More

  ఆఫ్ఘన్‎లో ముస్లిం మహిళలకు కఠిన ఆంక్షలు..! షరియా అంటే ఏమిటి..?

  ఆఫ్ఘనిస్తాన్ దాదాపు తాలిబన్ల కబంధ హస్తాల్లోకి వెళ్లిపోయింది. కొరకరాని కొయ్యలా మిగిలిన పంజ్ షేర్ సైతం లొంగిపోయేందుకు సిద్ధమైంది. ఇక అక్కడ ప్రజాస్వామ్యం అనే మాట వినిపించదు. అంతటా షరియా చట్టమే అమలవుతుంది. ఆప్ఘనిస్తాన్ వ్యాప్తంగా షరియా తప్ప మరో చట్టం ఉండదని.. ఇప్పటికే తాలిబన్ ప్రతినిధి వహిబుల్లా హషీమీ ప్రకటించాడు. దీంతో రెండు దశాబ్దాల క్రితం తాలిబన్ల పాలనను గుర్తుచేసుకుని ఆఫ్ఘన్లు హడలిపోతున్నారు. అవకాశం చిక్కినవాళ్లు దేశం విడిచి పారిపోగా.. మిగిలిన ఆఫ్ఘన్ జాతీయులు మాత్రం బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. షరియా చట్ట పాలనను గుర్తుచేసుకుని బెంబేలెత్తిపోతున్నారు. అసలు షరియా చట్టంలో అంటే ఏమిటి..? ఆప్ఘన్లు, ముఖ్యంగా మహిళలు అంతగా బయపడేంతగా చట్టంలో ఏముంది..? షరియా చట్టం ప్రకారం శిక్షలు ఎలావుంటాయి..? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

  ఇస్లాంలో ముఖ్యంగా మూడు ముఖ్యమైన విభాగాలుంటాయని చెబుతారు. మొదటి విభాగం.. భగవవంతుడు, మానవ సృష్టి, మరణానంతర పరిణామాల గురించి వివరిస్తుంది. ఇక రెండవది.. ప్రార్థన, ఉపవాసాలు, దానాలు, యాత్రల గురించి చెబుతుంది. చివరిది, మూడో విభాగం చట్టం గురించి వివరిస్తుంది. అదే షరియా. షరియా అరబ్బీ నుంచి ఉద్భవించిన పదం. ఇస్లామిక్ చట్టానికి షరియా షరియా ఒక్కటే ప్రత్యామ్నాయంగా భావిస్తారు. అయితే, ఈ భావనకు ఎలాంటి రాతపూర్వక ఆధారాలు లేవనే వాదన కూడా వుంది. ఖరాన్‎ నుంచి సేకరించి పలు మూలాల నుంచి రూపొందించిన సూత్రాల సమాహారమే షరియా. సున్నాహ్‎లోని మహమ్మద్ ప్రవక్త జీవితం, బోధనలు, అభ్యాసాల ఆధారంగా షరియా చట్టం రూపొందించినట్టు చెబుతారు. దైనందిన జీవితంలో పాటించే నియమాలు, మతాన్ని ఎలా ఆచరించాలి..? చట్టపరమైన విషయాలను ఎలా అనుసరించాలనే విషయాలు షరియాలో వుంటాయి. అలాగే, నేరాలకు సంబంధించిన శిక్షలను కూడా షరియా వివరిస్తుంది.

  ముందు షరియాలోని మొదటి విభాగానికి వద్దాం.. ఈ విభాగంలో ముఖ్యమైనది ప్రార్థన. ప్రతి ముస్లిం రోజుకు అయిదుసార్లు తప్పనిసరిగా ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయలేని వాళ్లను పాపులుగా అభివర్ణిస్తుంది షరియా. అయితే, ప్రార్థన చేయనందుకు ఖురాన్ గానీ, సున్నాహ్ గానీ ఎలాంటి శిక్షలు సూచించలేదు. ప్రార్థనకు ఎలాంటి ఆంక్షలు లేకపోయినప్పటికీ.. సౌదీ అరేబియా వంటి దేశాల్లో అన్ని సేవలను నిలిపివేస్తారు. ప్రార్థన జరుగుతున్నంతసేపు దుకాణాలు, మాల్స్, మందుల షాపుల్లో కార్యకలాపాలను నిలిపివేస్తారు. అయితే, ఈ విధానాన్ని సడలించాలని అనేకమంది ఉద్యమకారులు కోరుతున్నారు.

