More

  పాక్ దుస్థితికి కారణాలేంటి..? భారత్ కరుణించేనా..?

  ఉగ్రవాద దేశం పాకిస్తాన్ ప్రస్తుతం దరిద్రంలో కొట్టుమిట్టాడుతోంది. ఆ దేశంలో ప్రజలు తిండి దొరక్క అల్లాడిపోతున్నారు. గుప్పెడు గోధుమ పిండి కోసం క్యూలైన్లలో వేచి చూస్తున్నారు. గోడౌన్లలో దొరికిన కాడికి దోచుకెళుతున్నారు. నిత్యావసరాల సంగతి అటుంచితే,.. చివరికి పాక్ ప్రజలకు కరెంటు కష్టాలు కూడా తప్పట్లేదు. కరాచీ, లాహోర్, ఇస్లామాబాద్, పెషావర్ లాంటి పెద్ద నగరాలతో పాటు అనేక చోట్ల కరెంటు కోతలు నెలకొన్నాయి. నేషనల్ పవర్ గ్రిడ్‌లో ‘తీవ్రమైన బ్రేక్‌డౌన్’ ఉందని పాకిస్తాన్ ఇంధన మంత్రిత్వ శాఖ ట్వీట్ ద్వారా దీన్ని దృవీకరించింది. అయితే ఇది పవర్ గ్రిడ్ లోని బ్రేక్ డౌన్ వల్ల ఏర్పడిన సమస్య అనీ,.. దీన్ని త్వరలోనే పరిష్కరిస్తామని తెలిపింది. కానీ,.. దీనికి సరైన కారణాలు తెలపకపోవడంతో,.. పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి వల్లే ఈ సమస్య ఏర్పడిందని చాలామంది భావిస్తున్నారు. దీంతో పాటు దాయాది దేశంలో ముడి చమురు, గ్యాస్ కష్టాలు కూడా ప్రజలను వీడటం లేదు. ఇతర దేశాల నుంచి కొనాలన్నా,.. విదేశీ మారకం కూడా కేవలం మూడంటే మూడు వారాలకు సరిపడా నిల్వలున్నాయంటే ఇక పాక్ పరిస్థితి ఎంత దిగజారిపోతోందో ఇట్టే అర్థమైపోతోంది. వీటికి పైపెచ్చు తాలిబన్ తిరుగుబాట్లు, బలూచ్, పీఓకే ప్రజల వేర్పాటువాద ఉద్యమాలు ఆ దేశాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. అయితే ఇన్నాళ్ళూ ఐక్యరాజ్య సమితిలో అగ్రదేశాల సహాయంతో కశ్మీర్ పై భారత్ ను ఇరకాటంలో పెట్టే స్థాయిలో ఉన్న పాకిస్తాన్ ఇప్పుడెందుకు ఈ పరిస్థితికి దిగజారింది..? దీనికి గల కారణాలేమై ఉంటాయి..? ఇన్నాళ్ళూ అండగా ఉన్న అగ్రరాజ్యాల తోడు ఏమైపోయింది..? భారత్ ను కాదని,.. చైనా అండ చూసుకుని రెచ్చిపోయిన పాకిస్తాన్ కు డ్రాగన్ దేశం ఇప్పుడు హ్యాండిచ్చిందా..? అనే ప్రశ్నలు అందరి మదిలోనూ తొలచివేస్తున్నాయి. ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

  భారత్‎తో మూడు యుద్దాలు చేసిన తర్వాత తాము ఎంతో నష్టపోయామని.. పాకిస్తాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్ ఒక టీవీ ఛానెల్‎కు ఇచ్చిన ఇంటర్వ్యూ‎లో తెలిపారు. భారత్‎తో స్నేహం చేస్తే బావుండేదని,.. యుద్దాలు చేయడం వల్ల తమ దేశం మరింత పేదరికం, అస్థిరత, నిరుద్యోగాన్ని చవిచూసిందన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాతి నుంచి.. తాము ఆయుధాలపై భారీ యెత్తున ఖర్చు చేశామని అన్నారు. భారత్‎కు వ్యతిరేకంగానే తాము ఈ పనికి పాల్పడ్డామని వెల్లడించారు. భారత్‎తో స్నేహం చేస్తే తమకు ఈ ఖర్చంతా ఆదా అయ్యేదన్నారు. “We have learnt our lesson and we want to live in peace with India, provided we are able to resolve our genuine problems,” అంటూ.. భారత్‎తో కాళ్ళ బేరానికి వచ్చారు. నిజాలు ఒప్పుకుంటూనే.. కశ్మీర్‎లో మరోసారి తన వంకర బుద్దిని బయటపెట్టారు. కశ్మీర్‎పై ఇరు దేశాలూ చర్చలు కొనసాగించాలని తెలిపారు. అయితే ఈ మాటలు అటుంచితే,.. పాకిస్తాన్ ప్రధాని అన్న మాటలను ఒక్కసారి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం.

