ఇరాన్ – ఇజ్రాయెల్ యుద్ధం తప్పదా..?

0
999

మాటలు అసలు అర్థాన్ని కోల్పోయి, ప్రతికూలమైన అర్థాన్ని సంతరించుకోవడాన్ని భాషాశాస్త్రంలో ‘అర్థ విపరిణామం’ అంటారు. శాంతి అంటే యుద్ధమనీ. దౌత్యమంటే గూఢచర్యం, వ్యూహమంటే కుట్ర అనీ వర్తమాన భౌగోళిక రాజకీయాలు రూఢీ చేశాయి. అమెరికా అన్ని యుద్ధాలకు తానే కారణమవుతుంది. ఆయుధాలు కూడా తానే విక్రయిస్తుంది. తిరిగి శాంతిమంత్రం వల్లిస్తుంది. ఇదే ప్రపంచ భౌగోళిక రాజకీయ చరిత్రలో తారసపడే వైచిత్రి. ప్రపంచ వేదికలపై కనిపించే దేశాల మధ్య మైత్రీచర్చల మాటున చల్లారని ఉద్రిక్తత ఉంటుంది. నమ్మకమనిపించే ద్వైపాక్షిక చర్చల అంతస్సారం పరస్పర అనుమానంగా ప్రత్యక్షమవుతుంది.

తాజాగా ఇరాన్-అమెరికాల మధ్య ట్రంప్ పాలనలో తెగిపోయిన బంధం మరోసారి అతికే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి. వియన్నా భేటీలో ఇందుకు సంబంధించిన ప్రాథమిక స్థాయి చర్చలు మొదలై,  అర్ధంతరంగా ఆగిపోయాయి. అణ్వస్త్ర తయారీ నియంత్రణ ఒప్పంద పునరుద్ధరణ విషయంలో ఇరుదేశాలూ పునరాలోచనలో పడినట్టూ అంతర్జాతీయ నిపుణులు అంటున్నారు.

ఇరాన్-అమెరికా బంధం బలపడనుందన్న వార్త ఇజ్రాయిల్ కు కనుకు లేకుండా చేస్తోంది. అదే జరిగితే ఇరాన్ పై దాడికి దిగుతానంటోంది ఇజ్రాయిల్. తాను లేని పశ్చిమాసియాను అమెరికా కలలో కూడా ఊహించదు. ఆఫ్ఘనిస్థాన్ పరిణామాల తర్వాత వ్యూహాత్మక భూభాగం నుంచి నిష్క్రమించాల్సిన అనివార్యత అమెరికాకు ఏర్పడింది.  

చైనా క్రమంగా పాగావేస్తోంది. దీంతో పశ్చిమాసియాలో ఏదో ఒక ఉద్రిక్తత కొనసాగాలనే ఉద్దేశంతో తెగిపోయిన అణు ఒప్పందాన్ని మరోసారి చేసుకోవాలనే సాకుతో వ్యూహాత్మకంగా ఒప్పంద పునరుద్ధరణ అంశాన్ని చర్చలోకి తెచ్చింది. దీంతో సుదీర్ఘ కాలంలో ఇజ్రాయిల్-ఇరాన్ వ్యూహాత్మక వైరం మరోసారి భగ్గుమంది.

ఇజ్రాయిల్-అమెరికా పటిష్ఠబంధాన్ని జటిలం చేస్తుందని తెలిసినా శ్వేతసౌధం ఇరాన్ ను ఎందుకు చేరదీస్తున్నట్టూ? పశ్చిమదేశాలు ఇరాన్ పై పెట్టిన ఆంక్షలు తొలగిపోతే ఏమవుతుంది? ఇజ్రాయిల్ నిజంగానే సాయుధ ఘర్షణకు దిగుతుందా? పాక్షిక యుద్ధం అనివార్యమైతే పశ్చిమాసియాలో ఏ జరుగుతుంది? భౌగోళిక రాజకీయాల్లో వచ్చే మార్పులేంటి?

