ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బిగ్ ట్విస్ట్..! బోయినపల్లి అభిషేక్ రావు అరెస్ట్..!!

0
1023

‘మద్యం’ మహామహులను సైతం ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఢిల్లీ లిక్కర్ కుంభకోణం వరుస సంచలనాలు సృష్టిస్తోంది. సీబీఐ తన విచారణలో దూకుడు పెంచింది. లిక్కర్ స్కాం అరవింద్ కేజ్రీవాల్ మొదలు అభిషేక్ రావు వరకూ అందరికీ కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. తాజాగా ఎమ్మెల్సీ కవిత సన్నిహితుడు బోయినపల్లి అభిషేక్ రావును సీబీఐ అరెస్ట్ చేసింది. అభిషేక్ రావుకి దాదాపు తొమ్మిది కంపెనీలతో సంబంధాలున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖ సమాచారం ప్రకారం సదరు కంపెనీల్లో అభిషేక్ రావుకు వాటాలున్నాయి.

రియల్ ఎస్టేట్, మైనింగ్, క్వారీయింగ్, మాన్యూఫ్యాక్చరింగ్, కెమికల్ ప్రొడక్షన్, కంప్యూటర్ రిలేటెడ్ సర్వీసెస్ తదితర వ్యాపారాలు నిర్వహించే కంపెనీలతో అభిషేక్ రావుకు నేరుగా సంబంధం ఉన్నట్టూ సీబీఐ పేర్కొంది. అభిషేక్ రావు డైరెక్టర్ గా ఉన్న రాబిన్ డిస్టిలరీస్ కార్యాలయంపై సీబీఐ ప్రత్యేక దృష్టి సారించింది. అభిషేక్ రావును నిన్న సీబీఐ ఢిల్లీకి రప్పించింది. తదనంతరం అరెస్ట్ చేస్తున్నట్టూ ప్రకటించింది. అభిషేక్ రావు అరెస్ట్ అధికార పార్టీ నేతల్లో గుబులు రేపుతోంది. అభిషేక్ రావు ఎమ్మెల్సీ కవితకు సన్నిహితుడు కావడంతో కేసీఆర్ తనయి కవిత చుట్టూ ఉచ్చు బిగుస్తోందా అనే అనుమానాలు రాజకీయ వర్గాల్లో విస్త్రృతంగా వినిపిస్తున్నాయి. 

‘‘The bubble bursts when a gatekeeper is not impressed by the halo of success created by the fraudsters.’’ అంటుంది…smarak swain రాసిన ‘‘The Great Indian Fraud: Serious Frauds Which Shook the Economy’’ పుస్తకం.  ఢిల్లీ లిక్కర్ స్కాంలో కూడా సరిగ్గా ఇదే జరిగింది. ఎక్కడో ఎవరో అసంతృప్తికి గురయ్యారో తెలియదు. అక్కడే బయటకు పొక్కింది అసలు కుంభకోణం.

ఢిల్లీ మద్యం స్కాం గుట్టు రట్టవడం వెనుక చాలా పెద్ద కథే ఉంది. మొత్తం ప్రభుత్వం లిక్కర్ కుంభకోణం ఊబిలో కూరుకుపోయిందంటే…తీవ్రత అర్థమవుతోంది. ఢిల్లీ ప్రభుత్వ సమర్థత కన్నా…మద్యం వ్యాపారుల రాజకీయ ప్రభావమే చాలా ఎక్కువగా పనిచేసిందనే అపప్రదను కేజ్రీవాల్ ప్రభుత్వం ఎదుర్కొంటోంది.  ఇక బీజేపీ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ట్వీట్ తెలంగాణ రాజకీయాల్లో మరింత కాకరేపుతోంది. ‘అక్క జంప్ అట కదా! అమెరికాకి? అంటూ ఎంపీ అర్వింద్ చేసిన ట్వీట్ పొలిటికల్ సర్కిల్స్ లో చర్చకు కారణమైంది.

అసలు ఢిల్లీ లిక్కర్ స్కాంలో జరిగిందేంటి? జరుగుతున్నదేంటి? కేజ్రీవాల్ వాదనలేంటి? తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయి, ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అనివార్యం కానుందా? ఢిల్లీ మద్యం కుంభకోణంలో కల్వకుంట్ల కవిత పోషించిన పాత్ర ఏంటి? బోయినపల్లి అభిషేక్ రావు నిజంగానే ఎమ్మెల్సీ కవితకు సన్నిహితుడా?

ఇలాంటి అంశాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం….

