మోదీ నినాదాన్ని దీదీ అమలు చేస్తున్నారా..?

0
840

సాధ్యాసాధ్యాల విచక్షణా స్పృహలేనివారు సమర్థులైన నేతలు కాలేరు. పాలకులుగా మనగలగనూ లేరు. కేవలం వైరిపై కోపంతో లక్ష్యాలను సాధించలేరు. సదాశయమూ, దీక్షా చోదక శక్తులుగా పనిచేస్తే కృషి ఫలించే అవకాశం ఉంటుంది. అంతేకానీ, తగుదునమ్మా అని హడావిడి చేస్తే, నోరు పారేసుకుంటే గగనకుసుమాలను సంపాదించడం సాధ్యం కాదు.

ప్రస్తుతం దేశ రాజకీయాల్లో మమత బెనర్జీ ఆర్భాటం, ప్రశాంత్ కిషోర్ పేలుడు మాటలు హాస్యాస్పదంగా ఉంటున్నాయి. బుద్ధిలేని మేకపోతు కొండను ఢీకొట్టినట్టూ…బీజేపీని ఎదిరించేందుకు కాంగ్రెస్ రహిత ప్రతిపక్ష కూటమిని ఏర్పాటు కోసం ప్రయత్నిస్తున్నట్టూ దీదీ ప్రకటించారు. ఎన్సీపీ నేత శరద్ పవార్ ను కలిశారు. పనిలో పనిగా శివసేన నేతలతోనూ భేటీ అయ్యారు. కొన్నాళ్ల క్రితం ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సైతం పలుమార్లు పవార్ తో మంతనాలు చేశారు.

పీకే టీమ్ లోని ఓ ముఖ్యుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తోనూ భేటీ అయినట్టూ వార్తలు వెలువడుతున్నాయి. మొత్తంగా దేశంలోని బీజేపీ వ్యతిరేక ప్రాంతీయ పార్టీలన్నీ ప్రత్యామ్నాయం కోసం తహతహలాడుతున్నాయి. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ కమల వ్యతిరేకులు కూడబలుక్కునే ప్రయత్నాలు ముమ్మరంగానే సాగుతున్నాయి.

కాంగ్రెసేతర ప్రత్యామ్నాయం రావాలని బీజేపీ కూడా లోలోపల కోరుకుంటూ ఉండవచ్చు. అందుకు కారణమూ లేకపోలేదు. రాబోయే ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీల కూటమి ఏర్పడి బరిలోకి దిగితే, కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేస్తే ప్రయోజనం ఎవరికీ? ఇప్పటికే చతికిలపడిన కాంగ్రెస్ ఓటు బ్యాంకు ఎవరి పక్షాన తర్జుమా అవుతుంది? ప్రాంతీయ పార్టీల కూటమి నిజంగానే అధికారం సాధించిందే అనుకున్నా….అది ఎన్నాళ్లు మనగలదు? స్వప్రయోజనం మాత్రమే చోదక శక్తిగా ఉన్న పార్టీలు సమష్టి స్ఫూర్తితో వ్యవహరించగలవా? కాంగ్రెస్ పూర్తిగా మట్టికొట్టుకుపోతే బీజేపీ మరింత బలపడే అవకాశాన్ని కాదనగలమా? గతంలో ప్రాంతీయ పార్టీలు ఏ మోస్తరు విజయాలు సాధించాయి?

ఇలాంటి అంశాలను విశ్లేషణాత్మకంగా వివరించే ప్రయత్నం చేస్తాను.

బిజెపిని ఓడించేందుకు వ్యూహాన్ని రూపొందించాల్సి ఉందంటూ తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎన్‌సిపి నేత శరద్‌పవార్‌ను కలిసిన సందర్భంలో వ్యాఖ్యానించారు. శరద్‌పవార్‌ కూడా అదే మాట అన్నారు. కాంగ్రెస్ లేకుండా ఒక కూటమిని ఏర్పాటు చేయడానికి మమతా బెనర్జీ సన్నద్ధమవుతున్నట్లు శివసేన ఎంపీ సంజయ్ రావత్ ఇటీవలే ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్‌ను కూడా మమతా బెనర్జీ విశ్వాసంలోకి తీసుకున్నట్లు, ప్రశాంత్ కిషోర్ టీమ్ సభ్యుడు ఒకరు బలమైన రాజకీయ ప్రత్యామ్నాయంపై కేసీఆర్‌తో చర్చించినట్లు వార్తలు వెలువడుతున్నాయి.

