మోదీపై ప్రశంసల వర్షం కురిపించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ

0
650

గురువారం నాడు భారత్ 100కోట్ల వ్యాక్సిన్ డోసుల రికార్డును దాటేసింది. చైనా తర్వాత వందకోట్ల డోసుల మార్క్‌ను క్రాస్‌ చేసిన రెండో దేశంగా భారత్ నిలిచింది. 275 రోజుల్లోనే వందకోట్ల డోసుల వ్యాక్సినేషన్‌ను పూర్తి చేసి వేడుకలు నిర్వహించింది. ప్రధాని నరేంద్ర మోదీ మనోహర్ లోహియా ఆసుపత్రికి చేరుకుని 100 కోట్ల టీకా డోసును ఇచ్చారు.100 కోట్ల టీకాను దివ్యాంగుడైన అరుణ్ రాయ్ తీసుకున్నారు. అప్పుడు ఛావి అగర్వాల్‌(25) అనే దివ్యాంగురాలు టీకా వేయించుకునేందుకు అక్కడికి వచ్చారు. ఆమె అక్కడే ప్రాంగణంలో ఉండగా.. అటుగా వెళ్తోన్న మోదీని చూసి, ఆనందంతో ఉబ్బితబ్బియ్యారు. పట్టలేని సంతోషంతో ప్రధానిని గట్టిగా పిలిచారు. తననెవరో పిలుస్తున్నారని, వెనక్కి తిరిగిన మోదీకి ఛావి కనిపించారు. వెంటనే ఆమె దగ్గరకు వెళ్లి కొద్దిసేపు ముచ్చటించారు. ఇంతకాలం ఎందుకు టీకా తీసుకోలేదని మోదీ ఆమెను ప్రశ్నించారు. దగ్గు కారణంగా కుదరలేదని చెప్పారు.

ప్రధాని మోదీ మాట్లాడుతూ వ్యాక్సినేషన్‌లో 130 కోట్ల మంది భారతీయుల సమిష్టి స్ఫూర్తిని చూశామన్నారు. అతి తక్కువ కాలంలోనే వ్యాక్సిన్‌ అభివృద్ధి చేసిన సంస్థలకు, ఈ ఘనత సాధించేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. ప్రధాని మోదీ పుట్టిన రోజు సందర్భంగా సెప్టెంబరు 17న ఏకంగా రెండున్నర కోట్ల డోసుల వ్యాక్సిన్ వేసి రికార్డు సృష్టించారు. ఇప్పటివరకు 31 శాతం జనాభాకు రెండు డోసుల వ్యాక్సినేషన్‌ పూర్తి అయింది.

భారత్ లో ఇప్పటిదాకా అందించిన కరోనా వ్యాక్సిన్ డోసుల సంఖ్య 100 కోట్లు దాటడం పట్ల జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్పందించారు. ఇది ప్రతి ఒక్కరూ హర్షించాల్సిన విషయమని.. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ఈ ఘనత సాధించడం మనందరికీ గర్వకారణమని తెలిపారు. కరోనా సంక్షోభంతో భారత్ లో కోట్ల మంది చనిపోతారని డబ్ల్యూహెచ్ఓ, ఆరోగ్య నిపుణులు హెచ్చరికలు చేశారని, వాటన్నింటిని అధిగమించిన భారత్ వ్యాక్సినేషన్ లో 100 కోట్ల మార్కును దాటిందని పవన్ వివరించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలియజేస్తున్నట్టు వెల్లడించారు.

భారత్‌ సాధించిన ఈ ఘనతపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ప్రశంసల వర్షం కురిపించింది. భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ, శాస్త్రవేత్తలు, వైద్య ఆరోగ్య కార్యకర్తలు, దేశ ప్రజలకు శుభాకాంక్షలు అంటూ డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టెడ్రోస్‌ అధనోమ్‌ గెబ్రెయెసస్‌ తెలిపారు. 100కోట్ల డోసులను పూర్తి చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేయడమే కాకుండా.. కరోనావైరస్ మహమ్మారి ముప్పు ఉన్న ప్రజలను రక్షించడంతోపాటు వ్యాక్సిన్‌ సమానత్వ లక్ష్యాలను సాధించేందుకు మీరు చేస్తోన్న ప్రయత్నాలకు అభినందనలు అంటూ గెబ్రెయెసస్‌ తెలిపారు. 100కోట్ల డోసులను పంపిణీ చేసి భారత్‌ చరిత్ర లిఖించిందంటూ ప్రధాని మోదీ చేసిన ట్వీట్‌కు టెడ్రోస్‌ స్పందిస్తూ రీట్విట్ చేశారు.