కేసీఆర్ ‘పద్మవ్యూహం‘లో ఈటల అభిన్యుడా..? అర్జునుడా..?

0
878

ఈటల రాజేందర్ కమలం గూటికి చేరతారా?కాంగ్రెస్ కండువా కప్పుకుంటారా? కొత్త ప్రాంతీయ పార్టీ పెడతారా? ఈ ప్రశ్నలు తెలంగాణ రాజకీయ ఆవరణలో ప్రస్తుతం ఆసక్తిని రేపుతున్న ప్రశ్నలు. ముఖ్యమంత్రి కేసీఆర్ బలం, బలహీనతల గురించి లోతైన అవగాహన ఉన్న ఈటల రాజకీయ భవిష్యత్తు – రాష్ట్రంలోని మిగతా పార్టీలపై ప్రభావం చూపే అవకాశాన్ని నిరాకరించలేం! ఈటల రాజేందర్ బీజేపీలో చేరితే రాజకీయ పరిణామాలు ఎలా మారతాయి? కాంగ్రెస్ గూటికి చేరితే ఏమవుతుంది? కొత్త ప్రాంతీయ పార్టీ సాధ్యాసాధ్యాలేంటి? ఈటల తాజా సర్వేలో తేలిందేంటి? కేసీఆర్ ఎలాంటి ప్రతిక్రియకు దిగుతారు? కేసీఆర్ రాజనీతిశాస్త్రంలో చాణక్యం పాలెంత? కేసీఆర్ హఠాత్తుగా ఫాంహౌస్ వదిలి భాగ్యనగరంలో అడుగుపెట్టి హడావిడి ఎందుకు సృష్టిస్తున్నట్టూ..? ఆసక్తి రేకెత్తించే ఈ ప్రశ్నల లోతుల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తాను..

ప్రత్యర్థి ఉచ్చులను గుర్తించి ఎత్తుగడలనూ తరంగ స్థితిలో విస్తరిస్తూ… సామాజిక సమీకరణల బలాన్ని ఆసరా చేసుకుని వ్యూహాన్ని రచించి విజయం సాధించడం మరొక పద్ధతి. ఇక రెండోది: బలమైన రాజకీయ గొడుగు కిందకు చేరి రక్షణ పొందుతూ కాలక్రమంలో భవిష్యత్తును సుస్థిరం చేసుకోవడం. ఈ రెండూ ప్రయోగాలూ కాదనుకుంటే కష్టమైనా, నష్టమైనా కొత్త ప్రాంతీయ పార్టీని స్థాపించి సమర్థవంతంగా నడిపి నాయకత్వ చేవను ప్రదర్శించడం. తెలంగాణ రాష్ట్ర కేబినెట్ మాజీ మంత్రి ఈటల రాజేందర్ ముందు ఈ మూడు ప్రత్యామ్నాయాలున్నాయి. ఏమాత్రం స్వతంత్ర వైఖరి ప్రకటించినా, తమవైన అభిప్రాయాలు వెలిబుచ్చినా ముఖ్యమంత్రి కేసీఆర్ ససేమిరా ఒప్పుకోరు. అలాంటి వారిపై ఓ కన్నేసి ఉంచుతారు. వారి ఆర్థిక మూలాలు-వాటిలోని లొసుగులు, వ్యక్తిగత బలహీనతలు-అందుకు సంబంధించిన రహస్యాలు, న్యాయపరమైన తప్పిదాలు-అందుకు సంబంధించిన డాక్యూమెంటల్ ఎవిడెన్స్ తన గుప్పిట పెట్టుకుంటారు కేసీఆర్. ఏ రాజకీయ పార్టీ అధినేత అయినా ఇదే పనిచేస్తారు. అయితే కేసీఆర్ అందుకు భిన్నమైన శైలి.