  భారత్ పాకిస్తాన్‎ను మత పరమైన విభేధాలతో 1947 లో విడిపోయాయి. ఆనాటి పరిస్థితుల ప్రభావం వల్లనో,.. మన నాయకులు చేసిన తప్పిదాల వల్లనో పాకిస్తాన్ ఇస్లామిక్ రిపబ్లిక్ నేషన్‎గా ఏర్పడింది. అయితే అంతటితో ఆగకుండా పాక్ రాజకీయాల్లో భారత్ తో విద్వేషాలను రెచ్చగొట్టి పబ్బం గడుపుతూ వచ్చారు. దీంతో తమ దేశ ప్రజల్లో ఏర్పడిన భారత వ్యతిరేకత ను శాంతింపజేయడానికి తరచూ యుద్దాలకు దిగుతూ వచ్చారు. దీంతో భారత్ లాంటి శక్తివంతమైన దేశంతో ఎదుర్కోవాలనే ఒకే ఒక్క ఉద్దేశంతో తాహతుకు మించి ఆయుధాల కొనుగోళ్ళు చేస్తూ వచ్చింది. ఈ కొనుగోళ్ళు ఎంతగా జరిగాయంటే,.. తిండికి ప్రత్యక్ష యుద్దాల్లో ఓడినా బుద్ది రాని పాకిస్తాన్ పరోక్షంగా ఉగ్రవాదులను పెంచి పోషిస్తూ వచ్చింది. సైన్యానికే కాకుండా ఉగ్రవాదులకు కూడా డబ్బులు అందజేస్తూ ప్రజలకు ఖర్చు పెట్టాల్సిన సొమ్మునంతా భారత వ్యతిరేకతకు ఖర్చు చేసింది. ఈ కారణంతోనే పాక్ ఆర్థిక పరిస్థితి రోజురోజుకీ దిగజారుతూ వచ్చింది.

  సైన్యానికి వెచ్చించిన నిధులను దేశ అభివృద్దికి, మౌలిక సదుపాయాలకు వెచ్చించి ఉంటే పాకిస్తాన్ లోని ప్రాంతాలు అభివృద్ది చెందేవి. ఆ దేశంలో ఉగ్రవాదం కాకుండా పెట్టుబడులు పెరిగేవి. ఉగ్రవాద నిధులను తమ దేశంలో కంపెనీలు పెట్టిన వారికి ఇన్సెంటివ్ లను ఇచ్చి ఉంటే పాక్ ఇప్టటికే కొన్నింటిలో స్వయం సమృద్ది కూడా సాధించేది. అయితే మౌలిక సదుపాయాలను కాకుండా ఆర్మీకి అధికమొత్తంలో ఖర్చు చేయడానికి మరో కారణం కూడా ఉందని.. అంతర్జాతీయ నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. పాక్ భౌగోళికంగా వ్యూహాత్మక ప్రాంతంలో ఉంది. అఫ్గానిస్తాన్‎పై ఆధిపత్యం ప్రదర్శించడానికి.. అటు అమెరికాకు సహాయపడటం, ఇటు భారత్‎కు వ్యతిరేకంగా చైనాకు సహకరించడం వల్ల.. ఆ దేశంలో ఆయుధ సంపత్తి విపరీతంగా పెరిగింది. అయితే ఇది అంతిమంగా పాక్‎కే నష్టం చేకూరుతుందని మాత్రం గ్రహించలేకపోయింది. అగ్రదేశాలు కేవలం తమ అవసరాలకు మాత్రమే ఉపయోగించుకుంటుందనీ,.. అవసరం తీరిన తర్వాత ఏమాత్రం సహకరించవనీ పాక్ కాస్తంత ఆలస్యంగా గ్రహించింది.

  అప్పుడు అంతగా సహకరించినా,.. ఇప్పుడు అగ్రరాజ్యం కానీ,.. డ్రాగన్ కంట్రీ కానీ పాకిస్తాన్ వైపు కనీసం తొంగి చూడటంలేదు. పీఓజేకేలో ఆధిపత్యం చెలాయించడానికి బెల్ట్ అండ్ రోడ్ ఇన్షియేటివ్ తో పాటు సీపీఈసీ ప్రాజెక్టులను చేపట్టింది. దీనికి పాకిస్తాన్‎ను అందినకాడికి దోచుకుంది. అక్కడి ప్రజల భూములను అక్రమంగా ఆక్రమించుకోవడం, రకరకాల కారణాలు చెప్పి.. ఆ ప్రదేశాల్లో చైనా సైన్యాన్ని మోహరించినా పాక్ పూర్తిగా సహకరించింది. సొంత ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను కూడా పక్కనబెట్టి డ్రాగన్ కంట్రీతో అంటకాగింది. ఇప్పుడు ఉగ్రవాద దేశం ఇంతటి పరిస్థితుల్లో ఉంటే,.. ఒకవైపు చైనా కానీ,.. మరోవైపు అమెరికా కానీ,.. ఆ దేశానికి ఏ మాత్రమైనా సహాయం చేశాయా..? కనీసం పాకిస్తాన్‎లో పరిస్థితులను చూసి మానవతా సహాయం అయినా ప్రకటించాయా..? అన్న విషయాలను చూస్తే లేవనే చెప్పాలి. అయితే, ఈ దేశాల బుద్దిని పాక్ ప్రధాని గుర్తించినట్లున్నారు. అందుకే భారత్ సహాయం కోరటమే మంచిదని భారత్‎తో స్నేహానికి వెంపర్లాడుతున్నారు. కష్టకాలంలో పెద్దన్నలా భారత్ సహాయం కోసం అర్రులు చాస్తున్నారు. ఈ సమయంలో భారత్ నుంచి సహాయం ఎంతవరకు ఉంటుంది..? అనే విషయానికి వద్దాం.

