మునుగోడు విజేత ఎవరు..?

0
1089

ఎన్నిక నల్లేరు మీద నడక కాదు. డబ్బు మాత్రమే గెలుపు గుర్రమెక్కించదు. పార్టీ ప్రాబల్యం, వ్యక్తిగత ప్రాభవం, పార్టీ శ్రేణుల బలం ఈ మూడింటి మేలుకలయిక విజయాన్ని సునాయాసం చేస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఆరో అసెంబ్లీ ఉప ఎన్నిక మూడు రాజకీయ పార్టీలకు ముచ్చెమటలు పట్టిస్తోంది. మునుగోడు బైపోల్ మాకో యూనిట్ టెస్ట్ అని కేటీఆర్ మేకపోతు గాంభీర్యంతో అన్నా…గెలుపు అంత సులభం కాదని వారి అంతరంగానికి తెలుసు. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పట్ల సొంత పార్టీలోనే వ్యతిరేకత బాహటంగా వ్యక్తమవుతుండటం కారు పార్టీకి ప్రతికూలంగా మారింది. కూసుకుంట్లకు బి.ఫాం ఇవ్వొద్దని అసమ్మతి నేతలు ప్రగతి భవన్ మెట్లెక్కారంటే వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది.

వ్యూహాత్మకంగా మునుగోడు ఉప ఎన్నికను ముందుకు తెచ్చిన భారతీయ జనతా పార్టీకి కూడా బైపోల్ బరి అనుకున్నంత సులభంగా ఏమీ లేదు. గెలుపు కోసం అవసరమైన అన్ని ప్రయత్నాలు చేసినా చిన్న శంక ఒకటి మిగిలిపోతుంది. ప్రస్తుతం బీజేపీ పరిస్థితి అదే! తరుణ్ చుగ్, సునిల్ బన్సల్ లాంటి మేటి వ్యూహకర్తలు పూర్తి స్థాయిలో కేంద్రీకరించి పనిచేస్తున్నా…విజయం మాదే అని కరాఖండిగా చెప్పడం కష్టం. 

విజయం తమదే అని కాంగ్రెస్ పదే పదే ప్రకటించినా… అపజయం తప్పదని ఆ పార్టీ అధినేతలకు బాగా తెలుసు. కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రచారానికి వస్తారారో తెలియదు. మరోవైపు కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలతో….హస్తం పార్టీ ఓటమి అంచుల్లో ఉండి గెలుపు ప్రకటనలు చేస్తోంది.

ఇంతకూ మునుగోడు బైపోల్ బరిలో జరుగుతున్న పరిణామాలేంటి? ఏ పార్టీకి విజయావకాశాలున్నాయి? ఎవరిపట్ల వ్యతిరేకత ఉంది? కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పై ఉన్న వ్యతిరేకత కారుపార్టీకి నష్టం చేస్తుందా? గ్రామీణ ప్రాంతాల్లో ప్రచారం చేయడంలో బీజేపీ వెనుకబడి ఉందా? దుబ్బాక, హుజురాబాద్ ఉప ఎన్నికలకూ మునుగోడు ఉప ఎన్నికకూ ఉన్న వ్యత్యాసం ఏంటి? ప్రచార పర్వంలో టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తల మధ్య లోకల్ నాన్ లోకల్ వివాదం ఓటింగ్ సరళిపై ప్రభావం చూపనుందా? రాజగోపాల్ రెడ్డి రాజీనామా తర్వాత ఉప దరఖాస్తు చేసుకున్న 24వేల మంది కొత్త ఓటర్ల విషయంలో బీజేపీకి ఉన్న అభ్యంతరం ఏంటి? ఓటర్లను ఆకర్శించేందుకు టీఆర్ఎస్ వేస్తున్న కొత్త ఎత్తుగడలేంటి? మునుగోడులో గడచిన పది రోజుల్లో అమ్ముడుపోయిన మద్యం ఎంత?