బైడెన్ వచ్చిన తర్వాత అమెరికా విదేశాంగ విధానంలో మౌలిక మార్పు ఏమైనా వచ్చిందా? అమెరికా-ఇజ్రాయిల్ బంధం దెబ్బతింటుందా? ఇరాన్ అణుబాంబు బెదిరింపు ధోరణి మరింత ప్రమాదకరంగా పరిణమిస్తుందా?

ఈ జియోపొలిటికల్ ఫినామినాను….మూడు పుస్తకాల ఆధారంగా తాజా స్థితిని మదింపు వేసే ప్రయత్నం చేస్తాను.

  1. Trita parsi రాసిన ‘‘TREACHEROUS ALLIANCE: the secret dealings of israel, iran, and the united states”.
  2. Medea Benjamin  రాసిన ‘‘Inside Iran: The Real History and Politics of the Islamic Republic of Iran’’.
  3. Mark Hitchcock రాసిన Iran: The Coming Crisis: Radical Islam, Oil, and the Nuclear Threat

ఇరాన్-ఇజ్రాయిల్-అమెరికా బంధంలో అంతర్జాతీయ నిపుణులకే అర్థం కాని గోప్యవైరం నిరంతరం కొనసాగుతోంది. ఇదే విషయాన్ని విదేశీ సంబంధాల నిపుణుడు, రచయిత Trita parsi తన పుస్తకం ‘‘TREACHEROUS ALLIANCE: the secret dealings of israel, iran, and the united states”లో పేర్కొన్నారు.

‘‘Israeli-Iranian relations remain a mystery to most analysts in spite of the profound impact that these countries’ tensions have had on the Middle East and on U.S. national security’’

‘‘ఇజ్రాయిల్-ఇరాన్-అమెరికా మధ్య సంబంధాల ప్రభావం అటు మధ్యప్రాచ్యంపై, మరోవైపు అమెరికా రక్షణ విధానంపై తీవ్ర ప్రభావం చూపే అంశం. అయినా సరే ఈ దేశాల మధ్య సంబంధాల్లో ఎక్కడో అర్థంకానీ రహస్యం మిగిలిపోతోంది’’ అంటారు.

అమెరికా విదేశాంగ విధాన నిర్ణయ చరిత్రకూ, పశ్చిమాసియా అశాంతికీ అన్యోన్యసంబంధం ఉంది. ఇజ్రాయిల్ ఏర్పాటు వెనుక యూదుల ఆకాంక్ష ఎంత ఉందో మధ్య ప్రాచ్యం విషయంలో అమెరికా వ్యూహాత్మక భవిష్యత్తు అవసరం కూడా ఉంది. శ్వేతసౌధానికి యూదులపై ప్రేమ ఏమీ లేదు. చమురు నిక్షేపాలపై కన్నుఉన్న కారణంగా కూడా యూదుల వాగ్దత్తభూమి అవతరించింది.

ఇజ్రాయిల్ ఏర్పాటు వల్ల అరబ్బురాజ్యాల పక్కన బల్లెం పెట్టింది అమెరికా. నాటినుంచీ రావణకాష్టం ఆరని కార్చిచ్చులా రగులుతూనే ఉంది. గల్ఫ్ యుద్ధం, ఇరాన్, ఇరాక్ యుద్ధం, పాలస్తీనా ఇజ్రాయిల్ యుద్ధం, ఇజ్రాయిల్ జోర్డాన్ యుద్ధం ఇంకా అనేక యుద్ధాలకు ఆజ్యంపోసింది స్వయంగా అమెరికాయే! 1948 నుంచి ఈ ఏడాది మేలో జరిగిన పాలస్తీనా-ఇజ్రాయిల్ సాయుధ ఘర్షణ వరకూ ఏడు దశాబ్దాలుగా పశ్చిమాసియా నిరంతర రణరంగంగా కొనసాగుతోంది.

