నటి ఖుష్బూకు క్షమాపణలు.. కానీ..!

0
789

తమిళనాడులోని అధికార పార్టీ నేత సైదై సాదిక్ నటి ఖుష్బూకు క్షమాపణలు తెలిపారు. తన ప్రసంగాన్ని వక్రీకరించి సోషల్ మీడియాలో విడుదల చేశారని ట్విట్టర్‌లో ఆయన వివరణ ఇచ్చారు. ఖుష్బూ మనసు గాయపడి ఉంటే తనను క్షమించాలని కోరారు. సినీ తారలు ఖుష్బూ, గౌతమి, నమిత, గాయత్రి తదితరలను ఉద్దేశించి తమిళనాడులోని అధికార పార్టీ నేత సైదై సాదిక్ చేసిన ‘ఐటెమ్స్’ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. బీజేపీలో చేరిన ఆ నలుగురు ‘ఐటెమ్స్’ అని సాదిక్ అన్నారు. తమిళనాడులో కమలం వికసిస్తుందన్న ఖుష్బూ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. అమిత్ షా బట్టతలపై జుట్టు మొలుస్తుందేమో కానీ, తమిళనాడులో కమలం మాత్రం వికసించదని అన్నారు. సాదిక్ చేసిన ‘ఐటెమ్స్’ వ్యాఖ్యలపై ఖుష్బూ తీవ్రంగా స్పందించారు. ‘‘వీరేనా కలైంజర్ వారసులు?’’ అని ఆగ్రహం వ్యక్తం చేస్తూ కనిమొళిని ట్యాగ్ చేశారు. స్పందించిన కనిమొళి తమ పార్టీ నాయకుడి వ్యాఖ్యలపై తాను క్షమాపణలు చెబుతున్నట్టు ట్వీట్ చేశారు.

డీఎంకే నేతల వ్యాఖ్యల పట్ల సీఎం స్టాలిన్ ఎందుకు మౌనంగా ఉన్నారని ఖుష్బూ ప్రశ్నించారు. స్టాలిన్ స్పందించకుండా ఉంటే అర్థం ఏంటి? ఆయన మౌనం దేనికి సంకేతం? అని ఆమె ప్రశ్నించారు. ఈ విషయంలో సీఎం స్టాలిన్ నాకు మద్దతుగా నిలుస్తారని ఆశిస్తున్నాను. కానీ ఆయన ఎందుకు మాట్లాడడంలేదు? అని ప్రశ్నించారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆ డీఎంకే నేతను వదిలేది లేదని, ఎక్కడికి వెళ్లాలో అక్కడికే వెళతానని హెచ్చరించారు. ఇది తన ఆత్మగౌరవం, మర్యాదలు సంబంధించిన విషయం అని ఖుష్బూ స్పష్టం చేశారు.