టాల్లోనా..? చదువుల్లోనా..? పాలకుల్లోనా..? మన ఆలోచనల్లోనా..? మార్చి 8 రాగానే మహిళలపై ఎక్కడలేని ప్రేమ పుట్టుకొస్తుంది. వాట్సాప్‎లు, ఫేస్‎బుక్‎లు, ట్విట్టర్లు, ఇన్‎స్టాగ్రాంలు.. ఇలా అన్ని సోషల్ మీడియా ప్లాట్‎ఫాంలు మొత్తం విషెస్‎తో నిండిపోతాయి. మరి, ఈ ఒక్కరోజు మహిళలను గౌరవిస్తే సరిపోతుందా..? మహిళా దినోత్సవానికి అర్థం ఏంటి..? అసలు నిజమైన మహిళా దినోత్సవం ఎప్పుడు..?

నీటిని గంగమ్మగా పూజించే సంస్కృతి, నేలను భూమాతగా భావించే ఉన్నతి, ప్రకృతిలోనూ స్త్రీమూర్తిని దర్శించే తత్వం.. ఇదే మన భారతీయ జీవన విధానంలో మహిళకు వున్న ఔన్నత్యం.. మనమిస్తున్న గౌరవం. ఎక్కడ స్త్రీలు పూజలందుకుంటారో అక్కడ దేవతలు కొలువై ఉంటారు అని ఆర్యోక్తి. మాతృదేవో భవ అనే సనాతన ధర్మానికి నెలవు భారతదేశం. పరాయి స్త్రీని మాతృమూర్తితో సమానంగా గౌరవించే సంస్కృతికి పెట్టింది పేరైన భరతగడ్డపై నేడు మహిళలకు భద్రత కరువయ్యింది. మహిళలను దైవంగా కొలిచే దేశంలో వారిపై లైంగిక దాడులు, దౌర్జన్యాలు, హింస నిత్యకృత్యమయ్యాయి. పోలీసులున్నారు. చట్టాలున్నాయి. కానీ నేరాలు జరుగుతూనే ఉన్నాయి. ఎక్కడ ఏ అపాయం పొంచి ఉందో ఊహించలేని పరిస్థితి. నిర్భయ చట్టం వచ్చిన తర్వాత సైతం అత్యాచార ఘటనలు లేకుండా ఒక్క రోజైనా గడవటం లేదు. గృహ హింస చట్టం, వరకట్న నిషేధ చట్టం, కార్యాలయాల్లో లైంగిక వేధింపుల నిషేధ చట్టం.. ఇలా మహిళల రక్షణ కోసం అనేక చట్టాలు వచ్చాయి. కానీ మహిళల భద్రతకు మాత్రం హామీ లభించటం లేదు.

మహిళను ఆకాశంలో సగం.. అవకాశాల్లో సగం.. అంటూ ఊదరగొడతాం. ఇదంతా వినడానికి బాగానే ఉంది. అమలుకు మాత్రం నోచుకోవడం లేదు. కఠిన చట్టాలున్నా కార్యరూపం దాల్చడం లేదు. చదువుకున్నవారు, చదువులేని వారనే తేడా లేకుండా.. మహిళలను చిన్నచూపు చూస్తూనేవున్నారు. పురుష మస్తిష్కంలో నాటుకున్న విషపు ఆలోచనలతో.. మహిళ లింగవివక్షకు గురవుతూనేవుంది. ఆడబిడ్డ అమ్మకడుపులోనే అంతమైపోతోంది. ప్రపంచవ్యాప్తంగా మహిళల సంఖ్య తగ్గిపోతోంది. ప్రపంచ జనాభా లెక్కలను చూస్తే గుండె చెరువుతోంది. ఎందుకంటే, పురుషుల జనాభాతో పోలిస్తే మహిళల జనాభా 63 కోట్లకుపైగా తక్కువగా వున్నట్టు తాజా గణాంకాలు తేల్చిచెబుతున్నాయి. మన దేశంలోనూ స్త్రీ, పురుష లింగనిష్పత్తి దారుణంగా పడిపోతోంది.

ఇకనైనా ఆకాశంలో సగం.. అవకాశాల్లో సగం అనే భావనను ఆలోచనల్లో కాకుండా కార్యరూపంలో చూపినప్పుడే మహిళలకు న్యాయం జరుగుతుంది. అందుకే, ఎలాగైనా లింగ నిష్పత్తిలో సమానత్వం సాధించాలని మహిళలు కదం తొక్కారు. వారికి అండగా నిలిచింది ఐక్యరాజ్య సమితి. ఈ ఏడాది మహిళా దినోత్సవం థీమ్ ను లింగ నిష్పత్తిని పెంపొందించేలా రూపొందించింది. 2030 నాటికి భూమిపై సగం, సగం అనే థీమ్ ను ప్రకటించింది. అంటే లింగ నిష్పత్తిలో సమానత్వం సాధించేందుకు మరో 14 ఏళ్లు పడుతుంది. ఒక్కటిమాత్రం నిజం.. మహిళల్ని గౌరవించడాన్ని.. మహిళా దినోత్సవానికి పరిమితం చేస్తే.. మహిళాభ్యున్నతి ఎప్పటికీ సాకారం కాదు. మనిషి ఆలోచన మారాలి. మహిళను గౌరవించే తీరు మారాలి. అప్పుడే నిజమైన మహిళా దినోత్సవం.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

seven − five =