More

  చమురు ఎక్కడి నుంచైనా కొంటాం.. మాకు సుద్దులు చెప్పొద్దు..! – అమెరికాకు హర్దీప్ పరోక్ష చురకలు

  చమురు కొనుగోళ్లకు సంబంధించిన విధానంపై భారత్‌కు స్పష్టత ఉందన్నారు కేంద్ర పెట్రోలియం, సహజవాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి. అమెరికా పర్యటనలో వున్న ఆయన.. వాషింగ్టన్ లో అక్కడి భారత పాత్రికేయులతో ముచ్చటించారు. భారత్ చమురును ఎక్కడి నుంచైనా కొనుగోలు చేస్తుందని తెలిపారు. ఒపెక్ చమురు ఉత్పత్తి కోత, భారత్ కు అవసరమైన ఇంధనం సమకూర్చుకోవడం తదితర అంశాలపై ఆయన సుదీర్ఘ వివరణ ఇచ్చారు.

  రష్యా నుంచి చమురు కొనుగోలు చేయవద్దని భారత్ కు ఎవరూ చెప్పలేదని భారత కేంద్ర మంత్రి పురి తెలిపారు. దేశ ప్రజలకు అవసరమైన ఇంధనాన్ని అందించాల్సిన నైతిక బాధ్యత తమ పై వుందని అన్నారు. దేశ ప్రజల కోసం ఇంధనాన్ని ఎక్కడ నుంచైనా దిగుమతి చేసుకుంటామని ఆయన చెప్పారు.

  ఉక్రెయిన్ పై యుద్ధం సందర్భంగా రష్యా నుంచి చమురు దిగుమతులపై అమెరికా ఆంక్షలు విధించింది. దీనికి పశ్చిమ దేశాలు సైతం సై అన్నాయి. ఇదే సమయంలో.. భారత్ క్రెమ్లిన్ నుంచి ఇంధన కొనుగోళ్లు కొనసాగింపుపై విమర్శలు వచ్చాయి. దీనికి భారత్ ధీటుగా సమాధానం ఇచ్చింది. దీనిపై కేంద్ర మంత్రి పురి.. మరోసారి పూర్తి వివరణ ఇచ్చారు. భారత్ లో చమురు వినియోగం ఆధారంగానే కేంద్ర ప్రభుత్వం కొనుగోళ్లు చేపడ్తోందని, స్పష్టమైన విధానం వుంటే.. ఎక్కడ నుంచైనా కొనుగోళ్లు చేస్తామని చెప్పారు. రష్యా నుంచి ఇంధనం కొనుగోలు చేయవద్దని ఎవరూ చెప్పలేదని అన్నారు.

  ప్రపంచ ఇంధన వ్యవస్థపై ఉక్రెయిన్ యుద్ధం తీవ్ర ప్రభావం చూపిన విషయం అందరికీ తెలిసిందే. ఈ వార్ తో సరఫరాకు ఆటంకం కలిగింది. సుదీర్ఘ కాల వాణిజ్య సంబంధాలు దెబ్బతీశాయి. చాలా దేశాల్లో చమురు ధరలు ఒక్కసారిగా పెరిగాయి. ఎన్నో దేశాల ఆర్థిక వ్యవస్థలు పతనం అయ్యాయి. అయితే, భారతదేశం ఆచితూచి వ్యవహరించి.. సక్రమ పంథాను అనుసరించి.. ఆర్థిక కష్టాల ఊబిలో చిక్కుకోలేదు.

  ఈ ఏడాది ఏప్రిల్ తర్వాత రష్యా నుంచి భారత్ కు ముడి చమురు దిగుమతులు 50 రెట్లు పెరిగాయి. ఉక్రెయిన్ యుద్ధానికి పూర్వం భారత చమురు దిగుమతుల్లో రష్యా వాటా కేవలం 0.2 శాతం మాత్రమే. ఇప్పుడు అది పది శాతానికి పెరిగింది. యుద్ధం నేపథ్యంలో రష్యా చౌక ధరకు చమురు విక్రయాలు జరపడమే ఇందుకు కారణం అని విశ్లేషకులు అంటున్నారు. అయితే, కేంద్ర సర్కారు సమయస్ఫూర్తిగా వ్యవహరించడం, సరియైన సమయంలో..సమంజస నిర్ణయాలు తీసుకోవడంతో ఇది సాధ్యమైందని దేశ ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు.

  ఆర్థిక వృద్ధికి ఇంధనం ఎంత కీలకం అనే విషయాన్ని ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు కదా! ఉత్తర అమెరికాలో పెట్రోల్, డీజిల్ ధరలు 43 నుంచి 46 శాతం పెరిగితే, భారత్ లో కేవలం 2 శాతం మాత్రమే పెంపు జరిగింది. భారత్‎లో ప్రతి నిత్యం 50 లక్షల బ్యారెళ్ల చమురు వినియోగం సాగుతోంది. ప్రపంచ సగటు తలసరి వినియోగంలో మూడో వంతు భారత్ లో వుంది. రానున్న కాలంలో ప్రపంచ డిమాండ్ లో 25 శాతం భారత్ నుంచే వుంటుందని గణాంకవేత్తలు లెక్కలు కడుతున్నారు.

  చమురు ఎగుమతి చేసే దేశాలు తమ ఉత్పత్తులను మార్కెట్‌లో విక్రయించాల్సి ఉన్నందున కొనుగోలుదారులు అవసరమని కేంద్ర మంత్రి పూరి తెలిపారు. చమురు ఉత్పత్తి సామర్థ్యాలపై నిర్ణయం తీసుకునే హక్కు ఒపెక్‎కు ఉందన్నారు. అయితే, భారత్ ఒపెక్ లో భాగం కానందున ఆ నిర్ణయంపై స్పందించాల్సిన పని లేదని తెలిపారు. చమురు ఉత్పత్తిని రోజుకు 2 మిలియన్ బ్యారెళ్ల మేర తగ్గిస్తూ ఒపెక్ దేశాలు నిర్ణయం తీసుకున్న విషయం అందరికీ తెలిసిందే.

  Trending Stories

  Related Stories