భారత ప్రభుత్వం తీసుకుని వచ్చిన నూతన ఐటీ నిబంధనలను ప్రముఖ సోషల్ మీడియా సంస్థలు అమలు చేస్తూ ఉన్నాయి. ఫేస్ బుక్ ఆధ్వర్యంలోని ప్రముఖ సోషల్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ నూతన ఐటీ నిబంధనలను పాటిస్తూ భారతీయుల అకౌంట్లపై కఠినచర్యలు తీసుకుంది. భారత్ లో 20 లక్షలకు పైగా ఖాతాలను తొలగించినట్లు తన నెలవారీ నివేదికలో వాట్సాప్ పేర్కొంది. హానికరమైన ప్రవర్తనతో కూడిన ఖాతాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని వాట్సాప్ తెలిపింది. మే 15 నుంచి జూన్ 15 మధ్యన ఈ ఖాతాలను నిలిపివేసినట్టు తెలిపింది. ఇలాంటి ఖాతాలను ముందే గుర్తించడానికి ప్రాధాన్యత ఇస్తున్నామని, హాని జరిగాక స్పందించడం కంటే, ముందే చర్యలు తీసుకోవడం సబబు అని భావిస్తున్నట్టు తన నివేదికలో తెలిపింది. అవాంఛనీయ ఖాతాలను గుర్తించేందుకు అనువైన సాధనాలను ఏర్పాటు చేశామని వాట్సాప్ వెల్లడించింది. ఇలాంటి ఖాతాలను గుర్తించే సమయంలో మూడు దశలు కలిగి ఉంటుందని తెలిపారు. రిజిస్ట్రేషన్, సందేశాలు పంపే సమయం, ఫిర్యాదులు ఆధారంగా స్పందిస్తామని వివరించింది.
వాట్సాప్ మాతృ సంస్థ ఫేస్ బుక్ ఇదే కాలంలో 3.2 కోట్ల యూజర్ పోస్టులను తీసివేసినట్లు తెలిపింది. ఇవి స్పామ్ నుండి వయోజన నగ్నత్వం, బెదిరింపు మరియు వేధింపులు మరియు హింసాత్మక మరియు గ్రాఫిక్ కంటెంట్ చుట్టూ ఉన్న కంటెంట్ వరకు ఉన్నాయి. ఫేస్ బుక్ సంస్థ ఐటీ నిబంధనల ప్రకారం దేశంలో మే 15 – జూన్ 15 మధ్యకాలంలో 10 రకాల ఉల్లంఘన కేటగిరీల కింద 3 కోట్లకు పైగా యూజర్ల పోస్టులను తొలగించినట్టు వెల్లడించింది. స్వేచ్చాయుత భావవ్యక్తీకరణతో పాటు, ఆన్లైన్ భద్రత,రక్షణకు ప్రాధాన్యత ఇస్తామని ఫేస్బుక్ తెలిపింది. ఫిర్యాదులు, కృత్రిమ మేధస్సు, తమ సమీక్షా బృందం నివేదికల ఆధారంగా తమ విధానాలకు వ్యతిరేకంగా ఉండే కంటెంట్‌ను గుర్తిస్తామని తెలిపింది.ఫేస్‌బుక్‌కు చెందిన ఇన్‌స్టాగ్రామ్‌లోనూ అభ్యంతరకర పోస్టులపై చర్యలు తీసుకుంటున్నారు. స్పామ్ పోస్టులు 25 మిలియన్లు, హింసాత్మక, గ్రాఫిక్ కంటెంట్ అభ్యంతరకర పోస్టులు 2.5 మిలియన్లు, అశ్లీల, లైంగిక చర్యలకు సంబంధించిన 1.8 మిలియన్ల కంటెంట్లు ఇందులో ఉన్నాయని తెలిపింది. ఉగ్రవాద చర్యల ప్రచారానికి సంబంధించి లక్షకు పైగా పోస్టులు, విద్వేషాలు రెచ్చగొట్టే ప్రసంగాలకు సంబంధించిన మూడు లక్షలకు పైగా పోస్టులు, వేధింపులకు సంబంధించిన లక్షలకు పైగా పోస్టులు ఇందులో ఉన్నాయని తెలిపింది.
భారత ప్రభుత్వం కొత్త ఐటీ నిబంధనలను తీసుకొని వచ్చింది. ఈ నిబంధనలను పలు సోషల్ మీడియా దిగ్గజాలు పాటించాల్సిందే. కొత్త ఐటి నిబంధన మధ్యవర్తిత్వ మార్గదర్శకాలు, డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్ ప్రకారం, ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు (5 మిలియన్లకు పైగా యూజర్లు) ప్రతి నెలా ఫిర్యాదుల నివేదికలను ప్రచురించాల్సి ఉంటుంది. ఆయా వేదికలపై ఫిర్యాదుల వివరాలను, దానిపై తీసుకున్న చర్యలను వెల్లడించాలి.