ఇరాన్ మిగతా అరబ్బుదేశాల కన్నా భిన్నమైన చరిత్ర-సంస్కృతీ ఉన్నదేశం. ఇరానియన్లు తమను అరబ్బులు అంటే ఒప్పుకోరు. పర్షియా సాంస్కృతిక వారసులమని చెప్పుకుంటారు. వారు మాట్లాడే భాష అరబ్బీ కాదు. ఫార్శీ భాష. తాము భిన్నమని చెప్పడానికి ప్రపంచ ప్రసిద్ధ సూఫీ కవులు మౌలానా జలాలుద్దీన్ రూమీ, హఫీజ్ సాహిత్య సంపద గురించి చెపుతారు. షియాల మెజారిటీ దేశం ఇరాన్. దీంతో మిగతా అరబ్బు దేశాలతో పొంతన లేదు. దీంతో ఇరాన్ ఒక ప్రత్యేక దేశంగా ఉంటూ వచ్చింది.

1979లో ఇస్లామిక్ విప్లవం చోటు చేసుకున్నప్పటి నుంచి ఇప్పటివరకు ఇరాన్‌లో ఇద్దరే ఇద్దరు సుప్రీం లీడర్లు పదవిలో ఉన్నారు. ఇరాన్ వ్యవస్థాపకుడు అయతొల్లా రుహల్లా ఖొమైనీ, ఆ తర్వాత అధికారాన్ని చేపట్టిన అయతొల్లా అలీ ఖొమైనీ ఇరాన్ సుప్రీం లీడర్లుగా ఉన్నారు. షా మొహమ్మద్ రేజా పహ్లావిను పదవి నుంచి దించిన తర్వాత అయతొల్లా రుహల్లా ఖొమైనీ తన పదవికి అత్యున్నత అధికారాలు కల్పించుకున్నారు.

ఇరాన్ విప్లవం తర్వాత ఆ దేశం ఆర్థికంగా చితికిపోయింది. సంపదను తరలించుకుని రాజు షా దేశం వదిలి పారిపోయాడు. ఒక్కొక్కరాయ పేర్చి గాడినపెట్టాడు ఇరాన్ విప్లవసారథి ఆయెతొల్లా రుహల్లా ఖొమేనీ. ఖొమేనీ మరణం తర్వాత ఛాందసవాదిగా పేరున్న ఆయతుల్లా  అలీ ఖొమైనీ అధికార పగ్గాలు చేపట్టాడు. ఈ నలభై ఏళ్లలో దేశ ఆర్థిక పరిస్థితి గాడి తప్పింది. ప్రజలు తమ కోసం ఉపయోగించాల్సిన డబ్బును సిరియా, యెమెన్,ఇరాక్ దేశాల్లో లేనిపోని గొడవల కోసం ఉపయోగిస్తున్నారన్న అసంతృప్తి పెరిగింది.

 ఇరాన్ విప్లవానికి ప్రధాన కారణం రాజు షా అమెరికా అనుకూల వైఖరి. రాజు షా మొహమ్మద్ రెజా పెహ్లెవీ పశ్చిమ రాజ్యాల తొత్తుగా అభివర్ణించింది నాటి విప్లవం. కాబట్టి ఇరాన్ ఏర్పడిన నాటి నుంచీ అమెరికాతో ఎలాంటి అధికారిక సంబంధాలూ లేవు. ఈ కారణంగా పశ్చిమాసియాలో ఇరాన్ నిరంతరం ప్రత్యేకతను, ఈ ప్రత్యేకత కారణంగా ఏర్పడిన వైరంతో పాటు ప్రయాణించింది. కరోనా సమయంలో ఇరాన్ పై ఉన్న ఆంక్షల కారణంగా ఔషధ తయారీ రంగానికి అవసరమైన ముడిసరుకు అందలేదు. దీంతో మరణాల సంఖ్య పెరిగింది. ఇరాన్ అమెరికా వ్యతిరేకతకూ, ఇజ్రాయిల్ తో శతృత్వానికి కారణాలు కోకొల్లలు.

ఇక ఇరాన్-ఇజ్రాయిల్ సంబంధాలను నాలుగు ధశలుగా చూడాలి. 1953-1979 వరకూ, పహ్లవీ రాచరికం ఉన్న రోజుల్లో ఇరుదేశాల సంబంధాల్లో ‘సువర్ణాధ్యాయం’గా పేర్కొంటారు. ఇరాన్ విప్లవం తర్వాత ఇరు దేశాల సంబంధాల్లో వైరం ప్రవేశించింది. 1991 గల్ఫ్ యుద్ధం తర్వాత వ్యూహాత్మక శతృత్వంగా పరిణమించింది. ఇజ్రాయిల్ ఏర్పాటుకు వ్యతిరేకంగా ఓటేసిన 13 దేశాల్లో ఇరాన్ కూడా ఉంది. ఈ చారిత్రక నేపథ్యం కారణంగా అటు అమెరికాతో మైత్రిలేదు. ఇటు ఇజ్రాయిల్ తో ఘర్షణ కొనసాగుతోంది.

