More

  డిజిటల్ కరెన్సీ అంటే ఏమిటి..? ఇ-రూపీతో ఏమేం చేయొచ్చు..?

  ప్రపంచం టెక్నాలజీ వైపుకు అడుగులు వేస్తోంది. కాలానుగుణంగా ప్రతిఒక్కరూ ఈ టెక్నాలజీని అందిపుచ్చుకోవాలి. లేకపోతే ప్రపంచదేశాలతో పాటు మనం పోటీపడటంలో వెనుకబడిపోతాం. టెక్నాలజీతో ప్రభుత్వానికి మేలు జరిగేదై ఉంటే ప్రభుత్వాలు వీలైనంత త్వరగా వాటిని తీసుకురావాల్సి ఉంటుంది. ఈ విధంగానే ఆలోచించిన భారత్ తాజాగా డిజిటల్ కరెన్సీను పైలట్ ప్రాజెక్టుగా అందుబాటులోకి తీసుకువచ్చింది. అయితే భారత్ కు ఇప్పుడు డిజిటల్ కరెన్సీ అవసరం ఎందుకొచ్చింది..? డిజిటల్ కరెన్సీ ద్వారా ప్రజలకు, ప్రభుత్వానికి ఎంతమేర లాభం చేకూరనుంది..? ఇప్పటికే ఉన్న క్రిప్టో కరెన్సీని ప్రభుత్వం ఎందుకు గుర్తించడంలేదు..? సామాన్యులు డిజిటల్ కరెన్సీని ఉపయోగించగలిగేంత అవగాహన ఉందా..? దీనివల్ల వచ్చే నష్టాలేమిటి అనే ప్రశ్నలు ప్రతిఒక్కరినీ తొలుస్తున్నాయి. అయితే డిజిటల్ కరెన్సీ పైలట్ ప్రాజెక్టుగా మొదలైన నేపథ్యంలో ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు వెతికే ప్రయత్నం చేద్దాం.

  ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే క్రిప్టో కరెన్సీ రూపంలో డిజిటల్ మనీ అందుబాటులో ఉంది. ప్రపంచంలో ఇప్పటికే 20 వేల 268 రకాల క్రిప్టో కరెన్సీలు చెలామణీలో ఉన్నాయి. ఇందులో అందరికీ ఎక్కువగా తెలిసింది మాత్రం బిట్ కాయినే. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ చెలామణిలో ఉన్నది కూడా ఇదే. ఇప్పటివరకున్న క్రిప్టో కరెన్సీ విలువ 1.025 ట్రిలియన్ డాలర్లుగా ఉన్నట్లు ఒక అంచనా. ప్రస్తుతం ఒక రోజులోనే 107 బిలియన్ డాలర్ల క్రిప్టో కరెన్సీ చేతులు మారుతోంది. దీన్నిబట్టే ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ కరెన్సీకి ఆదరణ ఎంతుందో అర్థం చేసుకోవచ్చు. అయితే ముందుగా ఈ క్రిప్టో కరెన్సీ ఏ విధంగా పనిచేస్తుందో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. క్రిప్టో కరెన్సీని ‘సతోషి నకటొమా’ అనే వ్యక్తి సృష్టించాడు. అయితే ఇతడి నిజమైన పేరు కానీ, వ్యక్తికి సంబంధించిన పూర్తి వివరాలు కానీ బాహ్యప్రపంచానికి తెలియదు.

