More

  Gujarat – 2022 గెలిచేది ‘మోదీ’ మంత్రమా..? కాంగ్రెస్ ‘కుల’ తంత్రమా..?

  కమలం పార్టీది మోదీ మంత్రం.. హస్తం పార్టీది కుల తంత్రం.. ఆప్ ది పరివర్తన సూత్రం.. ఇదీ గుజరాత్ ఎన్నికల చిత్రం. అంతర్గత కుమ్ములాటలూ, తిరుగుబాటు అభ్యర్థులు హస్తం పార్టీని కకావికలం చేస్తున్నాయి. తిరుగుబాటు బెడదా బీజేపీనీ వదల్లేదు. బీజేపీ అధిష్ఠానం ఆజ్ఞను ధిక్కరించిన 19 మంది ఆశావహులపై ఆ పార్టీ బహిష్కరణ వేటు వేసింది. ‘గుజరాత్ మార్పు’ నినాదంతో బరిలో దిగిన ఆమ్ ఆద్మీ పార్టీ నగర, పట్టణ ఓటర్లను లక్ష్యంగా చేసుకుంది. కమలం పార్టీకి కంచుకోటలుగా ఆర్బన్ ప్రాంతాలపై ఆప్ ఫోకస్ పెంచింది. మొత్తానికి గుజరాత్ ఎన్నికల రాజకీయం హాట్ టాపిక్ గా మారింది. అయితే, ఈ ఎన్నికలపై లోతుగా విశ్లేషించుకునేముందు.. నేషనలిస్ట్ హబ్ గ్రూపాఫ్ ఛానెళ్లను సబ్‎స్క్రయిబ్ చేసుకోండి. ఈ వీడియోను లైక్ చేయండి. పదిమందికి షేర్ చేయండి. జాతీయవాద జర్నలిజానికి అండగా నిలవండి.

  గుజరాత్‎లో 182 అసెంబ్లీ స్థానాలుండగా,.. బీజేపీ మొత్తం స్థానాల్లో పోటీ చేస్తోంది. కాంగ్రెస్ 179, ఆమాద్మీ 181 స్థానాల్లో బరిలోకి దిగుతున్నాయి. ఇక ఎంఐఎం పార్టీ కూడా ముస్లింలు అధికంగా ఉండే 14 స్థానాల్లో తన అభ్యర్థులను బరిలోకి దింపింది. డిసెంబర్ 1, 5 తేదీల్లో ఎన్నికలుండగా 8న పోలింగ్ జరగనుంది. ఇక, పోటీ చేస్తున్న పార్టీలన్నీ ఈ ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరిశీలించుకోబోతున్నాయి. జీవన్మరణ సమస్యలో కొట్టుమిట్టాడుతున్న హస్తం పార్టీకి, రెండు దశాబ్దాల అధికారాన్ని మరోసారి నిరాటంకంగా కొనసాగించాలని చూస్తున్న బీజేపీకి, ప్రాంతీయ పార్టీని జాతీయ పార్టీగా మార్చాలని ఆమాద్మీ పార్టీ కుతూహలం మధ్య గుజరాత్ ప్రజలు ఏ పార్టీవైపు మొగ్గు చూపుతారో అన్న సందేహాలు అందరిలోనూ వ్యక్తమవుతున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఎన్నికల్లో ఎవరు గెలుపొందే అవకాశముంది..? ఆయా పార్టీలకు కలిసొచ్చే లేక తిప్పికొట్టే వ్యూహాలేంటి..? గుజరాత్ ప్రజలు ఏ పార్టీని అంగీకరించే అవకాశాలున్నాయి..? కాంగ్రెస్ పార్టీ గతంలో వచ్చిన సీట్లను నిలుపుకోగలదా..? ఆమాద్మీ కోరుకున్న మార్పును తీసుకురాగలదా..? అనే అంశాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

