ఈ గర్జన ప్రభంజనమయ్యేనా..? కేసీఆర్ ప్రధాని అయ్యేనా..?

0
1115

తెలుగుసీమ మీదునుంచి వింధ్యను దాటాలనే ఓ విచిత్ర ప్రయత్నం ఆరంభమైంది. ఉత్తర గంగను దాటి దక్షిణ గంగకు విస్తారించాలనీ.. హస్తినలోని అభేద్య ప్రాకారాన్ని బద్దలు కొట్టాలనే  గమ్మత్తైన గావుకేక ఒకటి తెలంగాణలో వినిపించింది. ప్రాంతీయ ఆకాంక్ష సాధన నుంచి జాతీయస్థాయి అధికార సాధనే ధ్యేయమనే ఓ గర్జన ప్రతిధ్వనించింది.

సాత్పుర పర్వత శ్రేణి తన ప్రయాణం ప్రారంభించే గుజరాత్ రాష్ట్రం నుంచి బయలుదేరిన ఓ చాయ్ వాలా ఆరావళిని దాటి ప్రధాని అవ్వగా లేంది…పుట్టుకతోనే దొరనైన నేను ప్రధాని కాలేనా అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన జాతీయ రాజకీయ ప్రస్థానాన్ని ఆరంభించారు. రాజప్రాసాదాన్ని పోలిన తెలంగాణ రాష్ట్ర సమితి కార్యాలయం సాక్షిగా భారత రాష్ట్ర సమితి అవిర్భావాన్ని తానే స్వయంగా ప్రకటించారు కేసీఆర్.

ఆరంభం మహాద్భుతం. పొరుగున ఉన్న పార్టీల నేతలు విమానాలు దిగి ప్రగతి భవన్ గేట్లు తట్టారు. అల్పాహార విందులో కేసీఆర్ పళ్లెం ఖాళీ అయిన అతిథుల వైపుచూసి..మళ్లీ వడడ్డించమని చేయి ఊపుతూ పనివారిని ఆఙ్ఞాపిస్తుంటే… రాజసం ఉట్టిపడింది.

కేసీఆర్ చుట్టూతా కూర్చుని నవ్వుతూ తుళ్లుతూ సుస్టుగా తింటున్న సదరు నేతలంతా అనేక మార్లు ప్రభుత్వాలను కూల్చినవారే! లేదా ఇతరుల ద్రోహాల వల్ల అధికారాన్ని కోల్పోయిన వారే! పాపం కుమార స్వామికి ఆశ చావలేదు. అందుకే కేసీఆర్ పిలవగానే వాలిపోయాడు. ఇంకా కన్నుతెరవని పసికూన బీఆర్ఎస్ తో కలిసి కర్ణాటకలో పోటీ చేస్తామని అత్యుత్సాహంతో ప్రకటించారు. ఇంతకు మించిన అఙ్ఞానాన్ని మనం ఎక్కడైనా చూస్తామా?

ప్రగతి భవన్ నుంచి భారీ వాహణ శ్రేణి…సైరన్ మోతల మధ్య తెలంగాణ భవన్ చేరుకుంది. విజయదశమి వేళ…విల్లు ఎక్కుపెడతానని గతంలోనే ప్రకటించారు చంద్రశేఖరులు. సమయం ఆసన్నమైంది. నేతలంతా  మితిమీరిన వినమ్రతతో అర్ధవలయాకారంలో ఆసీనులై ఉన్నారు.

రాచరికపు రోజుల్లో ఆస్థానాల్లో జరిగే సభ జ్ఞప్తికి వచ్చింది ఆ దృశ్యాన్ని చూస్తుంటే!  ఇచ్చిన మాట ప్రకారమే సుమూహూర్త సమయానికి శంఖరావం పూరించారు. ఆశీర్వచన మంత్రాలతో వేదపండితులు దీవించారు. వినయంతో నేతలు చప్పట్లు చరిచారు.