  క్రిప్టో కరెన్సీ పూర్తి బ్లాక్ ఛైన్ టెక్నాలజీపై ఆధారపడి ఉంటుంది. ఇంటర్నెట్ మైనింగ్ ద్వారా అయినా, ప్రత్యక్షంగా కొనడం వల్ల కానీ క్రిప్టో కరెన్సీని పొందవచ్చు. వీటిని ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా విరివిగా ఉపయోగిస్తున్నారు. ఆన్‎లైన్ షాపింగ్ నుంచి ఇతర దేశాల్లోని వ్యక్తులకు డబ్బులు ట్రాన్స్‎ఫర్ చేయడం వరకు ఈ క్రిప్టో కరెన్సీని బాగా ఉపయోగపడుతోంది. అయితే దీనికి ఎటువంటి బ్యాంకు కానీ, ప్రభుత్వం కానీ బాధ్యత వహించదు. ఇదీ పూర్తిగా డీ సెంట్రలైజ్డ్ మనీ అయినందున దీని ధర పడిపోవడం వంటివి జరిగితే నేరుగా ప్రజలు నష్టపోవడం జరుగుతుంది. దీంతో పాటు క్రిప్టో కరెన్సీకి ఎటువంటి సెక్యూరిటీ కూడా ఉండదు. 2010లో ప్రపంచవ్యాప్తంగా క్రిప్టో కరెన్సీ భారీ హ్యాకింగ్ కు గురైంది. అప్పట్లో బిట్ కాయిన్‎లోని లూప్ హోల్స్‎ను గుర్తించిన ఓ హ్యాకర్ ఒకేసారి మిలియన్ల కొద్దీ బిట్ కాయిన్లను సృష్టించాడు. దీంతో బిట్ కాయిన్ ధర భారీగా కుదుపులకు లోనైంది. ఈ క్రిప్టో కరెన్సీ తరచూ హ్యాకింగ్‎కు గురవుతూనే ఉంది. చివరిగా క్రిప్టో కరెన్సీ‎పై గత నెల అక్టోబర్ 7న హ్యాకర్లు దాడి చేసి ఏకంగా 570 మిలియన్ డాలర్లను దొంగిలించారు.

  ఇక హ్యాకింగ్ తో పాటు క్రిప్టో కరెన్సీకి ఎటువంటి ఐడెంటిటీ లేకపోవడం కూడా ఒక పెద్ద సమస్యగా మారిపోయింది. క్రిప్టో కరెన్సీకి కేవలం ఒక యూజర్ ఐడీ, పాస్‎వర్డ్ మాత్రమే ఉంటుంది. వీటిలో ఏ ఒక్కటి మర్చిపోయినా పూర్తిగా వదులుకోవాల్సిందే.. శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన స్టీఫెన్ థామస్ అనే వ్యక్తి 2011 లో కొన్ని బిట్ కాయిన్లను కొనుగోలు చేశాడు. ఆ తర్వాత కొన్నాళ్ళకు దాని పాస్వర్డ్ మర్చిపోవడంతో ఆ బిట్ కాయిన్లను తిరిగి పొందలేకపోయాడు. అయితే కాలానుగుణంగా వాటి విలువ పెరుగుతూ వచ్చి ఇప్పుడు 321 మిలియన్ డాలర్ల రేటు పలుకుతోంది. కానీ అతను పాస్ వర్డ్ మర్చిపోవడం వల్ల ఈ బిట్ కాయిన్లను తిరిగి పొందలేకపోయాడు. ఈ విధంగా క్రిప్టో కరెన్సీలో అనేక లోపాలున్నాయి. అందుకే దీన్ని భారత ప్రభుత్వం గుర్తించడానికి నిరాకరించింది. దీనిపై భారత ప్రభుత్వం ఎటువంటి గ్యారంటీ ఇవ్వలేదని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో తేల్చిచెప్పింది.

  అయితే దీనికి ప్రత్యామ్నాయంగా సెంట్రలైజ్డ్ డిజిటల్ కరెన్సీని భారత ప్రభుత్వం తీసుకువచ్చింది. దీంతో క్రిప్టో కరెన్సీలో ఉన్న లోపాలన్నీ ఇందులో సరిదిద్దబడతాయి. ఇది ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది కాబట్టి పాస్ వర్డులను మర్చిపోవడం వంటివి ఉండదు. అంతేకాదు, ఇది భారత రూపాయి విలువతో సమానంగా లెక్కించబడుతుంది కాబట్టి హ్యాకింగ్ లాంటివి చేసినా,.. మరే ఇతర అనుచిత కార్యకలాపాలు చేసినా కూడా దీని విలువ పడిపోవడం వంటివి జరగదు.