తాను దాడికి దిగదలచుకున్నపుడు స్వపక్షంలోని ప్రత్యర్థి అయినా సరే! గుక్క తిప్పుకోలేని దాడికి దిగుతారు కేసీఆర్. మరీ ముఖ్యంగా నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయడంలో కేసీఆర్ దిట్ట. సైకలాజికల్ అసాల్ట్ చేస్తే-డిఫెన్స్ పొజిషన్ లో కూరుకుపోయే వైరి వాదన అత్యంత బలహీనంగా, దైన్యంతో కూడుకుని ఉంటుంది. భూకుంభకోణం వార్తలు బద్దలైన తర్వాత ఈటల స్వరాన్ని గమనిస్తే ఈ విషయం అర్థమవుతుంది. తనపై వచ్చిన ఆరోపణలకు విధిగా జవాబు ఇచ్చుకోవడం మినహా-దాడికి దిగడం అసాధ్యంగా మారింది. రాజకీయ రణరంగంలో కేసీఆర్ తన తూటా మొదట పేలాలనుకుంటారు. శక్తివంతమైన రాజకీయ దాడిని కేవలం దొమ్మీగా మార్చేస్తారు కేసీఆర్. కేసీఆర్ రాజకీయ చదరంగంలో ఇది మాత్రమే అత్యంత కీలకమైంది. మిగతాదంతా నాటకీయతను తలపించే ‘‘strategy lable’’గా పేర్కొంటారు రాజకీయ విశ్లేషకులు. ఈ ఏడాది మార్చి 29న ఆంధ్రజ్యోతి దినపత్రికలో ‘‘మంత్రి మిస్సింగ్’’ అనే వార్త పతాక శీర్షికలో వచ్చింది. సరిగ్గా నెలరోజుల తర్వాత అంటే ఏప్రిల్ 30న ‘‘ఈటల భూ కబ్జా బాగోతం’’ వార్తలు గుప్ఫుమన్నాయి.

తన ప్రాకారపు వెనుక ఏదో జరుగుతోందని కేసీఆర్ పసిగట్టారు. అంతకుముందే సూచనప్రాయమైన నిఘా వర్గాల నివేదికలున్నా…అసాధ్యుడి ముందు అంతపనీ చేస్తారా? అనే విశ్వాసం కారణంగా గుంభనం ప్రదర్శించారు కేసీఆర్. ప్రత్యర్థిపై ఉండాల్సిన రాజకీయ వైరం కన్నా, స్వపక్షంలోని సన్నిహితులపైనే కేసీఆర్ అనుమానం పాలు అధికం. మంత్రి మిస్సింగ్ వార్త తర్వాత ముప్ఫై రోజులకు మంత్రి భూ బాగోతం ఎపిసోడ్ బయటకు వచ్చింది. ఆ తర్వాత ఈటలను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయడంతో తెలంగాణ ఏర్పాటు తర్వాత ఏడేళ్లకు టీఆర్ఎస్ లో ఓ ఆసక్తికరమైన ఎపిసోడ్ మొదలైంది. ఈటల రాజకీయ భవిష్యత్తుపై రకరకాల కథనాలూ, వ్యాఖ్యానాలూ మొదలయ్యాయి. అన్ని పార్టీల నేతలూ ఈటలకు మద్దతు ప్రకటించారు. కాంగ్రెస్, బీజేపీ నేతలు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. దీంతో ఏ పార్టీవైపు ఈటల చూపు అనే ప్రశ్న సహజంగానే రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ పూర్తిగా బలహీనపడింది. టీడీపీ మట్టికొట్టుకుపోయింది. మిగిలింది జాతీయ పార్టీ బీజేపీ. భారతీయ జనతాపార్టీ బీసీ మంత్రం పఠిస్తుండటంతో అటువైపే వెళతారన్న వార్తలు వెలువడుతున్నాయి.