  షరియా చట్టం ప్రకారం.. ముస్లింలు విద్యను అభ్యసించవచ్చు. వ్యాపారం, పరిశోధన, సాంకేతిక రంగాలను వృత్తులుగా ఎంచుకోవచ్చు. అయితే, స్త్రీ విద్య విషయంలో మాత్రం పలు ఆంక్షలు వున్నాయి. తాలిబన్ల పాలనలో స్త్రీ విద్య నిషేధం. 2012లో 15 ఏళ్ల వయసులో బాలికల విద్య కోసం పోరాడిన మలాలా యూసుఫ్ జాయ్ మీద తాలిబన్ మిలిటెంట్లు కాల్పులు జరిపారు. అయితే, ప్రస్తుతం తాము మహిళల హక్కులను గౌరవిస్తామని, విద్యను, వృత్తులను కొనసాగించుకోవచ్చని చెబుతున్నారు. కానీ, తాలిబన్ల మాటలు నీటిపై రాతలేనని తేలిపోయింది. ఇటీవల ఓ మహిళా జర్నలిస్ట్‎కు ఇంటర్వ్యూ ఇచ్చిన తాలిబన్లు.. అంతలోనే తమ నిజస్వరూపాన్ని బయటపెట్టుకున్నారు. అంతేకాదు, కొన్ని ప్రావిన్సులలో ఇప్పటికే స్కూళ్లను పూర్తిగా మూసివేశారు.

  విద్యపైనే కాదు, వ్యక్తిగత జీవితం, తినే తిండిపైనా ఆంక్షలున్నాయి. అన్ని కూరగాయలు, కోడిగుడ్లు, సముద్ర ఆహార ఉత్పత్తులను తినొచ్చు. అయితే, మాంసాహారం విషయంలో కొన్ని నిబంధనలున్నాయి. షరియా ప్రకారం కేవలం హలాల్ చేసిన మాంసాహారాన్ని మాత్రమే స్వీకరించాలి. షరియా చట్టం ప్రకారం, ముస్లింలు బ్రహ్మచర్యాన్ని పాటించడం, సన్యసించడం నేషధం.

  విందులు, వినోదాలకు హాజరయ్యే వెసులుబాటు ఉన్నప్పటికీ.. స్నేహితులు, కుటుంబ సభ్యులతో మాత్రమే పార్టీలు చేసుకోవాలి. అయితే, పార్టీల్లో పొగతాగడం, మద్యం, మాదకద్రవ్యాలు సేవించడం నిషేధం. పార్టీల్లో పురుషులు ఇతర కుటుంబాల్లోని మహిళలతో మాట్లాడకూడదు. అంతేకాదు, తాలిబన్ల పాలనలో సంగీతం వినడం, టీవీ చూడటం కూడా నిషేధం. దీంతో, రెండు దశాబ్దాలుగా విందులు, వినోదాలు, సంగీతాన్ని స్వేచ్ఛగా ఆస్వాదించిన ఆఫ్ఘన్లు.. ఇకపై పార్టీలకు దూరం కావాల్సిరావడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.

  షరియా చట్టం ప్రకారం.. ఆహారం విషయంలోనే కాదు, ఆహార్యం విషయంలోనూ పలు నిబంధనలున్నాయి. ముస్లింలలోని పురుషులు అందరూ గడ్డాలు పెంచుకోవాలి. ఇక, మహిళలు శరీరమంతా కప్పేలా వస్త్రాలు ధరించాలి. అంటే, హిజాబ్ లేదా బుర్ఘాలు ధరించాల్సివుంటుంది. మహిళలు అవసరమైతే తప్ప బయటికి వెళ్లకూడదు. ఒకవేళ వెళ్లినా.. పిల్లలు లేదా కుటుంబంలోని పురుషులను తోడుగా తీసుకుని వెళ్లాలి. గత తాలిబన్ల పాలనలోనైతే ఆంక్షలు మరీ దారుణంగా వుండేవి. కుటుంబంలోని పురుషులు లిఖితపూర్వకంగా అనుమతి ఇస్తేనే స్త్రీలు బయటికి వచ్చేవారు.

  వివాహాల విషయంలోనూ కఠిన నిబంధనలున్నాయి. నిఖా జరగని పక్షంలో ఆ వివాహానికి చట్టబద్ధత ఉండదు. ఇక, విడాకుల కోసం ట్రిపుల్ తలాఖ్ ను ఉపయోగిస్తారు. అయితే, ట్రిపుల్ తలాఖ్ ను విడాకుల ప్రక్రియలో ఒక చిన్న భాగం మాత్రమేనని చెబుతారు. ప్రపంచంలోని చాలా దేశాలు, ముస్లిం దేశాలు సైతం ట్రిపుల్ తలాఖ్ ను నిషేధించాయి. ఇలాంటి కఠినమైన నిబంధనల మధ్య మహిళలు బతకాల్సివుంటుంది. దీంతో తాలిబన్ల పాలనలో ఉద్యోగాలు లేకపోవడం, బలవంతంగా తాలిబన్లను వివాహం చేసుకుని పిల్లల్ని కనే పనికి ఎక్కడ పరిమితమవుతామనే భయంకరమైన ఆలోచనలు, ఆప్ఘన్ మహిళల్ని వెంటాడుతున్నాయి.

