More

  యోగాకు మతం లేదన్న సౌదీ ప్రభుత్వం.. తొలి మహిళా యోగా ట్రైనర్ గా నౌఫ్ మార్వాయ్

  జూన్ 21…! వరల్డ్ యోగా డే! ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు అందరూ యోగ జపం చేస్తున్నారు. బడా బడా కార్పొరేట్ సంస్థలు సైతం తమ ఉద్యోగులకు పని వత్తిడి భారాన్ని దూరం చేసేందుకు యోగానే శరణ్యం అంటున్నాయి. ఒక్క పాశ్చాత్య దేశాలే కాదు, కరడుగట్టిన ఇస్లామిక్ దేశాలు సైతం ఇప్పుడు భారతీయ యోగాకు మంత్రముగ్దులవుతున్నాయి.
  వరల్డ్ యోగా డే సందర్భంగా… ఇస్లామిక్ దేశంలో పుట్టిన ఓ మహిళ ఎలా యోగాను తన నిత్యజీవితంలో భాగం చేసుకుంది.? ఆ దేశానికి ఎలా యోగాను పరిచయం చేసింది? ఆమెను భారత ప్రభుత్వం ఏ విధంగా సత్కరించింది? మన దేశంలోని సోకాల్డ్ లెఫ్ట్ లిబరల్స్ లుటియెన్స్ జర్నలిస్టులు, కొంతమంది ఇస్లామిక్ మతోన్మాదులు యోగాపై ఏ విధంగా దుష్ప్రచారం చేశారనే విషయలను ఇప్పుడు మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను.

  శరీర మాద్యం ఖలు ధర్మసాధనం అన్నారు పెద్దలు. ధర్మసాధనలన్నింటిలోకీ మొట్టమొదటి స్థానం ఇవ్వాల్సింది శరీరానికే..! అందుకే దాన్ని ఆరోగ్యవంతంగా ఉంచుకోవాలి. నియమబద్ధంగా జీవితం గడపాలి. లేదంటే శరీరం రోగగ్రస్థం అవుతుంది. ప్రాచీన భారతీయ రుషులు శరీరాన్ని పరిశుభ్రంగా…ఆరోగ్యవంతంగా ఉంచేందుకే యోగ చికిత్స సూత్రాలను సైతం అందించారు. యోగతో మానసిక ఒత్తిడి దూరం అవుతుంది. అంతేకాదు అనేక రుగ్మతలు, దీర్ఘకాలిక రోగాల నుంచి సైతం ఉపశమనం లభిస్తుంది. ఒక్కమాటలో చెప్పాలంటే యోగ సర్వరోగ నివారణి..!

  ఈ క్రమంలో మనం సౌదీ అరేబియాకు చెందిన నౌఫ్ మార్వాయి యోగాను తన జీవితంలో భాగంగా చేసుకుని ఎలా ఆరోగ్యవంతురాలైందో తెలుసుకుందాం. నౌఫ్ మార్వాయి 1980లో జన్మించారు. ఆమె ప్రస్తుతం సౌదీ అరేబియా దేశంలో అధికారిక యోగా ఇన్ స్ట్రక్టర్. నిజానికి ఆమె పుట్టుకతోనే ఆటో ఇమ్యూన్ అనే వ్యాధితో జన్మించారు. దీనికి తోడు క్యాన్సర్ బారిన పడ్డారు ఆమె కిడ్నీలు సైతం పాడైపోయే దశకు చేరుకున్నాయి. కీళ్ల నొప్పులతో నడవలేని పరిస్థితి చేరుకున్నారు. సాధారణంగా మానవ శరీరంలో immune system అంటే రోగ నిరోధక వ్యవస్థ బయట నుంచి వచ్చి రోగ కారక క్రిములను అంతమొందించడానికి తోడ్పడుతుంది. కానీ auto immunity disease ఉన్నవారికి
  ఆ వ్యక్తి శరీరంలోని ఆరోగ్యకరమైన సెల్స్ ని నిర్వీర్యం చేస్తుంది. దీన్ని అధిగమించడానికి నౌఫ్ మార్వాయి ఆధునిక వైద్యవిధానంలోని అన్ని రకాల చికిత్సలను ప్రయత్నించినా లాభం లేకపోయింది.