ఈటల బీజేపీ వైపు వెళితే ఏమవుతుంది? చూద్దాం…

ఇదంతా ఆసక్తికరంగా సాగే ఊహాగానమే తప్ప జోస్యం కాదు. ప్రస్తుత స్థితిని ప్రాతిపదికగా చేసుకుని సమీప భవిష్యత్తును అంచనా కట్టడంగానే భావించాలి. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల గెలుపు తర్వాత బీజేపీ శ్రేణుల్లో కొంత ఊపు వచ్చింది. టీఆర్ఎస్ కించిత్ అంతర్మథనం మొదలైంది. ఆ తర్వాత జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలు, నాగార్జున సాగర్ ఉపకల్లో టీఆర్ఎస్ విజయం సాధించాక టీఆర్ఎస్ లో కాస్త తెరిపి కనిపించింది. టీఆర్ఎస్ అనడం కన్నా కేసీఆర్ ను కమలం పార్టీ ఢీ కొట్టగలదా? అనే సందేహాలు వ్యక్తమవడం మొదలైంది. బీజేపీకి బలం ఉన్న మాట ఎంత నిజమో, అనేక పరిమితులు ఉన్నవాస్తవాన్ని కూడా ఒప్పుకోవాలి.

బీజేపీ మొదటి నుంచీ భావజాల రాజకీయాల బలాన్నే నమ్ముకుంది. ఆ ప్రాతిపదికనే క్రమంగా బలం పుంజుకుంది. అయితే ప్రాంతీయ పార్టీలు ప్రధానంగా ప్రాంతీయ తత్వం, నిర్దిష్ట ప్రాంతాల్లోని బలమైన సామాజిక వర్గాల సంతృప్తీకరణ, ప్రాధాన్యం, పునరేకీకరణ పునాదిగా ఎన్నికల రణతంత్రాన్నిరచిస్తాయి. ఈ కారణంగానే దేశంలోని ప్రాంతీయ పార్టీలు సుదీర్ఘకాలం తమ ప్రాబల్యాన్ని నెరిపాయి. అయితే బీజేపీ ఈ పరిమితిని గుర్తించింది. పశ్చిమ బెంగాల్ ఎన్నికల బరిలో సామాజిక వర్గాల సమీకరణ మంత్రాన్ని పఠించింది. విజయాన్ని సాధించింది. సరిగ్గా తెలంగాణలో కేసీఆర్ ను ఢీ కొట్టాలంటే సామాజిక వర్గాల పునరేకీకరణ అనివార్యమైన రాజకీయ ఎత్తుగడ. సామాజిక వర్గాల సమీకరణ ఎత్తుగడ అంటరాని అంశం కాదు. రాజకీయాల్లో దాన్ని నిరాకరించలేని అడుగుగానే గుర్తించాలి. కాంగ్రెస్ అవకాశవాద రాజకీయాలకు భిన్నమైన లక్ష్యాలను ఎంచుకుని బలమైన సామాజిక వర్గాలను చేరదీయడం నేరమూ కాదు. ప్రస్తుతం తెలంగాణలో బీజేపీ ఒంటరిగా కేసీఆర్ ను ఢీకొట్టగలదా అంటే పోటీ ఇవ్వగలదేమో కానీ, చిత్తు చేసి ఓడించడం అసాధ్యమనే చెప్పాలి. ఈటల వంటి బలమైన బీసీ నేత, కొండా విశ్వేశ్వర్ రెడ్డి లాంటి బలమైన సామాజిక వర్గ పునాదిగల నాయకుడు బీజేపీలో చేరితే ప్రయోజనం ఉంటుందా లేదా అంటే భారీ మార్పులకు కారణమయ్యే విజయాలకు కారణం కాకపోయినా కొంత మార్పు రావచ్చు.