4వ తేదీ అర్ధరాత్రి నుంచే నగరం గులాబీ రంగును పూసుకుంది.  ఇక ఆ పార్టీ శ్రేణులు చేసిన హడావిడి అంతా ఇంతా కాదు! యుద్ధాన్ని గెలిచిన రాజుసైన్యం విజయోత్సవం జరుపుకున్నట్టే  కనిపించింది. తమ నేతల అంతెత్తు కటౌట్లు కడుతున్నపుడు…అలసిసొలసి…గమ్యం చేరే హడావిడిలో అడ్డొచ్చిన పాదచారులను కసిరి బుసకొట్టి మరీ పక్కకు నెట్టారు గులాబీ కార్యకర్తలు. మందు తాగించి అడ్డా కూలీలతో మత్తు నృత్యాలు చేయించారు. పాపం వారికి తెలియదు…తమ బతుకు బుగ్గి చేసినవారి ముందే తాగి  చిందులు వేస్తున్నామని. 

కన్నూమిన్నూ తెలియని ఉన్మాదం…ఉన్మత్తత కూరిన క్షణాలు, ఉన్మాదం దట్టించిన ఘడియలు…4వ తేదీ అర్ధరాత్రి చాలా చోట్ల సాక్షాత్కరించాయి. భాగ్యనగరం… దౌర్భాగ్య నగరంగా మారుతున్న క్రమమేదో లీలగా గోచరించింది. కావచ్చు, తమ నేత మహాయజ్ఞమే చేస్తుండవచ్చు. మహాసామ్రాజ్యాన్ని ఏలేదిశగా తన అశ్వాన్ని మళ్లించి ఉండవచ్చు. ఆ గుర్రం మామూలు జనం గుండెలపై నుంచి వెళ్లకూడదు కదా!

చరిత్రలో ఏ ఓటు లేకుండా, ఎవరి ఆమోదంతోనూ పనిలేకుండా సర్వాధికారాలు సంక్రమించిన రాజులకు కూడా ప్రజలంటే కాసింత గౌరవం ఉండింది. జనం ఓటుతో గద్దెనిక్కిన ప్రభువు… తన వందిమాగధ బృందానికి సంస్కారం కాదు, కనీసం కృరత్వం పాలు తగ్గించుకొమ్మన్నైనా చెప్పి ఉండాల్సింది. లేదా మర్యాదగా అయినా తిట్టమని చెప్పాల్సింది.

నిన్నటి నుంచీ…నగర వాతావరణాన్ని చూస్తుంటే 60ల్లో వచ్చిన అభిమానం సినిమాలోని పాట…‘‘రాజు వెడలె నిదిగో..రాజువెడలె రవి తేజములలరగ…’’పాటే గుర్తుకు వచ్చింది. ఆ పాట చిత్రీకరణ కూడా అలాగే ఉంటుంది. నటులు అల్లు రామలింగయ్య, చలం కత్తులు పట్టుకుని నానా హడావిడి చేస్తూ నృత్యం చేస్తుండగా ఈ పాట సాగుతుంది. ఇలాంటి రోజు ఒకటి వస్తుందని ఊహించే సముద్రాల జూనియర్ ఈ పాటకు ప్రాణం పోసి ఉంటారు.

సరే…! సిరిగలవారికి సామాన్యులు ఏం చెప్పగలరు….

అయితే నిజంగానే జాతీయ రాజకీయ రంగప్రవేశం సాధ్యమేనా? ప్రవేశం సులభమే కావచ్చు. విజేత కావడం సాధ్యమా? అనునిత్యం పరస్పరం అవిశ్వాసం ప్రకటించుకునే పార్టీలూ….డబ్బిచ్చి జనం ఓట్లను కొనగలమనే మదం గల నాయకులు ఒక చోట కూడగలరా? పూల బొకేలిచ్చుకుంటూ…ఆలింగనల ఆహ్వానాలతో గతంలో ఏర్పడిన కూటమి ప్రభుత్వాల గతెమయ్యిందో తరచి చూస్తే తెలుస్తుంది కదా!