  షరియా చట్టంలో ముఖ్యమైన ఘట్టం నేరాలు శిక్షలు. షరియా ప్రకారం హద్ నేరాలు, తాజిర్ నేరాలని రెండు రకాలు వుంటాయి. హద్ నేరాలు అంటే కఠినమైన శిక్షలుండే తీవ్రమైన నేరాలన్నమాట. తాజిర్ నేరాలంటే న్యాయాధిపతి నిర్ణయం మేరకు శిక్షలు విధించే వెసులుబాటు వుండే నేరాలు. దొంగతనం, వ్యభిచారం వంటివి హద్ నేరాల కిందికి వస్తాయి. దీనికి చేతులు నరకడం, రాళ్లతో కొట్టి చంపడం వంటి శిక్షలుంటాయి.

  అక్రమ సంబంధానికి పాల్పడినట్లు అనుమానిస్తున్న స్త్రీ పురుషులను బహిరంగంగా తలలు నరకడం లేదా ఉరితీయడం వంటివి చేస్తారు. వ్యభిచారంలో పాల్గొన్న వ్యక్తులకి తప్పనిసరిగా 100 కొరడా దెబ్బలు ఉంటాయి. ఇక అవివాహితులైతే వారిని ఏడాది పాటు బహిష్కరణ వేటు వేస్తారు. వారు వివాహం చేసుకుంటే రాళ్లతో కొట్టి చంపుతారు. రాళ్లతో కొట్టి చంపడాన్ని ఐక్యరాజ్య సమితి క్రూరమైన అమానవీయ చర్యగా అభివర్ణించి వీటిని నిషేధించింది. అయితే, ఇలాంటి శిక్షలను అన్ని ముస్లిం దేశాలు అమలు చేయవు. ఇక, షరియా చట్టం ప్రకారం.. మతమార్పిడి నేరం. ఈ నేరానికి పాల్పడితే మరణశిక్ష విధిస్తారు.

  షరియా చట్టం సంక్లిష్టమైనది. దీనిని ఆచరించడం పూర్తిగా నిపుణులు తీసుకున్న శిక్షణ, నైపుణ్యం పై ఆధారపడి ఉంటుంది. ఇస్లామిక్ న్యాయవేత్తలు షరియా నియమావళిని, ఆదేశాలను జారీ చేస్తారు. ఈ నియమావళిని చట్టబద్ధం చేస్తే ఫత్వా అంటారు. షరియా చట్టంలో మొత్తం అయిదు రకాల సిద్ధాంతాలు ఉన్నాయి. అందులో హంబలీ, మాలికీ, షఫీ, హనాఫీ, అనే నాలుగు సున్నీ సిద్ధాంతాలు, జాఫరీ అనే షియా సిద్ధాంతం ఉంది. షరియా చట్టానికి మూలంగా పరిగణించిన మూలగ్రంథాలలోని అంశాల పై వివిధ వర్గాల వారు చేసే విశ్లేషణల ఆధారంగా నియమావళిలో తేడాలుంటాయి.

  ఇతక చట్టాలలో పూర్తిగా నేర సంబంధిత విషయాలు, పౌర సంబంధాలు, వ్యక్తిగత హక్కులకు సంబందించిన నియమావళి ఉంటే, షరియాలో ముస్లింలు భగవంతుని ఆదేశాలకనుగుణంగా జీవించేందుకు సంబంధించిన అంశాలన్నీ ఉంటాయి. ముస్లిమేతర దేశాల్లో కూడా ముస్లింల కోసం షరియా న్యాయస్థానాలుంటాయి. వీటిని ముఖ్యంగా, కుటుంబ, వ్యాపార వ్యవహారాల కోసం ఏర్పరుచుకున్నారు.

  షరియా చట్టం కూడా ఒక్కో ప్రాంతానికి చెందిన మత పెద్దలు ఒక్కో విధంగా అర్థం చేసుకుంటారు. వివిధ రకాలుగా షరియా చట్టానికి వివరణ ఇస్తూ దాని ప్రకారం నియమాలను అమలు చేస్తుంటారు. 1996లో అధికారంలోకి వచ్చిన సమయంలో తాలిబన్ల షరియా చట్టాన్ని కఠినంగా అమలు చేశారు. మహిళలు ఉద్యోగం చేసినా తప్పే, బయటికి వెళ్లినా తప్పే. ఉద్యమాలు చేసినా తప్పే. తాలిబన్లు అమలుచేసే నియమాలను ఉల్లంఘిస్తే, మహిళలను బహిరంగంగా అవమానిస్తారు. అలాగే ఇష్టారాజ్యంగా దెబ్బలు కొడతారు. నాటి ఆరాచకాలు గుర్తు తెచ్చుకొని ప్రస్తుతం అఫ్గాన్‌ ప్రజలు బెంబేలెత్తుతున్నారు. తాలిబన్ల కంటే కూడా.. వారు అమలు చేసే షరియా చట్టాన్ని తలుచుకునే ఆఫ్ఘన్లు ఎక్కువగా భయపడుతున్నారు.

  Trending Stories

  Related Stories