  గుజరాత్‎లో బలాబలాల గురించి పరిశీలిస్తే,.. కమలానికి గుజరాత్ అర్బన్ ఓటర్లలో మంచి పట్టుంది. రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా వ్యాపారాలపైనే ఆధారపడి జీవిస్తుంటారు. దీంతో పట్టణ ప్రజలు ఎక్కువగా బీజేపీకే మొగ్గు చూపుతున్నారు. 2017లో జరిగిన గుజరాత్ ఎన్నికల్లో కూడా ఈ విషయం స్పష్టమైది. కమల వికాసానికి పట్టణ ఓటర్లే కీలకమయ్యారు. దీంతో పాటు బీజేపీ పాలనపై గుజరాతీల నమ్మకం కూడా కమలానికి కలిసొచ్చే అవకాశముంది. అంతేకాదు, గుజరాత్ బీజేపీకి ప్రధాన బలం మోదీ, షా.. దేశ ప్రధాని, కేంద్ర హోంమంత్రి సొంతరాష్ట్రం కావడంతో ఎక్కువ అభివృద్ది కార్యక్రమాలు చేపడతారనే నమ్మకం బలంగా ఉంది. తమ రాష్ట్రానికి ఏ లోటూ రాకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందుతుందనే భరోసా గుజరాత్ ప్రజల్లో నెలకొంది.
  ఇక కాంగ్రెస్ కు మాత్రం రూరల్ ఓటర్లు తమవైపే ఉన్నారనే నమ్మకం ఉంది. గత ఎన్నికల్లో 77 సీట్లు సాధించడంలో గ్రామీణ ప్రాంతాలు పూర్తిగా సహకరించాయి. ఈ ఎన్నికల్లో కూడా గ్రామీణ ఓటర్ తమకు సహకరిస్తాడనే నమ్మకంతో హస్తం పార్టీ బరిలోకి దిగింది. ఇక ఆమాద్మీ పార్టీకి ఇప్పటికిప్పుడు అధికారంపై ఆశ లేకపోయినా ఉనికిని చాటుకునేందుకు కనీస సీట్లను సంపాదిస్తే మరో ఐదేళ్ళలో అధికారం సాధించగలమనే ధీమాతో ప్రయత్నిస్తోంది. దీంతో ప్రధాన పోటీ బీజేపీ, కాంగ్రెస్ ల మధ్యే ఉండటంతో పోటీ రసవత్తరంగా సాగుతున్నా కూడా బీజేపీ చూపినంత దూకుడును కాంగ్రెస్ చూపలేకపోతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రచారంలో కానీ, వ్యూహాల్లో కానీ హస్తం పూర్తిగా చతికిలా పడిపోయిందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ కు గత ఎన్నికల్లో కలిసి వచ్చిన అంశాలు ఈ ఎన్నికల్లో కలిసి రాకపోవడం వృద్ద పార్టీని కలవరపెడుతోంది.

  అయితే హస్తం పార్టీలో ఈ కలవరానికి ముఖ్య కారణం మాత్రం కాంగ్రెస్ వ్యూహంలో భాగమైన కుల సమీకరణాలు 2017 ఎన్నికల్లో కలిసివచ్చినట్లుగా ఈ ఎన్నికల్లో కలిసిరాలేకపోవడమే అని తెలుస్తోంది. అప్పట్లో గుజరాత్ లో హార్థిక్ పటేల్ నేతృత్వంలోని పాటీదార్ ఉద్యమాలు, అల్పేష్ ఠాకూర్ నుంచి ఓబీసీ రిజర్వేషన్ ఉద్యమాలు, జిగ్నేష్ మేవానీ తీసుకొచ్చిన ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ పరిరక్షణ ఉద్యమాలు అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకే అనుకూలించాయి. ఈ ముగ్గురు నాయకుల్లో ఇద్దరు కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేలుగా గెలిచారు. ముఖ్యంగా గుజరాత్ బీజేపీకి బాగా పట్టున్న పటేల్ సామాజిక వర్గం భారీగా చీలిపోయి కాంగ్రెస్ కు లాభం చేకూర్చింది. దీంతో కమల దళానికి గట్టిపోటీ ఇవ్వగలిగింది. అయితే ఈ ఎన్నికల్లో కుల సమీకరణాలు కాంగ్రెస్ కు అంతగా కలిసిరావడంలేదు. ఉద్యమ నేతలైన హార్థిక్ పటేల్, అల్పేష్ ఠాకూర్ ఇద్దరూ బీజేపీలో చేరటంతో కాంగ్రెస్ కు పెద్ద దెబ్బ తగిలింది. కమలదళ సాంప్రదాయిక ఓటర్లైన పటేల్ సామాజిక వర్గం అంతా మళ్ళీ బీజేపీవైపే మొగ్గు చూపుతోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

