బీజేపీ ఎంపీగా కొనసాగుతా..!

బెంగాల్ బీజేపీ నేత బాబుల్ సుప్రియో ఇటీవల రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. తన సోషల్ మీడియా ఖాతాలో పెద్ద లేఖను కూడా ఉంచారు. తాను ఏ రాజకీయ పార్టీలోకి వెళ్లబోవడంలేదని, టీఎంసీ, కాంగ్రెస్, సీపీఎం, మరే ఇతర పార్టీ కూడా తనను ఆహ్వానించలేదని అన్నారు. తాను కూడా ఏ పార్టీలోనూ చేరట్లేదని తెలిపారు. ఎక్కడైనా గానీ, ఒకరు సామాజిక సేవ చేయాలంటే రాజకీయాల్లోనే ఉండాల్సిన అవసరం లేదని సుప్రియో చెప్పుకొచ్చారు. రాజకీయాల్లో ఉండి సామాజిక సేవ చేయడం అసాధ్యంగా భావిస్తున్నానని తెలిపారు. రాజకీయాల్లో చురుకుగా ఉండకుండా సామాజిక సేవ కూడా చేయవచ్చని నేను అర్థం చేసుకున్నాను. నన్ను నేను కొద్దిగా కుదుటపడనివ్వండి. నేను నా పార్లమెంటు సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నాను. ఇదే విషయమై నేను హోంమంత్రి అమిత్ షా మరియు బీజేపీ అధ్యక్షుడు జెపి నడ్డాకు తెలియజేశాను. అయితే, ఈ నిర్ణయాన్ని పునః పరిశీలించాలని వారు నన్ను మళ్లీ మళ్లీ కోరారు అంటూ బాబుల్ సుప్రియో కొద్దిరోజుల కిందట చెప్పుకొచ్చారు.
బీజేపీ నేతల సూచనల మేరకు బాబుల్ సుప్రియో తన మనసును మార్చుకున్నట్లు తెలుస్తోంది. తాను ఎంపీగా కొనసాగుతానని బాబుల్ సుప్రియో వెల్లడించారు.పశ్చిమ బెంగాల్ లోని అసన్ సోల్ నియోజకవర్గం నుంచి రాజ్యాంగబద్ధమైన ఎంపీ పదవిలో కొనసాగుతానని వివరించారు. ఒకవేళ అక్కడ కూడా రాజకీయాలు ఉంటే ఎంపీ పదవి నుంచి తప్పుకుంటానని అన్నారు. తాను మరే ఇతర రాజకీయ పార్టీలో చేరబోనని మరోసారి స్పష్టం చేశారు. త్వరలోనే ఢిల్లీలోని అధికారిక బంగ్లాను ఖాళీ చేస్తానని, భద్రతా సిబ్బందిని కూడా పంపించివేస్తానని బాబుల్ సుప్రియో వెల్లడించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అనంతరం సుప్రియో ఈ వ్యాఖ్యలు చేశారు.
2014 లో లోక్ సభ ఎన్నికలకు ముందు బాబుల్ సుప్రియో బీజేపీలో చేరారు. పశ్చిమ బెంగాల్ అసన్ సోల్ నియోజకవర్గం నుండి ఎన్నికయ్యారు. అతను 2019 లో అసన్సోల్ నుండి మళ్లీ గెలిచారు.