  అయితే ఆస్ట్రేలియాలోచదువుకుంటున్న సమయంలో ఎలాంటి దీర్ఘకాలిక రోగాలనైనా నయం చేసే శక్తి…భారతీయ యోగా విద్య, ఆయుర్వేదంకు ఉందని కొంతమంది మిత్రులు చెప్పగా తెలుసుకుంది. అప్పటిదాకా ఆధునిక వైద్యాన్ని ఆశ్రయించిన ఆమె.. తన చివరి ప్రయత్నంగా ఆయుర్వేద చికిత్సతో అలాగే యోగా అభ్యాసం ద్వారా తన వ్యాధి నయం అయ్యే అవకాశాలున్నాయో లేదో తెలుసుకునేందుకు 1998లో కేరళ రాష్ట్రానికి వచ్చారు. అక్కడ ఆయుర్వేద చికిత్స తీసుకున్నారు. అలాగే మొల్లిమెల్లిగా శిక్షకుల సలహా మేరకు చిన్న చిన్న యోగాసనాలను అభ్యాసం చేయడం మొదలు పెట్టారు. అంతకు ముందుకంటే…యోగా, ఆయుర్వేదంతో ఆమె ఆరోగ్యంలో మార్పు స్పష్టంగా కనబడసాగింది.అలాగే ఢిల్లీ తోపాటు హిమాలయ ప్రాంతాలకు వెళ్లింది.అక్కడ యోగాలో శిక్షణ తీసుకుంది. అయితే నౌఫ్ మార్వాయి ఆయుర్వేద చికిత్సతోపాటు యోగాసనాలను వేయడాన్ని ఆమె తల్లిదండ్రులు మొదట వ్యతిరేకించారు.ఇస్లామ్ కు విరుద్ధమని భావించారు. అయితే క్రమంగా నౌఫ్ ఆరోగ్యం పూర్తిగా మెరుగు అవ్వడంతో వారు ఆశ్చర్యపోయారు. యోగాను నేర్చుకునేందుకు ఆమెను మరింతగా పోత్సహించారు.

  అలా సౌదీ అరేబియాలో ఆమె మొట్టమొదటి సర్టిఫైడ్ యోగా బోధకురాలిగా మారారు. సౌదీ అరేబియాలో అందరికి ఆమోదయోగ్యమైన క్రీడాంశంగా యోగాకు గుర్తింపు తీసుకువచ్చేందుకు ఎంతగానో శ్రమించారు. అలాగే సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ కూడా దేశంలో అనేక మార్పులకు శ్రీకారం చుట్టడం నౌఫ్ కు కలిసివచ్చింది.

  2006లో ఆమె సౌదీలో యోగా శిక్షణను ప్రారంభించినప్పుడు కొంతమంది ఇస్లామిక్ మతోన్మాదులు ఆమెను వ్యతిరేకించారు. ఆమె ఇస్లామ్ కు విరుద్ధంగా వ్యవహారిస్తున్నారని కూడా ప్రచారం చేశారు.అయితే సౌదీ ప్రభుత్వం వీటిని సీరియస్ గా తీసుకోలేదు. 2010లో అరబ్ యోగా ఫౌండేషన్ స్థాపించారు. 2014 నుంచి సౌదీ అరేబియాలో మీడియా చానల్స్, రేడియో , మ్యాగజైన్స్ , పత్రికల ద్వారా యోగా గురించి నౌఫ్ ఎంతగానో ప్రచారం చేశారు. ఇటు భారత దేశంలో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జూన్ 21ని అంతర్జాతీయంగా యోగా డేగా గుర్తించాలని ఐక్యరాజ్యసమితిలోనూ ఒత్తిడి తీసుకువచ్చింది. 2015 లో ఐక్యరాజ్యసమితి కూడా జూన్ 21ని వరల్డ్ యోగా డే ప్రకటించింది. వరల్డ్ వైడ్ గా ఫస్ట్ టైమ్ యోగాను 170 దేశాల్లో గ్రాండ్ గా నిర్వహించడం జరిగింది. అటు యోగా విషయంలో సౌదీ ప్రభుత్వంలోనూ కదలిక ప్రారంభమైంది.

  సౌదీ ఫెడరేషన్ ఫర్ కమ్యూనిటీ స్పోర్ట్స్ ఉపాధ్యక్షురాలిగా ఉన్న ప్రిన్సెస్ రీమా బింట్ బందర్ ను కలిసి…ఆమెకు యోగా ప్రాముఖ్యాన్ని విన్నవించారు నౌఫ్ మార్వాయ్. ! యోగాతో తన జీవితం చాలా మారిపోయిందనీ.. అందుకు ప్రత్యక్ష ఉదాహరణ తన ఆరోగ్యం మెరుగుపడటమేనని ఆమెకు తెలిపారు. యోగా అభ్యాసం ద్వారా తాను ఎలా క్యూర్ అయ్యారో సవివరంగా వివరించారు. దీంతో ప్రిన్సెస్ రీమా కూడా యోగాను సౌదీ క్రీడల జాబితాలో చేర్చేందుకు తన వంతు సాయం చేసేందుకు ముందుకు వచ్చారు.

