కథల్లాగే రాజకీయాలు కూడా ఊహించని మలుపులు తిరుగుతుంటాయి. లంకలో పుట్టినవాళ్లందరూ రాక్షసులే అంటూ గతంలో ఆంధ్రా ప్రాంతం వారి గురించి నోరు పారేసుకున్న కేసీఆర్ ఇప్పుడు…తానే స్వయంగా నిర్వచించిన లంకకే బయలు దేరారు. మలిదశ తెలంగాణ ఉద్యమ కాలం అర్థ విపరిణామాన్ని వేగిరం చేసింది. ‘ఆంధ్ర’ అంటే వైరి భూభాగమనీ, ఆంధ్ర ప్రాంత వాసులంటే శతృవులు అనే మాటలు విరివిగానే చెవినపడేవి. అది ప్రాంతీయ ఉద్యమాలకు ఉండే పరిమితి కావచ్చు. అంతకు మించి వాటిని నడిపే పార్టీలకు ఉండాల్సిన మోతాదులో విచక్షణ లేకపోవడం కూడా కావచ్చు. కానీ, తాజా రాజకీయ స్థితి వీటన్నింటినీ రద్దు చేసింది.
భారత్ రాష్ట్ర సమితిగా పేరు మార్చుకున్న తెలంగాణ రాష్ట్ర సమితి నవ్యాంధ్రలోకి ప్రవేశిస్తున్నట్టూ వార్తలు వస్తున్నాయి. త్వరలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏపీలో పర్యటించనున్నారనే లీకులు వినపడుతున్నాయి. తెలంగాణ ఉద్యమ తీవ్రతను అనుభవించిన ఆంధ్రాప్రాంత వాసులు కేసీఆర్ విషయంలో ఎలా స్పందిస్తారనే ఆసక్తి అంతటా నెలకొంది. అందుకు ప్రధాన కారణం నాడు ఆయన నోటివెంట వచ్చిన తిట్లూ, శాపనార్థాలను ఏపీ వాసులు అంత సులభంగా మరిచిపోరు. అసలు తెలుగు రాష్ట్రల విభజనకు కారణమై, తమ రాష్ట్రం ఏకాకి కావడానికి మూలభూతమయ్యాడనే నిందను కేసీఆర్ ఎదుర్కొంటూనే ఉన్నారు. ఇది ఉత్కంఠరేపే మొదటి ఆసక్తికరమైన రాజకీయ పరిణామం.
రెండో పరిణామం మరింత ఉత్కంఠరేపేది.
ఉమ్మడి ఏపీలో సుదీర్ఘకాలం పాటు అధికారాన్ని అనుభవించిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్రకు తరలిపోయింది. తెలంగాణలో మిగిలిన ఆ పార్టీ కేడర్ ఎవరికి తోచినదారి వారు చూసుకున్నారు. మొత్తంగా తెలంగాణలో ఆ పార్టీ ఉనికి రద్దయిపోయింది.
ఎనమిదేళ్లు గడచిన తర్వాత ఈ దృశ్యం తారుమారైంది. తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక భూమిక పోషించిన తెలంగాణ రాష్ట్ర సమితి ఉరఫ్ భారత్ రాష్ట్ర సమితి ఏపీలోకి ప్రవేశిస్తోంంది. ఆంధ్రా పార్టీగా ముద్రపడిన తెలుగుదేశం పార్టీ తెలంగాణలోకి పున:ప్రవేశం చేస్తోంది.
ఊహించని ఈ రెండు నాటకీయ రాజకీయ పరిణామాలు సూచిస్తున్నదేంటి? ఆంధ్రాప్రాంత ద్రోహిగా ముద్రపడిన కేసీఆర్ ఏపీకి ఎందుకు వెళుతున్నట్టూ? తమకు తీరని అన్యాయం చేసిన నేతగా తెలంగాణవాసులు భావించే చంద్రబాబు మళ్లీ ఎందుకు హఠాత్ రంగప్రవేశం చేసినట్టూ?
ఈ సందేహాలే అంతటా వ్యక్తమవుతున్నాయి. ఈ నాటకీయ సన్నివేశంలో ఇమిడి ఉన్న రాజకీయ ఉద్దేశాలేంటో అంచనాకట్టే ప్రయత్నం చేస్తాను.
