డిసెంబర్ 30న ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ‘ధర్మ్ సన్సద్’ కార్యక్రమంలో మహాత్మా గాంధీని విమర్శించినందుకు కాళీచరణ్ మహారాజ్‌ను రాయ్‌పూర్ పోలీసులు అరెస్టు చేశారు. ఇంతకూ కాళీచరణ్ మహారాజ్ ఎవరు అనే డౌట్ అందరి మెదళ్ల లోనూ మెదిలింది. కాళీచరణ్ మహారాజ్ ‘అభిజిత్ ధనంజయ్ సరాగ్’ గా జన్మించారు. తలపై గుండ్రని తిలకంతో ఎర్రటి వస్త్రంతో తరచుగా కనిపించే కాళీచరణ్ మహారాజ్ కు శివుడు, కాళీ మాత అంటే ఎంతో అభిమానం. మహారాష్ట్రలోని అకోలా పాతబస్తీలోని శివాజీ నగర్‌కు చెందినవారు. కాళీచరణ్ తండ్రి ధనంజయ్ సరాగ్ మెడికల్ షాప్ నడుపుతున్నారు.
కాళీచరణ్ భావసాగర్ వర్గానికి చెందినవారు. ఆయన పుట్టిన తేదీ తెలియదు.. కానీ కొన్ని నివేదికలు ఆయన 1973లో జన్మించినట్లు సూచిస్తున్నాయి. కాళీచరణ్ ‘మహారాజ్’ 8వ తరగతి పూర్తి చేసిన తర్వాత చదువును మానేశారు. చదువును విడిచిపెట్టిన తర్వాత ఇండోర్ లోని అతని అత్త ఇంటికి పంపబడ్డాడు. అక్కడ హిందీ మాట్లాడటం నేర్చుకున్నారు. భయ్యూజీ మహారాజ్ ఆశ్రమానికి వెళ్లడం ప్రారంభించారు. నెమ్మదిగా ఆధ్యాత్మికత వైపు మొగ్గు చూపడం ప్రారంభించారు. భయ్యూజీ మహారాజ్ నుండి దీక్ష తీసుకున్నారు. ఆ తర్వాత ఆయన్ను ‘కాళీచరణ్ మహారాజ్’గా పిలవడం ప్రారంభించారు.
కాళీచరణ్ మహారాజ్ చాలా ప్రజాదరణ పొందారు. హిందూ గ్రంధాలకు చెందిన మంత్రాలు, శ్లోకాలను పఠించే ఆయన అనేక వీడియోలు వైరల్ అయ్యాయి. ఆయన 2017 లో పౌర ఎన్నికలలో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు కానీ విజయవంతం కాలేదు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఆయన పోటీ చేస్తారని వార్తలు వచ్చాయి.
కాళీచరణ్ మహారాజ్ శివ తాండవ స్తోత్ర వీడియో
2020లో, కాళీచరణ్ మహారాజ్ తాండవ స్త్రోత్రం పాడిన వీడియోలు వైరల్ కావడంతో సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. ఈ వీడియో మధ్యప్రదేశ్‌లోని భోజేశ్వర్ శివాలయంలో చిత్రీకరించారు. ఆయన పాడిన తాండవ్ స్త్రోత్ర వీడియో ఒకటి యూట్యూబ్‌లో రెండు కోట్లకు పైగా వ్యూస్ ను పొందింది. కాళీచరణ్ మహారాజ్ తన అధికారిక యూట్యూబ్ ఛానెల్‌లో గత మూడు సంవత్సరాలుగా చురుకుగా వీడియోలను అప్‌లోడ్ చేస్తున్నారు. ఆయన వీడియోలలో చాలా వరకు ఆధ్యాత్మిక కంటెంట్, ఇంటర్వ్యూలు, కథా వాచన్ ఉన్నాయి.
తన యూట్యూబ్ ఛానెల్‌లో అందుబాటులో ఉన్న ఒక వీడియోలో, ఒక కార్యక్రమంలో తన ప్రసంగంలో హిందూ సమాజంలో కుల సమస్య గురించి మాట్లాడారు. హిందువులలో కులం అనే కుళ్లిపోయిన సమస్య ధర్మ వినాశనానికి దారితీసే విభజనను సృష్టిస్తుందని ఆయన అన్నారు. హిందువులు శివాజీ మహారాజ్‌ను అనుసరించాలని, కుల సంకెళ్లను తెంచుకుని హిందుత్వ పతాకం కింద కలిసిపోవాలని ఆయన అన్నారు. హిందువులు విభజించబడినందున ఆక్రమణదారులు భారతదేశాన్ని జయించగలిగారు. శివాజీ మహారాజ్ హిందువులందరినీ ఏకతాటిపైకి తెచ్చారు, మనం ఆయన అడుగుజాడల్లో నడవాలి అని చెప్పుకొచ్చారు.
రాయ్‌పూర్ ధర్మ సంసద్‌లో చేసిన వ్యాఖ్యలపై ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం అతనిపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయడంతో ఇటీవల కాళీచరణ్ మహారాజ్ వార్తల్లో నిలిచారు. ఆయన మహాత్మా గాంధీని విమర్శించారు. డిసెంబర్ 30న, రాయ్‌పూర్ పోలీసులు ఆయనను ఖజురహో నుంచి అరెస్టు చేశారు. ధర్మ సంసద్‌లో గాంధీజీ హంతకుడైన నాథూరామ్ గాడ్సేని అభినందిస్తూ కాళీచరణ్ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల కారణంగా పలుచోట్ల ఆయనపై కేసులు నమోదయ్యాయి. కాళీచరణ్ మహారాజ్ గాంధీజీని దుర్భాషలాడడమే కాకుండా గాంధీజీని చంపినందుకు నాథూరామ్ గాడ్సేకి కృతజ్ఞతలు తెలిపారు.