మునుగోడులో ప్రలోభాల పర్వం తారా స్థాయికి చేరింది. తాగినోడికి తాగినంత..తిన్నోడికి తిన్నంత అన్నట్టుగా ఉంది పరిస్థితి. మునుగోడు అసెంబ్లీ సెగ్మంట్ పరిధిలో లిక్కర్ అమ్మకాలు జోరందుకున్నాయి. నియోజకవర్గ వ్యాప్తంగా రంగంలోకి దిగిన రాజకీయ పార్టీల నాయకులు, అనుచరులు, ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు మద్యం పంపిణీ జోరుగా చేస్తున్నారు. ఇందులో భాగంగా మునుగోడు నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో 28 వైన్ షాపుల్లో ఈ నెలలో 10 రోజుల్లోనే 70.7 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయని ఎక్సైజ్ శాఖ ప్రకటించింది. 

నియోజకవర్గ వ్యాప్తంగా గొర్రెలు, కోళ్లకు కొరత ఏర్పడింది. ప్రతి ఒక్క ఓటు కీలకం కావడంతో ఓటర్ల మనసు గెలుచుకునేందుకు కోసం ప్రయత్నిస్తున్న రాజకీయ పార్టీల నాయకులు, ఇతర ప్రాంతాలలో ఉన్న ఓటర్లను మునుగోడు తీసుకురావడానికి కూడా ఏర్పాట్లు చేస్తున్నారు.

అధికార టీఆర్ఎస్ ఓటర్లకు రకరకాల గేలాలు వేస్తోంది. మునుగోడు ప్రజలతో బంధుత్వం ఉన్న ఇతర ప్రాంతాల ప్రజలపై దృష్టిసారించింది. బంధుగణానికి సంబంధించి ప్రత్యేకంగా ఓ లిస్ట్ తయారు చేసి వారి ద్వారా మునుగోడు ఓటర్లకు చెప్పించే ప్రయత్నం చేస్తోంది. ఫోన్ లో వాట్సాప్ వీడియో కాల్స్ ద్వారా వారి బంధువులతో మాట్లాడిస్తున్నట్టూ సమాచారం.

అధికార టీఆర్ఎస్ భారీ ఎత్తున డబ్బు పంచుతుందనే ప్రచారం కొత్త ఓటర్ల నమోదును భారీగా పెంచిందంటున్నారు స్థానికులు. ఒక్క ఓటుకు వేల రూపాయలు ఇవ్వనున్నారని తెలియడం వల్లే ఓటర్ల నమోదు భారీ గా పెరిగింది. అక్టోబర్ 4వ తేదీ నాటికే 24 వేల కొత్త దరఖాస్తులు వచ్చాయంటే.. మునుగోడు ఓటర్లకు ఏ స్థాయిలో  డిమాండ్‌  ఉందో తెలుస్తోంది.

ఏడాదిన్నర క్రితం జరిగిన నాగార్జునసాగర్ ఉప ఎన్నికకు కేవలం15 వేల కొత్త అప్లికేషన్లు మాత్రమే వచ్చాయి. కానీ మునుగోడు ఉప ఎన్నికకు 24 వేల దరఖాస్తులు వచ్చాయంటే.. ప్రలోభాల పర్వం తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కొత్త ఓటర్ల దరఖాస్తులు వచ్చాయి. ఇక భారతీయ జనతా పార్టీ కొత్త ఓటర్ల నమోదుపై అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. కొత్త దరఖాస్తుల్లో చాలా వరకు బోగస్ అని ఆ పార్టీ అంటోంది. కొత్త ఓటర్ల నమోదుపై బీజేపీ హైకోర్టును కూడా ఆశ్రయించింది. హైకోర్టు ఆదేశించే వరకు కొత్త ఓటర్ లిస్ట్ ప్రకటించరాదని బీజేపీ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ లో పేర్కొంది.

