టెక్నాలజీ పరంగా మనం ఎంత ముందుకు వెళుతున్నా కూడా.. కొన్ని ప్రాంతాల్లో ఇంకా కనీసం రోడ్డు సదుపాయం లేదు. కొన్ని చోట్ల ప్రభుత్వ అలసత్వం ఉంటే.. ఇంకొన్ని చోట్ల రాజకీయాలు రాజ్యమేలుతూ ఉన్నాయి. గతంలో సరైన రోడ్డు సదుపాయం లేని కారణంగా గ్రామాల్లోని మగవాళ్లకు ఆడపిల్లలను ఇవ్వని ఘటనలు చోటు చేసుకున్నాయి. ఇప్పుడు ఈ కాలంలో రోడ్డు వేసే వరకూ పెళ్లి చేసుకోనని ఓ యువతి భీష్మించుకుని కూర్చుంది. ఈ విషయం మీడియా ద్వారా ఏకంగా ముఖ్యమంత్రికి చేరింది. దీంతో వారం తిరక్కుండా అధికారులు వచ్చి సర్వే చేశారు. రోడ్డు వేయడంతో పాటు బస్సు సర్వీస్ కూడా స్టార్ట్ చేస్తామని మాటిచ్చారు.

కర్ణాటకలోని దావణగిరి జిల్లాలో ఒక మారుమూల పల్లె హెచ్ రామ్‌పురాలో ఉండే 26 సంవత్సరాల యువతి ఆర్డీ బిందు దావణగిరి యూనివర్సిటీలో పీజీ (ఎకనమిక్స్) పూర్తి చేసింది. ఆమె టీచర్‌గా పని చేస్తోంది. ఇప్పుడు ఆమెకు తల్లిదండ్రులు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఆమె కూడా పెళ్లి చేసుకోడానికి తల్లిదండ్రులకు ఓకె చెప్పింది. కానీ తన పెళ్లిని అడ్డుపెట్టుకుని ఊరికి ఉన్న సమస్యలను తీర్చాలని అనుకుంది. ఆ ఊరిలో ఐదో తరగతి వరకు మాత్రమే బడి ఉండడంతో ఆమె మరో ఊరిలో హాస్టల్లో ఉండి చదువుకోవాల్సి వచ్చింది. కానీ ఆర్థిక పరిస్థితులు సహకరించక కొంత మంది రోజూ 14 కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లి చదువుకునే వాళ్లని మరి కొంత మంది చదువు మానేశారని ఆమె గుర్తించింది.


తమ ఊరి సమస్యలు పరిష్కారం అయ్యే వరకూ తాను పెళ్లి చేసుకోకూడదని ఆమె నిర్ణయానికి వచ్చింది. ఇదే విషయాన్ని తెలియజేస్తూ ఈ నెల 9న సీఎం బసవరాజ్ బొమ్మైకు ఈ మెయిల్ పంపింది. పిల్లలు స్కూల్‌కు వెళ్లాలన్నా, హాస్పిటల్‌కు వెళ్లాలన్నా కనీసం 14 కిలోమీటర్లు నడవాల్సి వస్తోందని, ఊరికి పక్కనే ఉన్న మయకొండ గ్రామానికి వెళ్లేందుకు రోడ్డు వేయాలని స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి పోరాడుతున్నామని ఊరి పెద్దలు చెప్పారని బిందు తెలిపింది. బిందు మెయిల్‌తో కర్ణాటక కొత్త సీఎం బసవరాజ్ బొమ్మై స్పందించారు. వెంటనే సీఎస్‌కు ఆ సమస్యను పరిష్కరించాల్సిందిగా ఆదేశాలిచ్చారు. దీంతో దానిపై అధ్యయనానికి గురవారం నాడు దావణగిరి జిల్లా డిప్యూటీ కమిషనర్ మహంతేశ్ బిలగి నేతృత్వంలో అధికారుల టీమ్ హెచ్ రామ్‌పురా గ్రామానికి వచ్చింది. గుంతలు గుంతలుగా ఉన్న మట్టి రోడ్డుపై అధికారుల వాహనాలు వెళ్లడం కుదరకపోవడంతో దాదాపు రెండు కిలోమీటర్లు నడిచి ఆ ఊరిలోకి పోయారు. పక్క ఊర్లతో హెచ్ రామ్‌పురాకు కనెక్టింగ్ రోడ్డు వేసి బస్సు సర్వీసును కూడా తర్వలోనే ప్రారంభిస్తామని అధికారులు హామీ ఇచ్చారు. దీంతో బిందు కుటుంబంలో మాత్రమే కాకుండా.. మొత్తం గ్రామం ఆనందంలో మునిగిపోయింది. కొన్ని దశాబ్దాలుగా గ్రామస్తులు రోడ్డు కోసం పోరాడారు.. వాళ్ల వల్ల కానిది బిందు చేసి చూపించిందని గ్రామ ప్రజలు ఆమెను పొగడ్తల్లో ముంచెత్తారు.



