ఏడాదిన్నర కాలంగా కరోనా ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. మందులేని ఈ మహమ్మారిని అడ్డుకోవాలంటే వ్యాక్సిన్ ఒక్కటే ఏకైక మార్గం. మన దేశంలో జనవరిలో ప్రారంభమైన వ్యాక్సినేషన్ ప్రక్రియ నిరాటంకంగా కొనసాగుతోంది. అనుమతి పొందిన మూడు వ్యాక్సిన్ల ప్రస్తుతం ప్రజలకు అందుబాటులో వున్నాయి. ఇప్పటికే 30 కోట్ల మందికి పైగా వ్యాక్సినేషన్ పూర్తయింది. ఫ్రంట్ లైన్ వారియర్లు, సెలబ్రిటీలు, రాజకీయ నాయకులైతే ఎప్పుడో వ్యాక్సిన్లు తీసుకున్నారు. కానీ, కొందరు రాజకీయ నాయకులు మాత్రం ఇందుకు భిన్నంగా ప్రవర్తిస్తున్నారు. వ్యాక్సిన్లు వేసుకోవడానికి ససేమిరా అంటున్నారు. వీరిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది పశ్చిమ బెంగాల్ చీఫ్ మినిస్టర్ మమతా బెనర్జీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. వీరిద్దరు మినహా.. దాదాపు దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కనీసం ఒక్క డోసైనా వేయించుకున్నారు. కానీ, వీళ్లిద్దరు మాత్రం వ్యాక్సిన్ల జోలికి వెళ్లలేదు.
సెకండ్ వేవ్ ఉధృతి.. ఇప్పటికే ఎందరో రాజకీయ నాయకులను బలితీసుకుంది. అయినా, ఈ ఇద్దరు నేతలు మాత్రం వ్యాక్సిన్ కు దూరంగా వున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ పట్ల ద్వేషమో,.. లేక, వాటిని బీజేపీ వ్యాక్సిన్లుగా భావించడమో,.. లేక, తమ రాష్ట్రాల్లోని మైనార్టీ శ్రేణులకు కట్టుబడాల్సిరావడమో తెలియదు గానీ.. ఈ ఇద్దరు నేతలు మాత్రం వ్యాక్సిన్లు తీసుకోవడానికి ముందుకు రావడం లేదు. గాంధీ కుటుంబం అడుగుజాడల్లోనే స్వదేశీ టీకాలపై ఏహ్యభావాన్ని ప్రదర్శిస్తున్నారు. బహుశా వీళ్లంతా భారత్ లో పైజర్ లేదా మొడెర్నా టీకాలు అందుబాటులోకి వచ్చిన తర్వాతే టీకాలు వేయించుకుంటారేమో..!
ఇద్దరు ముఖ్యమంత్రులు వ్యాక్సిన్ కు దూరంగా వుండటానికి,.. మైనార్టీ ఓటు బ్యాంకు ప్రభావమే కారణమనిపిస్తోంది. అన్ని వర్గాలని కాదు గానీ, మన దేశంలోని కొన్ని ముస్లిం మైనార్టీ వర్గాలు మొదటి నుంచీ వ్యాక్సినేషన్ పై పెద్దగా శ్రద్ధ చూపడం లేదు. అందుకే, అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ కొవిడ్ హాట్ స్పాట్ గా మారిపోయింది. టీకాలను అశ్రద్ధ చేసి పలువురు ప్రొఫెసర్లు, బోధనేతర సిబ్బంది ప్రాణాలు కోల్పోయిన పరిస్థితిని కూడా చూశాం. ఇలా విద్యాబుద్ధులు చెబుతున్న ప్రొపెసర్లే మతమౌఢ్యంలో కూరుకుపోయి.. వ్యాక్సిన్ కు దూరంగా వుండటం దిగ్బ్రాంతి కలిగించే అంశం. యూనివర్సిటీలో ఉన్నత విద్యావంతులైన నిపుణులే ఇలాంటి కుంచిత మనస్తత్వానికి లొంగిపోతే, ముస్లిం మైనార్టీ ఆధిపత్యం కొనసాగుతున్న పశ్చిమ బెంగాల్, తెలంగాణలో పరిస్థితిలు భిన్నంగా ఎందుకుంటాయి..? ఇక, వారి కనుసన్నల్లో నడిచే ఇద్దరు ముఖ్యమంత్రులు టీకాలకు దూరంగా వుండటంలో ఆశ్చర్యమేముంది..?