ఏపీలో బీఆర్ఎస్ తన తొలిశాఖను ప్రారంభించనుందనే వార్తలు బయటకు పొక్కాయి. ప్రజారాజ్యం, జనసేన తరపున పోటీ చేసిన ఓటమి పాలైన మాజీ ఐఏఎస్ అధికారి తోట చంద్రశేఖర్, మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు, మాజీ ఐఆర్ఎస్ అధికారి చింతల పార్థసారథితో పాటు ఉభయ గోదావరి జిల్లాల్లోని నేతలు కొంతమంది బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకుంటున్నట్టూ తెలుస్తోంది.
డిసెంబర్ 22న ఖమ్మం పట్టణంలో టీడీపీ భారీ బహిరంగ సభ నిర్వహించింది. తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి పూర్వవైభవం తెచ్చేందుకు పూనుకుంటున్నట్టూ ఆ పార్టీ తెలంగాణ చీఫ్ కాసాని జ్ఞానేశ్వర్ ప్రకటించారు. రాబోయే రోజుల్లో మరిన్ని సభలు కూడా నిర్వహించనున్నట్టూ స్పష్టం చేశారు.
అసలు బీఆర్ఎస్ ఏపీలో ఎందుకు విస్తరిస్తున్నట్టూ?
ఆంధ్రాప్రాంత ప్రజలకు కేసీఆర్ బద్ధద్వేశి. అలాంటిది కేసీఆర్ ఏ ప్రయోజనాలు ఆశించి ఏపీలో బీఆర్ఎస్ ను స్థాపిస్తున్నట్టనే అనుమానాలు అంతటా ఉన్నాయి. ఇందుకు కారణాలూ లేకపోలేదు. ఏపీ ఇప్పటికే క్రిక్కిరిసిన రాజకీయ ప్రాంగణం. అధికార వైసీపీతో పాటు మరోసారి ముఖ్యమంత్రి కావాలని ఉబలాటపడుతున్న చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒకవైపు అధికార సాధన లక్ష్యంగా ముందుకు సాగుతున్న బీజేపీ మరోవైపు….రాజకీయ మైదానాన్ని ఉద్రిక్తం చేస్తున్నాయి. ఇంత పోటీ నెలకొన్నచోట కేసీఆర్ ఏం చేస్తారు? ఏం చేయగలరు?
ఏపీలో ఎన్నికలు జరిగితే….ఒక వేళ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో ప్రభుత్వం ఏర్పాటైతే…ఈ పరిణామాన్ని కేసీఆర్ అంతసులభంగా జీర్ణం చేసుకోరు. అది తనకంత కలిసివచ్చే అంశం కూడా కాదనుకుంటారు. పొరుగు రాష్ట్రంతో సంప్రదింపులకు తావులేని స్థితి ఏర్పడుతుందని కూడా కేసీఆర్ భావిస్తూ ఉండవచ్చు. పూర్వాశ్రమంలోని ఆగర్భశతృవు అధికారంలోకి వస్తే….అనిశ్చిత వాతావరణం ఏర్పడుతుందని కూడా అనుకోవచ్చు.
ఇలా కాకుండా….
ఉద్రిక్త యుద్ధ రంగంలోని ప్రస్తుత ప్రత్యర్థి భారతీయ జనతా పార్టీ, పవన్ కళ్యాణ్ తో జట్టుకట్టి అధికార పగ్గాలు చేపడితే…ఈ పరిస్థితి మరింత ఇరకాటంలో పడేస్తుందని కూడా అనుకుంటూ ఉండవచ్చు. ఇప్పటికే జాతీయ పార్టీ బీజేపీతో బరిగీసి తాను స్థాపించిన ప్రాంతీయ పార్టీని ఏకంగా జాతీయ పార్టీగా పేరు మార్చిన కేసీఆర్ ఏపీలో ఆ పార్టీ అధికారంలోకి వస్తే….పక్కన బల్లెంలా భావిస్తారు.
