కేరళ రాష్ట్రంలోని కొల్లాంలో ఐదేళ్ల లోపు పిల్లలు ‘టొమాటో ఫ్లూ’ అనే వైరల్ ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్నారు. కొల్లాంలో అతి తక్కువ సమయంలో 80కి పైగా టొమాటో ఫ్లూ కేసులు నమోదయ్యాయి. ఈ కేసులన్నీ ఐదేళ్లలోపు పిల్లలు వారిలోనే నమోదయ్యాయని అధికారులు తెలిపారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రుల నుండి వచ్చిన కేసుల సమాచారం ప్రకారం మాత్రమే ఇవి ఉండగా.. ప్రైవేట్ ఆసుపత్రుల నుండి వచ్చిన కేసులను కలుపుకుంటే కేసుల సంఖ్య మరింత ఎక్కువగా ఉండవచ్చు. కేరళ రాష్ట్ర ఆరోగ్య శాఖ పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తోంది. టమోటో ఫ్లూ కేసులు నమోదైన ప్రాంతాల్లో నివారణ చర్యలు చేపట్టింది. గ్రామాల్లో అధికారులు అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. ఆయా ప్రాంతాల్లోని అంగన్‌వాడీ కేంద్రాలను ముందుజాగ్రత్త చర్యగా మూసివేశారు.
టొమాటో జ్వరం సోకిన పిల్లలకు జ్వరం వస్తుంది. టొమాటో ఫీవర్ వైరల్ ఫీవర్.. లేదా చికున్‌గున్యా లేదా డెంగ్యూ ఫీవర్ యొక్క అనంతర ప్రభావమా అనే దానిపై ఇప్పటికీ చర్చ జరుగుతోంది. సోకిన పిల్లల్లో దద్దుర్లు, చర్మం మీద చికాకు వంటి లక్షణాలను అనుభవిస్తారు. దీని వల్ల శరీరంలోని అనేక భాగాలపై బొబ్బలు ఏర్పడతాయి. బొబ్బల ఆకారం సాధారణంగా ఎరుపు రంగులో ఉంటుంది, కాబట్టి దీనిని టొమాటో ఫ్లూ-టొమాటో జ్వరం అంటారు. చేతులు, కాళ్ళలో రంగు మారడమే కాకుండా.. అలసట,కీళ్ళ నొప్పి, వికారం, వాంతులు, అతిసారం, దగ్గు, తుమ్ము, గురక, ముక్కు కారడం, తీవ్ర జ్వరం, ఒళ్ళు నొప్పులు వంటి లక్షణాలను కలిగి ఉంటారు.
ఈ వైరస్‌ను నిరోధించడానికి.. బొబ్బలను తాకడం, గోక్కోవడం వంటివి చేయకూడదు. కాచిన నీటిని తాగాలి, సరైన పరిశుభ్రత పాటించాలి, వైరస్ సోకిన వారికి కాస్త దూరంగా ఉండడమే బెటర్.. స్నానం చేయడానికి గోరువెచ్చని నీటిని ఉపయోగించాలి, ఎక్కువ విశ్రాంతి తీసుకోవాలి. వైరస్ ప్రాణాంతకం కాదని, చికిత్స చేయవచ్చని ఆరోగ్య అధికారులు చెబుతున్నారు.