  అందుకే బీజేపీ కూడా మొదటి జాబితాలోనే హార్థిక్ పటేల్ కు సీట్ ను ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇక ఇదే జాబితాలో ఓబీసీ ఉద్యమనేత అల్పేష్ ఠాకూర్ కు కూడా బీజేపీ గాంధీ నగర్ సౌత్ ను కేటాయిస్తూ నిర్ణయించుకుంది. మరోవైపు ఎస్సీ ఎస్సీ, ఎస్టీ ఉద్యమ నేత జిగ్నేష్ మేవానీ వద్గాంలో ఇండిపెండెంట్ గా ఒంటరి పోరాటం కొనసాగిస్తూ అష్టకష్టాలు అనుభవిస్తున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీకి గత ఎన్నికల్లో కలిసొచ్చిన కుల రాజకీయాలు అంతగా కలిసిరావనే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో పాటు కాంగ్రెస్ నాయకులు ప్రచారంలో కూడా పూర్తిగా పాల్గొనటంలేదు. రాహుల్ గాంధీ ఒకవైపు భారత్ జోడో యాత్రను కొనసాగిస్తున్నా.. గుజరాత్ లో అది అంతగా ప్రభావం చూపటంలేదు. అటు కాంగ్రెస్ లో పేరున్న నాయకులు కూడా స్టార్ క్యాంపెయినర్ బాధ్యతలు చేపట్టటంలేదు. ప్రియాంకా వాద్రా కూడా గుజరాత్ ఎన్నికల్లో అంటీముట్టనట్లు వ్యవహరిస్తోంది. దీంతో పాటు కాంగ్రెస్ అగ్రనాయకులైన గులాం నబీ ఆజాద్ పార్టీని వీడితే,.. సోనియాకు సన్నిహితుడైన అహ్మద్ పటేల్ మరణించారు. ఇక కాంగ్రెస్ అధ్యక్షుడు నామమాత్రంగానే మిగిలిపోయారు. దీంతో ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ గెలుపు పూర్తిగా అభ్యర్థుల బలాబలాలపైనే ఆధారపడి ఉండాల్సి వస్తోంది.

  అటు బీజేపీకి కూడా గెలుపుపై దీమాగా ఉన్నా కూడా లోలోపల కాస్తంత ఆందోళన కనిపిస్తోంది. పార్టీకి రెబెల్స్ బెడద తీవ్రంగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. వీరిని కమలదళం ఎంత గద్దించినా వినే పరిస్థితుల్లో లేరు. పార్టీ నాయకత్వాన్ని ధిక్కరించి నామినేషన్లు వేసిన వారిలో ఇప్పటికే 19 మంది రెబెల్స్‎ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. అయినా కూడా రెబెల్స్ ఏమాత్రం తగ్గకుండా పోటీలో నిలవడంతో బీజేపీలో ఆందోళన మొదలైంది. దీంతో పాటు కమలదళానికి బాగా పట్టున్న అర్బన్ ఓట్లలో కూడా ఆమాద్మీ పార్టీ చీలిక తెస్తుందా అనే అనుమానాలు కూడా బీజేపీ నాయకుల్లో ఉన్నాయి. ఈ విషయాన్నే టైమ్స్ ఆఫ్ ఇండియా AAP is like BJP and that’s BJP’s problem in Gujarat అనే శీర్షికతో ప్రచురించిన కథనంలో ఇదే విషయాన్నే వెల్లడించింది.

