మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో ఆ నియోజకవర్గంలో మూడు రోజుల పాటు వైన్ షాప్‌లు మూసివేయనున్నారు. మునుగోడులో నవంబర్ 3న ఉపఎన్నిక జరుగుతున్న నేపథ్యంలో నవంబర్ 1 సాయంత్రం 6 గంటల నుంచి, 3 తేదీ సాయంత్రం వరకు మద్యం షాప్‌లు మూసివేస్తున్నట్లు ఎక్సైజ్ శాఖ అధికారి సంతోష్ ప్రకటించారు. ఉప ఎన్నిక నేపథ్యంలో మునుగోడు నియోజక వర్గంలో మద్యం అమ్మకాలు విపరీతంగా పెరగడంతో అక్కడ మద్యానికి డిమాండ్ పెరిగింది. ఎన్నికల షెడ్యూల్ వచ్చినప్పటి నుండి మద్యం ఏరులైపారుతోంది.
దేశంలోనే అత్యధిక ఖరీదైన ఎన్నికగా మునుగోడు ఉప ఎన్నిక ఉండబోతుందని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే మూడు ప్రధాన పార్టీలు వందల కోట్ల వరకు ఖర్చు చేసినట్లు సమాచారం.నియోజకవర్గంలోకి ప్రవేశించే ప్రతీ వాహనం నెంబరు, యజమాని పేరు, ఏ అవసరం కోసం వచ్చారో నమోదు చేసుకుంటున్నారు. కార్లు మాత్రమే కాదు ఆర్టీసీ బస్సులు, గ్రామాల మధ్య తిరిగే ఆటోలను సైతం క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. కేంద్ర బలగాలు, రాష్ట్ర బలగాలు, రెవెన్యూ శాఖలు సంయుక్తంగా ఈ చెక్‌పోస్టుల తనిఖీల్లో పాలుపంచుకుంటున్నారు. ప్రతీ చెక్‌పోస్టులో ఒక ఎస్‌ఐ లేదా ఏఎస్ఐ విధుల్లో ఉండేలా చూస్తున్నారు. గ్రామానికి ఎనిమిది మంది పోలీసులు ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేశారు.