More

  మోదీ విశాఖ టూర్..! ఎఫెక్ట్ ఏ రేంజిలో ఉండబోతుందో తెలుసా..?

  ప్రధాని మోదీ మాకు ఏమీ చేయట్లేదు. మన దేశంలో ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, ఇతర నాయకుల నుంచి వినిపించే మాట ఇది. అందుకు మన తెలుగు రాష్ట్రాలు కూడా అతీతం కాదు. ముఖ్యంగా రాజధాని లేని ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఈ మాటలు ఎక్కువగా వినిపిస్తాయి. ఈ విషయంలో తెలుగు మీడియా వాయిస్ కూడా ఎక్కువగానే రైజ్ చేస్తుంది. మరి, నిజంగానే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను పట్టించుకోవడం లేదా..? విపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలను మోదీ గాలికొదిలేస్తున్నారా..? ఓసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పనిలో పనిగా.. పవన్ ఏ దారి ఎంచుకుంటారో చూద్దాం. ఎందుకంటే, ప్రధాని మోదీ విశాఖ టూర్ లో పవన్ కళ్యాణ్ తో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. దీంతో వీరిద్దరి భేటీ ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.

  ప్రధాని మోదీ ఏపీ పర్యటనలో 15 వేల కోట్ల అభివృద్ది పనులకు ప్రారంభోత్సవాలు, మరికొన్నింటికి శంకుస్థాపనలు చేయనున్నారు. వీటిలో గ్రీన్‎ఫీల్డ్ రాయ్‎పూర్-వైజాగ్ ఎకనమిక్ కారిడార్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఛత్తీస్ గడ్, ఒడిశా నుంచి వైజాగ్ వరకు 3 వేల 750 కోట్లతో ఈ ఎకనమిక్ కారిడార్ ను కేంద్రం అభివృద్ది చేయనుంది. దీంతో ఈ ప్రాంతంలో పలు మౌలిక సదుపాయాలు అభివృద్ది చేయబడతాయి. ఈ కారిడార్ వల్ల ఛత్తీస్ గఢ్, ఒడిశా రాష్ట్రాల నుంచి విశాఖపట్నం పోర్టుకు కనెక్టివిటీ పెరుగుతుంది. దీంతో వైజాగ్ పోర్టులకు సరుకురవాణా పెరిగే అవకాశం ఉంది. ఈ ఎకనమిక్ కారిడార్ తో పాటు విశాఖలో ‘ఓఎన్జీసీ-యూ ఫీల్డ్’ ను ప్రధాని జాతికి అంకితం చేయబోతున్నారు. ఈ ‘యూ ఫీల్డ్’ ను కేంద్ర ప్రభుత్వం 2,900 కోట్లతో అభివృద్ది చేసింది. దీనివల్ల ఇప్పటివరకు ఉన్న గ్యాస్ ఉత్పత్తి సామర్థ్యం మరింత పెరిగి,.. రోజుకు మూడు మిలియన్ మెట్రిక్ టన్నులకు చేరుకోనుంది. ఓఎన్జీసీలో ఉత్పత్తి చేసే గ్యాస్ పై రాష్ట్రానికి కూడా పన్నుల రూపంలో ఆదాయం లభిస్తుంది. ఈ ప్రాజెక్టుకు అనుగుణంగా గెయిల్ నిర్మించబోతున్న 745 కిలోమీటర్ల గ్యాస్ పైప్ లైన్ ప్రాజెక్టుకు కూడా ప్రధాని మోదీ శంకుస్థాపన చేయబోతున్నారు. 2 వేల 650 కోట్లతో నిర్మించే ఈ పైప్ లైన్ ద్వారా గ్యాస్ రవాణా సామర్థ్యం 6.65 మిలియన్ మెట్రిక్ టన్నులకు చేరుకోనుంది. దీంతో పాటు వైజాగ్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులకు మోదీ శంకుస్థాపన చేయబోతున్నారు. దాదాపు 450 కోట్లతో చేపట్టే ఈ ఆధునికీకరణ పనులతో వైజాగ్ స్టేషన్ సామర్థ్యం మరింత పెరిగి రోజుకు 75 వేల మంది ప్రయాణీకులను సేవలందించే స్థాయికి చేరుకుంటుంది. దీంతో పాటు వైజాగ్ ఫిషింగ్ హార్బర్ లో చేపడుతున్న 150 కోట్ల అభివృద్ది పనులకు మోదీ శంకుస్థాపన చేయబోతున్నారు. దీనివల్ల ఈ హార్బర్ సామర్థ్యం మరింత పెరగనుంది. ప్రస్తుతం 150 టన్నుల సామర్థ్యం ఉన్న ఈ పోర్టు అభివృద్ది పనులు పూర్తయ్యాక 300 టన్నుల సామర్థ్యానికి చేరుకుంటుంది.

  ఈ విధంగా ఆంధ్ర ప్రదేశ్ లో కేంద్ర ప్రభుత్వం పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేస్తూ రాష్ట్ర అభివృద్దిలో భాగస్వామ్యమవుతోంది. ఇక ఇప్పటికే ఇచ్చిన విభజన హామీలకు కూడా కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కానీ,.. అవి రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లనో,.. కోర్టుల స్టేల వల్లనో ఆగిపోయాయి. విశాఖపట్నం కేంద్రంగా ‘దక్షిణ కోస్తా రైల్వే జోన్’ ను 2019లోనే కేంద్రం ప్రకటించింది. వీటి పనులు ఇప్పటికే మొదలయ్యాయి. దీంతో పాటు ఆంధ్ర ప్రదేశ్ కు రావాల్సిన విద్యాసంస్థలతో పాటు ప్రత్యేకంగా గిరిజన యూనివర్శిటీని కూడా విభజన బిల్లులో పొందుపరిచారు. దీనికి కూడా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఆమోదం తెలిపింది. యూనివర్శిటీ తరగతులయితే 2019లోనే ఆంధ్రా యూనివర్శిటీలో మొదలయ్యాయి. కానీ, దీనికి ఇప్పటికీ శాశ్వత యూనివర్శిటీ లేదు. శాశ్వత వర్శిటీ కోసం విజయనగరం జిల్లాలోని కొత్తవలస మండలం రెల్లి గ్రామ శివార్లలో 526 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది. అయితే గిరిజన యూనివర్శిటీ మైదాన ప్రాంతంలో కాకుండా గిరిజన ప్రాంతంలోనే ఏర్పాటు చేస్తే బాగుంటుందని ప్రభుత్వం ఆలోచనలో పడింది. దీంతో రెల్లిలోని గిరిజన యూనివర్సీటీ పనులలకు బ్రేక్ పడింది. చివరకు కేంద్రం ఆమోదంతో విజయనగరం జిల్లాలోనే సాలూరు మండలం దుగ్గి సాగరం గ్రామ సమీపంలో యూనివర్శిటీ ఏర్పాటుకు అన్నీ సిద్దమయ్యాయి.

  దీంతో పాటు విశాఖకు అన్ని హంగులతో ఎయిర్ పోర్టు అవసరం ఉన్నందున భోగాపురంలో గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు కట్టేందుకు 2015లో 2,700 ఎకరాల స్థల సేకరణ చేశారు. దీనికి 2019 ఫిబ్రవరిలో అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేసినా,.. పర్యావరణ అనుమతులు లేక కోర్టుల నుంచి స్టేలు రావడంతో ఇన్నాళ్ళూ నిర్మాణాలు జరగలేదు. అయితే కొద్ది రోజుల క్రితం కోర్టులు విధించిన స్టేలన్నీ తొలగిపోవడంతో ఈ ఎయిర్ పోర్టుకు అడ్డంకులన్నీ తొలగిపోయాయి. ఇక చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ప్రత్యేక హోదాకు బదులు ప్యాకేజీకి కూడా ఒప్పుకున్నారు. అయితే ఈ ప్యాకేజీ నిధులు తెచ్చుకోకుండా హోదా అంటూ ప్రజలను మభ్యపెట్టడంతో ప్యాకేజీ నుంచి రావాల్సిన నిధులు కూడా ఆగిపోయాయి. ఈ విధంగా రాష్ట్రానికి రావాల్సిన అభివృద్ది ప్రాజెక్టులతో పాటు విభజన హామీలు కూడా కేంద్ర ప్రభుత్వ నెరవేరుస్తూనే ఉంది.

  ఇక, అభివృద్ధి, శంకుస్థాపనల పరిస్థితి ఇలావుంటే, మోదీ ఏపీ పర్యటనతో రాజకీయాలు కూడా ఆసక్తికరంగా మారాయి. ముఖ్యంగా పవన్ భేటీపై సర్వత్రా చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో బీజేపీ, జనసేన మధ్య ఏళ్ళ తరబడి పొత్తు కొనసాగుతున్నా వీటి ఫలితాలను మాత్రం ఇరు పార్టీలూ పొందలేకపోయాయి. ఈ పొత్తు వల్ల అటు బీజేపీ కానీ ఇటు జనసేన కానీ ఇసుమంత లాభంలేకుండా పోయింది. అయితే ఈ గ్యాప్ కు మాత్రం ఇరుపార్టీల్లో సమన్వయ లోపమే కారణమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో పేరుకే పొత్తున్నా కూడా ఇరుపార్టీల నాయకులు ఎవరికి వారే అన్న చందంగా వ్యవహరిస్తున్నారు. గతంలో తిరుపతి ఉపఎన్నికల్లోనూ ఇరుపార్టీలు పొత్తులతో పోటీ చేసినా ఎక్కడా కూడా సమన్వయంతో ప్రచారం చేసిన దాఖలాలు లేవు. ఇక బద్వేలు ఉపఎన్నికలో అయితే అంతర్గత కలహాలు బాహాటంగానే కనిపించాయి. దీంతో పాటు బీజేపీని రోడ్ మ్యాప్ ఎంత అడిగినా రాష్ట్రనాయకత్వం పట్టించుకున్న పాపాన పోలేదనీ.. ఇదిలాగే కొనసాగితే భవిష్యత్తులో పొత్తులపై ఆశలు వదులుకోవాల్సిందేనంటూ పవన్ బహిరంగంగానే హెచ్చరించారు. వీటితో పాటు కొన్నిరోజుల క్రితం చంద్రబాబు, పవన్ లు బహిరంగ ప్రెస్ మీట్ పెట్టడంతో టీడీపీ-జనసేనలు కలుస్తాయని రాష్ట్రంలో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మోదీ, పవన్ ల భేటీ ఆసక్తికరంగా మారింది. వీరి భేటీ తర్వాత ఏపీ రాజకీయాలు ఎలాంటి మలుపు తీసుకోబోతున్నాయన్నది ఉత్కంఠ రేకెత్తిస్తోంది. ఈ మీటింగ్ లో రాష్ట్ర బీజేపీ నాయకత్వం నుంచి ఎదురవుతున్న ఇబ్బందుల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ భేటీతో అయినా ఇరు పార్టీల మధ్య సమన్వయం ఏర్పడి పొత్తుతో ముందుకు సాగుతారో.. లేక పొత్తుకు ఇక్కడితో ఫుల్ స్టాప్ పడుతుందో వేచి చూడాల్సిందే.

  Trending Stories

  Related Stories