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఎమ్మెల్సీ కవిత సన్నిహితుడు బోయినపల్లి అభిషేక్ రావు అరెస్ట్  తర్వాత ఎవరి వంతు రానుందో అనే ఉత్కంఠ టీఆర్ఎస్ వర్గాల్లో నెలకొంది. ప్రకాశం జిల్లాకు చెందిన వైసీపీ ఎంపీ, మద్యం వ్యాపారి మాగుంట శ్రీనివాసులు రెడ్డి సహా బోయినపల్లి వినోద్ కుమార్ బంధువులకు ఢిల్లీ పరిధిలో కొన్ని మద్యం లైసెన్స్ ల కోసం కవిత మధ్యవర్తిత్వం వహించిందని సీబీఐ ఆరోపించింది. ఢిల్లీ ఎక్సైజ్ అధికారులతో కవిత, బోయినపల్లి వినోద్ కుమార్ లు పలు దఫాలు ఓ ఐదు నక్షత్రాల హోటల్ లో సమావేశమైనట్టూ ఢిల్లీ బీజేపీ నేతలు ఆరోపించారు. ఈ సమావేశాలకు కొన్ని సార్లు కవిత, మరికొన్ని సందర్భాల్లో కవిత తరపున బోయినపల్లి అభిషేక్ రావు హాజరైనట్టు ఢిల్లీ బీజేపీ నేతలు గతంలో ఆరోపించారు. ఈ చర్చల ముగింపు కొన్ని కోట్ల రూపాయల బదలాయింపుతో ముగిసిందని ఢిల్లీ బీజేపీ ఎంపీ పర్వేష్ వర్మ ఆరోపించారు.

ఎవరీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి?

90లో అప్పటి పీపుల్స్ వార్ నక్సలైట్ల చేతిలో హత్యకు గురైన మాగుంట సుబ్బిరామిరెడ్డి సోదరుడే మాగుంట శ్రీనివాసులు రెడ్డి. ఎనభైల చివరి నుంచి మాగుంట కుటుంబం మద్యం వ్యాపారంలో ఉన్నారు. మేక్డోల్ లాంటి కంపెనీలకు డీలర్లుగా వ్యవహరించారు. మాగుంట కుటుంబానికి ఉన్న ఏకైక అతి పెద్ద వ్యాపారం మద్యం వ్యాపారం మాత్రమే. ఢిల్లీ పరిధిలో మాగుంట శ్రీనివాసులు రెడ్డికి చెందిన మద్యం డిపోను ఢిల్లీ ఎక్సైజ్ శాఖ అవకతవకల కారణంగా సీజ్ చేసింది. సీజ్ చేసిన మద్యం డిపోను అన్ సీజ్ చేసేందుకు మొదలైన ప్రయత్నం దుకాణాల లైసెన్స్ లు పొందేవరకూ సాగింది. ఢిల్లీ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన కొత్త మద్యం విధానం కారణంగా మాగుంట బంధువర్గానికి కొన్ని లైసెన్స్ లు వచ్చాయి. ఈ లైసెన్స్ లు కూడా అత్యంత కీలక ప్రదేశాల్లో వచ్చాయని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక బోయినపల్లి వినోద్ కుమార్ సైతం ఢిల్లీ పరిధిలో కొన్ని మద్యం లైసెన్స్ లు పొందినట్టూ సమాచారం.

ఎవరీ బోయినపల్లి అభిషేక్ రావు?

బోయినపల్లి అభిషేక్ రావు గతంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వద్ద పనిచేశారు. కవిత వ్యక్తిగత కార్యదర్శిగా వ్యవహరించారనే ప్రచారం కూడా ఉంది. దీంతో అభిషేక్ రావు అరెస్ట్ మరింత ఉత్కంఠ రేకెత్తిస్తోంది. అరెస్ట్ తర్వాత హైదరాబాద్ నుంచి అభిషేక్ రావు ను ఢిల్లీకి తరలించిన సీబీఐ అధికారులు..  రౌస్ అవెన్యూ కోర్టు ముందు హాజరుపరిచారు. అభిషేక్ కు  5 రోజుల  కస్టడీ కోరింది సీబీఐ. అయితే మూడు రోజుల కస్టడీకి సిబిఐ కోర్టు అనుమతి ఇచ్చింది.

