దేశంలో అసలు కాంగ్రెస్ ఉందా..?

0
903

కొండను ఢీకొట్టేందుకు కోటరీలు రెడీ అవుతున్నాయి. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందే మోదీ ప్రభుత్వాన్ని కూల్చాలని కలలుగంటున్నాయి. అయితే, ఏకతాటిపైకి వచ్చే విషయంలో ప్రాంతీయ పార్టీల మధ్య పొంతన కుదరడం లేదు. అన్ని పార్టీలు ఎవరికివారే యమునాతీరే అన్నట్టు వ్యవహరిస్తున్నాయి. దీంతో కూటమి రాజకీయాలకు ఆదిలోనే అవాంతరాలు చుట్టుముడుతున్నాయి. ముఖ్యంగా నానాటికీ దిగజారిపోతున్న కాంగ్రెస్ తో కలిసి నడిచేందుకు ఇతర విపక్ష పార్టీలు ఆసక్తి కనబర్చడం లేదు. మోదీని ఢీకొట్టగల నాయకత్వం విషయంలో పార్టీల్లో విబేధాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అచేతనంగా మారుతున్న కాంగ్రెస్ పార్టీతో కలిసి నడిచేందుకు మమతా దీదీ వెనుకడుగువేస్తుంటే.. 2024 ఎన్నికల్లో విజయం సాధించాలంటే యూపీఏ అవసరమని శివసేన భావిస్తోంది.

ఇదిలావుంటే, ఓవైపు కాంగ్రెస్ సమర్థతపై అనుమానాలు వ్యక్తం చేస్తూనే.. మరోవైపు యూపీఏ బలంగా ఉండాలంటే ఆ పార్టీ అవసరమేనని చెబుతోంది శివసేన. ఎందుకంటే, యూపీఏ లాంటి మరో విపక్ష కూటమి ఏర్పాటు వల్ల బీజేపీ మరింత బలపడుతుందని చెబుతోంది ఉద్ధవ్ టీమ్. ఈ విషయాన్ని తన అధికారిక సామ్నా పత్రికలో బాహాటంగానే పేర్కొంది. అయితే, ముంబై వేదికగానే మమతా బెనర్జీ మాత్రం కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించింది. అసలు దేశంలో కాంగ్రెస్ పార్టీ ఎక్కడుందంటూ ముక్కుసూటిగా ప్రశ్నలు సంధించింది.

మోదీ ప్రభుత్వానికి వ్యతిరేక పోరాటంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న వైఖరిని తీవ్రంగా తప్పుబట్టారామే. సగం సమయం విదేశాల్లో గడిపితే, ఇక, రాజకీయాలు ఎప్పుడు చేస్తారంటూ.. ఇటీవల విహారయాత్రకు వెళ్లిన రాహుల్ గాంధీపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. అసలు యూపీఏ ఉనికిలోనే లేదన్నారు మమతా బెనర్జీ. డిసెంబర్ 1న తన ముంబై పర్యటన సందర్భంగా.. ఆమె What Is UPA..? అంటూ ప్నశ్నించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ముంబైలో శరద్ పవార్‌తో భేటీ ముగిసిన తర్వాత ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా.. యూపీఏకు నాయకత్వం వహించాలని భావిస్తున్నారా..? అని అడిగిన ప్రశ్నకు ఇలా ఘాటుగా స్పందించారు దీదీ. యూపీఏ అనేది లేదు. అన్ని సమస్యలను మేమే పరిష్కరించుకుంటాం. మేం బలమైన ప్రత్యామ్నాయాన్ని కోరుకుంటున్నాం అని ప్రకటించారు. ఈ వ్యాఖ్యలతో తనకు కాంగ్రెస్ పార్టీతో కలిసి వెళ్లడం ఇష్టంలేదని చెప్పకనే చెప్పినట్టయింది.

2024లో ఎన్నికల్లో ఎన్డీఏకు పోటీ ఇవ్వాలంటే, ఇతర విపక్ష పార్టీలు లేకుండా కాంగ్రెస్ పార్టీకి అసాధ్యం. అలాగే, కాంగ్రెస్ లేకుండా మిగతా పార్టీలకు కూడా సాధ్యం కాదన్నది నిజం. విపక్షాలన్నీ కలిసికట్టుగా వుంటే తప్ప.. కేంద్రంలో బీజేపీ ప్రభంజనాన్ని అడ్డుకోలేమని కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్.. ఇటీవల అభిప్రాయపడ్డారు. 2024 ఎన్నికల్లో ఎన్డీయేతో తలపడాలంటే.. ప్రాంతీయ పార్టీలతో కూడిన కొత్త కూటమి రూపుదిద్దుకోవడమే కాదు.. సంస్థాగతంగా యూపీఏ మరింత బలోపేతం కావాల్సివుంది. అయితే, ప్రాంతీయ పార్టీల క్యాడర్ మధ్య అనేక ఈగోలు, గొడవలు యూపీఏ కూటమికి తూట్లుపొడుస్తున్నాయి. మహారాష్ట్ర రాజకీయాలే ఇందుకు ఉదాహరణ. శివసేన, ఎన్సీపీ కూటమిగా ఏర్పడిన నాటి నుంచి ఆ రెండు పార్టీల మధ్య పొసగడం లేదు.

శివసేన.. హిందుత్వ భావజాలాన్ని,.. ఎన్సీపీ.. కాంగ్రెస్ భావజాలాన్ని విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నప్పటికీ.. ఇరు పార్టీ క్యాడర్ ను మాత్రం పాత వాసనలు వీడటం లేదు. ఇప్పటికీ పార్టీ ఆది సిద్ధాంతాలు పార్టీ క్యాడర్ లో బలంగా నాటుకుపోయాయి. అందుకే, జట్టు కట్టి ఏళ్లు గడుస్తున్నా.. ఈ రెండు పార్టీలు కళ్లలో కళ్లు పెట్టి చూసుకోలేకపోతున్నాయి. ఇలాంటి విబేధాల కారణంగా.. ప్రాంతీయ పార్టీలను ఏకం చేయడానికి ఓ జాతీయ శక్తి అవసరం. అయితే, విపక్ష ప్రాంతీయ పార్టీలను నడిపించాల్సిన జాతీయ చోదకశక్తి కాంగ్రెస్ పార్టీ మాత్రం అచేతన స్థితిలో వుంది. అందుకే, మమతా బెనర్జీ వంటి సీనియర్ నేతలు ఆ పార్టీపై విరుచుకుపడుతున్నారు. అయితే, మమతా బెనర్జీ వ్యాఖ్యలకు మరో కారణం కూడా ఉండొచ్చనేది రాజకీయ విశ్లేషకుల అంచనా. కాంగ్రెస్ ను తక్కువ చేసి చూపిస్తే.. 2024 ఎన్నికల్లో విపక్షాలకు తానే నాయకత్వం వహించవచ్చనేది దీదీ భావన. కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తే గత్యంతరం లేక దిగొస్తుందని.. అప్పుడు ఆ పార్టీతో బేరసారాలాడి యూపీఏ కూటమికి తానే నాయకత్వం వహించాలనేది.. దీదీ ఆలోచనగా తెలుస్తోంది.

ఇదిలావుంటే, శివసేన ఆలోచన మరో విధంగా వుంది. కాంగ్రెస్ లేకుండా ప్రాంతీయ పార్టీలు బీజేపీని ఢీకొట్టడం అంత సులువైన పని కాదని ఆ పార్టీ బలంగా నమ్ముతోంది. అలా చేయాలంటే ప్రాంతీయ పార్టీల సంస్థాగతమైన బలం సరిపోదనేది ఆ పార్టీ భావన. మహారాష్ట్రలో గత రెండేళ్లుగా శివసేన ఉనికి.. కాంగ్రెస్ పార్టీ పైనే ఆధారపడి వుంది. అందువల్ల, కాంగ్రెస్ కు, మమతా బెనర్జీకి మధ్య మధ్యవర్తిగా వ్యవహరించడానికి శివసేన ప్రయత్నిస్తోంది. ఇదే సమయంలో మమతా బెనర్జీ కాంగ్రెస్ పార్టీపై ముఖ్యంగా ఆ పార్టీ నాయకుడు రాహుల్ గాందీపై తీవ్రమైన విమర్శలు చేయడం శివసేనకు మింగుడు పడటం లేదు. ఇలా విపక్షాలన్నీ ఎవరికి వారే, యుమునా తీరే అన్నట్టు వ్యవహరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో యూపీఏ కూటమికి ఎవరు నాయకత్వం వహించాలో తేల్చుకోలేకపోతున్న ఈ పార్టీలు.. 2024లో మోదీ ప్రభుత్వాన్ని ఢీకొట్టడం సవాలే. దీనిపై విపక్ష కూటమి పార్టీలన్నీ ఆలోచించుకోవాల్సిన సమయమిది.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

19 − 6 =