గాజాపై దాడి ఇజ్రాయెల్ కొంప ముంచనుందా..?

0
107

హమాస్ – ఇజ్రాయెల్ యుద్దం గత 11 రోజులుగా నిర్విరామంగా కొనసాగుతూనే ఉంది. అయితే హమాస్ తన యుద్దాన్ని కాస్త నెమ్మదింపజేసినట్లు తెలుస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో హమాస్ చేసిన దాడికంటే ఇజ్రాయెల్ సృష్టించిన మారణహోమమే అధికంగా కనిపిస్తోంది. ఇది ఇలాగే జరిగితే రానున్న రోజుల్లో భౌతికంగా, రాజకీయంగా, సైనికదళాల పరంగా తీవ్ర నష్టం కలిగే అవకాశం ఉంది. హమాస్ చేసిన చాటు యుద్దానికి ప్రతీకగా ఆ ప్రాంతంపై దండయాత్ర చేపట్టింది. అయితే ఇద్దరు కొట్టుకుంటే యుద్దం.. ఒకడిపై పడిపోతే దండయాత్ర అంటారు. అది ఇజ్రాయెల్ దండయాత్ర అని నిపుణులు అంటున్నారు. ఈ వాతావరణం ఇలాగే కొనసాగితే అంతర్జాతీయంగా ఇజ్రాయెల్ కు భారత్ సహా ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, అమెరికా అగ్రదేశాలు మద్దతు ప్రకటించాయి. ఈ మద్దతు ఉపసంహరించుకునే ప్రమాదం ఉంది.

దీనికి కారణం ఇజ్రాయెల్ చేసిన దాడుల కారణంగా గాజాలోని అమాయక ప్రజలు తమ ఇళ్లను కోల్పోయి నిర్వాసితులు అయ్యారు. పైగా కూటికి కూడా గతిలేని దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఒకరి కోసం మరొకరిని బలిపెట్టడం అనేది ప్రపంచ దేశాలు అంగీకరించవు. దీంతో ఇజ్రాయెల్ మానవత్వాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. ఇదే గనుక జరిగితే ఆర్థికంగా, సాంకేతికంగా చాలా దెబ్బతినే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు. ఎందుకుంటే ఆ దేశంతో దాదాపు చాలా వరకూ సత్సంబంధాలను తెంచుకునేందుకు మిగిలిన దేశాలు ప్రయత్నిస్తాయి. దీంతో దౌత్యం రద్దయి ఎగుమతులు, దిగుమతులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. సాంకేతికంగా ఐటీ సంస్థలు తమ ప్రాజెక్టులను ఇతర దేశాలకు కట్టబెట్టే అవకాశం ఉంది. దీంతో ఆదాయం క్షీణించి దేశాభివృద్దిని కోల్పోయే ప్రమాదం ఉందని భావిస్తున్నారు.

ఇజ్రాయెల్ తమకున్న మూడు లక్షల మంది రిజర్వుడ్ బలగాలను గాజా సరిహద్దుల్లోకి తరలించింది. దీంతో పాటు 1.70 లక్షల మంది సైనికులను కూడా అక్కడకు పంపించింది. దీనికి కారణం హమాస్ కు ఆశ్రయం కల్పిస్తున్న గాజాను ఆక్రమించుకోవడమే లక్ష్యంగా పావులు కదుపోతోంది. అటు హామాస్ సైన్యాన్ని లెక్కలోకి తీసుకుంటే కేవలం 30,000 మంది మాత్రమే ఉన్నారు. అంటే ఇజ్రాయెల్ రిజర్వుడు బలగాల్లో కేవలం 10 శాతం అన్నమాట. పైగా వీరి వద్ద వైమానిక దళాలు, యుద్ద ట్యాంకులు లేని పరిస్థితి. దీంతో గాజాను ఆక్రమించుకుని హమాస్ ను మట్టుపెట్టాలని ఇజ్రాయెల్ భావిస్తోంది.

ఇదిలా ఉంటే హమాస్ కు ఉన్న సొరంగ మార్గాల ద్వారా గాజా పై దాడులను సులభంగా తిప్పికొట్టగలదు. పైగా ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగి ఉన్న నగరాల్లో గాజా ఒకటి. హమాస్ సైనికులు అడిగితే గాజా వాసులు తమ ఇళ్లను ఆవాసాలుగా ఇచ్చేందుకు వెనుకాడరు. దీంతో గాజాలోని ప్రతి ఇల్లు హమాస్ సైనికులకు రక్షణ కవచంలాగా మారుతుంది. దీనిని ఆసరాగా చేసుకుని ఇజ్రాయెల్ సైనికులు చొరబడే ప్రాంతాల్లో మందు పాతరలను ఏర్పాటు చేస్తే.. వాటిని దాటుకుని గాజా ప్రాంతాన్ని ఆక్రమించుకోవడం కష్టమౌతుంది. పైగా ఇజ్రాయెల్ రిజర్వుడు బలగాలు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. దీంతో తమ దేశ సైనిక బలగాలను ఇజ్రాయెల్ కోల్పోవల్సి వస్తుంది. బహుశా ఇలా భావించే ఉత్తర గాజాలోని ప్రజలను ఖాళీ చేయాలని ఇజ్రాయెల్ హెచ్చరిస్తోంది.