  చివరకు 2017 నవంబర్ లో సౌదీ ప్రభుత్వం అధికారికంగా యోగాను మతకోణంలో కాకుండా.., చట్టబద్దమైన క్రీడాంశంగా యోగాను గుర్తించింది. ఆమె ఎంతోమంది సౌదీ మహిళలకు యోగాలో శిక్షణ ఇచ్చారు. ప్రస్తుతం సౌదీ అరేబియాలో సర్టిఫైడ్ యోగా బోధకులు 500 మందికి పైగా ఉన్నారు. వీరిలో మహిళలు కూడా ఉన్నారు. సౌదీలో పలు యోగా సెంటర్లు వెలిశాయి. నౌఫ్ మార్వాయ్ నిర్వహిస్తున్న యోగా కేంద్రంలో ప్రతి ఏటా 40 మందికి శిక్షణను ఇస్తున్నారు. యోగా అంటే ఆధునిక పరిభాషలో యూనియన్ అంటారు. ఇది సమస్త మానవులకు అవసరమని.. శారీరక ఆరోగ్యానికే కాకుండా…, మనస్సు, భావోద్వేగాలకు సంబంధించినదని అంటారు మార్వాయ్.!

  పశ్చిమాసియాలో భారతీయ యోగా వికాసానికి నౌఫ్ మార్వాయ్ చేసిన కృషికిగాను 2018లో భారత ప్రభుత్వం నౌఫ్ మార్వాయ్ కు పద్మశ్రీ పురస్కారం ప్రకటించింది. ఈ పురస్కారాన్ని ఆమె రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేతులు మీదుగా అందుకున్నారు. ఇప్పటికీ పశ్చిమాసియా దేశాల్లో ఆమె యోగా వికాసానికి కృషి చేస్తునే ఉన్నారు.
  అయితే ఇప్పటికీ ఇస్లామిక్ మతోన్మాదుల నుంచి బెదిరింపులు వస్తూనే ఉన్నాయని ఆమె చెబుతున్నారు.

  ఇస్లామ్ పుట్టిన సౌదీ అరేబియానే యోగా ను అభ్యాసిస్తుంటే మన దేశంలో కూడా కొంతమంది మతోన్మాదులు యోగాకు మతం రంగు పులిమే ప్రయత్నం ఇంకా కూడా చేస్తున్నారు. 2017 జార్ఖండ్ లోని రాంచీలో రఫియా నాజ్ అనే మహిళ యోగా చేస్తోందని కొంతమంది మతోన్మాదులు దాడులకు పాల్పడ్డారు.

  ఇలాంటి ఘటనలు మనం దేశంలో ఎక్కడో ఒక చోట జరుగుతున్నాయి. దీనికి లెఫ్ట్ లుటియెన్స్ జర్నలిస్టులతోపాటు, ఇస్లామిక్ మతోన్మాదులు తమ రాతల ద్వారా ప్రజల్లో అపోహలు సృష్టించడమే అసలు కారణం. యోగాకు మతంతో సంబంధం లేదు. ఏ మతస్థులైన యోగాను ప్రాక్టిస్ చేయవచ్చు. ప్రాచీన భారతీయులు సమస్థ మానవాళి సంక్షేమం కోసం యోగాను అందించారనే విషయం మనం మర్చిపోరాదు.

  ఆధునిక వైద్యం సైతం నయం చేయని కొన్ని రకాల దీర్ఘకాలిక రోగాలు ఇప్పుడు యోగతో నయం చేయవచ్చు అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రతి ఒక్కరు తమ దైనందిన జీవితంలో యోగాను ఆచరించాలి. యోగ కోసం సమయం కేటాయించాలి. యోగా అభ్యసించడంతో మానసిక ఒత్తిడి దూరం కావడమే కాకుండా అనేక రుగ్మతల నుంచి సైతం ఉపశమనం పొందవచ్చని ఇటివలి కాలంలో నిర్వహించిన కొన్ని పరిశోధనలు సైతం చెబుతున్నాయి. వైద్యశాస్త్రం నుంచి మొదలు పెడితే విజ్ఞాన శాస్త్రం వరకు, ఒక్కరేమిటి మొత్తం ప్రపంచమే ముక్త కంఠంతో యోగా జపం చేస్తోంది. ఊపిరి సలుపని జీవితానికి…నిండు ఊపిరిని ఇచ్చేదే భారతీయ యోగ శాస్త్రం. సకల దేహ దురవస్థలకు, అనారోగ్యాలకు యోగా అభ్యాసమే దివ్వ ఔషధం.

  Trending Stories

  Related Stories