Right Angle

ప్రవీణ్ కుమార్ వ్యూహమేంటి..?

అజిత్ జోగీ నుండి అరవింద్ కేజ్రివాల్ వరకూ, హర్దీప్ సింగ్ పూరీ మొదలు అల్పోన్స్ కన్నంతనమ్ వరకూ చాలా మంది ఐఏఎస్, ఐఎఫ్ఎస్, ఐపీఎస్ అధికారులు రాజకీయ తీర్థం పుచ్చుకుని రాజ్యాధికారంలో భాగమయ్యారు. జాతీయ పార్టీలైన.. కాంగ్రెస్, బీజేపీ మొదలు అనేక ప్రాంతీయ పార్టీల్లో బ్యూరోక్రాట్లు కీలక పాత్ర పోషిస్తున్నారు. అధికారపు ఆనుపానులు తెలిసిన ఆఫీసర్లు, పాలనాయంత్రాంగంలోని లొసుగులూ, లోటుపాట్ల గురించి అవగాహన ఉన్న అధికారులను రాజకీయ పార్టీలు కండువా కప్పి సంతోషంగా ఆహ్వానిస్తాయి.

తాజాగా తెలంగాణ రాజకీయాల్లోకి ఐపీఎస్ అధికారి ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ తన 6 ఏళ్ల ఉద్యోగ జీవితాన్ని స్వచ్చందంగా వదులుకున్నారు. పూర్తి స్థాయి రాజకీయాల్లోకి ప్రవేశించారు. బహుజన్ సమాజ్ పార్టీ  పగ్గాలు చేపట్టారు. బహుజనవాద రాజకీయాలు ఉత్తరాదిలో అనేక విజయాలను నమోదు చేశాయి.

దేశంలోనే అతిపద్ద రాష్ట్రం-ఉత్తర ప్రదేశ్ లో సరికొత్త ఫార్ములాతో 4 సార్లు అధికార పగ్గాలు చేపట్టింది కాన్షీరాం-మాయావతి నేతృత్వంలోని బహుజన్ సమాజ్ పార్టీ. సామాజిక వర్గాల ప్రాబల్యం ప్రాతిపదికన ఒక రాజకీయ పార్టీ స్థాపించి, ఎన్నికల గోదాలోకి దిగి, ఆశ్చర్యపోయే విజయాన్ని సొంతం చేసుకుంది బహుజన్ సమాజ్ పార్టీ. భారతదేశ రాజకీయ చరిత్రలో బీఎస్పీ ఎన్నికల ఫార్ములాకు విశిష్ఠమైన స్థానం ఉంది.

కులబలమే ప్రాతిపదికన స్థాపించిన పార్టీలు మనదేశంలో ఎనభయ్యో దశకం వరకూ లేవనే చెప్పాలి. కులవాద వ్యతిరేక పార్టీలు, కుల వ్యతిరేక పార్టీలు, లేదా జాతీయవాదం, ప్రగతిశీలవాదం పేరిట ప్రయాణం ఆరంభించి చివరకు కులవాదంలోనో, కుటుంబ రాజకీయాలతోనో ముగిసిన, కొనసాగుతున్న పార్టీలు అనేకం ఉన్నాయి.

అసలు భారత దేశంలో కులవాద పార్టీల ఆవిర్భావం ఎప్పుడు జరిగింది? బీసీ,ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ప్రజలను ఏకం చేసి ఒక రాజకీయ నినాదాన్ని సృష్టించాల్సిన అగత్యం కాన్షీరాంకు ఎందుకు వచ్చింది? మాజీ ఐపీఎస్ అధికారి ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ తెలంగాణ రాజకీయాల్లో సక్సెస్ అవుతారా?

బీఎస్పీ తరహా రాజకీయం తెలంగాణ సమాజంలో చెల్లుబాటు అవుతుందా? కేసీఆర్ ను ఎదుర్కునేందుకు ప్రవీణ్ కుమార్ ఎలాంటి వ్యూహాన్ని అనుసరించబోతున్నారు? కంచన్ చంద్ర రాసిన ‘‘Why Ethnic Parties Succeed: Patronage and Ethnic Headcounts in India’’ పుస్తకం లో ఏముంది?

ఇలాంటి ఆసక్తికరమైన అంశాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

‘బహుజన’ అనే పాళీభాషా పదాన్ని స్వీకరించి, ఈ దేశ జనాభాలో మెజారిటీగా ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మత మైనారిటీలను ‘బహుజనులు’గా సూత్రీకరిస్తూ సరికొత్త రాజకీయ సిద్ధాంతాన్ని రూపొందించారు కాన్షీరాం. బౌద్ధ తాత్వికత, జ్యోతీబాఫూలే సామాజిక న్యాయసిద్ధాంతం, అంబేద్కర్ ప్రజాస్వామిక రాజకీయ విలువల… ప్రాతిపదికన ఏర్పడిన బహుజన్ సమాజ్ పార్టీ; కాంగ్రెస్, బీజేపీ లాంటి అతిపెద్ద రాజకీయ పార్టీలకు అనేక సవాళ్లు విసిరింది.   

కులాల ప్రస్తావన లేకుండా ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాజకీయాలను చర్చించే పరిస్థితి లేదు. రెండు రాష్ట్రాల్లో చాలా కులాలున్నాయి. బ్రిటిష్ పాలన కాలం నుంచి స్వాతంత్ర్యం వచ్చిన తొలినాళ్ల వరకూ ఓ రకంగా, ఆ తర్వాత 80ల వరకూ మరో రకంగా, అప్పటి నుంచి రాష్ట్ర విభజన వరకూ ఇంకో విధంగా తెలుగు నేలపై కుల రాజకీయాలు ప్రభావం సాగింది.

తెలుగునాట కులాలవారీగా రాజకీయ బలాన్ని విశ్లేషించాలంటే నిజానికి 11వ శతాబ్దం కాకతీయుల పతనం నుంచీ మొదలుపెట్టాలి. అంత గతాన్ని తవ్వకుండా, బ్రిటిష్ హయాంలో జరిగిన ఎన్నికలను గమనించినా ఆంధ్ర ప్రాంతంలో కుల రాజకీయాల ముద్ర స్పష్టంగా కనిపిస్తుంది. ఆ సమయంలో తెలంగాణ నిజాం పాలనలో ఉండడంతో కులాల ప్రత్యక్ష పెత్తనాలు లేవు. పరోక్షంగా బ్రాహ్మణ, వెలమ, రెడ్డి కులాల ఆధిపత్యం ఉండేది. కానీ వారి ఆధిపత్యం ముస్లిం నవాబులకు లోబడి ఉండేది. ఆంధ్రలో పరిస్థితి విభిన్నం. ఎన్నికల రాజకీయాలు బలంగా ఉండేవి.

ఉత్తర భారత రాజకీయాలు అందుకు భిన్నం. 1977లో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ ఎత్తివేసిన తర్వాత  కులరాజకీయాల ప్రస్థానం మొదలైంది. ఆయా రాష్ట్రాల్లోని సామాజిక, సాంస్కృతిక వాతావరణం కారణంగా, భూ యాజమాన్యంలో అసమానతల కారణంగా సామాజిక వర్గాల ప్రాబల్య రాజకీయాలు వేళ్లూనుకున్నాయి. అయితే ఈ తరహా రాజకీయాలు ఎక్కువ కాలం నిలదొక్కుకోలేకపోవడానికీ నిర్దిష్టమైన కారణాలున్నాయి. ఆశ్చర్యకరంగా కులాల ప్రాతిపదికన ఏర్పడిన బీఎస్పీ ఉత్తర, మధ్య భారత రాజకీయాల్లో నిర్ణయాత్మక పాత్ర పోషించినా దక్షిణాదిలో మాత్రం పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది.

