నేషనల్ డిఫెన్స్ అకాడమీలో మహిళలకు ఎంట్రీ.. స్పష్టం చేసిన కేంద్ర ప్రభుత్వం

నేషనల్ డిఫెన్స్ అకాడమీ (NDA) లోకి మహిళల ప్రవేశాన్ని అనుమతించే నిర్ణయం తీసుకున్నట్లు సెప్టెంబర్ 8 న కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఇప్పటివరకు సాయుధ దళాలలో నియామకానికి పురుషులనే తీసుకునేవారు.. ఇప్పుడు మహిళలకు కూడా కేంద్ర ప్రభుత్వం శుభవార్తను తెలిపింది. ఈ నిర్ణయం కాగితంపై అధికారికంగా వచ్చినట్లయితే, మహిళలు 12వ తరగతి తర్వాత సాయుధ దళాలలో కెరీర్ కోసం ప్రయత్నాలను చేసుకోవచ్చు. ఇదొక గొప్ప వార్త.. ఎన్డీయే, నేవల్ అకాడమీ ద్వారా మహిళలకు పర్మనెంట్ కమిషన్ ఇవ్వడానికి త్రివిధ దళాధిపతులు, ప్రభుత్వం అంగీకరించాయి. మంగళవారం రాత్రి ఈ నిర్ణయం తీసుకున్నారని అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి సుప్రీంకోర్టుకు తెలిపారు. అయితే, వారికి ప్రవేశాలు కల్పించేందుకుగానూ మార్గదర్శకాలను తయారు చేసేందుకు కొంత గడువు ఇవ్వాలని కోరింది. దానికి సమ్మతించిన కోర్టు ఈ నెల 20లోపు వెల్లడించాలని ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై సుప్రీంకోర్టు హర్షం వ్యక్తం చేసింది. ఎన్డీయేలోకి అమ్మాయిలను తీసుకునేందుకు సాయుధ బలగాలు ఒప్పుకోవడం ఆనందంగా ఉందని జస్టిస్ ఎస్కే కౌల్, జస్టిస్ ఎం.ఎం. సుందరేశ్ ల ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఒక్కరోజులోనే సంస్కరణలన్నీ జరిగిపోవన్న విషయం తమకూ తెలుసని, అమ్మాయిలను ఎన్డీయేలోకి తీసుకునే ప్రక్రియ, చర్యలకు కేంద్రం కొంత సమయం తీసుకోవచ్చని సూచించింది.
లింగ సమానత్వం కోసం సాయుధ బలగాలు మరింత చేయాల్సి ఉంది. త్రివిధ దళాధిపతులు ఈ నిర్ణయం తీసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. వాళ్లను ఒప్పించిన ఘనత మీకే దక్కుతుంది అని జస్టిస్ కౌల్ అన్నారు. అసలు గత విచారణ సందర్భంగానే ఈ విషయాన్ని చెప్పి ఉంటే తాము జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉండేది కాదని చెప్పారు.
సాయుధ దళాలు గౌరవనీయమైన సంస్థ అని, అయితే లింగ సమానత్వానికి సంబంధించి మరిన్ని సంస్కరణలను చేయాల్సి ఉందని తెలిపింది. దేశ రక్షణలో సాయుధ బలగాలు కీలకపాత్ర పోషిస్తాయని, అయితే, లింగ సమానత్వాన్ని ప్రోత్సహించేందుకు బలగాలు మరిన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొంది. కాగా, ఎన్డీయేతో పాటు నేవల్ అకాడమీలో అమ్మాయిలకూ అవకాశం కల్పించాలని పేర్కొంటూ దాఖలైన పిటిషన్ ను సుప్రీంకోర్టు విచారించింది. ఎన్డీయే పరీక్షను అమ్మాయిలూ రాయవచ్చని గతంలో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. తదుపరి విచారణ తేదీ అయిన సెప్టెంబర్ 22 లోగా దీనికి సంబంధించి అఫిడవిట్ దాఖలు చేయాలని ధర్మాసనం ప్రభుత్వాన్ని కోరింది. అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి మాట్లాడుతూ అతి త్వరలోనే సవివరణాత్మకంగా అఫిడవిట్ ను దాఖలు చేస్తామన్నారు. ఎన్డీయే ప్రవేశ పరీక్షను నవంబర్ కు వాయిదా వేస్తున్నట్టు జూన్ 24న ప్రకటించామని.. ప్రస్తుతం అమ్మాయిలకు అవకాశం కల్పించే అంశంలో చాలా మార్పులు చేయాల్సి ఉన్నందున పరీక్షలపై యథాతథ స్థితిని అమలు చేయాల్సిందిగా కోరారు.
ఇక మహిళలకు పర్మనెంట్ కమిషన్‌పై ఓ నిర్దిష్ట కాల వ్యవధి ఇవ్వాలని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా కేంద్రాన్ని ఆదేశించింది. మహిళలు రక్షణ సర్వీసుల్లో కమిషన్ పొందేందుకు నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసే వీలు కల్పించగా.. ప్రస్తుతం మహిళలను తాత్కాలిక కమిషన్ ఆఫీసర్లుగానే తీసుకుంటున్నారు. అయితే పురుషులకు ఇచ్చినట్లే వీళ్లకు కూడా పర్మనెంట్ కమిషన్ ఇవ్వాలని సుప్రీంకోర్టు ఇంతకు ముందే ఆదేశాలు జారీ చేసింది.