ఈ మధ్య కాలంలో భార్యా భర్తల మధ్య సంబంధాలు ఎంతో సున్నితంగా మారిపోయాయి. చిన్న చిన్న మాటలు కూడా చివరకు డైవోర్స్ దాకా వెళ్ళిపోతూ ఉంది. ఈ పవిత్ర బంధాన్ని పరిహాసం చేస్తున్న వాళ్లు ఎంతో మంది ఉన్నారు. అయితే అలాంటి వాళ్ళందరి కళ్లు తెరిపించేలా ఓ మహిళ ప్రవర్తించింది. చనిపోయిన భర్తకు గుర్తుగా.. ఏకంగా గుడినే కట్టేసింది ఆమె..! భర్తకు పూజలు చేయడమే కాకుండా అన్నదానం వంటి కార్యక్రమాలను చేపడుతూ ఉన్నారు. నిజంగా ఆమె చేసిన పని గ్రేట్ అంటూ దేశ వ్యాప్తంగా మెచ్చుకుంటూ ఉన్నారు.
ప్రకాశం జిల్లా పొదిలి మండలం నిమ్మవరంకు చెందిన అంకి రెడ్డి, పద్మావతి భార్యాభర్తలు. ప్రకాశం జిల్లా పొదిలి మండలం నిమ్మవరం గ్రామానికి చెందిన అంకిరెడ్డి, పద్మావతికి 21 సంవత్సరాల క్రితం వివాహమైంది. నాలుగేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు అంకిరెడ్డి. తన భర్త మరణానంతరం ఆయనకు ఏకంగా గుడి కట్టి.. నిత్యం పూజలు చేస్తుంది అతని భార్య. అంతేకాదు ప్రతి పౌర్ణమి, శని, ఆదివారాలలో పేదలకు అన్నదానం కూడా చేస్తుంది. అలాగే ప్రతి ఏటా గురుపౌర్ణమికి అంకిరెడ్డి పేరుమీద, ఆమె పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఆనవాయితీగా పెట్టుకుంది.
అంకిరెడ్డి నాలుగేళ్ల కిందట రోడ్డు ప్రమాదంలో కన్నుమూసినప్పటి నుండి భర్త లేడనే విషయాన్ని ఆమె మర్చిపోలేకపోయారు. భర్త అంకిరెడ్డిని గుర్తు చేసుకుంటూ గడుపుతూ వచ్చారు. చనిపోయిన భర్తకు గుర్తుగా ఆమె పాలరాతి విగ్రహం చేయించి గుడిలా నిర్మాణం చేపట్టి ప్రతిష్టించారు. నిత్యం పూజలు చేస్తూనే సమాజ సేవ కూడా చేస్తున్నారు. కుమారుడు శివశంకర్ రెడ్డితో కలిసి సేవా కార్యక్రమాలను ఆమె నిర్వహిస్తూ ఉన్నారు.