ఎనభయ్యో దశకం పూర్వర్ధంలో పురుడుపోసుకుని, తొంభయ్యో దశకంలో దేశ రాజకీయాల్లో సంచలనాలకు కారణమైన బీఎస్పీ ఆ తర్వాత క్రమంగా తన ప్రాబల్యాన్ని కోల్పోయింది. దశాబ్దన్నర కాలంగా ఓట్ల శాతంలో తన ప్రభావాన్ని నెరపుతున్న బీఎస్పీ అధికారం అంచులకు వెళ్లలేకపోతోంది. సామాజిక వర్గాల ప్రాబల్య నమూనా ప్రాసంగీతను కోల్పోయింది. సరిగ్గా ఇలాంటి సందర్భంలో మాజీ ఐపీఎస్ అధికారి ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ బీఎస్పీలో చేరడం తెలంగాణలో కొత్త రాజకీయ సమీకరణకు కారణమవుతుందా అన్న ఆసక్తికరమైన చర్చ మొదలైంది.

ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ వద్ద కేసీఆర్ లాంటి కుటిల రాజకీయనేతను, ఏళ్లుగా వేళ్లూనుకున్న కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనే వ్యూహమేదైనా ఉందా? టీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు పార్టీలు ప్రాంతీయ అభివృద్ధి, జాతీయభావనల గురించి ఎన్ని చెప్పినా అవి మనుగడ సాగిస్తున్నది సామాజిక వర్గాల సంతృప్తీకరణ పునాదిపైనే అన్నది జగమెరిగిన సత్యం.

మరోవైపు భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా వ్యూహాత్మక దృష్టితో విస్తరణ ఎత్తుగడలను రచిస్తూ దక్షిణాదికి వ్యాపిస్తోంది. ఇలాంటి క్లిష్ట రాజకీయ సన్నివేశంలో ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ ఏం చేయబోతున్నారు? ‘దళిత’ ముద్ర ఉన్న ప్రవీణ్ కుమార్ బీసీలతో మమేకం అయ్యేందుకు ఎలాంటి వ్యూహం అనుసరిస్తారు? మత మైనారిటీలు సులభంగా సహకరించినా అధికార పీఠాన్ని చేజిక్కించుకోవడం అసాధ్యం కదా? అనే అనుమానాలూ రాజకీయ ఆవరణలో వ్యక్తమవడం సహజం.

తెలంగాణలో బీసీ జనాభా 51.08 శాతం అంటే కోటీ 85లక్షల 61వేల 856 మంది ఉన్నట్టూ సకలజనుల సర్వే తేల్చింది. 112 బీసీ కులాల మొత్తం జనాభా ఇది. 2011 జనాభా లెక్కల్లో తెలంగాణలోని ఎస్సీల జనాభా 15.44%గా నమోదు కాగా, 2014లో నిర్వహించిన సర్వేలో అది 17.50% శాతమని తేలింది. ఉమ్మడి రాష్ట్రంలో ఎస్సీలలో 62 ఉప కులాలుండగా, తెలంగాణలో అవి 56 ఉప కులాలకు తగ్గాయి.

మొత్తం ఎస్సీల జానాభా 63,60,158 – 17.50%. 2011 లెక్కల్లో గిరిజన జనాభా 9.34%గా ఉండగా, సర్వేలో అది 9.91%గా నమోదయింది. ఉమ్మడి రాష్ట్రంలో 36 గిరిజన తెగలుండగా, తెలంగాణలో 16 గిరిజన తెగలు మాత్రమే ఉన్నాయి.

తెలంగాణ పది జిల్లాల్లో గుంటెడు సాగు భూమి కూడా లేని కుటుంబాల సంఖ్య 69.19 లక్షలు. మొత్తం కుటుంబాలు 1,01,93,027. అంటే సాగు భూమి 31 శాతం మందికే పరిమితమైందని తేలింది. వీరిలో ఎకరం కంటే తక్కువ భూమి ఉన్న కుటుంబాలు 9.67 లక్షలు. ఒకటి నుంచి రెండెకరాలలోపు 6.83 లక్షలు, 2-3 ఎకరాల మధ్య 5.73 లక్షలు, 3-4 ఎకరా మధ్య 3.62 లక్షలు, 4-5 ఎకరాల మధ్య ఉన్న కుటుంబాలు 3 లక్షలున్నాయి.