ఇక బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి కొంత మంది కీలక టీఆర్ఎస్ నేతలతో మంతనాలు జరుపుతున్నట్టూ కొన్ని ఆంగ్ల పత్రికలు కథనాలు ప్రచురించాయి. కూసుకుంట్ల అభ్యర్థిత్వం తమ పార్టీకి అనుకూలిస్తుందని బీజేపీ ధీమా వ్యక్తం చేస్తోంది. టీఆర్ఎస్ లోని అసమ్మతి నేతలను తమ వైపు తిప్పుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తోంది. వీరంతా గతంలో టీఆర్ఎస్ లో  చేరాలని నిర్ణయించుకున్నా…అధికార పార్టీ కక్ష్యసాధింపునకు దిగుతుందన్న భయంతో తాత్కాలికంగా వాయిదా వేసుకున్నట్టూ సమాచారం. టీఆర్ఎస్ అసమ్మతి నేతలు లోపాయికారిగా కమలం పార్టీకి మద్దతు ఇస్తారని ఆ పార్టీ పూర్తి భరోసాతో ఉంది.

తెలంగాణ రాష్ట్ర సమితి అసమ్మతి నేతలను బుజ్జగించేందుకు విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించలేదని తెలుస్తోంది. కమ్యూనిస్టుల దన్ను ఉంది కాబట్టి గట్టెక్కగలమన్న ధీమా టీఆర్ఎస్ వర్గాల్లో వ్యక్తమవుతోంది. మరోవైపు 11వ తేదీ టీఆర్ఎస్ భవన్ లో జరిగిన టీఆర్ఎస్వీ రాష్ట్ర స్థాయి ప్రతినిధుల సమావేశానికి హాజరైన కేటీఆర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. 105 అసెంబ్లీ సీట్లున్న టీఆర్ఎస్ పార్టీకి ఒక్క సీటు పోయినంత మాత్రాన పోయేదేమీ లేద‌న్నారు. కేటీఆర్ మాట‌ల‌ను బ‌ట్టి చూస్తే మునుగోడు ఉపఎన్నిక‌ల ఫ‌లితాలు ముందుగా ఉహించి కార్య‌క‌ర్త‌లతో ఇలా మాట్లాడిన‌ట్లు క‌నిపిస్తోంది.

ఇక దుబ్బాక, హుజురాబాద్ ఉప ఎన్నికకూ మునుగోడు బైపోల్ కు చాలా వ్యత్యాసమే ఉంది. సోలిపేట రామలింగారెడ్డి హఠాన్మరణం తర్వాత జరిగిన దుబ్బాక ఎన్నికకు ప్రత్యేకత ఉంది. అంతకు ముందు జరిగిన ఎన్నికల్లో రఘునందన్ రావు పోటీ చేసి ఓడిపోవడం వల్ల ఏర్పడిన సానుభూతి, రామలింగారెడ్డి భార్య సుజాతా రెడ్డికి టిక్కెట్ ఇవ్వడం వల్ల నియోజకవర్గంలో రాజుకున్న అసమ్మతి బీజేపీ గెలుపునకు కారణమయ్యాయి. అంతేకాకుండా రఘునందన్ రావు ఎన్నికల్లో ఓడిపోయినా అసెంబ్లీ సెగ్మెంట్ లో పర్యటించడం, ప్రజలకు చేరువగా ఉండటం కూడా విజయాన్ని సునాయాసం చేశాయని చెప్పొచ్చు.

హుజురాబాద్ ఉప ఎన్నికకు మరిన్ని ప్రత్యేకతలున్నాయి. కరోనా కష్ట కాలంలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా ఈటల అందించిన సేవలతో పాటు మంత్రివర్గం నుంచి హఠాత్తుగా బర్తరఫ్ చేయడం హుజూరాబాద్ బైపోల్ లో కలిసొచ్చిన అంశాలు. అంతేకాదు, నియోజకవర్గ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండటం కూడా ఈటల గెలుపునకు కారణమయ్యాయి.

మునుగోడు ఉప ఎన్నిక ఈ రెండు ఉప ఎన్నికలకు పూర్తిగా భిన్నం. రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ తరపున గెలిచి రాజీనామా చేసి బీజేపీలో చేరడం, రాజగోపాల్ రెడ్డి ఫక్తు రాజకీయనాయకుడు కాకపోవడం, నియోజకవర్గంలో కాంగ్రెస్, కమ్యూనిస్టులు బలంగా ఉండటం బీజేపీకి ప్రతికూలమైన అంశాలు. అయితే అధికార టీఆర్ఎస్ పట్ల వ్యతిరేకత మాత్రమే బీజేపీకి మేలు చేసే అవకాశం ఉంది.