2018 మార్చిలోనే కేసీఆర్ పశ్చిమబెంగాల్ వెళ్లి దేశంలో బిజెపియేతర, కాంగ్రెసేతర కూటమి ఏర్పడినప్పుడే రాజకీయాల్లో గుణాత్మక మార్పు వస్తుందని ప్రకటించారు. అయితే 2019 ఎన్నికల్లో ప్రాంతీయపార్టీలు దాదాపు 190 సీట్లు గెలుచుకున్నాయి. కాంగ్రెస్ ఘోర పరాజయం పాలైంది.

దేశవ్యాప్త రాజకీయ ఉనికిని, జనసామాన్యంలో గుర్తింపును, 2019 లోక్‌సభ ఎన్నికల్లో 19.5 శాతం ఓట్లను సాధించిన కాంగ్రెస్‌ పార్టీని… కాదని, బీజేపీ వ్యతిరేక కూటమికి నాయకత్వం వహించే స్థాయి, సామర్థ్యం ‘మమత’కు ఉందా? ప్రాంతీయ పార్టీల కూటమి కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయం కాగలదా? బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాలను ఏకం చేయగలదా? దాదాపు 200 స్థానాల్లో బీజేపీని నేరుగా ఎదుర్కొనే స్థితిలో ఉన్న కాంగ్రెస్‌ను కాదని మమతా వెనుకనడిచే విపక్ష, ప్రాంతీయ పార్టీలు ఎన్ని? లాంటి సవాళ్లు ఉండనే ఉన్నాయి.

1984 నుంచి 2014 వరకు జరిగిన ఎన్నికల చరిత్రను పరిశీలిస్తే ప్రాంతీయ పార్టీల ఓటు బ్యాంకు ఓ మోస్తరు పెరిగింది. ఆయా రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలు తమ ప్రాబల్యాన్ని స్థిరంగానే కాపాడుకుంటున్నాయి. ఇందులో సందేహం లేదు. కానీ, వేరు వేరు ప్రయోజనాల ప్రాతిపదికన ఏర్పడిన పార్టీలు ఒక స్థిర లక్ష్యంతో, బలమైన జాతీయ పార్టీని ఎన్నికల మైదానంలో సవాలు చేయగలవా? కాంగ్రెస్ లేని ప్రతిపక్షం అనే నినాదం బీజేపీకి ప్రయోజనం చేకూర్చదా అంటే ఖచ్చితంగా అవుననే సమాధానం వస్తుంది.

బెంగాల్ ఎన్నికల తర్వాత ఊపుమీదున్న మమత బెనర్జీ తన యుద్ధాన్ని బీజేపీపై కాకుండా కాంగ్రెస్ పై మళ్లించారు. మేఘాలయలో 17 మంది ఎమ్మెల్యేలతో ప్రతిపక్ష పార్టీగా ఉన్న కాంగ్రెస్‌ను మమత గట్టి దెబ్బకొట్టారు. నవంబరు 24న మాజీ సీఎం ముకుల్‌ సంగ్మాతో సహా 12 ఎమ్మెల్యేలు టీఎంసీ తీర్థం పుచ్చుకున్నారు. ఫలితంగా అక్కడ టీఎంసీ ప్రతిపక్షపార్టీగా అవతరించింది.

2022 ఫిబ్రవరి– మార్చి నెలల్లో జరిగే గోవా ఎన్నికల్లో బరిలోకి దిగుతామని ప్రకటించిన టీఎంసీ వేగంగా పావులు కదిపింది. కాంగ్రెస్‌ కురువృద్ధుడు, మాజీ సీఎం లుజిన్హో  ఫలేరోను, భారత టెన్నిస్‌ దిగ్గజం లియాండ్‌ పేస్‌ను మమత అక్కున చేర్చుకున్నారు. కొద్దిరోజుల్లోనే లుజిన్హో ఫలేరోను బెంగాల్‌ నుంచి రాజ్యసభకు పంపారు. టీఎంసీ ఉపాధ్యక్షుడిగా కూడా నియమించారు.