ఇండోస్పిరిట్ అకౌంట్ నుండి 3.85 కోట్ల రూపాయలు బోయిన్ పల్లి అభిషేక్ రావు ఖాతాలో  చేరాయని సిబిఐ ఆరోపించింది. ఈ నగదు బదిలీపై అభిషేక్ ఎలాంటి పత్రాలు చూపించలేదని కోర్టుకు తెలిపింది. రెండు, మూడు ఖాతాల ద్వారా అభిషేక్ రావు ఖాతాలోకి నిధులు వచ్చాయని సీబీఐ వాదించింది. ఈ నగదును అభిషేక్ రావు వివిధ కంపెనీల్లో పెట్టుబడిగా పెట్టారని..  ఈ కంపెనీల్లో అభిషేక్ కు షేర్లు ఉన్నాయని సీబీఐ కోర్టుకు తెలిపింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ విధానం సమయంలో అభిషేక్ రావు వేర్వేరు ప్రదేశాల్లో జరిగిన సమావేశాలకు హాజరయ్యాడని వెల్లడించింది. దక్షిణ భారతదేశంలోని లిక్కర్ లాబీ తరపున పెద్ద ఎత్తున అభిషేక్ రావు పైరవీ చేసినట్లూ సీబీఐ కోర్టుకు తెలిపింది. నిర్దిష్టంగా చెప్పాలంటే “cartelization” for “Southern lobby’’ అని కోర్టు సమర్పించిన పత్రాల్లో పేర్కొంది. సీబీఐ కోర్టు ఆదేశాలతో మూడు రోజుల పాటు బోయినపల్లి అభిషేక్ ను విచారించనున్నారు సీబీఐ అధికారులు. ఈ విచారణలో కీలక విషయాలు వెలుగులోనికి వచ్చే అవకాశాలు ఉన్నాయి.

అభిషేక్ రావు కస్టడీ ముగిసిన తర్వాత ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు నోటీసులు?

అభిషేక్ రావు కస్టడీ ముగిసిన తర్వాత ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సీబీఐ నోటీసులు జారీ చేసే అవకాశం ఉందంటున్నాయి రాజకీయ వర్గాలు. టీఆర్ఎస్ పేరు మార్పులో భాగంగా తెలంగాణ భవన్ లో జరిగిన కీలక సమావేశాలకు కవిత హాజరు కాకపోవడం పొలిటికల్ సర్కిల్స్ లో చర్చనీయాంశమైంది.

కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లేందుకు తెరవెనుక జరిగిన కసరత్తులో కూడా కవిత ఎక్కడా కనిపించకపోవడం, టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారిన వెంటనే సీబీఐ అరెస్టులు చేయడం…మొత్తంగా కవిత చుట్టూ ఉచ్చు బిగుస్తోందా అనే సందేహం టీఆర్ఎస్ వర్గాల్లో బాహటంగానే వ్యక్తమవుతోంది. అక్టోబర్ 6న న్యూస్ 18న  న్యూస్ వెబ్ సైట్ As ‘‘KCR Launches BRS for National Foray, Absence of Life of The ‘Party’—Daughter Kavitha—Sparks Buzz of Tiff ’’ శీర్షికన ప్రచురించిన కథనంలో కూడా అనేక సందేహాలను వ్యక్తం చేసింది. కీలక సమావేశాలకు కవిత గైర్హాజరు కావడం, దసర పండగ సందర్భంగా ప్రగతి భవన్ లో జరిగిన పూజా కార్యక్రమాల్లో సైతం కవిత లేకపోవడం చూస్తుంటే లిక్కర్ స్కాం ప్రభావం తీవ్రంగానే ఉన్నట్టూ అర్థమవుతోంది. అయితే ఎమ్మెల్సీ కవిత మాత్రం తన సొంత ఇంట్లో ఆయుధ పూజ చేసుకున్నట్లూ ట్విటర్ ద్వారా వెల్లడించారు. మొత్తంగా దేశ రాజధాని కేంద్రంగా జరిగిన మద్యం కుంభకోణం తెలంగాణలో సంచలనం సృష్టిస్తోంది. కవితపై ఆరోపణలు రావడంతో రాష్ట్ర బీజేపీ కేసీఆర్ ను టార్గెట్ చేస్తూ విమర్శలు ఎక్కుపెట్టింది. అభిషేక్ రావు కస్టడీ ముగిసిన తర్వాత కవితకు నిజంగానే నోటీసులు ఇస్తారా? ఒక వేళ నిజంగానే కవితకు నోటీసులు ఇస్తే కేసీఆర్ ఎలా స్పందిస్తారు? ఇలాంటి ప్రశ్నలకు జవాబు దొరకాలంటే వేచిచూడాల్సిందే!

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

4 − one =