International

థర్డ్ వేవ్ ముప్పు పొంచే ఉందంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక

ప్రపంచ ఆరోగ్య సంస్థ థర్డ్ వేవ్ ముప్పుపై కీలక వ్యాఖ్యలు చేసింది. కరోనా మహమ్మారి జన్యు మార్పులకు గురవుతూ ఉండడంతో రాబోయే రోజుల్లో ముప్పు తప్పదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. థర్డ్ వేవ్ ముప్పు ముంగిట ఉన్నామని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. థర్డ్ వేవ్ ప్రారంభ దశలో ఉన్నామని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథ్నామ్ ఘ్యాబ్రియోసిస్ గురువారం నాడు ఆందోళన వ్యక్తం చేశారు. డెల్టా వేరియంట్ తో ముడిపడిన కేసులు అన్ని ప్రాంతాల్లోనూ పెరుగుతున్నాయని డబ్ల్యూహెచ్ఓ ఆందోళన వ్యక్తం చేసింది. ఏప్రిల్ 13 నాటికి 111 దేశాల్లో ఈ వేరియంట్ ఉనికి ఉందని.. మున్ముందు ఇది మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపింది.

డెల్టా వేరియంట్ వ్యాప్తి కారణంగా పాజిటివ్ కేసుల సంఖ్య, మరణాలు రెండింటిలోనూ పెరుగుదల నమోదవుతున్నాయని టెడ్రోస్ చెప్పుకొచ్చారు. వైరస్ అభివృద్ధి చెందుతూనే ఉందని దీంతో మరింత వేగంగా వ్యాప్తి చెందే వేరియంట్‌లు పుట్టుకొస్తున్నాయని టెడ్రోస్ అన్నారు. డబ్ల్యూహెచ్ఓ పరిధిలోని ఆరు రీజియన్లలో వరుసగా నాలుగు వారాల నుంచి కోవిడ్ కేసులు పెరుగుతునే ఉన్నాయన్నారు. ఐరోపా, ఉత్తర అమెరికాలో వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలైన తర్వాత కోవిడ్ కేసులు, మరణాలు తగ్గుముఖం పట్టాయి.. కానీ, ప్రస్తుతం పరిస్థితి తారుమారవుతోందని నివేదికలు స్పష్టం చేస్తున్నాయని అన్నారు. డెల్టా వేరియంట్ ఇప్పుడు 111కి పైగా దేశాలకు వ్యాపించిందని అన్నారు. పది వారాల పాటూ తగ్గిన మరణాలు మళ్లీ పెరగడం ఆందోళన కలిగిస్తోందని ఆయన చెప్పుకొచ్చారు. వ్యాక్సిన్లు అత్యధికంగా కలిగి ఉన్న దేశాలు ఆంక్షలను ఎత్తివేసి, వారి సమాజాలను తిరిగి తెరుస్తున్నారు.. రెండోది వ్యాక్సిన్లు అందని దేశాలు వైరస్ దయపై భారం వేశాయని అన్నారు. చాలా దేశాలు ఇప్పటి వరకూ ఎటువంటి టీకాలను పొందలేదని అన్నారు. ఈ ఏడాది సెప్టెంబరు నాటికి ప్రతి దేశం తన జనాభాలో కనీసం 10 శాతం మందికి, డిసెంబరుకు 40 శాతం మందికి, 2022 మధ్య నాటికి 70 శాతం మందికి వ్యాక్సిన్ ఇవ్వాలని కోరారు. వ్యాక్సిన్లు ఒక్కటే కరోనాను ఆపలేవని.. భౌతికదూరం, మాస్క్ ధరించడం వంటి నిబంధనలను తప్పనిసరిగా పాటిస్తేనే ఫలితం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.

భారతదేశంలో తగ్గుతూ కనిపించిన కరోనా కేసులు.. మళ్లీ పెరుగుతూ ఉన్నాయి. రెండు రోజుల క్రితం 31వేల దిగువకు పడిపోయిన కేసుల సంఖ్య తాజాగా మళ్లీ పెరిగింది. గత 24 గంటల్లో 41,806 మందికి కరోనా సోకినట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. అదే సమయంలో 581 మంది కరోనాతో మరణించారు. తాజా కేసులతో కలుపుకుని దేశంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 3.09 కోట్లకు చేరుకోగా, 4,11,989 మంది మరణించారు. 39 వేల మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో రికవరీల రేటు 97.28 శాతంగా ఉండగా, యాక్టివ్ కేసుల రేటు 1.39 శాతంగా ఉన్నట్టు ప్రభుత్వం పేర్కొంది. దేశంలో ఇంకా 4,32,041 మంది కరోనాతో బాధపడుతున్నారు. 3.01 కోట్ల మంది వైరస్ నుంచి కోలుకున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

two × one =

Back to top button