‘కాంగ్రెస్ ముక్త్ భారత్’ నినాదం బీజేపీ స్వరపేటికలోంచి వచ్చిన దాన్ని నిజం చేస్తున్నది మాత్రం ఆయా రాష్ట్రాల్లోని ప్రాంతీయపార్టీలని చెప్పకతప్పదు. యూపీ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలన్నీ ‘మహాఘట్ బంధన్ గా ఏర్పడితే కాంగ్రెస్ ఏకాకిగా మిగిలింది. బెంగాల్ ఎన్నికల్లోనూ అదే జరిగింది. బెంగాల్ కాంగ్రెస్, సీపీఎం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయి…బీజేపీ బలపడింది. ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్ ను ఏ స్థాయిలో రాజకీయంగా దెబ్బతీస్తే బీజేపీ అదే స్థాయిలో బలపడే అవకాశం ఉందని సమీప గతాన్ని పరిశీలించినా అర్థమవుతుంది.

త్రిపుర, మణిపూర్, అరుణాచల్‌ప్రదేశ్‌లలో తృణమూల్‌కు రాష్ట్ర పార్టీగా ఇప్పటికే గుర్తింపు ఉంది. ఢిల్లీకి చెందిన మాజీ క్రికెటర్, మాజీ ఎంపీ కీర్తీ ఆజాద్, రాహుల్‌గాంధీకి సన్నిహితుడిగా పేరున్న అశోక్‌ తన్వర్‌లు ఇటీవలే టీఎంసీలో చేరారు. జి–23 నేతల్లోనూ చాలామందితో ఆమె టచ్‌లో ఉన్నారనేది తెరపైకి వస్తున్న మరో కొత్త అంశం.

ఇటీవలే జీ–23 నేతల్లో ఒకరైన గులాంనబీ ఆజాద్‌కు సన్నిహితులైన నలుగురు మాజీ కశ్మీర్‌ మంత్రులతో సహా 20 మంది కాంగ్రెస్‌ గుడ్‌బై కొట్టారు. సుస్మితాదేవ్, లుజిన్హో ఫలేరోలను పార్టీలో చేరిన వెంటనే రాజ్యసభకు పంపడం ద్వారా కాంగ్రెస్‌ నేతలకు తాను సముచిత స్థానం, గౌరవం ఇస్తానని మమత సంకేతాలు పంపుతున్నారు.

ప్రాంతీయ పార్టీలన్నీ ఏకమై, కాంగ్రెస్ ఏకాకిని చేస్తే…జాతీయ స్థాయిలో మిగిలేది బలమైన బీజేపీ మాత్రమే అనే సత్యాన్ని ప్రాంతీయ పార్టీలు గుర్తిస్తే, ఆ తర్వాత జరిగే పరిణామాలను సులువుగానే గ్రహించవచ్చు. తెలుగు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోవడానికి కారణం ప్రాంతీయ పార్టీలే! ఢిల్లీ ఎన్నికల్లో కేవలం 4 శాతం ఓట్లు సాధించి అవమాన భారాన్ని మోయడానికి కూడా కారణం ప్రాంతీయ పార్టీలే !

అంటే ప్రాంతీయ పార్టీలన్నీ కలిసి కాంగ్రెస్ ను బలహీన పరిస్తే…బీజేపీ ప్రచండ శక్తిగా అవతరిస్తుంది. ఐక్యతలేని ప్రాంతీయ పార్టీల మధ్య అనారోగ్యకర వాతావరణాన్ని సృష్టించడం బీజేపీకి పెద్ద పని కాదు. కాబట్టి ఎంతచెడ్డా గ్రామీణ భారతంలో కాంగ్రెస్ ఇంకా తన ప్రాబల్యాన్ని కోల్పోలేదు. కూటమి రాజకీయాల్లో ఆరితేరిన కాంగ్రెస్ కనీసం కొన్నాళ్లపాటైన పాలన సాగించగలదు. అందుకు అవసరమైన అన్ని రాజీమార్గాలను అనుసరించ గలదు.