మరోవైపు టీఆర్ఎస్ ను వీడి బీజేపీలో చేరిన నేతలను, ప్రజాప్రతినిధులను తిరిగి గులాబీ గూటికి చేర్చేందుకు చేస్తున్న ప్రయత్నాలు కూడా ఫలిస్తున్నాయి. చండూరు జడ్పీటీసీ సభ్యుడు బీజేపీని వీడి తిరిగి స్వంత గూటికి చేరుకున్నాడు. మునుగోడు నియోజకవర్గానికి చెందిన ఓ ఎంపీపీ ఇటీవల టీఆర్‌ఎస్‌  నేతలతో విభేదించి బీజేపీలో చేరారు. కొద్దిమంది ఎంపీటీసీలు, వార్డు సభ్యులతో కలిసి ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ చేతుల మీదుగా కాషాయ కండువా కప్పుకున్నారు.

ఈ విషయాన్ని అధికార పార్టీ పెద్దలు సీరియ్‌సగా తీసుకున్నారు. ఆయనపై గతంలో ఉన్న మూడు భూ వివాదాలకు సంబంధించిన కేసులను తిరగదోడారు. రాత్రికి రాత్రే పోలీసులతో అరెస్టుకు ప్రయత్నించగా.. బీజేపీ నేతల మద్దతుతో ఆయన అరెస్టు కాకుండా బయటపడ్డారని సమాచారం. ఎంపీపీ ముందస్తు బెయిల్‌ కోసం హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ బెయిల్‌ దొరక్కపోవడంతో సుప్రీంకోర్టుకు వెళ్లారు. కొంత కాలం అజ్ఞాతంలోకి వెళ్లారు. అయితే సదరు ఎంపీపీని తిరిగి సొంత గూటికి తీసుకొచ్చేందుకు మునుగోడు మండలం బాధ్యతలు తీసుకున్న ముగ్గురు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు బేరసారాలు మొదలుపెట్టినట్టూ భోగట్టా.

టీఆర్ఎస్ ఎన్నికల ప్రచారం కోసం నాన్ లోకల్ కార్యకర్తలను మునుగోడుకు తరలించింది. అయితే స్థానిక కార్యకర్తలకు ప్రాధాన్యత లేకుండా పోయిందనే అసంతృప్తి అక్కడక్కడా వ్యక్తమవుతోంది. స్థానికులైన తమకు ప్రాముఖ్యత ఇవ్వకుండా నాన్ లోకల్ కేడర్ ను పురమాయించడాన్ని స్థానికులు జీర్ణించుకోలేకపోతున్నారు.

ఈ మొత్తం వాతావరణాన్ని పరిశీలిస్తే…అధికార టీఆర్ఎస్ ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రె్స్ ల మధ్య పోటీ బలంగానే ఉన్నట్టూ అర్థమవుతోంది. నోటిఫికేషన్ వెలువడక ముందు టీఆర్ఎస్, బీజేపీల మధ్య మాత్రమే ఉంటుందని ఊహించినా ఆ తర్వాత పరిస్థితి మారింది.  త్రిముఖ పోటీలో ఎవరు నెగ్గుకు వస్తారన్నది ఖచ్చితంగా చెప్పలేమంటారు పరిశీలకులు. గతంలో ఓడిపోయిన కారణంగా కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి రెడ్డికి సానుభూతి ఓట్లు పడే అవకాశం ఉందంటారు స్థానికులు. కాంగ్రెస్ గెలిచే అవకాశం లేకపోయినా పెద్ద మొత్తంలో ఓట్లు చీల్చే అవకాశం ఉంది. మునుగోడు త్రిముఖ పోటీలో విజేత ఎవరనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే!

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

1 × one =