ఇలాంటి భిన్నమైన ఉపద్రవాలతో కూడిన పరిస్థితులను అంచనా వేయకుండా రంగంలోకి దిగితే ఇజ్రాయెల్ తీవ్రంగా నష్టపోక తప్పదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పైగా ఇది హమాస్ వేసిన ట్రాప్లో పడి తన దేశ సైనిక బలగాలను కోల్పోవడంతో పాటూ ఆర్థికంగా, సామాజికంగా నష్టపోవడమే అని మరో విశ్లేషకుడు అభిప్రాయపడ్డాడు. అయితే హమాస్ తనపై దొంగదెబ్బ తీసిందని భావించి ఇజ్రాయెల్ ఎదురుదాడికి దిగితే యుద్దం ఇప్పట్లో చల్లారేది కాదు. సుదీర్ఘ కాలం చాలా మంది ప్రాణాలను కోల్పోవల్సి వస్తుంది. దీంతో తీవ్ర స్థాయిలో రక్తపాతం సంభవించే అవకాశం ఉంది. ఈ పరిస్థితులు తన రాజకీయ భవిష్యత్తకే ప్రశ్నార్థకంగా మారుతుంది. ఈ విషయాన్ని ఆ దేశ ప్రధాని నెతన్యాహు గమనించాలి అంటున్నారు. లేకుంటే గతంలో అఫ్గానిస్తాన్ – అమెరికా 20 ఏళ్ల యుద్ద పరిస్థితులు పునరావృతం అవుతాయని నిపుణులు చెప్తున్నారు.

ఈ నేపథ్యంలోనే ఇజ్రాయెల్, హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధంలో అమెరికా యూటర్న్ తీసుకుంది అంటున్నారు. యుద్ధం ప్రారంభమైన నాటి నుంచి ఇజ్రాయెల్ కు పూర్తి మద్దతు ఇస్తూ వచ్చిన బైడెన్.. సడెన్ గా మాట మార్చారు. ఇజ్రాయెల్ క్రూర చర్యలకు దిగుతోందని, గాజాను ఇజ్రాయెల్ తిరిగి స్వాధీనం చేసుకోవడం పెద్ద తప్పంటూ అమెరికా అధ్యక్షుడు హెచ్చరించారు. హమాస్‌ను నాశనం చేయాలని, అయితే పాలస్తీనా రాజ్యానికి కూడా ఒక మార్గం ఉండాలని బిడెన్ అన్నారు. ఇజ్రాయెల్ సైన్యం గాజా సరిహద్దు వెంబడి ట్యాంకులను మోహరించింది. తీవ్రవాద సమూహాన్ని నిర్మూలించడానికి భారీ ఆపరేషన్ ఉంటుందని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ ప్రకటించారు. ఇజ్రాయెల్ భారీ వైమానిక దాడులు మొత్తం గాజా స్ట్రిప్‌ను నాశనం చేశాయి.

అయితే హమాస్‌పై జరుగుతున్న యుద్ధంలో ఇజ్రాయెల్‌కు అమెరికా మొదటి నుంచి మద్దతు వచ్చింది. దీనికి ముందు, ఇజ్రాయెల్‌కు మద్దతు తెలిపేందుకు అమెరికా తన రెండు యుద్ధనౌకలను ఇజ్రాయెల్ సముద్ర సరిహద్దు సమీపంలోకి పంపింది. అనేక యుద్ధ విమానాలను పంపేందుకు కూడా ప్రణాళిక రూపొందించారు. కానీ ఇప్పుడు గాజాను ఆక్రమించకూడదని ఇజ్రాయెల్‌కు అధ్యక్షుడు జో బిడెన్ స్వయంగా చేసిన ప్రకటన ఆసక్తిని రేపుతోంది. మధ్యప్రాచ్య దేశాల ప్రయోజనాల కోసం ఆయన ఇలా చేస్తున్నాడా అనే అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఇక అమెరికా వైట్‌హౌస్ జాతీయ భద్రతా సలహాదారు జేక్ సుల్లివన్ మాట్లాడుతూ, ఈ వివాదం తీవ్రతరం కావడం, ఉత్తరాన రెండవ ఫ్రంట్ తెరవడం వల్ల యుద్ధంలో ఇరాన్ ప్రమేయం ఉండే ప్రమాదం ఉందని చెప్పారు. అలాగే అంతకుముందు అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ కూడా జోర్డాన్‌లోని అమ్మన్‌లో పాలస్తీనా అథారిటీ చీఫ్ మహమూద్ అబ్బాస్‌ను కలిశారు.