పదవులివ్వకపోతే…శాపనార్థాలు పెట్టి కూటమిని వదిలిన నేతలూ, చీటికీ మాటికీ బెదిరించే పార్టీలూ…బేరం కుదరకపోతే….ప్రభుత్వాలను కూల్చిన ప్రబుద్ధులను చరిత్ర చూడలేదా? మందమతులు కూడా దిగువ సభలో బుద్ధిజీవి అయిన అటల్ బిహారీ వాజ్ పాయ్ ని అవమానించి పదవీచ్చుతుణ్ని చేసిన విషాదం ఇంకా మన ఙ్ఞాపకాల్లోంచి రద్దు కాలేదు కదా!

అధిక  సీట్లు  వచ్చిన పార్టీ ఎక్కడ అధికార పగ్గాలు చేపడుతుందో అనే అక్కసుతో అర్భకులంతా కూడి కూటమి ప్రభుత్వాలను ఏర్పాటు చేసి…నాలుగురోజులు కూడా గడవకుండానే కుక్కలు కోట్లాడుకున్నట్టే…కొట్లాడుకుని తామే జట్టు కట్టి ఏర్పాటు చేసుకున్న ప్రభుత్వాన్ని చేజేతులా తామే కూలదోసుకోలేదా? తిట్టులో శునకాలను వాడుతున్నందుకు వాటిని క్షమించమని కోరుతున్నాను. అనైతిక నేతలను తిట్టేందుకు తగిన ఉపమానం కోసం  నిఘంటువు ఇంకా శోధిస్తూనే ఉంది.

ప్రభుత్వమంటే ప్రజలకు విశ్వాసమివ్వాల్సిన పాలనా వ్యవస్థ కదా! బాగోగులను పరిశీలించి వెలితి ఉన్న చోట భరోసాను పూరించే పెద్ద మనిషి కదా! మంచీ చెడులు తెలుసుకుని వెన్నుతట్టి ఓదార్చాల్సింది ప్రభుత్వమే కదా! అందుకు కదా ప్రజలు నమ్మి తమ అమూల్యమైన ఓటును అమాయకంగా పార్టీలకు సమర్పించుకుంటారు. ఇది ప్రజలిచ్చిన అధికారమనీ….అధికారమంటే బాధ్యత అని మరిచిపోయి..పదవులకోసం కొట్లాడుకునే సంస్కారహీనులా సుస్థిర ప్రభుత్వాలను ఏర్పాటు చేసేది?     

ధీశాలి ముందు నిలబడి అల్పజీవి  హడావిడి చేస్తే అందరూ చూస్తారు.. నిజమే! కానీ అది నవ్వించే దృశ్యం కదా! కాలక్షేప క్షణాలను ఎవరైనా ఆస్వాదిస్తారు. వినోదభరిత దృశ్యాలను చూసేందుకు జనం ఎగబడి వస్తారు. జన సమ్మర్దం ఉన్నంత మాత్రాన సమ్మతి ఉన్నట్టు కాదు.  ఇది గుర్తెరగకుండా ఇక నేను బయలుదేరాను కాచుకో అంటే…నవ్వుకోరా.. ప్రభూ!

దేశంలోని ఏ రాష్ట్రంలో అయినా గౌరవించదగ్గ పార్టీ, విలువలు గల నేత, వ్యక్తిత్వం గల నాయకుడు కనిపిస్తాడా? రాజనీతి మూర్తిభవించిన అపూరూప అగ్రగామి… దీపం పెట్టి వెతికినా దొరుకుతాడా? అన్ని ప్రాంతీయ పార్టీలకూ ప్రజలంటే బేఖాతరు. బీరూ బిర్యాని ఇస్తే వచ్చే అలగా జనమనే హేళన భావం. ఐదు వందల కాగితం జేబీలో పెట్టి, క్వార్టర్ బాటిల్ చేతికి ఇస్తే  ఓటు వేసే వ్యర్థజనమనే ఛీత్కారభావం.  ఇలాంటి పార్టీలే కుమ్మక్కై అధికారాన్నినంజుకు తింటాయి. ప్రజాధనాన్ని లూఠీ చేస్తాయి. పైగా అది తమ జన్మహక్కని నిస్సిగ్గుగా చెప్పుకుంటాయి. Money is the mother’s milk of politics అని మిలన్ వైష్ణవ్ ఒక్క వాక్యంతో తేల్చేశాడు.