ఇరాన్ అమెరికా బంధంలో వైరమే తప్ప మైత్రి లేదు. తనపై పశ్చిమ దేశాలు విధించిన ఆంక్షలకు వ్యతిరేకంగా అణ్వాయుధ తయారీ గురించి మాట్లాడ్టం, యూరేనియం శుద్ధి ప్రక్రియ, ప్లూటోనియం సేకరణ ప్రయత్నం మొదలుపెట్టింది. దీన్ని నివారించేందుకు అమెరికా 2015లో నాటి అధ్యక్షుడు బరాక్ ఒబామా చొరవతో ఆంక్షలు పరిమితంగా తొలగించి అణ్వాయుధ తయారీని కాస్తంత నిలువరించారు.

ట్రంప్ హయాంలో ఈ ఒప్పందం నుంచి వైదలగింది. అయితే ఇజ్రాయిల్ మాత్రం ఇరాన్ అణ్వాయుధ తయారీని నిరంతరం కొనసాగిస్తోందని ఆరోపిస్తోంది. ఇరాన్  అణ్వస్త్ర తయారీలో ఉన్నారంటూ శాస్త్రవేత్తలను ఇజ్రాయిల్ చంపింది. 2019లో ఫక్రిజాదే అనే ముఖ్య శాస్త్రవేత్తను డ్రోన్ తో హతమార్చింది. ఆ దేశ మిలట్రీ జనరల్  ఖాసీం సులేమానీని ఇరాక్ లో హత్య చేసింది.

ఇరాన్ కూడా ఏమీ తక్కువ తినలేదు. ఇజ్రాయిల్ పక్కన బల్లెంలా తయారైన పాలస్తినా, లెబనాన్, సిరియాల్లో ఉగ్రవాదాన్ని ప్రోత్సహించి నిద్రలేకుండా చేస్తోంది. యుద్ధాన్ని అనివార్యం చేసి, ఆయుధాలు తయారు చేయోద్దనే వింత షరతు విధిస్తోంది అమెరికా. పైగా అదే ప్రపంచ దేశాలకు ఆయుధాలు అమ్ముతోంది.

పశ్చిమాసియాలోని సంపదే ఆయా దేశాల అశాంతికి కారణం. సంపద ఉన్నచోట అమెరికా ఉంటుంది. అమెరికా ఉన్నచోట అశాంతి ఉంటుంది. ఇదే ఆయాదేశాల్లో అనిశ్చితికీ, అస్థిరతకూ కారణమవుతోంది. అమెరికా విదేశాంగ విధానంలో పశ్చిమాసియా అస్థిరత ప్రధాన భాగంగా ఉంటూ వస్తోంది. బైడెన్ అధ్యక్షపగ్గాలు చేపట్టిన తర్వాత విదేశాంగ విధానంలో మార్పు వచ్చింది. ఆఫ్ఘనిస్థాన్ నుంచి బలగాల ఉపసంహరణ నిర్ణయం, చైనా రాజీధోరణి, ఇరాన్ తో తిరిగి ఒప్పందం చేసుకోవాలనే పున:పరిశీలన నిర్ణయాలు భౌగోళిక రాజకీయాల్లో మరోసారి ఉద్రిక్తతకు కారణమయ్యాయి.

