పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. యువతిని గర్భవతిని చేసి మోసం చేశాడో పోలీసు అధికారి. ఈ ఉదంతం విజయనగరం జిల్లాలో వెలుగుచూసింది. జిల్లాలోని రామభద్రపురం మండలం మిర్తివలస గ్రామానికి చెందిన సువ్వాడ ఉషారాణి.. అదే గ్రామానికి చెందిన పొట్నూరు గోపాలకృష్ణ 2019 నుంచి ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు. గోపాలకృష్ణ హైదరాబాద్ పోలీసు లైన్స్ లో రిజర్వ్ సబ్ ఇన్ స్పెక్టర్ గా పనిచేస్తున్నాడు. 2020లో ఉషారాణి – గోపాలకృష్ణల మధ్య బేధాభిప్రాయాలు రావడంతో.. విషయం గ్రామ పంచాయతీ పెద్దల దృష్టికి చేరింది.
పంచాయతీ పెద్దలు ఇరువురితో మాట్లాడి.. ఉషారాణికి కొంతమొత్తాన్ని పరిహారంగా ఇప్పించి రాజీ చేశారు. కొద్దిరోజుల తర్వాత ఉషారాణి – గోపాలకృష్ణ మళ్లీ కలుసుకున్నారు. డిప్యుటేషన్ మీద గోపాలకృష్ణ విధులు నిర్వహించేందుకు వచ్చాడు. అప్పుడప్పుడూ గ్రామానికి వచ్చి ఉషారాణిితో సన్నిహితంగా మెలిగేవాడు. ఈక్రమంలో ఉషారాణి గర్భం దాల్చింది. విషయం గోపాలకృష్ణకు చెప్పి.. తనను పెళ్లి చేసుకోవాలని కోరింది. ఒత్తిడి చేసింది. కానీ.. గోపాలకృష్ణ పెళ్లికి ఒప్పుకోలేదు. దాంతో తనకు న్యాయం చేయాలని ఉషారాణి విజయనగరంలోని హ్యూమన్ రైట్స్ సంఘం సభ్యులను ఆశ్రయించింది. వారి సూచన మేరకు గ్రామ పెద్దలతో కలిసి స్థానిక పోలీస్ స్టేషన్లో గోపాలకృష్ణపై ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.