ఈటల, విశ్వేశ్వర్ రెడ్డిలను అభిమానించే వారంతా బీజేపీ వైపు మొగ్గాలన్న షరతేమీ లేదు. మరోవైపు బీజేపీ ఇప్పటికే Crouded space లా మారింది. కాబట్టి బీజేపీలో చేరడం కన్నా ప్రాంతీయ పార్టీ పెట్టి రాబోయే ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేయడం వల్ల ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాలను కాదనలేం! బీజేపీ, రెడ్డి, బీసీ, ఎస్సీ, ఎస్టీ కాంబినేషన్ లో ఏర్పడే కొత్త పార్టీ వల్ల మరో ప్రయోజనం కూడా చేకూరే ఛాన్స్ ఉంది. టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ కూటమి మధ్య పోటీ వల్ల టీఆర్ఎస్ ను ఓడించే ఛాన్స్ లేకపోలేదు. అంతేకాదు, తెలంగాణ సాధన తర్వాత రాష్ట్రంలో బలమైన సామాజిక వర్గాలుగా ఉన్న రెడ్డి, బీసీ, ఎస్సీలకు ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వలేదన్న భావన బలంగానే ఉంది. మరీ ముఖ్యంగా చెప్పాలంటే రెడ్డి సామాజిక వర్గం టీఆర్ఎస్ పై వ్యతిరేకతతో ఉంది.

ఇప్పటికిప్పుడు కొత్త ప్రాంతీయ పార్టీ పెట్టడం అంత సులభమా? సాధ్యాసాధ్యాలేంటో చూద్దాం…

దేశంలో ప్రాంతీయ పార్టీ ప్రాబల్యం క్రమంగా కనుమరుగవుతోన్న తరుణంలో తెలంగాణలో మరో కొత్త ప్రాంతీయ పార్టీ ఏర్పడి నిలదొక్కుకోగలదా అనే ప్రశ్న రావడం సహజం. ప్రాంతీయ ఆకాంక్ష అయిన తెలంగాణ నెరవేరింది. తెలంగాణ ఉద్వేగ స్థాయి సహజంగానే కనుమరుగవుతుంది. కాబట్టి ‘తెలంగాణ’ అనే నినాదంతో పెద్దగా ప్రస్తుతం ప్రయోజనం లేదు. కేవలం కేసీఆర్ వ్యతిరేకత మాత్రమే ప్రాతిపదికగా రాజకీయ పార్టీని స్థాపించి నడపడం సాధ్యమా అంటే అది కూడా కష్టమనే చెప్పాలి. కొత్త పార్టీ ఏర్పాటు చేయదలచుకుంటే ప్రస్తుత స్థితిని అంచనావేసి-మూడేళ్లపాటు నిబద్ధతతో పనిచేసే యువనేతలను ఎన్నుకోవాలి. సామాజిక వర్గాల ప్రాబల్యాన్ని పరిగణలోకి తీసుకోవాలి. ఒడిదుడుకులు ఎదుర్కొంటూ స్థిరమైన రాజకీయ యుద్ధం చేయాలి. అందుకు ఆర్థిక వనరులను సమకూర్చుకోవాలి. కేడర్ బేస్డ్ పార్టీని నిర్మించేందుకు ప్రయత్నించాలి. నిజానికి టీఆర్ఎస్ శ్రేణీబలం ఉన్న పార్టీ కాదు. కేసీఆర్ స్టేచర్ పై ఆధారపడిన బలహీన నిర్మాణం. బీజేపీకి స్థిరమైన, బలమైన కేడర్ ఉంది. కొత్త ప్రాంతీయ పార్టీ సైతం గ్రామీణ ప్రాంతాల్లో బలపడాలి. పటిష్ఠమైన ప్రచార యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకుని నిరంతరం ప్రభుత్వ విధానాలను ఎండగట్టాలి. ఈటల, కొండా సహా మరికొంతమంది నేతలు అనుకుంటే ప్రాంతీయ పార్టీని ఏర్పాటు చేసి అనుకున్న లక్ష్యాన్ని సాధించవచ్చు. అది ఎంత వరకు జరుగుతుందో వేచి చూడాల్సిందే!