  డిజిటల్ కరెన్సీ వోచర్ల రూపంలో ఉంటుంది. దీన్ని ఎవరు ఎవరికైనా పంపవచ్చు. దీనికి సంబంధించిన ఐడీని తీసుకుని అవతలి వ్యక్తి రిడీమ్ చేసుకోవచ్చు. ఇది వందశాతం సెక్యూర్‎ గా ఉంటుంది. అంతేకాదు, దీనికి ఇంటర్నెట్ అవసరం కూడా ఉండదు. పూర్తి ఆఫ్‎లైన్‎లో కూడా డిజిటల్ రూపీని ఉపయోగించుకోవచ్చు. వోచర్లను ఇచ్చిన వ్యక్తి అవతలి వ్యక్తి ఉపయోగించుకున్నారా లేదా అనే విషయాన్ని కూడా తెలుసుకోవచ్చు. దీనితో ఇప్పటికే చెలామణిలో ఉన్న ప్రత్యక్ష నగదు మరింత తగ్గుతుంది. ఇప్పటికే యూపీఐ చెల్లింపుల్లో ప్రపంచదేశాలన్నిటికంటే భారత్ ముందు వరుసలో ఉంది. కానీ వీటిలో ఒకేసారి ఎక్కువ మొత్తంలో చెల్లింపులు చేసే అవకాశం ఉండటంలేదు. యూపీఐ చెల్లింపుల్లో బ్యాంకును బట్టి డైలీ లిమిట్ ఉండటంతో ఎక్కువ మొత్తంలో నగదు చెల్లింపులు చేయడానికి కుదరడంలేదు. అయితే డిజిటల్ కరెన్సీకి ఈ విధమైన లిమిట్లు ఏమీ లేవు. ఎవరికి ఎంతైనా చెల్లించవచ్చు. దీంతో భారీ నగదును ట్రాన్స్ఫర్ చేసే సంస్థలు దీన్ని విరివిగా ఉపయోగించుకునే అవకాశమేర్పడుతుంది. అన్ని పెద్ద కంపెనీలు డిజిటల్ రూపంలోనే జీతాలను ఇచ్చే అవకాశం ఏర్పడుతుంది.

  అంతేకాదు, ప్రభుత్వ పథకాలకు నిధులిచ్చే కార్యక్రమాల్లో కూడా ఈ డిజిటల్ వోచర్లను ఉపయోగించేలా కేంద్ర ఆలోచిస్తోంది. ఈ వోచర్లను ఉపయోగించడం వల్ల ట్రాన్సాక్షన్ ఛార్జీలు కూడా ఏమీ ఉండవు. ఆన్‎టైమ్ పేమేంట్‎తో పాటు దాన్ని ట్రాకింగ్ చేసే అవకాశం కూడా కలుగుతుంది. దీనికి ఎటువంటి బ్యాంకు ఖాతాలు వినియోగించాల్సిన అవసరం కూడా లేదు. దీంతో పాటు అంతర్జాతీయ లావాదేవీలు సులభంగా జరిపేందుకు వీలవుతుంది.

  అయితే ఈ డిజిటల్ రూపీ నుంచి కొన్ని ప్రతికూల పరిస్థితులు కూడా ఎదురయ్యే అవకాశముంది. దీన్ని హ్యాకర్లు హ్యాక్ చేసే అవకాశమూ లేకపోలేదు. ఇప్పటివరకు ఆన్లైన్ బ్యాంకింగ్ ఉండగా అందులో అప్పుడప్పుడూ కొన్ని మోసాలు జరిగాయి. కానీ పెద్దయెత్తున మోసాలైతే ఎక్కువగా జరగలేదు. అందుకే డిజిటల్ కరెన్సీ పై కూడా మరీ ఎక్కువగా కాకపోయినా అప్పుడప్పుడూ హ్యాకింగ్ కూ, ఆన్‎లైన్ మోసాలకు గురయ్యే అవకాశం ఉంటుంది. అయితే దీన్ని ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు ఎదుర్కొనే సాంకేతికతను ఏర్పాటు చేసుకుంటే డిజిటల్ కరెన్సీ లో భారత్ మరో ముందడుగు వేసినట్లవుతుంది.

  Trending Stories

  Related Stories