ఇంకో స్థితిని కూడా ఊహిద్దాం. టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే…ఈ పరిస్థితి మరింత సంక్లిష్టమవుతుంది. ఈ మొత్తం అంచనాల్లో మెరుగైన మితృడు వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి మాత్రమే అని కూడా కేసీఆర్ భావిస్తూ ఉండవచ్చు.
అయితే….తాను ఎలాంటి పాత్ర పోషిస్తే….జగన్మోహన్ రెడ్డికి పరోక్షంగా ఎలాంటి సాయం అందించవచ్చు అని కేసీఆర్ ఆలోచించి బీఆర్ఎస్ ను ఏపీలో స్థాపిస్తే….ఎన్నోకొన్ని ఓట్లు చీల్చవచ్చని కూడా కేసీఆర్ అంచనా కట్టి ఉండవచ్చు.
అయితే…నిన్నగాక మొన్న పుట్టిన బీఆర్ఎస్…సంకీర్ణమైన ఏపీ రాజకీయాల్లో ఓట్లు చీల్చి…నష్టపరిచే స్థాయి పాత్రను పోషించగలదా? అది కూడా పరిశీలిద్దాం.
ఏపీలో ప్రస్తుతం కాపుల అంశంపై తీవ్ర స్థాయి చర్చ జరుగుతోంది. ఉభయ గోదావరి జిల్లాల్లో కాపు జనాభా ఎక్కువ. ప్రస్తుతం బీఆర్ఎస్ లో చేరుతున్నది కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలే ఎక్కువ. ఎన్నికల వేళ వైసీపీకి ఉభయ గోదావరి జిల్లాల్లో కాపుల ఓట్ల అంశంలో క్లిష్టపరిస్థితి ఏర్పడితే…బీఆర్ఎస్ చీల్చే ఓట్ల వల్ల ఏమైనా ప్రయోజనం చేకూరవచ్చని కూడా కేసీఆర్ ఆలోచించి ఉండవచ్చు. నాలుగు పార్టీలు తలపడుతున్న ఏపీ ఎన్నికల మైదానంలో వందల ఓట్లు కూడా గెలుపోటములను నిర్ణయించే అవకాశం తప్పక ఉంటుంది. గత ఎన్నికల్లో టీడీపీ కొన్ని స్థానాల్లో వందల ఓట్లతో ఓడిపోయిన ఉదాహరణ ఉండనే ఉంది. కాబట్టి బీఆర్ఎస్ ఏపీ శాఖను ఏర్పాటు చేయడం వల్ల వైసీపీ ఏమాత్రం మేలు చేయగలిగినా మంచిదే అనే భావనతోనే కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చు.
అంతేకాదు, ఏపీ రాజకీయ భ్రష్టత్వం పరాకాష్టకు చేరుకున్న నేపథ్యంలో నవ్యాంధ్ర ప్రజలకు….కేసీఆర్ పై కొన్ని భ్రమలు ఉండవచ్చు. తమ రాష్ట్ర పాలకులకన్నా….కేసీఆర్ మేలనే వ్యాఖ్యలు గతంలో అక్కడక్కడా వినపడిన దాఖలాలు కూడా ఉన్నాయి. ఒకటి రెండు సందర్భాల్లో కేసీఆర్ ఏపీని సందర్శించినప్పుడు భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన స్వాగతం పలికిన ఉదంతాలు ఉండనే ఉన్నాయి. ఈ మొత్తం పరిస్థితిని అంచనా వేసిన తర్వాత ఏపీలో ఎంతో కొంత ప్రభావం వేయొచ్చని కూడా కేసీఆర్ అనుకుని ఉండవచ్చు.
స్థూలంగా ఈ అంచనాల నడుమ బీఆర్ఎస్ విస్తరణను ఏపీ నుంచి ఆరంభించాలని కేసీఆర్ భావించే ఛాన్స్ ఉంది.
మొత్తంగా ఒకప్పుడు తాను విపరీతంగా ద్వేషించిన ప్రాంతాన్ని….తాజా పరిస్థితుల్లో ప్రయోగశాలగా మార్చుకోవాలనుకుంటున్న కేసీఆర్ కలలు ఏ మేరకు నెరవేరతాయో వేచి చూడాలి.
