More

    మరోసారి అజ్ఞాతంలోకి నియంత కిమ్.. అనారోగ్యమా..? ఆ దేశంపై దాడికి సన్నాహాలా..?

    ఉత్తర కొరియా అధ్యక్షుడు నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. ఐతే ఈ తరం నియంతగా ప్రపంచ దేశాల్లో గుర్తింపు తెచ్చుకున్న ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జొంగ్ ఉన్‌కు అసలు ఏమైంది..? తీవ్ర అనారోగ్యానికి గురయ్యారా..? ఎందుకు కనపడటం లేదు..?అధికారిక కార్యక్రమాలు, సమావేశాలకు ఎందుకు హాజరు కావటం లేదు..? అనే ప్రశ్నలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఉత్తర కొరియాలో నెలకొన్న ఆహార, వ్యవసాయ సంక్షోభాన్ని నివారించడానికి ఏర్పాటు చేసిన కీలకమైన పొలిట్ బ్యూరో భేటీకీ ఆయన డుమ్మా కొట్టడం ఇప్పుడు చర్చనీయంగా మారింది.

    కిమ్ జొంగ్ 36 రోజులుగా కనిపించట్లేదు. బాహ్య ప్రపంచం ముందుకు రావట్లేదు. దీనిపై అధికారంలో ఉన్న వర్కర్స్ పార్టీ ఆఫ్ కొరియా ఎలాంటి సమాచారాన్ని ఇవ్వట్లేదు. కిమ్ జొంగ్ ఉన్నట్టుండి అజ్ఞాతంలోకి వెళ్లడం కొత్తేమీ కాదు. గతంలో రెండుసార్లు ఆయన ఇలా అదృశ్యం అయ్యారు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి నెలకొంది. 36 రోజులుగా కిమ్ జొంగ్ ఎలాంటి అధికారిక కార్యక్రమాలకు గానీ, సమావేశాలకు గానీ హాజరు కావట్లేదు.

    2020లో కిమ్ జొంగ్ ఉన్ కార్డియో వాస్కులర్ బారిన పడ్డారు. విపరీతంగా పొగతాగడం, భారీ శరీరం కావడం వల్ల కార్డియో వాస్కులర్‌ కు గురయ్యారు. దీనితో ఆయన హ్యూయంగ్‌సాన్‌లోని ఓ విల్లాలో సర్జరీ చేయించుకున్నారనే ప్రచారం అప్పట్లో పెద్ద ఎత్తు జరిగింది. కొద్దిరోజుల పాటు విశ్రాంతి తీసుకున్న తరువాత కిమ్ జోంగ్.. రాజధాని ప్యాంగ్యాంగ్‌కు తిరిగి వచ్చారని, అనంతరం అబ్జర్వేషన్‌లోకి వెళ్లారని అప్పుడు ఓ వార్త సంస్థ వెల్లడించింది. అంతకు ముందు 2014లోనూ కిమ్ జొంగ్ సుమారు 40 రోజుల పాటు అజ్ఞాత జీవితాన్ని గడిపారు.

    ఐతే తాజాగా ఈ నెల 5వ తేదీన కిమ్ జొంగ్ ఉన్ సైనిక సమావేశానికి హాజరు కాలేదు. అప్పటి నుంచీ ఆయన ఏమైపోయారనేది ప్రశ్నార్థకమైంది. సైనిక భేటీలకు ఆయన క్రమం తప్పకుండా హాజరవుతుంటారు. దీనితో పాటు సెంట్రల్ మిలిటరీ కమిషన్ సమావేశంలోనూ కిమ్ కనిపించలేదు. ఈ భేటీకి ఆయన హాజరయ్యారంటూ నార్త్ కొరియా న్యూస్ తెలిపింది. తన పొరుగు దేశం దక్షిణ కొరియాపై యుద్ధానికి కిమ్ సన్నద్ధమౌతోన్నారనే ప్రచారం సైతం ఊపందుకుంటోండటం చర్చనీయాంశమౌతోంది. తాజా పరిణామాలపై అమెరికా ఆరా తీస్తోన్నట్లు తెలుస్తోంది.

    ఉత్తర కొరియా గత ఏడాది పెద్ద ఎత్తున వివిధ రకాల మిస్సైల్స్ పరీక్షలను నిర్వహించింది. ఖండాంతర క్షిపణులు, బాలిస్టిక్స్ మిస్సైళ్లను సంధించింది ఆ దేశం. ఒక్క ఏడాదిలోనే 70 మిస్సైళ్లను ప్రయోగించింది. ఈ ప్రయోగాలు దక్షిణ కొరియా, జపాన్ లకు కంటి మీద కునుకు లేకుండా చేసింది. మెజారిటీ మిస్సైల్ టెస్టింగ్స్ ను కిమ్ జొంగ్ స్వయంగా పర్యవేక్షించారు. దక్షిణ కొరియాతో చిరకాలంగా ఉద్రిక్తత కొనసాగుతున్న నేపథ్యంలో యుద్ధ ట్యాంకులు, ఫిరంగులను అప్పట్లో సిద్ధం చేశారు. అమెరికా విధించిన ఆంక్షలు, ఆ దేశంతో కుదుర్చుకున్న ఒప్పందాలను కాదని అణ్వాయుధాలను సిద్ధం చేసుకున్నారు. ఇలాంటి తరుణంలో కిమ్ కనపడక పోవటంతో నిజంగానే దాడులకు సిద్దపడుతున్నారా..? లేక అనారోగ్యంతో బాధపడుతున్నారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

    Trending Stories

    Related Stories