  అటు బీజేపీతో పాటు కాంగ్రెస్ ను కూడా ఆమాద్మీ పార్టీ భయపెడుతోంది. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను ఆమాద్మీ పార్టీ చీల్చుకుపోతే మొదటికే మోసం వస్తుందని కాంగ్రెస్ భావిస్తోంది. ఒక పట్టాన దేశవ్యాప్తంగా కాంగ్రెస్ స్థానాన్ని భర్తీ చేయాలనే ప్రణాళికతో వెళుతోన్న చీపురు పార్టీ నాయకుల దెబ్బకు హస్తం తుడిచిపెట్టుకుపోతుందేమో అన్న భయాందోళనలను సైతం కలిగిస్తోంది.

  ఇక బీజేపీ, కాంగ్రెస్ విషయం ఎలా వున్నా.. ఆమాద్మీ మాత్రం ఉత్తర భారతం నుంచి పశ్చిమానికి పాకితే తన జాతీయ పార్టీ కలలకు మార్గం ఏర్పడుతుందని భావిస్తోంది. అయితే గుజరాతీలు ఆమాద్మీ పార్టీని ఎంతమాత్రం అంగీకరిస్తారో అన్నది సందేహంగానే ఉంది. వ్యాపారమే జీవన విధానంగా మార్చుకున్న గుజరాత్ ప్రజలకు తమ వ్యాపారాలను విస్తరించడానికి సహాయపడే ప్రభుత్వాన్నే కోరుకుంటారు తప్ప ఉచిత హామీలు కాదు. అయితే కేజ్రీవాల్ ఇప్పటివరకూ ఉచిత కరెంటు, ఉచిత నీళ్ళు లాంటి హామీలపైనే ఆధారపడి గెలుస్తూ వచ్చాడు. అయితే, గుజరాతీలు ఈ హామీలకు ఓట్లేస్తారా అన్నదీ సందేహంగానే మిగిలి ఉంది. కానీ స్థానిక ఆప్ అభ్యర్థులకున్న పలుకుబడి కారణంగానో లేక ఆమాద్మీ పార్టీ కున్న ఇమేజ్ కారణంగానో ఓట్లయినా అరకొర సీట్లయినా సంపాదించే అవకాశముంది.

  అయితే, అన్ని పార్టీలు ఇటువంటి సమస్యలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో బీజేపీనే మరోసారి గుజరాత్‎లో అధికారం సంపాదించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మోదీ, షా ల మార్కు రాజకీయం వెనుక గుజరాత్ ప్రజలు బీజేపీ తప్ప మరో పార్టీని అధికారంలోకి కూర్చోబెట్టే పరిస్థితుల్లో లేరనే పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఇక ఈ ఎన్నికల్లో బీజేపీకి రెబల్ అభ్యర్థులు తప్ప పెద్దగా ప్రతికూలతలు లేవు. ఆమాద్మీ కూడా బీజేపీ ఓటర్లలో కొంత చీలిక తీసుకొచ్చినా,.. ఎక్కువగా కాంగ్రెస్ ఓట్లను చీల్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. దీంతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఇరు పార్టీల మధ్య చీలి అంతిమంగా బీజేపీనే గెలిపించే అవకాశాలున్నాయి. అందులోనూ గతంలో వచ్చిన సీట్ల కంటే ఈసారి మరింత ఎక్కువగా సాధించినా ఆశ్చర్యపోనక్కర్లేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

  Trending Stories

  Related Stories