ఇక డ్రాగన్ దేశం కూడా ఇజ్రాయెల్ దాడిని వ్యతిరేకిస్తోంది. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ మాట్లాడుతూ గాజాలో ఇజ్రాయెల్ సైనిక చర్యలు ఆత్మ రక్షణ పరిధిని మించి ఉన్నాయని అన్నారు. ఇజ్రాయెల్ ప్రభుత్వం గాజా ప్రజలపై సామూహిక శిక్షను నిలిపివేయాలని ఆయన అన్నారు. ఇజ్రాయిల్-హమాస్ వ్యవహారం పెద్ద యుద్ధంగా విస్తరించకుండా ఉండేందుకు అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్ చైనా సహకారాన్ని కోరిన ఒక రోజు తర్వాత చైనా ఈ వ్యాఖ్యలు చేసింది. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ, సౌదీ అరేబియా విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్ తో మాట్లాడారు. పరిస్థితి తీవ్రతరం చేయడానికి అన్ని పక్షాలు ఎలాంటి చర్యలు తీసుకోకూడదని, వీలైనంత త్వరగా చర్చలు జరపాలని వాంగ్ యీ సూచించారు. ఈ వివాదాన్ని ముగించడానికి, కాల్పుల విరమణ, శాంతి చర్చల కోసం చైనా రాయబారి జై జున్ వచ్చే వారం మిడిల్ ఈస్ట్ సందర్శించనున్నారు. ఈ వివాదాన్ని పరిష్కరించడానికి ‘టూ స్టేట్ పాలసీ’ కోసం చర్చలు ప్రారంభించాలని, ఐక్యరాజ్యసమితి తన పాత్ర పోషించాలని కోరాడు.

ఇటు హమాస్ దాడిని చైనా ఖండిచకపోవడంపై ఇజ్రాయిల్ తీవ్ర నిరాశ వ్యక్తం చేసింది. అటు పాలస్తీనా మిలిటెంట్ గ్రూపు హమాస్‌ని అంతం చేయాలన్న లక్ష్యంతోనే దూసుకుపోతున్న ఇజ్రాయెల్‌కు ఇరాన్ మరో వార్నింగ్ ఇచ్చింది. పాలస్తీనియన్లపై దురాక్రమణలకు తక్షణమే ముగింపు పలకాలని, లేకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని గట్టి హెచ్చరిక జారీ చేసింది. గాజాలో ఇజ్రాయెల్ దురాక్రమణను ఆపకపోతే, ఈ ప్రాంతంలోని అన్ని దేశాల చేతులు ట్రిగ్గర్‌పైనే ఉన్నాయంటూ ఇరాన్ విదేశాంగ మంత్రి హుస్సేన్ అమిరబ్దుల్లాహియన్ హెచ్చరించారు.

ఇదే సమయంలో ఇజ్రాయెల్‌కు మద్దతు తెలిపిన అమెరికాపై కూడా ఆయన మండిపడ్డారు. ప్రస్తుతం హమాస్, ఇజ్రాయెల్‌కు మధ్య నెలకొన్న యుద్ధ పరిస్థితుల్ని నియంత్రించడానికి ఎవరూ హామీ ఇవ్వలేరని.. అలాగే.. ఈ ఘర్షణలు ఇతర ప్రాంతాలకు విస్తరించకుండా చూస్తామని కూడా ఏ ఒక్కరూ భరోసా కల్పించలేరన్నారు. ఈ యుద్ధాన్ని, సంక్షోభాన్ని నిరోధించే ఆసక్తి కలిగి ఉన్నవారు.. గాజా పౌరులపై జరుగుతున్న అనాగరిక దాడులకు వ్యతిరేకంగా ముందుకు రావాల్సిన అవసరం ఉందని అమెరికాను ఉద్దేశిస్తూ హుస్సేన్ పరోక్ష విమర్శలు చేశారు. మొత్తానికి ఇజ్రాయెల్ కు మద్దతుగా నిలిచిన అమెరికా యూటర్న్ తీసుకోవటం.. చైనా ఇజ్రాయెల్ దాడిని వ్యతిరేకించటం.. ఇరాన్ యుద్ధ సంకేతాలు ఇవ్వడం చూస్తుంటే ఇజ్రాయెల్ కు రానున్న రోజుల్లో ఇతర దేశాల నుంచి వ్యతిరేకత అధికం అయ్యే అవకాశాలు ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

16 + nine =