గ్రేటర్‌ హైదరాబాద్‌లో యాదవుల జనాభా 13 నుంచి 14 శాతం ఉంటుందని అంచనా. 2010లో గ్రేటర్‌ పరిధిలో 14 లక్షల పైచిలుకు యాదవులు ఉన్నట్టు తేలింది. 12.7 శాతం ఉన్న ముస్లీం జనాభా సమారు 53 నియోజకవర్గాల్లో ప్రభావాన్ని చూపుతారు. హైదరాబాద్‌లోని 14 శాసనసభ నియోజకవర్గాల్లో ముస్లిం ఓట్లు గరిష్ఠంగా 80 శాతం నుంచి కనిష్ఠంగా 13 శాతం వరకు ఉన్నాయి. ఇదీ స్థూలంగా తెలంగాణ ‘బహుజన జనాభా చిత్రం’. ఏ వ్యూహాలు రచించినా ఈ గణాంకాలనే ప్రాతిపదికగా చేసుకోవాలి.

కేవలం ఒక్క హుజురాబాద్ ఉప ఎన్నిక విషయంలోనే కేసీఆర్ ఊహకందని అబద్ధపు హామీల వర్షం కురిపించారు. ఈ హామీలన్నీ కేవలం దళిత ఓటర్లను ఆకర్షించేందుకే అని స్పష్టంగానే అర్థమవుతోంది. దళిత బంధు, దళిత బీమాతో పాటు సింగరేణి కార్మికుల పదవీ విరమణ వయసు పెంపు, హుజురాబాద్ టీఆర్ఎస్ నేతకు ఎస్సీ కార్పొరేషన్ పదవి లాంటి హామీలు ఉదారంగా ఇచ్చేశారు. హుజురాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్ లో 45వేల దళిత ఓటర్లను దృష్టిలో ఉంచుకుని సరికొత్త పతకాలను ప్రవేశపెట్టారు. భవిష్యత్తులో వాటి అమలు ఎలా ఉన్నా తాత్కాలిక అవసరాలను ఇలాంటి హామీలు నెరవేర్చడం తథ్యం.

ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ అనే సరికొత్త రాజకీయ నాయకుడికి కేసీఆర్ ను ఎదిరించి ఎన్నికల్లో విజయం సాధించాలనే పట్టుదల ఉందా లేదా రాబోయే ఎన్నికల్లో కేసీఆర్ కు చేదోడువాదోడుగా ఉండాలన్న దీర్ఘకాలిక ప్రణాళిక ఉందా అనే అనుమానాలు లేకపోలేదు.

ఈ శంకకు కారణాలూ లేకపోలేదు. కేసీఆర్ లాంటి నేతను ఎదుర్కోవడం కన్నా బార్గెయినింగ్ కెపాసిటీ పెంచుకునే పద్ధతి ఆశ్రయించడం మేలని ప్రవీణ్ కుమార్ భావించినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు.

ఉత్తరాదిలో బీఎస్పీ రాజకీయ క్షేత్రంలోకి వచ్చిన తర్వాత ప్రధానంగా కాంగ్రెస్ కు పోటీదారుగా నిలించింది. స్వాతంత్ర్యం తర్వాత దళిత ఓట్లను తన ఖాతాలో వేసుకున్న కాంగ్రెస్ పార్టీకి బీఎస్పీ రూపంలో వచ్చిన ప్రమాదాన్ని తట్టుకోవడం క్లిష్టంగానే మారింది. పంజాబ్ లో కాంగ్రెస్ దెబ్బతినడానికి చమార్ ఓట్లు బీఎస్పీ వైపు మళ్లడమే అంటారు కంచన్ చంద్ర తన ‘‘Why Ethnic Parties Succeed: Patronage and Ethnic Headcounts in India’’ పుస్తకంలో. యూపీ, పంజాబ్, మధ్య ప్రదేశ్ రాష్ట్రాల్లో కొన్ని స్థానాలను కైవసం చేసుకుంది. ఎక్కువ రాష్ట్రాల్లో ఓట్ల శాతాన్ని గణనీయంగా పెంచుకుని ఫలితాలను ప్రభావితం చేసింది. అయితే దక్షిణాదిలోని కర్ణాటకలో పెద్దగా ప్రభావం చూపలేకపోయిందంటారు కంచన్ చంద్ర.