  భారత్ కు వ్యతిరేకంగా పాకిస్తాన్ చేసిన కుట్రలు అన్నీ ఇన్నీ కావు. ప్రత్యక్ష యుద్దాల్లో భారత సైనికులనూ, పరోక్షంగా ఉగ్రవాదాన్ని ఎగదోసి అమాయక ప్రజలనూ వేలాదిగా చంపింది. ఒక్క కశ్మీర్ లోనే 42 వేలమంది అమాయకులు, సైనికులు పాకిస్తాన్ ఉగ్రవాదానికి ప్రాణాలు కోల్పోయారని కేంద్ర హోం మంత్రి అమిత్ షా 2022 అక్టోబర్ లో వెల్లడించారు. ఇక భారత దేశమంతా జరిగిన ఉగ్రదాడుల లెక్కలు తీస్తే ఇది మరింత ఎక్కువే అవుతుంది. ఇంతమంది ప్రాణాలు కోల్పోయినా కూడా.. భారత ప్రధానిగా మోదీ ప్రమాణం చేశాక.. ఆ దేశంతో స్నేహ హస్తమే అందిచారు. ఆహ్వానం లేకపోయినా,.. నవాజ్ షరీఫ్ మనవరాలి పెళ్లికి స్వయంగా మోదీ హాజరయ్యారు. అయినా బుద్ది మార్చుకోని పాక్ భారత్ పై పఠాన్ కోట్ ఉగ్రదాడి జరిపి తన బుద్దిని చూపింది. దీంతో ఆగకుండా సరిగ్గా ఎన్నికల సమయంలో పుల్వామా దాడులు జరిపి భారత ప్రజాస్వామ్యాన్నే అస్థిరపరిచేందుకు ప్రయత్నించింది పాకిస్తాన్. ఇన్ని ఆగంతకాలకు పాల్పడినా,.. భారత్ పాకిస్తాన్ కు స్నేహ హస్తం చాచాల్సిన అవసరముందా..? మానవతా సహాయం అంటే,.. ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబన్ ప్రభుత్వమేర్పడినా,.. వారికి సహాయం చేస్తే భారత్ జోలికి రాకుండా ఉంటారనే కారణంతోనూ,.. అటు ఆఫ్ఘన్ ప్రజలు బాగుపడతారనే కారణంతోనూ,.. ఇప్పటికీ మానవతా సహాయం అందిస్తూ వస్తోంది. ఈ విధంగా పాకిస్తాన్ కు ఆర్థిక సహాయం చేస్తే అది కృతజ్ఞతాభావం చూపుతుందనే గ్యారంటీ ఎంతమేరకు ఉంటుంది..? అన్న ప్రశ్నకు సమాధానాలు పాక్ ప్రధాని మాటల్లోనే వినిపిస్తుంది. ఒకవైపు తమ దేశం యుద్దాలతో నష్టపోయిందని చెబుతూనే,.. కశ్మీర్ అంశాన్ని పదే పదే ప్రస్తావిస్తోంది. ఆ ప్రాంతం పూర్తిగా భారత్ లో అంతర్భాగమని గుర్తించకుండా దీనిపై చర్చకు పట్టుబడుతోంది. ఈ సమయంలో భారత్ కు మరింత సందేహాలు ఎక్కువవుతున్నాయి. చింత చచ్చినా పులుపు చావలేదన్న చందంగా పాకిస్తాన్ ప్రవర్తిస్తోంది. దీని వల్లే భారత్ పాక్ కు సహాయం చేయడానికి ఇప్పటికీ ఆలోచిస్తోంది. ఇక భారత్‎తో పాటు అమెరికా, చైనాలు కూడా పాక్‎ను పట్టించుకోకపోవడంతో దిక్కూ మొక్కూ లేకుండాపోయింది. ఇక ఆ దేశ ఆర్థిక పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారటంతో.. పాక్‎ను ఏ దేశం కాపాడుతుందో వేచి చూడాలి. ఒకవేళ ఇది భారత్‎కు మరీ ఆందోళనకరంగా అనిపిస్తే.. నాలుగు మెతుకులు విదిల్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

  Related Stories