అమెరికా-ఇజ్రాయిల్ వ్యతిరేకతపాలు ఏ  స్థాయిలో తెలుసుకోవాలంటే…. ఇరానియన్ సినీ దర్శకుడు హబీబ్ అహంజాదే మాటలు తప్పక గుర్తు చేసుకోవాలి. “Death to America; Death to Israel.” అంటాడాయన. అరబ్బు దేశాల మధ్య కొరవడిన సఖ్యతను అమెరికా తన కూటనీతితో మరింత పెంచుతుంది. చుట్టూ పొంచి ఉన్న ఇస్లామిక్ దేశాల నుంచి పొంచి ఉన్న ముప్పును ఎదుర్కొనేందుకు ఇజ్రాయిల్ సైనికరంగాన్ని ఆధునీకరించడాన్ని, వ్యూహాత్మక అవసరాల కోసం అమెరికాతో ద్వైపాక్షిక సంబంధాలను నెరపడాన్ని అర్థం చేసుకోవచ్చు.

ఇరాన్ తన అవసరం కోసం చైనాతో బంధాన్ని కోరడాన్ని కూడా సానుకూలంగానే చూడవచ్చు. ఎటొచ్చీ అమెరికా ప్రాపకం కోసం దేశాల బలహీనతలను సొమ్ము చేసుకోవడం అసలు సమస్యకు కారణం. పరస్పర హనన స్థాయిలో శతృత్వాన్ని పెంచిన అమెరికా….తిరిగి శాంతికోసం తాను ప్రయత్నిస్తున్నట్లు నటిస్తుంది. ఈ వైఖరిని చూస్తే ఇరాన్ కు ఏం ఖర్మ ఏ అగస్త్య భ్రాత దేశానికైనా కంపరమే కలుగతుంది.

మరోవైపు ఇరాన్-అమెరికా మధ్య వియన్నాలో జరుగుతున్న చర్చల్లో ఇరాన్ ఆంక్షల ఎత్తివేతతో పాటు మరిన్ని డిమాండ్లు పెట్టింది. దీంతో చర్చల్లో తాత్కాలిక ప్రతిష్ఠంబన నెలకొంది. ఇరాన్ డిమాండ్లపై ఇజ్రాయిల్ కు చిర్రెత్తుకొచ్చింది. దాడికి సిద్ధమంటూ ప్రకటించింది. ఆంక్షలు ఎత్తేస్తే అణ్వాయుధాలు ఎక్కడ తయాచేసి తన నెత్తిన వేస్తుందో అనే భయమే ఇజ్రాయిల్ ఒంటికాలిపై లేవడానికి కారణం.

ఇరాన్-అమెరికాల మధ్య ఒప్పందం కుదరడం అసాధ్యంగానే తోస్తోంది. కాబట్టి ఇజ్రాయిల్ కోపం కయ్యంగా మారడం సాధ్యం కాదు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇరాన్-ఇజ్రాయిల్ దాడి వల్ల పశ్చిమాసియాలో అశాంతి నెలకొంటుంది. అది అమెరికాకు చేటు చేస్తుంది.                

ఇరాన్ విషయంలో అమెరికా వైఖరి కారణంగా ఇజ్రాయిల్-అమెరికా ద్వైపాక్షిక బంధంలో పొరపచ్చాలు రాకపోయినా ఆ రెండు దేశాల బంధానికి పెద్దగా మేలు చేయదు. దేశాలను గిల్లి వాటి వైఖరి ఏ స్థితిలో ఉందో చూసి కొత్త వ్యూహాలు రూపొందించడం, లేదా లొంగినవాడిని సముదాయించినట్టూ నటించి అసలుకే ఎసరు తేవడం అమెరికాకు దశాబ్దాలుగా అలవాటు. పశ్చిమాసియా విషయంలో అమెరికా విధానం ప్రాతిపదికన భారత్ తన వైఖరిని నిర్ధారించుకోలేదు. అమెరికా భారత్ విషయంలో ఎలా వ్యవహరిస్తోందన్న వైఖరి మాత్రమే భారత విదేశాంగ విధాన నిర్ణయంలో కీలకం. పైగా చమురు నిల్వలు అపారంగా ఉన్న అరబ్బు దేశాల విషయంలో అమెరికా అంతకన్నా భిన్నంగా వ్యవహరించాలని అనుకోవడం వెర్రితనమే అవుతుంది. భారత్ కు  ఆ గొడవ లేదు కాబట్టి, అమెరికాతో సఖ్యంగానే మెలగవచ్చు.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

16 − ten =