More

    ఇండియన్ వేరియంట్ కాదది.. ‘డెల్టా’ వేరియంట్..!

    కరోనా వైరస్ లో ఎన్నో వేరియంట్లు పుట్టుకొస్తూ ఉన్న సంగతి తెలిసిందే..! చాలా దేశాల్లో కరోనా వేరియంట్లు పుట్టుకొచ్చాయి. యూకే లోనూ, భారత్ లోనూ.. ఇలా పలు దేశాల్లో వేరియంట్లు బయటపడ్డాయి. ఇలా రూపాంతరం చెందిన వేరియంట్ల వలన కరోనా వైరస్ విపరీతంగా వ్యాప్తి చెందుతోంది. చాలా దేశాలు కొత్త వేరియంట్ల దెబ్బకు అల్లాడిపోయాయి. ఇంకా కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చే అవకాశం కూడా ఉందని తెలుస్తోంది.

    ఈ వేరియంట్లకు ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్లు పెట్టింది. భారత్ లో బి.1.617 అనే వేరియంట్‌ పుట్టుకొని వచ్చిన సంగతి తెలిసిందే. కొందరు కావాలనే భారత్ వేరియంట్ అంటూ ప్రచారం చేశారు కూడా..! ‘ఇండియన్ వేరియంట్’ ఇతర దేశాల్లోకి ప్రవేశించిందంటూ కొన్ని సంస్థలు విష ప్రచారాన్ని చేశాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎక్కడా కూడా ఇండియన్ వేరియంట్ అనే పదాన్ని ఉపయోగించలేదు. సోషల్ మీడియాలో ఇండియన్ వేరియంట్ అంటూ ఉన్న కథనాలను వెంటనే తొలగించాలని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అందుకు సంబంధించి ఐటీ మినిస్ట్రీ కీలక ఆదేశాలను జారీ చేసింది. ఇండియన్ వేరియంట్ అంటూ కంటెంట్‌తో కూడిన కథనాలు B.1.617 కారణంగా కరోనా కేసులు ఎక్కువయ్యాయని నిపుణులు చెబుతున్నారు కానీ.. ‘ఇండియన్ వేరియంట్’ ఉందని డబ్ల్యూహెచ్ఓ అధికారికంగా ఎక్కడా ప్రకటించలేదని ఇప్పటికే కేంద్రం వెల్లడించింది. కరోనా B.1.617 వేరియంట్‌ను ‘ఇండియన్ వేరియంట్’ అని డబ్ల్యూహెచ్ఓ ఎక్కడా చెప్పలేదని,ఏ రిపోర్టులోనూ పేర్కొనలేదని తెలిపింది. ఇండియన్ వేరియంట్ అంటూ ఉన్న కథనాలన్నిటినీ ‘వెంటనే తొలగించాలని’ కేంద్ర ప్రభుత్వం సోషల్ మీడియా కంపెనీలకు గతంలో సూచించింది.

    కొత్తగా వెలుగుచూసే ఏ కరోనా వేరియంట్‌నూ దేశాల పేర్లతో పిలవకూడదని డబ్ల్యూహెచ్‌ఓ ఇప్పటికే చెప్పగా.. కొత్త వేరియంట్‌ల‌కు పేర్లు పెడుతోంది. భారత్‌లో వెలుగుచూసిన కొవిడ్‌ వేరియంట్‌ బి.1.617కు డబ్ల్యూహెచ్‌ఓ ‘డెల్టా’గా నామకరణం చేసింది. భారత్‌లో అంతకుముందు వెలుగుచూసిన కొవిడ్‌ వేరియంట్ కు ‘కప్పా’ అని పేరు పెట్టింది. బ్రిటన్‌ కొవిడ్‌ వేరియంట్‌కు ‘ఆల్ఫా’ అని, దక్షిణాఫ్రికా వేరియంట్‌కు ‘బీటా’ అని, బ్రెజిల్‌ వేరియంట్‌కు ‘గామా’ అని పేర్లు పెట్టింది. కొత్త పేర్లు పెట్టిన‌ప్ప‌టికీ ప్రస్తుతం ఉన్న శాస్త్రీయ నామకరణాలను నూతన పేర్లు భర్తీ చేయవని.. శాస్త్రీయ నామాలు విలువైన సమాచారమని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఏ దేశంలో అయినా కొత్త వేరియంట్ కనుగొనబడితే వెంటనే సమాచారం అందించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టం చేసింది. 24 లెటర్ల గ్రీక్ ఆల్ఫాబెట్ మించిన కరోనా వేరియంట్లు బయటపడితే కొత్త సిరీస్ ను ఉపయోగిస్తామని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. కరోనా వైరస్ ను కట్టడి చేయడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ అన్ని ప్రయత్నాలను చేస్తోందని తెలిపింది.

    Trending Stories

    Related Stories