ఇక మిగిలిన ప్రత్యామ్నాయం స్వతంత్రంగా ఉండటం. ప్రస్తుతం ఈటల ఎదుర్కొంటున్న రాజకీయ ఒత్తిడుల నేపథ్యంలో స్వతంత్రంగా ఉండటం అసాధ్యం. ఇదే విషయాన్ని ఇటీవల ఈటల వ్యక్తిగతంగా ఉప ఎన్నిక కోసం చేయించిన సర్వేలో వెల్లడైనట్టూ సమాచారం. ఈటల సమగ్ర నివేదికలు తెప్పించుకున్న తరువాతే ఉప ఎన్నికలకు ఒంటరిగా వెళ్లే ప్రయత్నం చేయలేదని తెలుస్తోంది. మంత్రివర్గం నుంచి తొలగించిన తరువాత విశ్వసనీయంగా చేయించుకున్న సర్వే ఫలితం అంతా కూడా ప్రతికూలంగా రావడం వల్లే ఇండిపెండెంట్‌గా పోటీ చేసేందుకు విముఖత చూపినట్టు సమాచారం. స్వతంత్ర అభ్యర్థిగా ఈటల పోటీ చేస్తే ముందుగా ప్రజల్లోకి ఆయనకు ఎన్నికల కమిషన్ కేటాయించే గుర్తును తీసుకెళ్లడం అంత సులభం కాదు. అంతేకాకుండా ఈటల రాజేందర్ కారు గుర్తు అన్న భావనలో ఉన్న సామాన్య జనం సాధారణంగా కారు గుర్తుకు వేసే అవకాశాలు మెండుగానే ఉంటాయి. అధికార పార్టీ ఇండిపెండెట్లను పెద్ద ఎత్తున పోటీలో నిలిపే అవకాశం ఉంటుంది.

ఉప ఎన్నిక జరిగితే ఈటల గుర్తు ఈవీఎంలలో ఓటర్లు గుర్తించే అవకాశం చాలా అరుదనే చెప్పాలి. స్వతంత్ర అభ్యర్థులు పెద్ద సంఖ్యలో పోటీ చేస్తే వారు చీల్చుకునే ఓట్లు కూడా గెలుపు ఓటములను శాసిస్తాయి. ఈ నేపథ్యంలో రాజీనామా చేయకుండా మిన్నకుండి పార్టీల మద్దతు కూడగట్టుకునే ప్రయత్నం చేశారు ఈటల. రాష్ట్రంలోని ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌లు అభ్యర్థులను పోటీలో నిలబెట్టకుండా ఉంచాలన్న ప్రయత్నాలు చేసినప్పటికీ సానుకూలత లభించిందో లేదో తెలియదు. ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తే టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీప బంధువు అయిన కౌశిక్ రెడ్డిని కాదని తనకు మద్దతు ఇచ్చే అవకాశాలు లేకపోవచ్చు. 2010 మే 28న తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న సమయంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మానుకోట టూర్‌కు వెళ్లారు. తెలంగాణ ఉద్యమకారులకు, వైఎస్సార్సీపీ నాయకులకు మధ్యన పెద్ద ఎత్తున గొడవ జరిగింది. రాళ్ల దాడి నుండి కాల్పుల వరకూ వెళ్లింది. తెలంగాణ ఉద్యమ చరిత్రలో అత్యంత ఘోరమైన ఘటనగా చెప్పే మానుకోట ఘటనలో ఇద్దరు ఉద్యమకారులు మరణించగా పెద్ద ఎత్తున గాయాలపాలయ్యారు. ఈ ఘటన జరిగి సరిగ్గా 12 ఏళ్లయిన రోజుకు ఓ రోజు ముందు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఈటల సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. మొత్తంగా ఈటల రాజేందర్ సరికొత్త రాజకీయ చర్చకు కారణమయ్యారు. కేసీఆర్ పై వ్యతిరేకత వ్యక్తమవుతున్న కాలంలో ఈటల ఎపిసోడ్ టీఆర్ఎస్ మేలుకన్నా కీడు చేసే అవకాశాలే ఎక్కువంటారు నిపుణులు.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

3 + 6 =