ఇక చంద్రబాబు తెలంగాణలో టీడీపీ ఎందుకు పూర్వవైభవం తేవాలని అనుకుంటున్నారు?
తెలంగాణ ఆవిర్భావం తర్వాత టీడీపీ బలంగా ఉన్న జిల్లాల్లోని ఆ పార్టీ శ్రేణులు గరిష్ట సంఖ్యలో తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారు. తెలంగాణలో స్థిరపడిపోయిన ఏపీవాసులు కూడా అధికారంలో ఉన్న పార్టీవైపు మొగ్గు చూపితేనే ప్రయోజనమని భావించి అదే బాటన నడిచారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఈ విషయం ప్రస్ఫుటమైంది. తెలంగాణ ప్రాంత వాసుల ఓట్లు ఎక్కువగా ఉన్నచోట బీజేపీ విజయం సాధిస్తే…ఆంధ్రాప్రాంత వాసుల ఓట్లు మెజారిటీగా ఉన్నచోట టీఆర్ఎస్ ఎక్కువ స్థానాలు గెలుచుకుంది.
ఏపీలో బీజేపీ ఒకవేళ తనతో చేతులు కలిపితే…..తెలంగాణలో టీడీపీని పున:ప్రతిష్టించడం ద్వారా బీజేపీకి తాను సహకరించాలని కూడా చంద్రబాబు అనుకుని ఉండవచ్చు. టీడీపీ తుడిచిపెట్టుకుపోయిన కారణంగా…మాత్రమే ఆంధ్రాప్రాంత ఓటర్లు టీఆర్ఎస్ వైపు మొగ్గారనీ, మళ్లీ టీడీపీని పటిష్టం చేస్తే…వారి ఓట్లను తిరిగి ఆకర్షించవచ్చని కూడా చంద్రబాబు అంచనా వేయడం మూలంగానే మళ్లీ…..టీడీపీ పూర్వవైభవం గురించి మాట్లాడుతున్నారా అనే అనుమానాలూ ఉన్నాయి. అయితే ఇవేవీ నిర్ధారిత అంచనాలు కావు.
ఖమ్మం జిల్లా ఏపీకి పొరుగున ఉన్న జిల్లా. ఇక్కడ టీడీపీ కార్యకర్తలు ఏదో మేరకు ఉన్నారు. వారంతా రాజకీయంగా స్తబ్దుగా ఉన్నారు. కాబట్టి ఖమ్మం జిల్లాలో టీడీపీ విజయం సాధించిక పోయిన అధికార పార్టీకి నష్టం కలుగజేసే అవకాశాలున్నాయి. ఇక హైదరాబాదు మహానగరంలో ఆంధ్రాప్రాంత ఓటర్లు గణనీయమైన సంఖ్యలో ఉన్నారు. బీజేపీకి జీహెచ్ఎంసీ పరిధిలోని అసెంబ్లీ స్థానాలు కీలకం కూడా. కాబట్టి చంద్రబాబు ఇవన్నీ గుర్తించి బీజేపీకి ఎరవేయడానికి కూడా చంద్రబాబు టీడీపీ పూర్వవైభవం గురించి మాట్లాడుతూ ఉండవచ్చు.
ఇదీ స్థూలంగా ఒక అంచనా. ప్రాంతాల ప్రయోజనం పేరుతో పరస్పరం ద్వేశించుకున్న నేతలు తారుమారుగా నడకసాగిస్తున్నారు. నిర్దిష్టంగా ఒక ప్రాంత ప్రజలను లక్ష్యంగా చేసుకుని ఉద్యమం చేసిన పార్టీలు….భిన్న ధ్రువాల్లో ప్రయాణిస్తున్నాయి.
ఏపీ ప్రజలు తాము సుదీర్ఘకాలం ద్వేశించిన కేసీఆర్ ను ఆదరిస్తారా? తెలంగాణలో చంద్రబాబు వేసిన ఎరకు బీజేపీ చిక్కుతుందా? ఈ సందేహాలకు జవాబు కోసం వేచి చూడాల్సిందే!