ధీరవనితలుగా….
వీరమాతలుగా…,
విప్లవ పోరాటయోధులుగా…
సేవా శిరోమణులుగా…
సమాజానికి ఆదర్శంగా….
స్ఫూర్తిదాతలుగా నిలిచిన…
ఎందరో మాతృమూర్తులు…. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నేషనలిస్ట్ హబ్ శుభాకాంక్షలు తెలుపుతోంది.
‘స్త్రీ’ అంటేనే శక్తి. సకల వైభవాలకు ఆమె మూలం. వేదాల నుంచి మొదలుకొని, ఆధునిక గ్రంథాల వరకు అన్ని వాఞ్మయాలూ ఇదే విషయాన్ని చెబుతున్నాయి. అందువల్ల సృష్టిలో స్త్రీ మహిమ వర్ణనలకు అందనిదిని అంటారు కవులు.!
ఎక్కడైతే… నారీమణుల్ని గౌరవిస్తారో అక్కడ దేవతలు సంతోషంతో, సంతృప్తితో సంచరిస్తారని.. ఎక్కడ మహిళామణులకు అవమానం జరుగుతుందో అక్కడ అన్ని పనులూ నిష్ఫలమై పోతాయి…ఏ ఫలితమూ దక్కదని మన ప్రాచీన గ్రంథాలు చెబుతున్నాయి.
స్త్రీ లేకుంటే నేడు మానవజాతి ఉండేదేకాదు. ఇది చాలూ…! ఆమె ఈ మానవ సృష్టిలో ఎంతటి విశిష్టురాలో అర్థం చేసుకోవచ్చు. అందుకే మొదటి నమస్కారాన్ని తల్లికే చేయాలని వేదాలు చెబుతున్నాయి.
బాల్యంలో కూతురిగా, కౌమారంలో చదువుల తల్లిగా, యౌవనంలో ధర్మపత్నిగా, వార్ధక్యంలో తోడునీడగా ఉండే స్త్రీ జన్మ సార్థకమే కాదు విశ్వకల్యాణకారకం కూడా.! లోకంలో జరిగే పెళ్ళిళ్లకు అన్నింటికీ, స్త్రీ మాత్రమే మూలం అంటే అతిశయోక్తి కాదు.
వివాహం అయిన తరవాత గృహలక్ష్మిగా భర్త ఇంటిలోకి అడుగుపెట్టిన వనిత జీవితాంతం వరకు ఎన్నో అవతారాలు ఎత్తుతుంది. సేవకురాలై ఇంటిపనులన్నీ చేస్తుంది. ఇంటి బాగోగుల గురించి ఒక మంత్రిలా ఆలోచిస్తుంది. లక్ష్మీదేవిలా ఆభరణాలు ధరించి గృహిణిగా కన్నుల పండుగ చేస్తుంది. భూదేవిలా సహనంతో అన్నీ ఓర్చుకొంటుంది. కుటుంబసభ్యులకు, అతిథులకు అన్నంపెట్టే సమయంలో తల్లిలా కారుణ్యం ప్రదర్శిస్తుంది. భర్తతో సాంసారిక సౌఖ్యంలో అనురాగవతిగా అల్లుకొనిపోతుంది. కనుక స్త్రీ మహిమ వర్ణనలకు అందనిదని విష్ణుశర్మ పంచతంత్రంలో అంటాడు.
ఏ ఇంటిలో భర్త… భార్యను సంతోషంగా బతకనిస్తాడో ఆ ఇంటిలో సకలకల్యాణ గుణపరంపరలు తాండవిస్తాయనీ, ఆమెను దుఃఖానికి గురిచేస్తే అన్ని సంపదలూ నశించిపోతాయని మన రుషులు తెలిపారు. అందరినీ ఆదరించి, అన్నంపెట్టే గృహిణి లేని ఇల్లు ఎన్ని సంపదలున్నా అడవితో సమానమే అని పెద్దలు అంటారు.
సహధర్మచారిణి అయిన స్త్రీ లేకుండా ఏ ఇంటిలోనూ శుభకార్యాలు చేసే అధికారం పురుషుడికి లేదని వేదం చెబుతోంది. దీనివల్ల స్త్రీకి ఎంతటి ప్రాధాన్యం ఉన్నదో గ్రహించవచ్చు.
లోకంలో మహాత్ములు, మహాపురుషులు చిన్నతనంలో తల్లివల్ల శిక్షణ పొందినవాళ్లే. తల్లి ప్రమేయం లేకుండా సౌజన్యం, సౌశీల్యం, సాత్వికత లభించడం కష్టం. అసలు స్త్రీ అంటేనే కారుణ్యానికి ప్రతీక.
స్త్రీ అడుగుపెట్టని రంగమంటూ ఏదీ లేదు. ఆమె నిలదొక్కుకోలేని స్థానమూ ఉండదు. విజయం సాధించని సందర్భమూ కనిపించదు. వంటింటిని సమర్థంగా చక్కదిద్దుకోవడం నుంచి అంతరిక్ష రహస్యాలు ఛేదించడం వరకు ఆ మేధస్సు ఎప్పటికప్పుడు నిరూపితమ వుతోంది. సంగీతం, సాహిత్యం, విద్య, వైజ్ఞానికం, పరిపాలన- అన్నింటా అంతటా మహిళామణులెందరో రాణించారు, రాణిస్తున్నారు.
పోరాట యోధురాళ్ళుగా రుద్రమదేవి, కేలడి చెన్నమ్మ, ఝాన్సీ లక్ష్మీబాయి వంటి వారెందరో పేరు తెచ్చుకున్నారు. రాజకీయాల్లో అనేకమంది మహిళలు శక్తియుక్తులు చాటుకున్నారు, చాటుతున్నారు. సేవా శిరోమణులుగా డొక్క సీతమ్మ తల్లి, సోదరి నివేదిత..వంటివారు అసమాన కీర్తి గడించారు. ఆమె కరుణతోనే ఈ ప్రపంచం చల్లగా వర్ధిల్లుతోంది.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భాంగా నేషనలిస్ట్ హబ్… మహిళా మణులందరికీ వందనాలు చెబుతోంది.