అధికార దుర్వినియోగాలనూ చేయగలదు. అవినీతిని ప్రోత్పహించగలదు. కూటమి ప్రభుత్వాలు నడపడంలో ఉండే అన్ని అపసవ్య మార్గాలను అనుసరించే వ్యాకరణం కాంగ్రెస్ కు తెలిసినంతగా మరే పార్టీకి తెలియదు. కాబట్టి బీజేపీని ఎదిరించాలంటే ప్రాంతీయ పార్టీలకు కాంగ్రెస్ మినహా మరో మార్గం లేదు. రాష్ట్రాల్లోని ముస్లీం ఓటు బ్యాంకును మజ్లీస్ పార్టీ క్రమంగా తనవైపు తిప్పుకుంటోంది. మరోవైపు ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్ ను ఏకాకిని చేస్తే…దేశంలో బలమైన శక్తిగా బీజేపీ తన పరిధిని విస్తరించుకుంటుంది.

ఎన్నికల ఫలితాలను తన మంత్రజాలంతో  మార్చగలననీ, వ్యూహరచనా దురంధరుడననీ చెప్పుకునే ప్రశాంత్ కిషోర్ ‘కాంగ్రెస్ రహిత కూటమి’ ఆలోచన ఏ ఉద్దేశంతో చేస్తున్నాడు అనే సందేహం రావడం కూడా సహజం. పీకే శకుని పాత్ర పోషించి ప్రతిపక్షాలను బలహీన పరుస్తున్నాడా? అనే అనుమానం రాకమానదు.

మరో పరిణామాన్ని కూడా మనం గమనించాలి. మమత బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్, అసదుద్దీన్ నాయకత్వంలోని ఎంఐఎం పార్టీలు ప్రాంతీయ పార్టీల స్థాయి నుంచి క్రమంగా రాష్ట్రాలకు విస్తరిస్తూ కాంగ్రెస్ కు బేజారు పుట్టిస్తున్నాయి. నగరాలు, పట్టణాల్లోని రాజకీయ వర్గాల్లో అనేక ఆశలు రేపిన ఆమ్ ఆద్మీ పార్టీ విస్తరణలో వెనుకబడిపోయింది. మజ్లీస్ పార్టీ మాత్రం తన ప్రభావాన్ని నగరాలు, పట్టణాల్లోనే పెంచుకుంటోంది.

ప్రాంతీయ పార్టీలుగా మొదలై ఇతర రాష్ట్రాల్లో విస్తరించిన పార్టీలు మన దేశ రాజకీయాల్లో చాలా అరుదనే చెప్పాలి. అయితే విస్తరించకపోవడానికి అనేక పరిమితులూ, పరిధులూ ఉన్న మాట కూడా నిజం. ఎంఐఎంకు ఉన్న అనుకూలత ముస్లీం ప్రజానీకం. తృణమూల్ కు ఉన్న సానుకూలత కాంగ్రెస్ లోని అసంతృప్త నేతల గణం. ఈ కారణంగా కాంగ్రెస్ క్రమంగా ఖాళీ అయి, మమత నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ దేశవ్యాప్తంగా విస్తరిస్తుందా అనే అంచనాలూ ఉన్నాయి. నిజానికి ‘తృణమూల్ కాంగ్రెస్’ అంటే ‘ఇదే నిజమైన కాంగ్రెస్’ అని అర్థం. ఈ అర్థాన్ని మమత సార్థకం చేస్తారా అనే ఆసక్తికరమైన ప్రశ్న రాజకీయ వర్గాల్లో ఆసక్తిరేపుతోంది.

అయితే నేతలు పార్టీలు మారినంత మాత్రాన ప్రజా క్షేత్రంలో ఓటర్లు అంత సులభంగా పరకాయ ప్రవేశంచేసి నేతలకు అధికార పీఠాన్ని కట్టబెడతారా అంటే అదేమంత సులభసాధ్యమైన విషయం కాదు. అత్యంత సంకీర్ణమైన ఎన్నికల వ్యాకరణాన్ని ఔపోసన పట్టినవారు కూడా అంతిమ ఫలితాన్ని అంచనా వేయలేక అవస్థలు పడతారు. సంస్థాపరమైన బలం, హిందూ సంస్థల దన్ను ఉన్న బీజేపీని చెల్లాచెదురుగా విస్తరించి ఉన్న ప్రాంతీయ పార్టీలు ఢీకొనడం అంత సులభం కాదు. అయితే బీజేపీ ఎదర్కోవాలనే పట్టుదల మాత్రం ప్రాంతీయ పార్టీల్లో పెరిగిందనే చెప్పాలి. మొత్తంగా 2024లో జరిగే ఎన్నికలు రెండేళ్ల ముందే ఉత్కంఠకు తెరలేపాయి.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here