మైనార్టీ సపోర్టు లేకుండా ఈ ఇద్దరు నాయకులు ఎన్నికల్లో విజయం సాధించడం కల్ల. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ముస్లింలంతా టీఎంసీకే ఓటు వేయాలని మమతా బెనర్జీ బహిరంగంగా పిలుపునిచ్చారు. ఓవైపు కరోనా కేసులు పెరుగుతున్నా.. ఈద్ ఉత్సవాల్లో తెలంగాణ సీఎం ముస్లింలకు ఉచిత పాస్ అందజేశారు. దీంతో చార్మినార్ ప్రాంతంలో కొవిడ్ నిబంధనలు గాలికొదిలేవారు. ఈద్ షాపింగ్ కోసం మాస్కులు, సామాజికదూరాన్ని మరిచిపోయి జనం భారీగా గుమికూడారు. సరే, ఇదంతా.. తెలంగాణ సీఎంకు మైనార్టీల పట్ల అభిమానం అనుకుందాం. కానీ, అదే మైనార్టీ వర్గాలు వ్యాక్సిన్లు వేసుకునేలా ఎందుకు ప్రోత్సహించడం లేదు..? పైగా వారి మనోభావాలు ఎక్కడ దెబ్బతింటాయోనని వ్యాక్సిన్ వేసుకోవడానికే భయపడుతున్నారు. ఇది ఓటు బ్యాంకు రాజకీయం కాదా..?
నిజానికి, హైదరాబాద్ లో మైనార్టీలకు మొదటి నుంచి వ్యాక్సిన్లపై నమ్మకం లేదు. కొవిడ్ టీకా విషయంలోనే కాదు.. ఇతర టీకాల పట్ల కూడా వారికి చిన్నచూపే. పోలియోకు వ్యతిరేకంగా భారత్ సమర్థవంతంగా పోరాటం చేస్తుంటే.. పోలియో చుక్కల మందును వారు విషంలా భావిస్తారు. పోలియో చుక్కలు వేసుకుంటే నపుంసకత్వం వస్తుందని కూడా ప్రచారం చేస్తారు. కరోనా వ్యాప్తి ప్రారంభమైన నాటి నుంచి ఈ ఏడాదిన్నర కాలంలో.. వ్యాక్సిన్లు వేస్తున్న ఫ్రంట్ లైన్ వర్కర్లపై మైనార్టీ వర్గాలు దాడులు చేసిన సందర్భాలు కూడా వున్నాయి. అన్ని వర్గాలని చెప్పడం కాదు గానీ, మైనార్టీల్లో కొంతమంది సంప్రదాయక వర్గాలు మతపరమైన కారణాల మీద టీకాలకు దూరంగా వుంటున్నారు. వీరు వ్యాక్సిన్లను ఎల్లప్పుడూ వ్యతిరేకిస్తూనేవుంటారు. కానీ, అందరికీ ఆదర్శంగా నిలవాల్సిన నాయకులే టీకాలు వేసుకోకపోవడాన్ని ఎలా చూడాలి..? ఇది మైనార్టీ వర్గాల్లో టీకాల పట్ల వున్న వ్యతిరేక భావనను మరింత పెంచిపోషించినట్టు కాదా..?
ఇటీవలే సీఎం కేసీఆర్ కొవిడ్ బారిన పడి కోలుకున్నారు. సో.. నిబంధనల ప్రకారం కనీసం మూడు నెలలు టీకా తీసుకోకూడదు. కానీ, ఇన్నాళ్లూ ఏంచేసినట్టు..? టీకా తీసుకోవడంలో నాయకులకు ఎందుకీ అలసత్వం..? కేవలం ఒక వర్గాన్ని సంతృప్తి పరిచేందుకే.. కేసీఆర్, మమతా బెనర్జీ వంటి నాయకులు టీకాలకు దూరంగా వుండటం న్యాయమేనా..? భారతీయ టీకాలను ప్రోత్సహిస్తూ.. ప్రజల్లో మరింత అవగాహన పెంచాల్సిన నాయకులే వాటికి దూరంగా వుంటే.. ఈ సమాజానికి ఎలాంటి సందేశం ఇస్తున్నట్టు..? ఇప్పటికైనా ఈ ఇద్దరు సీఎంలు ఓటు బ్యాంకు రాజకీయాలను పక్కనబెట్టి, మానవత్వాన్ని కాపాడటంపై దృష్టిపెట్టాలి. మైనార్టీలు కూడా ఈ దేశంలో ఒక భాగమేనన్న సత్యాన్ని గుర్తించి.. వారిలో టీకాల పట్ల వున్న వ్యతిరేక భావాలను తొలగించే ప్రయత్నం చేయాలి. కొందరు కరుడుగట్టిన సంప్రదాయవాదులు ఎలాగూ మారరు. కానీ, మిగతా వర్గాలకైనా టీకా అందేలా చర్యలు తీసుకోవాలి.