కంచన్ చంద్ర పుస్తకాన్ని సాంతం పరిశీలిస్తే భారతదేశ ఎన్నికల రాజకీయాల్లో స్థిరమైన ఫార్ములా అన్నది అసాధ్యమని తేలుతుంది. అది సామాజిక వర్గాల ప్రాబల్య సమీకరణ అయినా సరే విజయాన్ని ఖరారుగా చెప్పే సూత్రీకరణ లేదని అర్థమవుతుంది.

ఈ నేపథ్యంలో ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ రాజకీయ వ్యూహం గురించి కొన్ని ఆసక్తికరమైన అంచనాలు వేయవచ్చు. దేశంలో పెరుగుతున్న బీజేపీ ప్రాబల్యాన్ని నిలువరించేందుకు ఏఐఎంఐఎం ముస్లీం ఓట్లను తన ఖాతాలో వేసుకుంటూ కాంగ్రెస్ ను నిలువరిస్తోంది కానీ, ఈ మజ్లీస్ ఓట్ల చీలిక వల్ల పరోక్షంగా బీజేపీ ప్రయోజనం పొందుతోంది. బీజేపీ విజయాలను కట్టడి చేయాలంటే దేశవ్యాప్తంగా ఉన్న దళిత, బీసీ ఓట్లను చీల్చడం ఒకానొక మార్గమని ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ లేదా ఆయన వెనుక ఉన్న శక్తులు అంచనాకు వచ్చి ఉండవచ్చు.

తెలంగాణకే పరిమితమై ఒక చిత్రాన్ని ఊహిస్తే….రాబోయే ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు టీఆర్ఎస్ కు గట్టి పోటీ ఇచ్చే అవకాశాలూ లేకపోలేదు. నిజంగానే అలాంటి సందర్భం తారసపడితే కేసీఆర్ ఎన్ని ఎత్తుగడలు వేసినా విజయం సునాయాసంగా దరిచేరదు. కాంగ్రెస్, బీజేపీలను ఎదుర్కోవాలంటే ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ లాంటి ఓ దళిత అదికారి-వ్యూహాత్మక అంశాలూ, పాలనా వ్యవహారాలు తెలిసిన బ్యూరోక్రాట్ మరోవైపు నుంచి వైరి మైదానాన్ని చదును చేయడం అవసరమని కూడా భావించి ఉండవచ్చు.

మొత్తంగా ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ ప్రధాన లక్ష్యం కేవలం తెలంగాణ రాజకీయాల్లో మెరుగైన ఫలితాల సాధించడమో, అధికారం చేపట్టడమో కాదు, దేశవ్యాప్తంగా బీజేపీ దూకుడును నివారించడమే ధ్యేయంగా మైదానంలోకి వచ్చినట్టూ స్పష్టంగానే అర్థమవుతోంది.

ఏదేమైనా ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ లాంటి మాజీ ఐపీఎస్ అధికారి, వ్యూహం-ఎత్తుగడలు తెలిసినవాడూ, నేతల లోగుట్టు పసిగట్టగల నిష్ణాతుడూ రాజకీయాల్లోకి రావడం, మరీ ముఖ్యంగా అణగారిన దళితులకు గొంతుకగా మారతానని చెప్పడం ఆహ్వానించదగిన పరిణామం. అయితే ఈ రాజకీయ ప్రవేశం…ఇతరుల అధికారాన్ని కాపాడే ప్రణాళికలో భాగమే అయితే…అది రాజకీయాలకూ, దళితులకూ ఉభయ పక్షాలకూ శ్రేయస్కరం కాదు.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

1 × four =

Back to top button