భారతదేశ రాజకీయ చరిత్రలో ఎన్ని దాఖలాలు చెప్పాలి? కూటమి ప్రభుత్వాలు బాహటంగా గెలుపు గుర్రాలను కొని దొరికి పోలేదా? జార్ఖండ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన శిబూసోరెన్ కూటమి ప్రభుత్వాలకు చెప్పిన గుణపాఠం ఇంకా అర్థం కాలేదా? ప్రజాభిప్రాయాన్ని అపహాస్యం చేయడమే కూటమి ప్రభుత్వా లక్షణం.

1979లో చరణ్ సింగ్ మొదలు 1998లో వాజ్ పాయ్ వరకూ అన్ని ప్రభుత్వాలు కేవలం ఏడాది కాలం పాటు మాత్రమే పాలించాయి. అంటే ఆరు ప్రభుత్వాలు కూలిపోయాయి. దీన్ని చూస్తే అర్థమవలేదా ప్రజలంటే ఎంత గౌరవమో?

కురచబుద్ధి గలవారంతా ఒకచోట చేరి, మనమంతా కూటమి కడదాం.. రాజ్యాన్ని కూల్చేద్దాం..మనమే అధికారాన్ని చేపడదాం…ఎవరి వంతు వారు, వారివారి తహతుకు తగినట్టూ పంచుకుందాం. ఇదంతా సాధ్యం కావాలంటే…ముందు మనం జట్టు కట్టాలి. ఆ జట్టుకు నేనే సారథి కావాలి. నడిపించే పూచీ నాది. వెంట వచ్చే బాధ్యత మీది. వ్యూహం నాది. ఆయుధాలు మీవి. సేనాని నేను. సైనికులు మీరు. అని ఓ చందమామ కథ మొదలవుతుంది. అచ్చం అలాగే ఉంది కదా ఈ వ్యవహారం.

ఆర్భాటానికి ఆకర్షణ ఉంటుంది. పోగుపడిన మంద కంటిని ఆకర్షిస్తుంది. బరువైన పేలుడు మాటలు విన్న జనం పెడ మరలి చూస్తారు. కరతాళ ధ్వనులు అల్లంత దూరానికి వినిపిస్తాయి. అంత మాత్రాన ఇక అధికారం వచ్చేసిందనుకుంటే…మనం అవివేకులం కాక మరేమిటీ….?

ఊహాశక్తి చాలా గొప్పది. ఎల్లలు ఉండవు కదా! ఇది ఊహల కాలం. కలల కాలం. బ్రహ్మాండమైన భ్రమల రుతువు. అందుకే మళ్లీ కూటమి లొల్లి. సీఎం కేసీఆర్ గొప్ప కాల్పనిక రచయిత. దృశ్యాన్ని చిత్రిక పడితే పాఠకుడు మైమరచిపోతాడు. మాట్లాడితే జనం జేజేలు కొడతారు. ఇపుడు ఆయా రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీల నేతలకు ఒక మహాద్భుత దృశ్య కావ్యాన్ని మౌఖికంగా వినిపిస్తున్నారు కేసీఆర్. వారంతా తదేకంగా వింటున్నారు. దానిపేరే కాంగ్రెసేతర కూటమి ప్రభుత్వం. పాపం వారంతా చాలా కాలంగా అధికారం లేక మొహం వాచిపోయి ఉన్నారు. నిరాశలో ఉన్నవాడికి అబద్ధమైనా నిజమే అనిపిస్తుంది. అసాధ్యం కూడా సాధ్యం కావచ్చనిపిస్తుంది. అందుకే పిలిచిన చోటికి వస్తున్నారు. చెప్పింది వింటున్నారు. పెట్టింది తింటున్నారు.

భ్రమలన్నీ పటాపంచలయ్యేకాలం త్వరలోనే రావచ్చు. ఆ తర్వాత ఙ్ఞానోదయం కలగవచ్చు. కేసీఆర్ మాత్రం తాను గర్జించానని భావిస్తున్నారు. గర్జన ప్రభంజనం కాబోదనీ…అది భయంగా తర్జుమా అయితీరుతందంటున్నారు బుద్ధి జీవులు.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

one + seventeen =