మహిళలపై దాడులకు పాల్పడ్డ తాలిబాన్లు

తమ హక్కులకు భంగం కలిగించకుండా తాలిబాన్ల పాలన సాగాలని ఆఫ్ఘనిస్తాన్ మహిళలు గత కొద్దిరోజులుగా నిరసనలకు దిగుతున్న సంగతి తెలిసిందే..! ఆఫ్ఘనిస్తాన్ లోని పలు నగరాల్లో మహిళలు పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేశారు. ఆఫ్ఘన్ ప్రధాన పట్టణాల వీధుల్లో వేల మంది మహిళలు తాలిబాన్లకు వ్యతిరేకంగా ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ‘మా హక్కులు మాకు ఇవాల్సిందే’ అంటూ నిరసన గళం వినిపిస్తున్నారు. పశ్చిమ ప్రాంతంలోని చాలా పట్టణాలలో హక్కుల పరిరక్షణ కోసం మహిళలు ఉద్యమాన్ని మొదలుపెట్టారు. మూడో అతిపెద్ద పట్టణం అయిన హెరాత్‌లో యాభై మంది మహిళలు మొదలుపెట్టిన నిరసన ప్రదర్శన.. మిగతా మహిళల్లో స్ఫూర్తి, ధైర్యాన్ని నింపింది. తాము బురఖాలను ధరించడానికి సిద్ధమేనని.. అయితే ఉద్యోగాలు మాత్రం తమకు కావాలని తాలిబాన్లకు మహిళలు తెగేసి చెబుతూ వస్తున్నారు. ఉద్యోగాల నుంచి తమను తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పుకొచ్చారు. తమ కుమార్తెలు తాలిబాన్ పాలనలో పాఠశాలకు వెళ్లగలిగితే బురఖా అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నామని ఆఫ్ఘన్ మహిళలు నిరసనల్లో తెలిపారు.
ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్‌లో మహిళల నిరసన హింసాత్మకంగా మారింది. అధ్యక్ష భవనం వద్దకు వెళ్లేవారిని తాలిబాన్లు అడ్డుకున్న తర్వాత హింసాత్మకంగా మారింది. తాలిబాన్లు తమపై టియర్ గ్యాస్ షెల్స్‌తో దాడి చేశారని ఆందోళనకారులు ఆరోపించారు. తాలిబాన్లు మహిళలపై దాడి చేసిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉన్నాయి. చాలా మంది మహిళలకు గాయాలు అయ్యాయి. ఒక స్థానిక వార్తా సంస్థ ఒక వీడియోను షేర్ చేసింది. అందులో ఆఫ్ఘన్ మహిళ తల నుండి రక్తం కారుతుండడాన్ని గమనించవచ్చు. ఆఫ్ఘనిస్తాన్‌లో మహిళల హక్కుల కోసం నిరసనకారులు వీధుల్లోకి వచ్చారు. దీన్ని తాలిబాన్ పాలకులు జీర్ణించుకోలేకపోతున్నారు. మహిళలకు సమాన హక్కులు, రాజకీయాల్లో అవకాశం కోరుతూ ఆఫ్ఘనిస్తాన్‌లో నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఆందోళనకారులు శుక్రవారం కూడా వీధుల్లోకి వచ్చారు. మహిళలు ఆందోళన చేస్తూ ఉంటే తాలిబాన్ గార్డులకు, కొంతమంది మహిళల మధ్య ఘర్షణచోటు చేసుకుంది. వెళ్ళిపోవండి అంటూ తాలిబాన్ గార్డులు అరుస్తూ ఉండడం కూడా వీడియోలలో చూడొచ్చు. తాలిబాన్ దేశాన్ని పాలించడం మొదలుపెట్టినప్పటి నుండి ఆఫ్ఘనిస్తాన్‌లో మహిళల హక్కులకు సంబంధించి ఆందోళనలు జరుగుతున్నాయి. ఇస్లామిక్ షరియా చట్టం ప్రకారం మహిళలపై ఆంక్షలను అమలు చేస్తూ వస్తున్నారు తాలిబాన్ పాలకులు.